ట్రాన్స్ జెండర్ల బాధా సమస్యా,పరిష్కార కథా సర్వస్వం- ‘’అస్మిత ‘’

ట్రాన్స్ జెండర్ల బాధా సమస్యా,పరిష్కార కథా సర్వస్వం- ‘’అస్మిత ‘’

సుమారు పదిహేను రోజులక్రితం బెజవాడ నుంచి శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారు ఫోన్ చేసి తాము ‘’అస్మిత ‘’అనే కథా సంకలనం ,’’ఒక్క క్షణం ‘’ అనే తన కథా సంపుటి ప్రచురించామని ,పంపుతున్నామని ,అభిప్రాయం తెలియజేయమని  చెప్పి ,వెంటనే కొరియర్ లో పంపగా అవి వారం తర్వాత నాకు అందాయి .ఈలోగా ఆమె వాట్సాప్, లో ఫోన్ లో వచ్చాయా అని అడగటం రాలేదని చెప్పటం కూడా అయింది .రాగానే వెంటనే తెలియజేశాను .నాలుగురోజులక్రితం ‘’అస్మిత ‘’చదివారా అని వాట్సాప్ప్ చేస్తే ,అప్పుడే కొరియర్ విప్పి పేర్లు చూసి, ఇంకాలేదు చదివాక తెలియజేస్తా అని సమాధానమివ్వగా ధాంక్స్ చెప్పారు .బిజీ బిజీ గా ఉన్ననేను నిన్ననే ఆపుస్తకం ఆదివారం చదివి ,నా భావాలు రాయాలనుకొని ,ఇవాళ ‘’లైవ్ ‘’ అయ్యాక ఉదయం 11-30కు చదవటం మొదలుపెట్టి 8కథలు చదివి ,భోజన విశ్రాంతి తర్వాత సాయంత్రం మళ్ళీ చదివి పుస్తకం ఇప్పుడే ఒక అరగంట క్రితం చదివి పూర్తిచేశాను. అదో లోకం .నాకు తెలియనిది .శీర్షికకూడా వెంటనే స్పురించలేదు ,ఇప్పుడే పై శీర్షిక మనసులో తట్టి  రాయటం ప్రారంభిస్తున్నాను .

  సమాజం లో కొజ్జాలు ,’’అదో టైపు ‘’నపుంసకులు ,హిజ్రాలు,ట్రాన్స్ జ౦డర్లుఅనే అనేక పేర్లతో పిలువబడేవారి ‘’జీవితం బాధలు సమస్యలు ,వాటికి పరిష్కారాలు గురించి జనసామాన్యానికి తెలియ జేసి, వారిపై ఆత్మీయత స్నేహం పెంచే గొప్ప సదుద్దేశ్యం తో కోపూరి ట్రస్ట్ వారు ‘’సమన్విత ‘’సంస్థద్వారా తెలుగు రాష్ట్రాలలోని రచయితలను పై సమస్యపై కథలపోటీ ఏర్పాటు చేసి,  రాసి పంపమని కోరితే స్పందించి రాసిన వాటిలో  15కథలను మాత్రం ఎంపిక చేసి ,సమన్విత బృందం వారి నాలుగు కథలనూ చేర్చి మొత్తం 19 కథలను ‘’అస్మిత ‘’పేరుతొ ఈ సంవత్సరమే ప్రచురించి ఆదర్శంగా నిలిచారు .ఇందులో  మూడు ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులు ,నాలుగు కన్సొలేషన్ బహుమతులకు ఎంపికయ్యాయి. వీరికి వెన్ను దన్నుగా అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం –ఐద్వా నిలిచింది .అభినందించదగిన  గొప్ప ప్రయత్నం .ఈ పుస్తకాన్ని హస్తభూషణం చేసుకొన్న వారందరికీ అంకిత మిచ్చారు విశాలహృదయం తో .

