మనకు తెలియని మహాయోగులు—5
9-దాస సాహిత్య మార్గదర్శి మహాయోగి –చిరుమామిళ్ళ సుబ్బదాసు -1802-1882
చిరుమామిళ్ళ సుబ్బదాసు అన౦తపురం జిల్లా ధర్మవరం లో చిరు మామిళ్ళనరసయ్య ,తిరుమలమ్మ అనే సదాచార కమ్మదంపతులకు 1802లో పుట్టాడు .అసలు పేరు సుబ్రహ్మణ్యం .వాడుకనామం సుబ్బయ్య .వీధిబడిలో చదువుతూ 8వ ఏట నే కృష్ణ, దాశరథి ,నరసింహ శతక పద్యాలు భాగవత పద్యాలు నేర్చేసుకొని అర్ధరాత్రి దీపం ముందుకూర్చుని నిశ్చల ధ్యాన సమాధి మగ్నుడై ,భక్తిజ్ఞాన వైరాగ్యపద్యాలు కీర్తనలు రాస్తూ పాడేవాడు .10వ ఏట రెండు మూడురోజులు సమాధి లో ఉండిపోయేవాడు .అప్పుడే 108 కందపద్యాల ‘’కేశవ మకుట శతకం ‘’రాసి అందర్నీ ఆశ్చర్యపరిచి వేణుగోపాలస్వామి భక్తుడుగా ప్రసిద్ధి చెందాడు .
ఒక సాధువుకనిపించి నాలుకపై బీజాక్షరాలురాయాగా ఆయన సూచనమేరకు ఒకరోజు రాత్రి సద్గురువు అన్వేషణకు బయల్దేరాడు .ఆకాశం లో ఒక కాంతి పుంజం కనిపించగా ,దాన్ని చూస్తూ నడిచి దుర్గి గ్రామం చేరాడు.ఆ గ్రామం లోనే కాంతి పుంజం వేణుగోపాలస్వామి గుడిపై ఆకాశం లో నక్షత్రంగా మారిపోయింది .గర్భాలయం చేరగా స్వామి కన్నులనుండి కారుణ్య తరంగాలు బయల్దేరి వచ్ఛి సుబ్బదాసు లో ప్రవేశించగా ,ఆశువుగా తనకే ఆశ్చర్యం కలిగేట్లు పద్యాలు వచ్చాయి . దుర్గిలోని పండిత కవి ,త్రికాలజ్ఞుడు జ్ఞానపూర్ణుడు ,దైవ సాక్షాత్కారం పొందిన తాతాచార్యుల వారు సుబ్బయ్యను వివాహం చేసుకోమని నచ్చ చెప్పగా 20వ ఏట 10ఏళ్ళ మేనమామ కూతురు వేణమ్మ ను పెళ్ళాడి ,16రోజులపండుగాతర్వాత తాతాచార్యుల ఆశ్రమం లో చేరి ,పంచకావ్యాలు ,భారత భాగవతాలు ,ప్రస్థాన త్రయం ,వేదాంత యోగశాస్త్రాలు వాటిలోని మర్మాలు సాకల్యంగా గ్రహించాడు .ఆచార్యులు అనుగ్రహించి సుబ్బదాసు దీక్షానామం తో దీక్ష ఇచ్చారు .
తర్వాత అయిదేళ్ళు దీక్షగా తీవ్ర సాధన చేసిన సుబ్బదాసు కు గొప్ప ఆధ్యాత్మిక శక్తులు అలవడినాయి .తాను రచించిన రచన రచనా సర్వస్వాన్ని శిష్యులకు అప్పగించి జాగ్రత్తగా ఆతాటాకు గ్రంథాలను కాపాడమని చెప్పారు .12-1-1882 వృషనామ సంవత్సర పుష్యబహుళ అష్టమి గురువారం ఉదయం యోగసమాధి లో కపాల చేదనం చేసుకొని 80వయేట సుబ్బదాసు వేణుగోపాలస్వామిలో ఐక్యమయ్యారు .చిన్నతనంలో ఆయన నాలుకపై బీజాక్షరాలు రాసిన చోటనే సుబ్బదాసు సమాధి స్థితుడయ్యారు.ధర్మవరం లోని ఆయన సమాధి పవిత్ర యాత్రాస్థలమైంది .ప్రతియేటా పుష్యబహుళ అష్టమినాడు ఆరాధనోత్సవం, నవమినాడు ప్రభలతో స్వామి ఊరేగింపు చేసి గురుపూజోత్సవం నిర్వహిస్తారు .దాస సాహిత్యం లో సుబ్బదాసు రాసిన శతకాలు, అష్టకాలు ,యక్షగానాలు నక్షత్రమాలికలు తత్వాలు కీర్తనలు పాటలు కృతులు ఆణిముత్యాలుగా వెలిగిపోతున్నాయి .
