ఉయ్యూరుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చంద్(87) మరణం

ఉయ్యూరుకు చెందిన ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి ప్రేమ్ చంద్(87) మరణం

ఉయ్యూరుకు చెందినప్రపంచ ఆర్ధిక వేత్త శ్రీ ఆరిగపూడి  ప్రేం చంద్ గారు నిన్న 9-9-20 బుధవారం రాత్రి హైదరాబాద్ లో మరణించినట్లు ,ఈ రోజు ఉదయం అక్కడే మహా ప్రస్థానం లో అంత్యక్రియలు జరిగినట్లు ఈ ఉదయం 11-50కి గండిగుంట వాసి, గుంటూరు నాగార్జున యూని వర్సిటీ రిటైర్డ్ లైబ్రేరియన్ ,ప్రస్తుతం హైదరాబాద్ లో ఉంటున్న సరసభారతి ఆత్మీయులు శ్రీ సుంకర కోటేశ్వరరావు గారు వాట్సాప్ లో మెసేజ్ పంపారు .నేను సాయంత్రం 4గంటలకు చూసి, రిప్లై ఇచ్చాను .ప్రేం చ౦ద్ గారి ఆత్మకు శాంతి కలగాలని కోరుతున్నాను వారి  కుటుంబానికి  సాను భూతి తెలియ జేస్తున్నాను .

జీవిత విశేషాలు

శ్రీ ఆరిగపూడి ప్రేంచంద్22-3-1933 న ఉయ్యూరు మండలం  కడవకొల్లు అనే కుగ్రామం లో జన్మించారు .తండ్రి శ్రీ 1925లో స్వంత ఖర్చులతో గ్రామస్తుల సహకారం తో కడవకొల్లు లో హయ్యర్ ఎలిమెంటరి స్కూల్ నిర్మించి నడిపారు .ఆర్ధిక పరిస్థితులు కలిసిరాక ,దాన్ని కృష్ణా జిల్లా బోర్డ్ కు అప్పగించి ,మకాం ఉయ్యూరు కు మార్చి ఏది చేసినా కలిసిరాక బాగా నష్టపోయారు ..ప్రేంచంద్ గారు పామర్రు హై స్కూల్ లో ఎస్ ఎస్ ఎల్సి  చదివిపాసయ్యారు విజయవాడ ఎస్ ఆర్ ఆర్ కాలేజిలో  హిస్టరీతో ఇంటర్ చదివి ,ఉత్తమ శ్రేణి లో ఉత్తీర్ణులై ,ఆర్ట్స్ సబ్జెక్ట్ లో ఘనత సాధించి రికార్డ్ సృష్టించారు .కుటుంబం దుర్భర జీవితాన్ని గడుపుతున్నా ,స్వయం శక్తి తెలివి తేటలతో ప్రగతి సాధించారు .ప్రేమ చాంద్ గారి బావగారు శ్రీ త్రిపురనేని సుబ్రహ్మణ్యంగారు ఉయ్యూరు హై స్కూల్ లో మాకు తెలుగు పండితులు  ఎస్ వి  రంగారాఉ పర్సనాలిటి మేస్టారిది.

విశాఖ ఆంద్ర విశ్వవిద్యాలయం లో ఎకనామిక్స్ లోబి ఏ ఆనర్స్ చదివి , ఫస్ట్ క్లాస్  లో పాసై మరో రికార్డ్ నెలకొల్పారు .అప్పటిదాకా సైన్స్ లెక్కల సబ్జెక్ట్ లవారికే ఇలా తండ్రి మరణం తో కుటుంబ బాధ్యతలు గ్రహించారు శ్రీమతి రామ గారితో వివాహం జరిగి దిశా దశ తిరిగింది. ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో డిప్లొమా చేసి ,ఆంధ్రాయూని వర్సిటీ లో ట్యూటర్ గా చేరి విద్యార్ధులకు ముందస్తు తరగతులు బోధించారు .ఆలిండియా సర్వీస్ పరీక్ష పాసై ,ఢిల్లీ సెంటర్ సెక్రెటేరియట్ లో చేరి ,కేంద్ర బడ్జెట్ రూప కల్పనకు తోడ్పడ్డారు .