  ఇంతకీ నాకు ‘’అస్మిత ‘’అంటే ఏమిటో అసలు అర్ధం కాలేదు .నిఘంటువు వెతికా .అందులో ‘’నేను అనే భావం ‘’,అహం అనే భావం ‘’అహమిక ‘’అంటే ఆదేశం ,ఉద్ధతి ,పొగరు ,బీరము  హం కారం అనే అర్దాలున్నట్లు తెలిసింది .ఎవర్ని ఉద్దేశించి ఈ పుస్తకం తెచ్చారో వారందరిలో ‘’నేను అనే భావం ‘’అంటే అస్తిత్వ భావన కలగాలన్నది గొప్ప ధ్యేయం కనుక శేర్షిక చాలాబాగా సరిపోయింది అనిపించింది .అహ౦ భావం లేకపోతే సమాజం గుర్తించదు.అది పొగరు కాదు  అస్తిత్వ  నిరూపణమాత్రమే .అని మనం గుర్తుంచుకోవాలి .

  మొదటి బహుమతి పొందిన కథ-‘’కసారా నుంచి రైలు ‘’ను శ్రీ  పివిఆర్ శివకుమార్ రాశారు .రైలు పెట్టెలలో బస్సుల్లో ,రోడ్లమీద హిజ్రాలు గుంపులు గుంపులుగా వచ్చి డబ్బు ఇవ్వమని పీడిస్తూ వెకిలి చేష్టలు చేయటం చూస్తూనే ఉంటాం .వాళ్ళను చూడంగానే  అంటరాని వారుగా భావించి దూరం పోవటం కూడా మనకు తెలుసు .శ్రీ హరి పెళ్లి అవుతుంటే తెలిసి ‘’చక్కాలు ‘’వచ్చి  వాళ్లమామూలు అడిగారు .తండ్రికి ఇష్టం లేదు .ఇంట్లో ఎవ్వరికీ అదొక జుగుప్స మేళం అనిపించింది .పెళ్లి కొడుకే  బయటికి వచ్చి వాళ్ళు అడిగిన రెండు వేలే కాక పైన మరో అయిదు వందలు వేసి ఇచ్చి ‘’ఇది అందరం పంచుకుంటాం .మీ గోడ మీద సైను పెడతా .మా వాళ్ళు ఎవరూ మళ్ళీ రారు ‘’అని హామీఇచ్చింది నాయకురాలు రంజని .ఆశీర్వదించి౦ది. ఆమె కళ్ళలో కోటి కాంతులు చూసాడు హరి .వీరిపై సానుభూతి కలగటానికి తన ఫ్లాష్ బాక్ చెప్పాడు .ఒక సారి నాసిక్ నుంచి ముంబై రైలులో వెడుతుంటే కసారా స్టేషన్ లో తనప్రక్క కూర్చున్న వ్యక్తిని  చూడగానే  ఏవగింపు కలిగి దూరంగా జరిగాడు .ఆమె ముఖం కోపం తో ఎర్రబడి ‘’కూచో౦డి ఎందుకు దూరంగా అరుగుతారు నేను అడుక్కొటానికి రాలేదు .కాసేపాగాక ఆమె తాను  కఠినంగా మాట్లాడినందుకు సారీ చెప్పి అతనిలాంటి విద్యావంతులు కూడా తమలాంటి వారని అవమానంగా చూడటం బాధగా ఉందని ‘’అంటే  వాళ్ళ ప్రవర్తన వల్లనే అలా జనం చీత్కరిస్తున్నారని అతడు అంటే, ఆమె తమ ప్రవర్తన వెనుక విషాదం అంతా వివరించింది .తానూ సోషియాలజీ  ఎం.ఏ.అనీ ,ఉద్యోగం కోసం ఇంటర్వ్యులకు  వెడితే ట్రాన్స్ జెండర్ అనే నెపంతో ఉద్యోగం ఇవ్వలేదని అలాంటి వారి ప్రక్క మిగిలిన ఉద్యోగులు కూర్చోటానికి కూడా ఒప్పుకోరనీ ,ప్రభుత్వాలు తమలాంటివారికోసం ఉద్యోగాలు కేటా ఇంచాలనీ ,తమ శారీరక వైపరీత్యం తమ చేతుల్లో లేదనీ ,ఆకలి తీర్చుకోటానికి అనేక చెడు మార్గాలు పడుతున్నామని ,తమకు పని కల్పించరు ,తమకు తోచింది చేయనివ్వదు ఈ సమాజం అని వాపోయింది .హరి మైండ్ బ్లాంక్ అయిపోయి యదార్ధం తెలిసి కళ్ళు తెరుచుకొన్నాయి .ఆమె తలిదండ్రులు కూడా పట్టించు కోరా అనే పిచ్చ ప్రశ్న వేశాడు .ఇంట్లో అవమానాలు భరించలేక వీధిన పడుతున్నామనీ ,ఇంట్లో వాళ్ళే తమపై జుగుప్సతో ఉండటం భరించలేకపోవటమే కారణమనీ తల్లులు మాత్రం జుగుప్సకీ ,కన్నపేగుకీ మధ్య నలిగి పోతున్నారనీ ,బయటికొచ్చి విశృ౦ఖలతకు స్వేచ్చాజీవితానికి అలవాటు పడిపోతున్నామని ,ఒక రకంగా సమాజానికి ఎదురీది బతుకు తున్నామని చెప్పింది .వీరిద్దరి మధ్య ఆత్మీయమైన అవగాహన కలిగి  హరి ఇంట్లో వారికి చెప్పి ఉద్యోగం మానేసి గార్మెట్ ఇండస్ట్రీ పెట్టి ఆమెను  అడ్మిని స్ట్రేషన్ భాగం అప్పగించి ,ట్రాన్స్ జెండర్లనే ఇద్దరూ ఆసంస్థలో ఉద్యోగులను గానియమించి క్రమ౦ గా అనేక శాఖలు గా ఎదిగి  ఎందరికో ఆసరా గా నిలబడ్డారు .ఒక ఇడియా హిజ్రాలజీవితాలలో వెలుగే నింపింది .