10-సిద్ధ సంకల్ప శివయోగి,అవధూత –చేళ్ళ గురికి ఎర్రి స్వాములు -1822-1922
తెలంగాణా లోపుట్టి ,మైసూరులో విద్యనేర్చి ,ఉన్నతోద్యోగం చేస్తూ ,తీవ్రవైరాగ్యం పొంది ,భార్యాపిల్లల్ని వదిలేసి ,అవదూతగా మారిన ఆరాధ్య బ్రాహ్మణుడు నంజుండయ్య ఎర్రితాత,ఎర్రిస్వామిగా పిలువబడ్డాడు .ఆయనను సేవించినవారు చెప్పినవిషయాలే తప్ప చరిత్ర తెలియదు .ఏది దొరికితే అది తిని వాడు .ఆయన తింటుంటే కాకులు, కుక్కలు మూగేవి వాటికి తినిపిస్తూ ,తానూ తినేవాడు .
ఉద్యోగం వదిలి నిద్రాహారాలుమాని ,కొబ్బరి చెట్టుపై శివయోగిగా ఉన్న ఈయనను ప్రజలు గుర్తించారు.లింగనహళ్లి లో లింగాయతుల నాగప్ప శుశ్రూష చేసి యోగ రహస్యాలు తెలుసుకొన్న నంజు౦డప్ప దొడ్డ బళ్లాపురం గగనాచారి దగ్గరకు చేరి ,దేహాభిమాన శూన్యత ,నిర్గంధిముని తత్త్వం నిరూపించి ఉపదేశం పొందాడు .నిరంజన దీక్షానామంఇచ్చి నంజు౦డ ప్పకు సన్యాసం ఇచ్చాడు గగనాచారి .
అనుకుంటే చాలు వందల మైళ్ళు వెళ్ళగలిగే సంకల్ప సిద్ధుడు అయ్యాడు నిరంజనస్వామి .చెన్నరాయకొండ చేరి గుహలో కొంతకాలం ,కల్యాణదుర్గం, ముష్టూరు,ఉరవకొండ లలో కొంతకాలం గడిపి చేళ్ళగురి చేరాడు .అక్కడ గోచీమాత్రమే ధరించి ఎండా వానలలో అంతర్ముఖుడై నిశ్చల సమాధిలో గడుపుతూ ఉన్న ఎర్రి స్వామికి భక్తులు ఆశ్రయమిచ్చారు .కొత్త ఇల్లు కట్టించి అందులో ఉంచారు .అప్పటినుంచి చేళ్ళ గురి ఎర్రి స్వాములుగా సుప్రసిద్దుడయ్యాడు .1907లో మఠనిర్మాణం మొదలుపెట్టి ఏడాదిలో పూర్తి చేశారు .1922వరకు అక్కడే ఉంటూ, మహిమలెన్నో ప్రదర్శించారు .సమకాలీన యోగులు, సిద్ధులు ఆయన్ను సందర్శించి పునీతులయ్యారు . శిష్యుడు తిక్కయ్యకట్టించిన ఆ మఠంలోనే ఎర్రి స్వామి 14ఏళ్ళు భక్తులకు జ్ఞానవైరాగ్యభక్తిమార్గాలు ఉపదేశిస్తూ గడిపారు .నూరేళ్ళు సార్ధకం గా జీవించి 30-5-1922దుందుభి సంవత్సర జ్యేష్ట శుద్ధ చవితి మంగళవారం ఉదయం శివయోగి ఎర్రిస్వాములు శివైక్యం చెందారు .శిష్యుడు తిక్కయ్య కట్టించిన సమాధిలోనే ఆయన పార్ధివ శరీరాన్ని ఉంచి సమాధి చేశారు .ప్రతియేడు జ్యేష్ట శుద్ధ షష్టి ,అమావాస్య ,శివరాత్రి రోజులలో ఆయన ఆరాధనోత్సవాలు జాతరలతో వైభవంగా జరుపుతారు .ఆయనను ఆరాధించే భక్తుల పూజా ప్రతిమలలో ,పటాలలో దర్శనమిస్తూ ,సమాధి నుంచి మాట్లాడుతూ ,స్వప్న సాక్షాత్కారం కలిగిస్తూ అనుగ్రహిస్తూనే ఉన్నారు ఎర్రి స్వాములు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -31-8-20-ఉయ్యూరు