ప్రేంచంద్ రాసిన ‘’కంట్రోల్ ఆఫ్ పబ్లిక్ ఎక్స్ పెండిచర్’’అనే బృహత్ గ్రంథాన్ని  ప్రపంచ ఆర్ధిక వేత్తలు చదివి ‘’కర దీపిక ‘’గా ప్రశంసించారు .ఆర్ధిక రంగం లో వచ్చిన మొట్ట మొదటి ఆ పుస్తకం నాలుగు నెలలలో ద్వితీయ ముద్రణ పొంది ,ప్రపంచ వ్యాప్తంగా విశేష ప్రచారమైంది .తర్వాత ప్లానింగ్ కమిషన్ ఆర్ధికవేత్త గా పని చేసి ,ఢిల్లీ లో ఫోర్డ్  అంతర్జాతీయ సంస్థలో ఉద్యోగించారు .’’పెర్మార్మింగ్ బడ్జెట్ ‘’అనే గొప్ప అరుదైన పుస్తకం రాసి ,మరింత పేరు ప్రఖ్యాతు లార్జించారు .అదృష్టం ,స్వయం ప్రతిభ కృషి కలిసొచ్చి అమెరికాలోని వాషింగ్టన్ లో ఉన్న అంతర్జాతీయ ద్రవ్య నిధి –ఐ .ఎం. ఎఫ్. లో ఈ ఆర్ధిక వేత్తకు అనువైన హోదా ఉద్యోగం గౌరవం లభించాయి .ఈ సంస్థలో 30సంవత్సరాలు పని చేసి ,తన అనుభవాలను అన్ని దేశాలకు అందించి ,ఐఎంఎఫ్ అసిస్టెంట్ డైరెక్టర్ గా పదవీ విరమణ చేశారు .ఆర్ధిక విషయాలపై డజనుకు పైగా అపూర్వ గ్రంథాలు రాశారు. అందులో లేటెస్ట్ బుక్ 2017మార్చి లో   రాసిన ‘’పబ్లిక్ ఎక్స్ పెండిచర్ మేనేజ్ మెంట్  అండ్ పబ్లిక్ పాలిసి ఇన్ ఇండియా –క్రైసిస్  అండ్ రెన్యువల్ ‘’.ఉద్యోగం లో ఉండగా ప్రపంచ దేశాలన్నీ పర్యటించారు .ఎన్నో దేశాలకు ఆర్ధిక సలహాదారుగా ఉన్నారు .ఆ దేశాల ఆర్ధిక పరిపుష్టి కి విలువైన సలహాలిచ్చి అమలు జరిగేట్లు చేసి ,ఆర్దిక  ఉన్నతికి సాయం చేశారు .వీరి సేవలు గుర్తించిన అమెరికా తానా సంస్థ ‘’ఎక్సలెంట్ అండ్ ఒరిజినల్ కంట్రి బ్యూషన్ ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ ఎకనమిక్స్ ‘’పురస్కారం అందించి గౌరవించింది .ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం వీరి సేవలను గుర్తించి తగిన పురస్కారాలు అందించకపోవటం శోచనీయం .

ప్రేంచంద్ గారు  తమ జీవిత చరిత్ర ను ‘’ఆన్ ఫ్రింజేస్(అంచులు ) ఆఫ్ గవర్నమెంట్ –ఎ పర్సనల్ జర్నీ ‘’గా రాశారు .ఇందులో తాను పుట్టిపెరిగిన కడవకొల్లు ఉయ్యూరు లలో ఆనాటి జనజీవితాన్ని ,పరిస్థితులను గ్రంధస్ధం చేసిన మొదటి వ్యక్తి .తనకుటుంబం చదువు ఉద్యోగాలు సామాజిక స్థితిగతులు ,సహచరులు ఉపాధ్యాయులు ,అధ్యాపకులు మొదలైన అన్ని విషయాలపైనా నిర్మోహమాటంగా ఆత్మీయంగా రాశారు. అది ‘’ఒక సమర్ధుని  జీవిత యాత్ర ‘’అని ఖచ్చితంగా అని పిస్తుంది .అర్ధ శతాబ్దికి పైగా అమెరికాలో ఉంటూ ,ప్రపంచ ఆర్ధిక శాస్త్ర వేత్తలలో ఒకరుగా గుర్తింపు పొంది ,సదరన్ కాలి ఫోర్నియా ఇర్విన్ లో నివాసముండే వీరు సుమారు పదేళ్ళ నుంచి హైదరాబాద్ లో దర్గా వద్ద స్వగృహం లో  అర్ధాంగి శ్రీమతి రమగారితో  తో  కాపురం ఉంటున్నారు .మద్య మాంసాలకు దూరంగా శాకాహారిగా ఉంటున్న ఆ దంపతులు అందరికీ ,ప్రేరణ ఆదర్శం .నీతీ నిజాయితీ అంకిత భావం తో కర్తవ్య నిర్వహణ చేసిన ప్రేంచంద్ అవి అందరిలో ఉండాలని ఆశిస్తారు .

ప్రేమ చంద్ గారితో నా పరిచయం – .2004లో అమెరికా నుంచి ఉయ్యూరుకు తమ తలిదండ్రుల పేర నిర్మించబడినభూరి విరాళం తో ’’ శ్రీ మైనేని వెంకట నరసయ్య  శ్రీమతి  సౌభాగ్యమ్మ  దంపతుల  స్మారక ఎసి గ్రంధాలయం ‘’ప్రారంభోత్సవానికి వచ్చిన ