’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి

’నాటక రంగ వేజేత’’ అలేక్జాండర్’’ శ్రీజయప్రకాష్ రెడ్డి

 

 

సుమారు 167సినిమాలలో జీవించాడు .నెల్లూరు యాసకు  హాస్యనటుడు రమణారెడ్డి జీవం పోస్తే ,జెపి రాయలసీమ యాసకు ప్రాణం పోశాడు

ఉయ్యూరుకు దగ్గర గండి గుంట కు చెందిన స్టేజి ,టి.వి.నటుడు,ప్రొడ్యూసర్, డైరెక్టర్  ఉయ్యూరు హైస్కూల్ లో  విద్యార్ధి శ్రీ వల్లభనేని వెంకటేశ్వరరావు  ఉయ్యూరులో తెలుగునాటక రంగ దినోత్సవం గత రెండు సార్లుగా ఘనం గా నిర్వహించాడు .మూడవసారి  మొదటి రోజు 18-4-16 సోమవారం శ్రీ కోట శంకరరావు ప్రదర్శించిన ”మినిస్టర్ ”నాటకం ,ప్రసిద్ధ పౌరాణిక నటుడు శ్రీగుమ్మడి గోపాల కృష్ణ ప్రదర్శించిన శయన దృశ్యం (పడక సీను ) బాగా ఆకట్టుకొన్నాయి ముఖ్య అతిధిగా శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ పాల్గొన్నారు .

రెండవ రోజు విలన్కేరక్టర్ యాక్టర్ గా రాయలసీమ యాస భాష తో ప్రసిద్ధులైన శ్రీ తూర్పు  జయ ప్రకాష్ రెడ్డి ‘’అలెక్సాండర్’’నాటకం ఆద్యంతం రక్తి కట్టింది .రచన కీ శే పూసల .నటనా ,నిర్వహణ శ్రీ రెడ్డి .దాదాపు ఏక పాత్రాభినయం .అయితే కొత్త ప్రయోగం .దీన్ని గురించి రెండేళ్ళ క్రితం పేపర్లో చదివి రెడ్డిగారు చాలా బాగా చేస్తున్నారని తెలుసుకొన్నాను. ప్రత్యక్షంగా నిన్న చూశాను .నిజంగా చెప్పాలంటే ‘’ప్రీ రికార్డెడ్ ‘’నాటకం .రికార్డర్ లో వచ్చే మాటలను బట్టి పెదిమలు కదిలిస్తూ హావ భావ ప్రకటన చేస్తూ, ఒంటి చేత్తో శ్రీ జయ ప్రకాష్ రెడ్డి నిర్వహించాడు .మిగిలిన పాత్రలున్నా అవి వినిపించేవే కాని  స్టేజి పై కనిపించేవికావు .కాని వారందరి గొంతుకలు చాలా నిర్దుష్టంగా పాత్రల స్వభావాలకు తగినట్లు ఉండటం మహా గొప్ప గా ఉంది .వారి సెలెక్షన్ ,రెండరింగ్ లో తీసుకొన్న జాగ్రత్త మెచ్చ దగినది .సంఘం లో ఉన్న అనేక సాంఘిక దురన్యాయాలు ,పిరికితనం ,ఆరళ్ళు వంటి వాటికీ హెల్ప్ లైన్ లో శ్రీ రెడ్డి చెప్పిన పరిష్కారాలు ,అవి క్లిక్ అయిన వైనాలు బాగా ఆకర్షించాయి .ఇతర దేశాలలో బెకెట్ధారన్ టన్ వంటి నాటక రచయితలూ ఎన్నెన్నో ప్రయోగాలు చేసి నోబెల్ బహుమతి అందుకొన్నారు .ఎన్.ఆర్ నంది వంటి వారూ ప్రయోగాలు చేశారు .నిలకడ నీరు ఆరోగ్యం కాదు. ప్రవాహ జలం ఆరోగ్యకరం అందుకే ప్రయోగాలు .

  శ్రీ రెడ్డి ఒక్కడే స్టేజి అంతా దున్నేశాడు అన్ని రకాల భావోద్వేగాలకు చిరునామాగా నిలిచి పోషించి సెహబాస్ అనిపించాడు .పూసల డైలాగులు సహజ సిద్ధంగా ఉండి’’మణిపూసలు ‘’అని పించాయి అని నేను స్పందన తెలియ జేయమని అడిగితే వేదికపై చెప్పాను .అలాగే ‘’నాటక రంగ వేజేత అలేక్జాండర్’’గా శ్రీ రెడ్డి బహుముఖీన ప్రజ్నకనిపించారని ఆయన నాటక సినీరంగానుభవాలను రంగ రించి అందించిన కళాత్మక నాటకం’’ అన్నాను.అయితే నాకేమని పించింది అంటే నాటకం నిడివి పది హేను నిమిషాలు తగ్గి ఉన్నట్లయితే ఇంకా చిక్కగా గొప్పగా నిర్దుష్టంగా ఉండేది .అంతేకాదు ముఖ్య నటుని లో వచ్చిన మార్పు తానూ ఏ సలహాలు చెప్పి ఎదుటి వారిలో మార్పులు తెప్పించాడో అలాగే తాగుడు సిగరెట్ .కొడుక్కు దూరంగా ఉండటం విషయాలలో కూడా క్రమంగా మార్పు వస్తే మరింత ఎఫెక్ట్ ఉండేది .తానుతాగి అనుభవించి అందరికీ దూరమై చివర్లో’’ సినేమా డైలాగులు ‘’వల్లించటం సినిమాటిక్ గా ఉందికాని డ్రమాటిక్ గా లేదని పించింది ..శ్రీనివాస అక్షరాలయ డైరెక్టర్ శ్రీపరుచూరి శ్రీనివాసరావు తమ కాలేజి విశాఖ లో జరిగిన పోటీలో నందీ అవార్డ్ పొందిందని ఇక్కడి ఇంతమంది  జనాన్ని చూస్తుంటే ఒళ్ళు పులకించి పోతోందని ఈ నాటకోత్సవాలు ప్రతి సంవత్సరం నిర్వహించే బాధ్యత తమ కాలేజి తీసుకొంటుందని హర్ష ధ్వానాల మధ్య ప్రకటించారు .కీప్ ఇట్ అప్ శ్రీ రావ్.

       వల్లభనేని వెంకటేశ్వరరావు తరువాత ఏడు జరిపిన నాటకోత్సవం లో’’ రచయితకు ఇచ్చే పురస్కారం’’  నాకు ప్రకటించి ,నేను అప్పుడు హైదరాబాద్ లో ఉండటం తో నేను వచ్చాక ,మా అబ్బాయి రమణద్వారా తెలుసుకొని ఆజ్ఞాపికను భద్రంగా ఇంటికి పంపాడు .

ఇప్పుడు జయప్రకాష రెడ్డి జీవిత విశేషాలు తెలుసుకొందాం .

