5-9-20శనివారం సాయంత్రం గురుపూజోత్సవ సందర్భంగా బ్రహ్మశ్రీ కోటసూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల గురుపూజోత్సంగా సరసభారతి 154 వ కార్యక్రమం లాంజనేయస్వామి దేవాలయం -శ్రీ సువర్చ -విద్యార్ధులకు నగదు పురస్కార౦ ,ఉపాధ్యాయులకు సన్మానం ”
సరసభారతి 154 వ కార్యక్రమంగా బ్రహ్మశ్రీ శ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవ విశేషాలు
5-9-20శనివారం నాడు సాయంత్రం శ్రీ సువర్చలాన్జనేయ స్వామి దేవాలయం లో సాయంత్రం 6-30గంటలకు భారత మాజీ రాష్ట్ర పతి ,భారతరత్న డా సర్వేపల్లి రాధా కృష్ణ పండితుని 132వ జయంతి నాడు సరసభారతి 154వ కార్యక్రమంగా బ్రహ్మ శ్రీ కోట గురు వరేణ్యుల గురుపూజోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది . ముందుగా ఇటీవలే మరణించిన భారత మాజీ రాష్ట్రపతి ,భారత రత్న శ్రీ ప్రణవ్ ముఖర్జీ మరణానికి ,సుప్రసిద్ధ హాస్యనటుడు రచయిత,శ్రీ రావి కొండలరావు ,బాలసాహిత్య రచయిత శ్రీ కలువకొలను సదానంద మొదలగు రచయితలకు ,కరోనా కల్లోలం లో అశువులు బాసిన వేలాది ప్రజలకు ,వారికి సేవల౦దిస్తూ ఆవ్యాధి సోకి ప్రాణాలు కోల్పోయిన డాక్టర్లు నర్సులు ,పోలీసు సిబ్బందికి , ప్రైవేట్ స్కూళ్ళలో , కాలేజీలలో పని చేస్తూ ,హాయిగా జీవితాలుగడిపి ,ఈ లాక్ డౌన్ల ఫలితంగా జీతాలు లేక రాక మరణించిన ఉపాధ్యాయ మిత్రులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించాం .
తర్వాత బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి గురు వరేణ్యుల చిత్రపటానికి మొదటగా నేను పుష్పమాల అలంకరించి ,పుష్పాలు సమర్పించి ,శాసనమండలి సభ్యులు శ్రీ వై వి బి రాజేంద్ర ప్రసాద్ ,హాజరైన ఉపాధ్యాయ ,విద్యార్ధులు , తలిదండ్రుల చేత పుష్పాలను సమర్పింప జేశాము .తరువాత నేను కోట గురువరేణ్యుల వద్ద నేనూ శ్రీ మైనేని గోపాలకృష్ణగారు సుమారు 75 సమ్వత్సరాఆల క్రితం ప్రాధమిక విద్య నేర్చిన సంగతి ,మైనేని గారు ఏర్పాటు చేసిన గురువుగారి స్మారక పురస్కారాలసంగతి ,గురుపుత్రులు తమతలిదడ్రుల స్మారకార్ధం ఏర్పరచిన పురస్కార విశేషాలు తెలియజేశాను. తర్వాత రాధాకృష్ణ పండితుని శేముషీ వైభవాన్ని గురించి నేను కొంచెం మాట్లాడి ,తర్వాత సన్మాననగ్రహీతలైన ఉపాధ్యాయుల చేత మాట్లాడింప జేశాం .
ఆ తర్వాత శ్రీ రాజేంద్ర ప్రసాద్ కూడా సర్వేపల్లి ఘనకీర్తి వివరించి ఆయన ను ఆదర్శంగా గ్రహించాల్సిన విషయాన్ని తెలియ జేశారు .వెంటనే 2020 పదవతరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులైన పేద ప్రతిభగల విద్యార్ధినీ విద్యార్ధులకు శ్రీ మైనేని గోపాలకృష్ణ ,శ్రీమతి సత్యవతి (అమెరికా )దంపతులు ఏర్పాటు చేసిన బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ శాస్త్రి ,శ్రీమతి సీతమ్మ దంపతుల స్మారక నగదు పురస్కారాలను నాలుగు స్కూళ్ళకు చెందిన 7గురు విద్యార్ధినీ విద్యార్ధులకు ,ఒక్కొక్కరికి 2 వేలరూపాయలు వంతున ,పిమ్మట శ్రీ కోట గురుపుత్రులు ఏర్పాటు చేసిన తమతలిదండ్రుల స్మారక నగదు పురస్కారాలను ఈ సంవత్సరం పదవతరగతి పబ్లిక్ పరీక్షలో ఉత్తీర్ణులై ,ఇంటర్ మొదటి సంవత్సరం లో చేరిన పేద ,ప్రతిభగల ఇద్దరు బ్రాహ్మణ విద్యార్ధినులకు ఒక్కొక్కరికి 10 వేలరూపాయల వంతున ,సరసభారతి ప్రత్యేకంగా పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధికి ఏర్పాటు చేసిన 5 వేలరూపాయల నగదు పురస్కారాన్ని ,సరసభారతి శ్రీ శార్వరి ఉగాదికి ఆవిష్కరించిన మూడు పుస్తకాల సెట్ తోపాటు నేనూ ,శ్రీ రాజేంద్ర అందజేశాము .
ఉత్తమ ఉపాధ్యాయులుగా పేరు పొందిన శ్రీ వేమూరు సదాశివరావు శ్రీఆదిరాజు హనుమంతరావు ,శ్రీమతి ఆదిరాజు కనకదుర్గలకు శ్రీ రాజేంద్ర చేతులమీదుగా సరసభారతి సత్కారం చేయించి తలొక 5 వందల రూపాయల నగదు పురస్కారం ,సరసభారతి మూడు పుస్తకాల సెట్ ,ఇందించి శాలువాలతో సత్కరించాం .నిరాడంబరంగా ఉత్సాహంగా కోవిడ్ జాగ్రతలైన మాస్కులు, శానిటైజర్ల వాడకం తో కార్యక్రమ౦ ఘనంగా జరిగింది .కార్యక్రమాన్ని కార్యదర్శి శ్రీమతి మాదిరాజు శివలక్ష్మి ,కోశాధికారి ఛి గబ్బిట వెంకటరమణ ,సాంకేతిక సలహాదారు శ్రీ వి.బి.జి.రావు గార్లు చక్కని ఏర్పాట్లతో సహకరించారు .
నా ప్రసంగం లోని కొన్ని ముఖ్య విషయాలు – బ్రహ్మశ్రీ కోట సూర్యనారాయణ గురువరేణ్యులు 26-3-1903 శుభకృత్ ఫాల్గుణ బహుళ త్రయోదశి నాడు జన్మించారు తలిదండ్రులు శ్రీ కోట పున్నయ్య ,శ్రీమతి సరస్వతమ్మ దంపతులు .68 వ ఏట 7-2-1971సాధారణ సంవత్సర మాఘ శుద్ధ త్రయోదశి ఆదివారం మరణించారు .గుడివాడ కలువపాముల ,ఉయ్యూరులో ఉపాధ్యాయులుగా పని చేసి ఎందరి జీవితాలనో తీర్చి దిద్దారు .తర్వాత గుడివాడలో ఒక ప్రైవేట్ సంస్థలో చేరి జీవితాంతం ఉద్యోగించి మంచి కీర్తి పొందారు .రెన్ అండ్ మార్టిన్ ఇంగ్లీష్ గ్రామర్ శిక్షణలో గొప్ప పేరు సంపాదించి ఎందరో ఉన్నత విద్యలలో రాణి౦చటానికి తోడ్పడ్డారు.
శ్రీ సర్వేపల్లి రాధాకృష్ణన 5-9-1888న తిరుత్తణి లో శ్రీ వీరాస్వామి ,శ్రీమతి సీతమ్మ నిరుపేద బ్రాహ్మణ దంపతులకు జన్మించారు .చదువు చెప్పించే స్థోమత లేక తండ్రి గారు రాధాకృష్ణన్ ను పూజారిగా ఒక గుడి లో చేరమన్నారు .ఆయనకు చదువు మీద బాగా ఆసక్తి ఉండటం చేత ,కాదని తిరుపతిలో ఒక మిషనరీ స్కూల్ లో చేరారు .అరిటాకు కొని అందులో తినే ఆర్ధిక స్తోమతు కూడా లేక పోవటం తో నేలను శుభ్రం చేసుకొని ,నేలపై భోజనం చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి .అక్కడి నుంచి చదువులో అత్యుత్తమ ఫలితాలు సాధిస్తూ స్కూలు, కాలేజీ, యూనివర్సిటీ విద్య అంతా స్కాలర్ షిప్ లతో చదివిన మేధావి రాధాకృష్ణపండితుడు .21 ఏళ్ళకే మద్రాస్ ప్రేసిడెన్సి కాలేజి ప్రోఫెసరయ్యారు .శ్రీనంజుండయ్య వీరిప్రతిభగుర్తించి మైసూర్ విశ్వవిద్యాలయానికి ప్రొఫెసర్ గా ఆహ్వానిస్తే చేరి తత్వశాస్త్ర ప్రొఫెసర్ అయ్యారు .తర్వాత విశ్వకవి రవీంద్ర నాథ టాగూరు ,మహా మేధావి విద్యావేత్త లాయర్ అశుతోష్ ముఖర్జీలగౌరవ ఆహ్వానంతో కలకత్తా యూని వర్సిటీ ప్రొఫెసర్ గా చేరి ఇక్కడే ‘’ఇండియన్ ఫిలాసఫీ ‘’గ్రంథం రాశారు .
