మనసున్న పౌరాణి కనటుడు లవకుశ నాగరాజు
లవకుశ సినిమాలో లవుని పాత్ర పోషించిన అనపర్తి నాగరాజు –‘’లవకుశ నాగరాజు’’ గా గుర్తింపు పొందాడు .అసలు పేరు నాగేంద్ర రావు .తండ్రి కీలుగుఱ్ఱం హరిశ్చంద్ర సినిమాలలో నటించిన ఎ. వి .సుబ్బారావు .శ్వాసకోశ వ్యాధితో బాధపడుతున్నలవకుశ నాగరాజు-71 హైదరాబాద్ గాంధీ నగర్‌లోని తన స్వగృహంలో సోమవారం ఉదయం గుండెపోటుతో తుదిశ్వాస విడిచారు. వారం రోజులుగా తీవ్ర అనారోగ్యానికి గురైన ఆయనను ,కుటుంబ సభ్యులు 15ప్రైవేట్ ఆస్పత్రుల చుట్టూ త్రిప్పినా ,ఎవరూ చేర్చుకోలేదు .చివరికి ఇంటి వద్దే మరణించారు .
ఎన్టీఆర్, అంజలిదేవి జంటగా 1963లో సి.పుల్లయ్య, సి.ఎస్.రావు దర్శకత్వంలో రూపొందిన ‘లవకుశ’ చిత్రంలో13 వ ఏట లవుడి పాత్రలో వెండితెరకు పరిచయమయ్యారు నాగరాజు. అమ్మ మీద అమితమైన ప్రేమ, తండ్రిని ఎదురించే సాహసం కలబోతగా సాగే పాత్రలో అద్వితీయ అభినయాన్ని కనబరిచి మెప్పించారు. కుశుడుగా సుబ్రహ్మణ్యం నటించాడు .ఈ జంట కాదు ముచ్చటగా ఉండేది .ఈ చిత్రంతో ఎన్టీఆర్‌తో నాగరాజుకు చక్కటి అనుబంధం ఏర్పడింది. అనంతర కాలంలో ఎన్టీఆర్‌తో కలిసి ఇంద్రజీత్, భీష్మ, టైగర్‌రాముడు, భామవిజయం, శ్రీకృష్ణసత్యతో పాటు నలభై వరకు సినిమాలు చేశారు నాగరాజు. నారదుడిగా పలు సినిమాల్లో నటించారు. సుదీర్ఘ సినీ ప్రయాణంలో తెలుగు, తమిళ భాషల్లో 340కిపైగా సినిమాలు చేశారు. పాత్ర ఏదైనా అందులో పరకాయ ప్రవేశం చేయడంలో నాగరాజు దిట్ట. నటించిన తొలి సినిమానే ఇంటిపేరుగా మార్చుకున్న ప్రతిభావంతుడు. బాలనటుడిగా, సహాయ నటుడిగా పలు వైవిధ్యమైన పాత్రలతో ఆకట్టుకున్న నాగరాజు తన నటనతో ప్రేక్షకుల మనసులపై చెరగని ముద్ర వేశారు. తన నటనతో ప్రేక్షకులను అలరించిన ప్రతిభావంతుడునాగరాజు .నాగరాజుకు భార్య ,ముగ్గురు కుమార్తెలు ఉన్నారు .ఒక్కగానొక్క కుమారుడు 2017లో చనిపోయాడు .
దురదృష్ట వంతుడు నాగరాజు ఒక్కగానొక్క కొడుకు నాగరాజు కుటుంబానికి దూరమయ్యాడు .అది మనసులో బాధగా ఉండేది .హైదరాబాద్ లో ఒక వదాన్యుడు షిరిడీ సాయిబాబా ఆలయం నిర్మించి ,ఆయన కుటుంబానికి ఆశ్రయం కలిపించాడు నాగరాజు కుటుంబం అందులో ఉంటూ, బాబా సేవలో తరిస్తున్నట్లు ఒకసారి ఏదో పేపరు ఇంటర్వ్యు లో చెప్పాడు .అది నేను చదివాను .
నాగరాజు తో మా పరిచయం –అల్లు అర్జున్ నటించిన ‘’వరుడు ‘’సినిమా షూటింగ్ 2008 ఏప్రిల్ –జూన్ నెలలలో రామోజీ ఫిలిం సిటీ లో జరిగింది .గుణశేఖర్ దర్శకుడు .మా మనవడు ఛి హర్ష –మా అబ్బాయి శర్మ కొడుకు ను చిన్న అల్లు అర్జున్ వేషానికి ఎంపిక చేశారు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ .మా అబ్బాయి బలవంతం తో మేమందరం హైదారాబాద్ లో వాళ్ళింట్లో ఉండి మేమూ షూటింగ్ కు వెళ్లాం .మగవారందరికీ అందరికి పట్టుపంచెలు లాల్చీ ఉత్తరీయాలు ,ఆడవారికి పట్టు చీరలు జాకెట్లు కట్టించారు నగలు .రోజూ రెండు కార్లు ఇంటికి వచ్చి ఎక్కించుకొని వెళ్ళేవి .అక్కడే అందరికీ కాఫీలు టిఫిన్లు .మధ్యాహ్న భోజనం .సాయంత్రం స్నాక్స్ .రాజభోగంగా ఉండేది .సాయంత్రం షూటింగ్ అవగానే స్నాక్స్ పెట్టించి మళ్ళీ కార్లమీద ఇంటికి పంపేవారు. మేమిద్దరం మా మనవడు చరణ్ ,మనవరాలు రమ్య , వారం రోజులు షూటింగ్ లో పాల్గొన్నాం .మా అమ్మాయి విజ్జి ,మనవలు శ్రీకేత్ , ఆశుతోష్,పీయూష్ మా పెద్దాడు శాస్త్రి కోడలు సమత పిల్లలు సంకల్ప్ భువన్,మా వియ్యపురాలు శ్రీమతి ఆది లక్ష్మి ,మా బావమరిది ఆనంద్ భార్య రుక్మిణి ,పిల్లాడు వంశీ ,మా అమ్మాయి ఆడపడుచు భర్త లను కూడా ప్రోత్సహించి మాతో తీసుకు వెళ్లాం ,మా అబ్బాయి శర్మ కోడలు ఇందిర హర్ష ,మనవరాలు హర్షిత లకు రోజూ తప్పని సరి .ఈ షూటింగ్ లో రావి కొండలరావు ,రాధాకుమారి దంపతులు ,సింగీతం శ్రీనివాసరావు ,అనితారెడ్డి ,సుహాసిని ,నరేష్ ,లవకుశ నాగరాజు , బొంబాయి హీరోయిన్ ,అల్లు అర్జున్ వగైరా నటీనటులంతా కొందరు యువ టివి ఆర్టిస్ట్ లుకూడా రోజూ ఉండేవారు .
మొదటి రోజునే లవకుశ నాగరాజు తో పరిచయమైంది .మా వాళ్ళందరికీ పరిచయం చేశాను .అందరితో చాలాకలుపుగోలుగా మాట్లాడేవాడు .ఎన్నో ఫోటోలు తీసుకొన్నాం .తాను అప్పుడప్పుడు ఉయ్యురులో విశ్వశాంతి స్కూల్ కు వస్తాననని ,అందుకని ఉయ్యూరు బాగా తెలుసన్నాడు .ఈ సారి వస్తే మా ఇంటికి రమ్మని చెప్పాం తప్పక వస్తామనన్నాడు.సెల్ నంబర్ ఇచ్చాడు .మేము ఇంటినుంచి ఏదైనా టిఫిన్ తెచ్చుకొంటే ఆయనకూ పెట్టేవాళ్ళం హాయిగా తినేవాడు .భేషజం లేదు .ఆ కీచు గొంతు భలేగా ఉండేది .తాను ఏయే సినిమాలలో నటించిందీ వివరాలు చెప్పాడు .తాను ఎవరినీ అడగకుండానే వేషాలు లభించేవని సంతోషం చెప్పాడు .తన నటజీవితం సంతృప్తి కరం అన్నాడు .మీనా నటిస్తున్న వెంగమాంబ సినిమాలో తానూ నటించాననీ ,బాగా వచ్చిందనీ తప్పక చూడమని చెప్పాడు .మాగాయి కావాలంటే మా అబ్బాయి ఇంటినుంచి తీసుకు వెళ్లి ఇచ్చాం .చాల కృతజ్ఞాత చెప్పాడు . షూటింగ్ తక్కువ హడావిడి ఎక్కువా .ఖాళీ సమయం లో మేమిద్దరం దూరంగా కూర్చుని కబుర్లు చెప్పుకోనేవాళ్ళం పద్యాలు బాగా పాడి వినిపించేవాడు .సిగరెట్ కాల్చేవాడని గుర్తు .తన తండ్రిగొప్పనటుడు అనీ చెప్పాడు .తమది కాకినాడ అని చెప్పినట్లు జ్ఞాపక౦ .కుశుడు వేసిన సుబ్రహ్మణ్యం తో గాఢమైన అనుబంధం ఉండేదని చెప్పాడు .తన నాటకాను భవం సినీ ప్రవేశం అన్నీ చెప్పేవాడు .పౌరాణిక సినిమా తీస్తే అడగకుండానే తన అనుభవం చూసి తప్పక వేషం ఇస్తారని చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడు .అతనిలో నాకు సంతృప్తి బాగా కనిపించేది .డబ్బపండు వంటి పచ్చని శరీరఛాయ ,తీర్చిదిద్దినట్లుండేఅవయవాల పొందిక ,మంచి హావభావాలు, గాంభీర్యం ,స్పష్టమైన ఉచ్చారణ ,చూపుల్లో ఆకర్షణ ఎర్రని నిలువు బొట్టు,అందమైన చిరునవ్వు నాగరాజు ప్రత్యేకం .’’లవబుల్ లవకుశ నాగరాజు ‘’.
సుహాసిని ,అనితా రెడ్డి లు మా ఆవిడను వదిలే వారు కాదు ఆవిడతో ,మా అమ్మాయి,పిల్లలతో కలిసి ఫోటోలు తీయి౦చు కోనేవారు.నరేష్ కు రోజూ ఇంటి నుంచి భోజనం కారియర్ వచ్చేది .ఒకమ్మాయి విస్తరి వేసి వడ్డించేది .ఆపోసనపట్టి కమ్మగా భోజనం చేసేవాడు .రోజూ నేను ఆయనతో కూడా మాట్లాడేవాడిని .బాగా మాట్లాడేవాడు .ఒకరోజు ‘’మీరు ఇంత అందంగా ఉన్నారు సినిమాల్లో అంత అందంగా చూపించట్లేదు మిమ్మల్ని ‘’అని అడిగాను ‘’అలాగా’’ అని నవ్వేశాడు .అల్లు అర్జున్ మాంచి ఎనర్జీటిక్ గా యాక్ట్ చేసేవాడు .ఆశ్చర్యమేసేది .వేటూరి పాటలు భావగర్భత౦గా రాశారు .డాన్స్ లు ఊపేశాడు అర్జున్ .చేతులు చూసి జోశ్యం చెప్పేవాడు .మా ఆవిడకూ చెప్పాడు .దీనికోసం జనం మూగేవారు .రోజూ గుణశేఖర్ ను పలకరించేవాడిని .రావి దంపతులతో,సింగీతం తో ఫోటోలు తీసుకొన్నాం . ఒక రోజు రానా కూడా వచ్చి వెళ్ళాడు .బొంబాయి నుంచి జూనియర్ ఆర్టిస్ట్ లు డాన్సర్లు కుప్పలు తెప్పలుగా వచ్చి షూటింగ్ లో పాల్గొనేవారు .అంతా సందడి సందడిగాసరదాగా గడిచిపోయింది .షూటింగ్ జరిగిన తీరు చూస్తె ‘’ఇది బతికి బట్టకట్టే సినిమా కాదు నిర్మాత దానయ్యకు పెద్ద బొక్క ‘’‘’అని నాకు అనిపించేది .రాధాకుమారి రోజూ విసుక్కొనేది .’’ఇక్కడి రావటం టైం వేస్ట్.టివి సీరియల్స్ లో చేస్తే ఇంతకంటే ఎక్కువ డబ్బులొస్తాయి ‘’అని గొణిగేది.తూర్పు గోదావరిజిల్లా దంపతులు దీనికి కొంతస్క్రిప్ట్ కూర్చారనుకొంటా .వాళ్ళ హవా ఎక్కువగా ఉండేది .
వరుడు సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్ శ్రీకాంత్ .మా శర్మను మా ఫోటోలు పంపమంటే అప్పుడు మేము అమెరికాలో ఉన్నామని చెప్పి పంపాడు .చాలాబాగున్నారని మా కుటుంబాన్ని అంతా షూటింగ్ లో చేర్చాడు శ్రీకాంత్ .రోజూ సెట్స్ దగ్గర నమస్కారం తో పలకరించేవాడు మా ఇద్దర్నీ షాట్ లో తప్పక ఉండేట్లు చేసేవాడు .ఇంతచేసినా ఎక్కదోదూరపు షాట్ లో ఒక చోట కనిపించీ కనిపించకుండా ఉన్నట్లు’’ బొమ్మ’’ లో ఉంది.
నాగరాజు వీలైనప్పుడల్లా ఫోన్ చేయమని చెప్పాడు .నాలుగైదు సార్లు ఫోన్ లో మాట్లాడుకొన్నాం ఒకటి రెండు సార్లు తానే ఫోన్ చేశాడుకూడా .2018ఏప్రిల్ 2న మా మనవడు ఛి శ్రీకేత్ ఉపనయనాన్ని మా అమ్మాయి విజ్జి అల్లుడు అవధాని దంపతులు కుటుంబంతో అమెరికా నుంచి వచ్చి హైదరాబాద్ లో బాగ్ లింగం పల్లి ఫంక్షన్ హాల్ లో చేశారు .నాగరాజు కు ఫోన్ చేసి అడ్రస్ తీసుకొని శుభలేఖ పంపి తప్పక రమ్మని ఆహ్వానించాను .మా అమ్మాయి వాళ్ళతో కూడా బాగా పరిచయం ఉందికనుక తప్పక వస్తానన్నాడు .ఆయన ఇచ్చిన అడ్రస్ సాయి బాబాదేవాలయం అడ్రస్ అనే బాగా జ్ఞాపకం .వడుగు హడావిడి లో నేను మళ్ళీ ఫోన్ చేయలేకపోయాను నాగరాజు రాలేదు . ఆ బాధ నాలో ఉంది. కారు పంపించి ఉంటె తప్పక వచ్చేవాడేమో అని పించింది .
మనసున్న ఒక మంచి పౌరాణిక నటుడిని మన తెలుగు సినీ పరిశ్రమ కోల్పోయింది .నాగరాజు ఆత్మకు శాంతి కలగాలని ,ఆకుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-9-20-ఉయ్యూరు