  శ్రీ జయప్రకాష రెడ్డి  కర్నూలు జిల్లాఆళ్ళగడ్డ మండలంలోని శిరువెళ్ళ గ్రామంలోని వ్యవసాయ కుటుంబంలో 1946మే 8న జన్మించాడు. తండ్రి సాంబిరెడ్డి సబ్ ఇన్‌స్పెక్టర్ గా పనిచేసేవారు. నెల్లూరులోని పత్తేకాన్‌పేటలో ఉన్న ప్రాథమిక పాఠశాలలో 1 నుండి 5వ తరగతి వరకు చదివాడు. తర్వాత నెల్లూరులోని రంగనాయకులపేట లోని ఉన్నత పాఠశాలలో చేరాడు. ఇతడు పదోతరగతిలో ఉండగా నాన్నకు అనంతపురం బదిలీ అయ్యింది. అక్కడ సాయిబాబా నేషనల్ హయ్యర్ సెకండరీ స్కూల్లో ఎస్‌ఎస్‌ఎల్‌సీలో చేరాడు. కొన్నాళ్లకి జయప్రకాశ్ తండ్రి డిఎస్పీ హోదాలో నల్లగొండకు బదిలీ అయ్యాడు. తండ్రికోసం నల్లగొండ వచ్చిపోతుండేవాడు. అక్కడ బంధువులూ, స్నేహితులతో మాట్లాడటంతో తెలంగాణ భాష మీదా పట్టు దొరికింది. చిన్నప్పటి నుంచే నాటకాలంటే ఆసక్తి ఉండేది. తండ్రి కూడా నటుడే కాబట్టి ఇంట్లో కుటుంబ సభ్యులు కూడా అందుకు అడ్డు చెప్పేవారు కాదు. తండ్రీ కొడుకులు కలిసి కూడా నాటకాల్లో నటించారు. చదువులోనూ ముందుండే వాడు. గుంటూరు ఏ సి కాలేజీలో డిగ్రీ చదువుతూ ,నాటకాలు వేస్తూ ,అక్కడే తర్వాత ఉపాధ్యాయ శిక్షణ పొందాడు ఇక్కడ ఉన్నప్పుడే ఆయనకు ‘’బాట సారి ‘’అనే నిక్ నేం ఉండేది .

నటజీవితం

అనంతపురంలోని పాఠశాలలో చదివేటపుడు అక్కడి టీచర్లందరూ ఆచార్యులే. గుండాచారి అని సైన్స్ టీచర్ కల్చరల్ యాక్టివిటీస్‌కి హెడ్‌గా పనిచేసేవారు. కళలపై ఆయనకున్న అభిమానం ఇతనిపై చాలా పనిచేసింది. ఎంతంటే ఒకరోజు ఇతడు, ఇతడి స్నేహితుడు ‘దుర్యోధన గర్వ భంగం’ అనే నాటికలో పద్యాలు, డైలాగులు బట్టీ కొట్టేసి ఆయన దగ్గరకెళ్లి టపటపా అప్పజెప్పేశారు. ఎక్కడ తేడా వచ్చిందో తెలీదు. ఆయన చాలా కోపంగా ‘మళ్లీ నాటకాల పేరెత్తితే తన్నేస్తాను వెధవల్లారా..’ అంటూ అరిచారు. ఇతడి స్నేహితుడు లైట్‌గా తీసుకున్నాడు గానీ.. ఇతడు మాత్రం చాలా ఫీలయ్యాడు. మూడురోజులు బెంగపెట్టుకున్నాడు. ఆ బాధ, కసి కారణంగానే నటనను వృత్తిగా స్వీకరించాలని నిర్ణయం తీసుకున్నాడు. జె. పి.థియేటర్ ఏ. పి. పేరుతో ప్రతి సంవత్సరం తన తండ్రి పేరుమీద నల్లగొండలో నాటకోత్సవం జరిపేవారు.జెపి శిష్యుడు పెట్టిన ‘’ప్రజా పోరు ‘’పత్రిక  వార్షికోత్సవాన్ని దాసరి నారాయణరావు ను ఆహ్వానించి ,ఆయన ఎదుట మాడభూషి దివాకర్ బాబు రాసిన ‘’గప్ చుప్’’ నాటకం వేస్తూ రెడ్డి ‘’దాసరిగారి కోసమే ఈనాటకం ఆడుతున్నాం ‘’అని ప్రకటించగా ‘’గొప్ప ఫిట్టి౦గేపెట్టావు ‘’అని ఆసాంతం చూసి అతని నటనను మెచ్చి ,సత్కరించి ‘’ఈ రత్నం ఇక్కడ కాదు సినీ రంగం లో ఉండాలి .నేనే మొదటి అవకాశమిస్తాను ‘’అని హర్ష ధ్వానాలమధ్య ప్రకటించాడు . తర్వాత దాసరి పరిచయం చేయగా రామానాయుడు 1888లో ‘’బ్రహ్మ పుత్రుడు ‘’సినిమాలో వేషం ఇచ్చాడు   కొన్ని సినీ ఆఫర్లు అవచ్చినా ,రామానాయుడు సంస్థ తప్ప తప్ప మిగిలినవారెవరూ అనుకొన్న డబ్బు ఇవ్వలేదు .గుర్తింపూ రాలేదు .అయిదేళ్ళు ఎదురు చూసి గుంటూరుకు తిరిగివచ్చి ఉపాధ్యాయ వృత్తి లో లెక్కల మేస్టారుగా 1991 లో చేరాడు .హెడ్ మాస్టర్ గా కూడా పని చేశాడు .మంచిపేరు సంపాదించుకొన్నాడు .

సినీ వీరంగ0

  ఒక సారి స్నేహితుడికి హెల్త్ చెకప్ కోసం హైదరాబాద్ వెడితే ,రామానాయుడు గుర్తుపట్టి పిలిచి ‘’ఏమైపోయావ్ ఇంతకాలం .నీకోసం మంచి పాత్ర ఉంది సురేష్ బాబు ను కలువు ‘’అన్నాడు .కలిశాడు .వాళ్ళు తీస్తున్న ‘’ప్రేమించు కొందా౦ రా ‘’లో విలన్ పాత్ర చేయాలన్నాడు .దానికి హిందీనటుడు నానాపటేకర్ కోటిన్నర డిమాండ్ చేశాడట .పరుచూరి బ్రదర్స్ రెడ్డిని సెలెక్ట్ చేశారు  రాయలసీమ మాండలికం పెడితే బాగుంటుందని  సురేష్ బాబు సూచించాడు .తనాకూ అలానే అనిపించి తిరుపతి కర్నూలు వగైరా ప్రాంతాలకు బస్ లో వెళ్లి రాయలసీమ యాస పకడ్బందిగా నేర్చి ఆ మాండలికం పండించి హావభావాలతో   విరగ దీశాడు డైలాగులతో ,సూపర్ డూపర్ హిట్  .ఇక వెనక తిరిగి చూసుకోవాల్సిన అవసరమే కలగలేదు

తరువాత బాలకృష్ణ కథానాయకుడిగా వచ్చిన సమరసింహా రెడ్డి, నరసింహ నాయుడు లాంటి విజయవంతమైన సినిమాల్లో కూడా ఇలాంటి పాత్రతోనే ప్రేక్షకులను మెప్పించాడు.’’ఆయనలో పాజిటివ్ ఎనర్జీ చాలాఉంది.ఎప్పుడూ నాటకాలు సినిమాలు పాత్రలగురించే మాట్లాడుతాడు ‘’అన్నాడు దర్శకుడు శీను వైట్ల .’’అన్ని రకాల కేరక్టర్లు చేశానుకానీ  సెంటి మెంట్ పండించే పాత్ర చేయలేదు ‘’అనే లోటు ఫీలయ్యేవాడు

అలెగ్జాండర్ నాటక0

రంగస్థల, సినిమా నటుడు ఆశిష్‌ విద్యార్థితో కలిసి నటించినపుడు, తాను ఒకే పాత్రతో నాటకాలు వేశానని ఆశిష్‌ విద్యార్థి చెప్పడంతో తాను కూడా తెలుగు నాటకరంగంలో అలాంటి  ప్రయోగం చేయాలనుకున్నాడు. పూసల వెంకటేశ్వరరావు రాసిన అలెగ్జాండర్‌ అనే నాటకాన్ని తయారుచేసి రిటైర్డ్‌ మేజర్‌ పాత్రలో ఏకపాత్రాభినయంతో 100 నిమిషాలపాటు ఏకధాటిగా ఆ నాటకాన్ని 30 ప్రదర్శనలిచ్చాడు.

 జయప్రకాష్ గొప్ప శివ భక్తుడు .ఏటా శివ దీక్ష తీసుకొని మహా శివరాత్రికి శ్రీశైలం వెళ్లి భ్రమరాంబా మల్లికార్జునస్వామిని దర్శిస్తాడు .’’శివుడు మా కులదైవం మల్లన్న సన్నిధిలో యెంత సేపున్నా తనివి తీరదు .శ్రీశైలం లో నా పేరు మీద ఒక కాలేజి ఉంది ‘’‘’అని పొంగిపోతూ చెబుతాడు .