  రెండో కథలోకి వెళ్లేముందు మీ దృష్టికి ఒకవిషయం తెస్తున్నాను .సుమారు అయి డా రేళ్ళక్రితం డా.అలిసేటి నాగరాజు  అనే అంధుడు శ్రీ గంథం  వేంకాస్వామి శర్మగారి కథాసంపుటి ‘’అమృత హస్తాలు ‘’పై పరిశోధన చేసి ,పుస్తకం ఆవిష్కరణ జరిపినప్పుడు శర్మగారి ద్వారా పరిచయమై ,తర్వాత ఆతనే తనలాంటి ‘’దివ్యా౦గులు ‘’చేత కథలు రాయించి, నాకు పంపి అభిప్రాయం రాయమని కోరితే దాదాపు అన్నీ చదివి ముందుమాట రాస్తే ఆకథలను నేను రాసిన దానితో సహా ముద్రించి ఆవిష్కరించాడు .అతడికి మూడేళ్లక్రితం సరసభారతి స్వయం సిద్ధ పురస్కారం అందించింది .అలా ఈ పుస్తకం లో ట్రాన్స్  జ౦డర్ల  చేత రాయించే ప్రయత్నం జరగలేదని అనిపించింది అంతే .

   ద్వితీయబహుమతి ప్రఖ్యాత వైద్యులు డా రమణ యశస్వి రాసిన ‘’తోటమాలి చమత్కారం ‘’కి దక్కింది .హిజ్రాలను ఈస డించే వారే కానీ వారిని ఇంట్లో పనిలో పెట్టుకోటానికి ఎన్నో గుండెలు ఉండాలి . ,ఇంటిపనికోసం ఒక మనిషికావాలని ప్రకటన ఇస్తే అమ్మాయో అబ్బాయో అర్ధంకాని ఒక మొరటు శాల్తీ వస్తే తానూ రోజూ రైలు గేటు దగ్గర చూసే  వింత హావ భావాలు చూపి డబ్బులు అడుక్కొనే  నాగరాజు అని గుర్తి౦చగా తల్లి వాడు అబ్బాయిగానే పుట్టి ,క్రమ౦గా అమ్మాయి లక్షణాలు పొందాడని,వాడిపై ముగ్గురూ మగపిల్లలేనని తాగుబోతు భర్త  బలవంతం తో   వీడిని కన్నానని, సుఖం లేకుండా పోయిందని బావురుమన్నది .రాజు తనలాంటి ఇంకోడిని ఈ డాక్టర్ దగ్గరకు తెచ్చాడు .వాడి పేరు  పేరయ్య అని  పమిట సవరిస్తూ చెప్పుకొన్నాడు .గజ్జల్లో నెప్పులతో బాధవాడికి .పరీక్షిస్తే తొంటి కీళ్ళు రెండూ చెడిపోయాయి ఎక్సరే వగైరా పరీక్షలు చేయించి రిపోర్ట్ తీసుకురమ్మంటే అడుక్కుంటే కాని పొట్టగడవదని చెబితే సానుభూతితో ఉచితంగా చేయించాడు డాక్టర్ బాబు .దీనికి తోడూ  హెచ్ ఐ వి   పాజిటివ్ అనీ తేలింది .తనగు౦పు లో  సగం మందికి ఈజబ్బు ఉందని ,దేవుడికి కూడా తాము అక్కర్లేదని బాధపడ్డాడు .మందు బిళ్ళలు రాసిస్తే ‘’నొప్పి లేకపోతే రోజూ స్వర్గమే సారూ ‘’అని కూలబడి ఏడ్చాడు .దోవ చూపే వారు లేక వాళ్ళు అలా అయ్యారని బాధపడ్డాడు .