కట్టమంచి రామలింగారెడ్డి గారి పదవీ విరమణ తర్వాత 1931లో ఆంద్ర విశ్వవిద్యాలలయ వైస్ చాన్సలర్ అయ్యారు .తన పదవీ కాలం లో దేశంలోని అత్యున్నత విద్యావేత్తలను సగౌరవంగా ఆహ్వానించి ఉద్యోగాలలో నియమించారు.అలా నియమింపబడిన వారిలో హీరేన్ ముఖర్జీ ,హుమాయూన్ కబీర్ వంటి మేదావులున్నారు ..భారత రాజ్యంగపరిషత్ సభ్యులుగా ఆయన 1947ఆగస్ట్ 14-15రాత్రి చేసిన ప్రసంగం మహా ఉత్తేజంగా సాగింది .రష్యారాయబారిగా ఆయన నియంత స్టాలిన్ హృదయం లో పరి వర్తన తెచ్చారు.ఉపరాష్ట్ర పతిగా 1952నుండి 1962 వరకు పదేళ్ళు ఉన్నారు అప్పుడు బాబూ రాజేంద్ర ప్రసాద్ భారత తోలి రాష్ట్రపతి .వీరు తొలి ఉపరాష్ట్ర పతి .1962నుంచి 1967వరకు రాధాకృష్ణన్ భారత రెండవ రాష్ట్ర పతిగా కీర్తి ప్రతిష్టలు తనకు దేశానికీ పదవికీ ఆర్జి౦చి పెట్టారు .భారత రత్న పురస్కారం పొందిన శేముషీ దురంధరుడు .
యాన్ ఐడియలిస్టిక్ లైఫ్ ,ది హిందూ వ్యూ ఆఫ్ లైఫ్ ,ది ప్రిన్సిపల్స్ ఆఫ్ లైఫ్ వంటి అత్యుత్తమ గ్రంథాలు రచించారు .పాశ్చాత్య ,భారతీయ తత్వ శాస్త్రాలను తులనాత్మకంగా పరిశోధించి గొప్ప పుస్తకాలు రాశారు .’’ప్రస్థాన త్రయానికి అనితరసాధ్యమైన ఆంగ్ల వ్యాఖ్యానం’’ రాసిన మహోన్నత మేధావి రాధాకృష్ణన్.కొరాన్ బైబిల్ లను సాధికారికంగా వ్యాఖ్యానించే నేర్పు ఆయనది .దార్శనిక గ్రంథాలేకాదు తర్క ,మానసిక శాస్త్రాలలోనూ మహాపండితుడు .ఆయన అపార పరిజ్ఞానం తో రాసినవన్నీ విజ్ఞాన భా౦డాగారాలే ,భిన్నత్వంలో ఏకత్వం సాధించేవే .వైరుధ్యాలమధ్యసమానత్వం సాధిస్తాయి .మానవ కర్తవ్య నిర్దేశానికి మానవోద్ధరణకు రాసినవి .వాటిలోని సమ్యక్ దృష్టి అసాధారణం ,అపూర్వం .రాధాకృష్ణన్ అమోఘ వ్యక్తిత్వాన్ని ఆవిష్కరిస్తూ శ్రీ నార్ల ‘’కర్ణునికి సహజ కుండలాలతో పుట్టినట్లు రాధాకృష్ణన్ ‘’ఆయనకే ప్రత్యేకమైన తెల్లని శిరో వేష్టవం ‘’తో జన్మించారేమో ‘’
భారతరత్న రాధాకృష్ణన్ 17-4-1975 న 87 వ ఏట మరణించారు
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-20
—