 

అతడు సినిమాల్లో పండించిన కొన్నిడైలాగులు

  • వచ్చేదానికంటే పొయ్యేదే ఎక్కువ ఉందేమి రా?
  • ఒరేయ్ పులీ! ఏమిరా నెత్తికి అట్ల గుడ్డ జుట్టుకున్న్యావ్, బోడెమ్మ లెక్క!
  • మీ మనసులు దెల్చుకున్న్యాం, మా అలవాట్లని మార్చుకున్న్యాం.
  • పెళ్ళి నాడు గుడక మాంసం ఏంది రా? ఒక్క దినము గుడక ఉండలేవా?
  • ఏమి రా నోరు లేచ్చండాదే?
  • ఆడ ఏం ఉండాయో ఏం లేవో. కంది బ్యాడలు, శెనగ బ్యాడలు, అన్ని ఒక లారీకి ఏసి పంపిజ్జామా?
  •   ఇవికాక అతడి నటన లో వెరైటీ బాగా చూపిన పాత్రలు కబడ్డీ లో హెడ్డు .’’ఏందిరా ఏంజేస్తాన్నా’’అని జీవా ను అడిగితె ‘’పాలుపితుకున్నా హెడ్డు గారూ ‘’అంటే ‘’దున్నపోతుకు పాలుపితుకు  డే౦దిరా’’అంటే కడుపు చెక్కలౌతుంది .రామదాసు సినిమాలో తానీషా బామ్మర్ది పాత్ర నటన  తెలుగు తురక మిశ్రమ భాష ఉచ్చారణ మర్చిపోలేం .అన్నిటికంటే ‘’ఢీ’’సినిమాలో మాటలేని ‘’పెదనాయన ‘’పాత్రలో ప్రతిక్షణం చూపిన హావభావాలు చిరస్మరణీయం .మాటలు లేకుండా కూడా తన నట విశ్వ రూపం చూపాడు జెపి .తండ్రీ కొడుకులుగా కూడా నటించి తెలంగాణా శకుంతలను పెళ్ళాడే పాత్రకూడా మర్చిపోలేనిది .ఇలా చాలా ఉన్నాయి .సబ్ ఇన్స్పెక్టర్ గా ఉంటూ హెడ్ కోట ప్లాన్ లలో చిక్కి వెర్రి వెంగలప్ప అయి సస్పెండ్ అవుతూ భార్యను కూడా బ్రోతల్ కేసులో బుక్ చేసిన పాత్ర సరదాగా  హాస్యభరితంగా అమాయకంగా ఉంటుంది .స్క్రీన్ అంతా నిండిపోయే పర్సనాలిటి .పంచకట్టినా ఖాకీ డ్రెస్ వేసినా  లుంగీ కట్టినా నిండుగానే ఉంటాడు .·         సుమారు 167సినిమాలలో జీవించాడు .నెల్లూరు యాసకు  హాస్యనటుడు రమణారెడ్డి జీవం పోస్తే ,జెపి రాయలసీమ యాసకు ప్రాణం పోశాడు
  •   తెలుసు సినీ పరిశ్రమాకు మళ్ళీ గండం వచ్చి పడింది .సుమారు నెలరోజులక్రితం హాస్యనటుడు రచయిత రావి కొండలరావు మరణం ,మొన్న పౌరాణిక నటుడు లవకుశ నాగరాజు ,నిన్న జయప్రకాష్ రెడ్డి మరణం ఊహిస్తే బాధగా ఉంది .వీరందరికీ ఆత్మలకు శాంతికలగాలని వారి కుటుంబాలకు సానుభూతి తెలియ జేస్తున్నాను .
  •   మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -9-9-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్ చిత్రం

You are commenting using your Google account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.