 నాలుగురోజులకు గేటుదగ్గర కూరలమ్మి వచ్చి తనకొడుకు ను యదకొచ్చిన గేదె లాగాఉన్నాడని మూడోరకం జనం మీద పడి పోతున్నారని ఏడ్చింది .అప్పుడు అర్ధమైంది పేరయ్య అన్నమాటలు .వాడికి తోటమాలి ఉద్యోగం ఇచ్చాడు డాక్టర్ .మొక్కలు బాగాపెంచి ఫలసాయం బాగా తీస్తున్నాడు .ఒక రోజు డాక్టర్ ఆస్పత్రిలో ఉన్న సమయం లో వాడిని కొజ్జాలువచ్చి అత్యాచారం చేస్తే స్పృహ కోల్పోయాడు .వారం ట్రీట్ మెంట్ తర్వాత కోలుకొన్నాడు . వాళ్ళ సంగతి తెలుసుకోవటానికి డాక్టర్ వెడితే పేరయ్య కనిపించాడు .అతనిద్వారా వాళ్ళ వివరాలన్నీ తెలుసుకొని ,వాళ్లకు ఉచిత హెల్త్ కార్డులు ఇచ్చి ,రాజు జోలికి రావద్దని హెచ్చరించి ,వైద్య శిబిరం పెట్టి కేసులు చూసి కౌన్సెలింగ్ ఇచ్చి  వృత్తి మాన్పించాడు .రాజు ఇంటి దగ్గర గార్డెన్ పనిలో రాటు దేలాడు   అంటుకట్టి  సగం తెలుపు సగం ఎరుపు గులాబీ పూయించాడు .దానికి ముళ్ళు ఎక్కువే .వాసన లేదు .దేవుడి సృష్టీ ఇలాగే ఉంటుంది అనుకొన్నాడు డాక్టర్ బాబు .ఇందులో హిజ్రాల బాధలు ఒత్తిడి చెబుతూ ,పరిష్కారం కూడా చూపారు రచయిత.

 ‘’మానవత్వం ‘’అనే మూడవ బహుమతి పొందిన కథ రచయిత శ్రీ కోయిలాడ రామమోహనరావు .ఇందులో హిజ్రాల సాహసం చూస్తాం .నాలు గేళ్ళక్రితం  ఈస్ట్ ఢిల్లీలో ‘’త్రిలోకపురి ‘’ప్రాంతం లో హిందూ ముస్లిం లమధ్య మతకల్లోలాలు బాగాజరిగితే ,పోలీసుల వశం కాకపొతే అక్కడి హిజ్రాలు ధైర్యం గా ఆ రెండు వర్గాలమధ్యా నిలిచి ఆపకపోతే తమబట్టలు విప్పేస్తాము అని బెదిరించగానే కల్లోలాలు ఆగిపోయాయి .కనుక వారిలో ప్రాణాలకు తెగించే సాహసం ఉందని తెలుస్తోంది ఇన్స్పెక్టర్ అహ్మద్ గ్రహించి తనింట్లో పెళ్లి జరిగితే హిజ్రాలకు గొప్పనగదు బహుమతి ఇచ్చానని పరాంకుశానికి చెబితే బిత్తరపోయి  తనింటికి వచ్చిన  అలాంటివారికి డబ్బిచ్చిపంపాడు .ధాయలాండ్ ‘’అల్కజార్ షో’’ప్రపంచ వ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అందులో డాన్స్ చేసే వాళ్ళు వీళ్ళే .ఈ కథ2014అక్టోబర్ 28 న ఢిల్లీ లో జరిగిన యదార్ధ సంఘటనకు కథారూపమే .

కన్సొలేషన్ ప్రైజ్ వచ్చిన ‘’రంగుటద్దం’’లో ఉమ  తనజీవితాన్ని వీడియోలలో పెట్టి తనలాంటి వారిని ఎడ్యుకేట్ చేసి చాలాపాప్యులరరై’’ప్రతివాడూ తనజీవితానికి తానేకర్త ,సంస్కర్త ‘’అని ప్రబోధించింది .ధర్డ్  జ౦డర్ల లలో అమ్మతనం అనంతంగా ఉంది దాన్ని చానలైజ్ చేసి అనాధపిల్లలకు అందించిన కథ ‘’ప్రేమ బృందావనం ‘’.తనకొచ్చే ఉద్యోగాలకు ట్రాన్స్ జ౦డర్ కారణంగా ఆగిపోతుంటే కోర్టులలో సవాలు చేసి ,దాన్ని కోర్టులో ధృవీకరి౦పజేసుకొని వారిహక్కులకోసం వెల్ఫేర్ కమీషన్ లాంటివి ఏర్పాటు చేయించాలని కృషి చేసిన సోనాలీ కథ, ,,పర్వతాలరావు కు  యాక్సిడెంట్ అయితే మానవత్వం చూపి కాపాడిన హిజ్రా విశాలాక్షి ఆదర్శాలకు చేయూతనిచ్చి కుటీర పరిశ్రమ స్థాపించి జాలీ నాలీ లేని తనలాంటి వారుస్వయం శక్తితో నిలబడేట్లు చేసిన విశాలాక్షిగా మారిన విశాల్ ‘’చీకటి జాబిలీ ‘’గా కనిపిస్తుంది .’’కొత్త చిగుళ్ళు ‘’లో స్నేహితులంతా  కలిసి హిజ్రా సమస్యలను కూలం కషంగా అధ్యయనం చేసి అన్నిమాధ్యమాలద్వారా ప్రజల దృష్టికి తీసుకు వెడతారు .కొడుకు తల్లిని వదిలించుకొని పారిపోతే ఆముసలిది ఎక్కడో దిగి ఒక చిన్న హోటల్ నడిపే ఊర్వశి దగ్గర చేరి పనులు చేస్తూ ,ఆమెకు తోడుగా తనకు ఆమె తోడుగా ఉంటూ బతుకు  వెళ్ళ దీస్తుంటే  చివరికి ఆ ఊర్వశి తాను  మగపోకడలు ఉండటం  గ్రహించి ఇంట్లో నుంచి గెంటేసిన తనకూతురు బాల అవటం   ఫినిషింగ్ టచ్ గా ఉన్నదే ‘’ఎదిపుణ్యం ఏది పాపం ?’’

  హిజ్రాల జీవితాలలో రిఫార్మ్స్ తీసుకురావాలి సంఘంలో వారికి గౌరవమర్యాదలు దక్కాలి .అనే ధ్యేయంతో జమునారాణి బెంగుళూర్ లో ఒక షెల్టర్ ఏర్పాటు చేసి ,దానికి తగిన ఆర్ధికస్తొమతు కోసం ప్రయత్నిస్తుంటే  కేశవ శ్రమకు  నచ్చి, తన సహాయ సహకారాలు ఉంటాయని చెప్పగా సంతోషం లో బెంగళూరు వెళ్లగా కొందరు దుండగులు దొంగ చాటుగా ఆమె పైకాల్పులు జరిపి పారిపోయారు .తన స్నేహితుడు ఐబిఐ డైరెక్టర్ కు చెబితే ,రైఫిల్  అసోసియేషన్  సభ్యురాలై కాల్పుల విషయం బయటపడకుండా జాగ్రతపడి౦ది చావు భయం లేని ఆమె .’’ధ్యేయం బలమైనప్పుడు ,మానవాళికి అత్యవసరమైనప్పుడు మృత్యువు కూడా కరుణించి కొన్నేళ్ళు వేచి ఉంటుందని చెప్పేదే ‘’వైఖరిలో మార్పు ‘’.

 అబ్బాయిగా పుట్టినవాడు  జెట్ స్పీడ్ లో అవయవాలలో హార్మోన్ల మార్పుల వల్ల స్త్రీగా మారి తే ,తలిదండ్రులు కూడా సానుభూతిగా అర్ధం చేసుకొంటే  డాక్టర్ల  సంప్రదింపులతో  తల్లి సహకారం తో ,స్వచ్చంద సంస్థల సాయంతో బొంబాయిలో సర్జరీలు చేయించుకొని నాగరాజు నాగమణి గా మార్పు చెంది మిస్ ఇండియా పోటీలో గెలిచి ,తన్ను తిరస్కరించిన చోటే అత్యుత్తమమహిళగా  గుర్తింపు పొందాలన్న  కాంక్ష నెరవేరి, ఆ గౌరవంతో తనలాంటి ట్రాన్స్ జండర్ లసంక్షేమం కోసం కృషి చేసే ప్రయత్నం చేసిన కథ ‘’విజేత ‘’.హిజ్రాలపై కవిత్వం రాస్తే విని పరవశించే తత్త్వం ,కన్నీరు కార్చిన అనూషా అనే  హనుమంతు విషయమే’’మాకూ మనసుంది ‘’.హిజ్రాలు స్వతంత్రంగా బతకాలనీ , వాళ్లజీవితాలలో వెలుగులు  ని౦పాలనీ సదుద్దేశ్యంతో అగర్వాల్ అనే ధనవంతుడు చేసే కృషి కల లోకి వచ్చి ,అదికలకాకూడదని నిజమై తీరాలని ,అది కర్తవ్య బోధ  అని గ్రహించటమే ‘’కొత్తదారి’’.

‘’ట్రాన్స్ జండర్ జాతి మాది  అని గర్వం గా చెప్పుకొనేట్లు చేస్తాను. జన్యుపరంగా ఏర్పడిన లోపాలకు గురైన జాతి మాది అని గర్వంగా చెప్పుకొనేట్లు చేస్తాను ‘’అన్న అతడు . ‘’వికసించిన పుష్పం లాంటి వాడు ‘’అని చెప్పినదే ‘’వికసిత కుసుమం ‘’

  అబ్బాయిల్లో సెకండరి సెక్సువల్ కారస్టిక్స్ డెవలప్ అయి అమ్మాయిలుగా ప్రవర్తి౦చటం మహేష్ లో  జరిగితే ,ఇంట్లో వాళ్ళ బాధ అర్ధం చేసుకొని అందనంత దూరం గమ్యం లేకుండా వెళ్లి హిజ్రాలపరిచయంకలిగి మహేశ్వరి పేరుతో ఉంటూ , వాళ్ళజీవితాలను అర్ధం చేసుకోవటం ‘’సమాజ నిరాదరణకు గురౌతున్న ఈ అంటరాని అభాగ్య జాతి పట్ల ‘’ప్రభుత్వాలు వారిని జనజీవన స్రవంతిలో భాగస్వాములయేట్లు సకల చర్యలూ తీసుకోవాలని ఉద్బోధించటమే  ‘’పంజరం ‘’ధ్యేయం .ఇంట్లో పనిమనిషి వెంకటరమణ అదో టైపు. భార్య సుభద్రకు మొదట్లో ఇష్టం లేకపోయినా భర్తను కాదనలేక చేర్చుకొన్నది .ఆమెకు అన్ని రకాల సేవలూ వెంకటరమణ చేసి మనసు గెలిచి భర్తపోయాక కూడా ఆసరాగా నిల్చి౦ది . తన మనసులోని బాధను ‘’మాలా౦టివాళ్ళం అందరి తిట్లు చివాట్లు తినాలనికాదు .సమాజం మమ్మల్ని చీడ పురుగులుగా చూస్తోంది .కళ్ళు కాళ్ళు లేనివారిపై చూపే సానుభూతి మాపై ఎందుకు చూపరు ?.మా తప్పుకాని మా పుట్టుకకు మమ్మల్ని బాధ్యులు చేస్తున్నారు ‘’అని వలవలా  ఏడిస్తే రజని లాంటి యువరక్తం తాము అండగా నిలబడతామని భరోసా ఇవ్వటం శ్రీమతి కోపూరి పుష్పావతిగారి కథ ‘’చేయీ చేయీకలిపి ‘’.

  హిజ్రాల పెళ్లి రిజిస్టర్ చెయ్యరు .లేకపోతె సెక్స్ మార్పు చేయించుకొని సర్టిఫికేట్ ఇవ్వాలి ఇది అనవసరం అనుకొన్న అభిరాం ,ఆషాగా మారిన హిజ్రా అరుణ్ పెళ్లి చేసుకొని హాయిగా గడుపుతున్నారు .కొత్త ఇల్లు కట్టుకొని అనాథాశ్రమలో పెరుగుతున్న పిల్లను దత్తత చేసుకొని ‘’కోకిల ‘’పేరు పెట్టుకొని కిలకిలా నవ్వులతో గడిపే కథ’’కోకిల ‘’.ప్రేమించి పెళ్లి చేసుకొన్న భర్త పిల్లలు పుట్టకపోతే మారు మనువుకు సిద్ధమైతే అతడి మనస్తత్వానికి విసిగిపోయిన చామేలీ కి లేడీ డాక్టర్ స్వంతిల్లు ఏర్పడే వరకు విడాకులకు అంగీకరించవద్దని సలహా చెప్పి సాంత్వన కలిగించినదే ‘’చమేలీ ‘’కథ . గ్రామీణ కొండ ప్రాంతం లో పుట్టి జీవనపోరాటం లో ఆరితేరి ప్రకృతి విసిరే సవాళ్ళకు జవాబు ఇస్తూ ,క్రీడలలో రాణించి ,ఆర్చెరీలో ఒలింపిక్స్ లో గెలవాలన్న ధ్యేయం తో ఉన్న ట్రాన్స్ జండర్ స్త్రీల విభాగం లో పోటీ చేయటానికి ఎన్నో  అడ్డంకు లేర్పడితే అన్నిటికీ తెలివి తేటలతో సమాధానాలు చెప్పి ఒప్పించి గెలిచి సత్తా చూపించిన ఒలింపిక్ చాంపియన్ అమీ కధ’’సమత్వం ‘.ఇందులో ఆమె తనలక్ష్యం ను ‘’SI DDOD’’గా చెప్పింది .అంటే ‘’సేవ్ఇండియా ,డ్రైవ్ ఔట్ డిస్క్రిమినేషన్’’అని అర్ధం .లింగ వివక్షత పోవాలి. లింగ నిర్దారణహక్కు వ్యక్తులకే ఉండాలికాని సమాజానికి కాదు .సమాజంలో లింగ వివక్షతకు స్థానం ఉండరాదు .ఈ కథలన్నిటీ లక్ష్యం అదే .

  మంచి ఆలోచనలతో సమస్యను వివిధకోణాలతో చిత్రించిన చిత్రిక పట్టినకథలు ఇవన్నీ .ఉద్దేశ్యం చక్కగా నెరవేరింది .రచయితలంతా లోతైన అధ్యయనం చేసి ,గొప్ప అవగాహన తో రాసిన ఆణి ముత్యాలే ఇవి .అందరూ అభినందనీయులే .ఇప్పటికే కేంద్రం రాష్ట్ర ప్రభుత్వాలు హిజ్రాల విషయం ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేసి అమలు చేస్తున్నాయి .కొందరు శాసన సభ్యులయ్యారు .కానీ చేసింది సముద్రంలోనీటి బొట్టుమాత్రమే .ఇకనైనా సమాజాలు సంఘాలు ప్రభుత్వాలు వారి సంక్షేమం , ఉద్ధరణపై పూర్తి దృష్టి పెడితేనే తగిన న్యాయం వారికి లభిస్తుంది .ఈ సంకలనం ఒకరకంగా గుంటూరు శేషేంద్ర శర్మ అన్నట్లు ‘’శూన్య మైన వేదనలో ఒక స్వరం పలకరింపు ‘’

  మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -6-9-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.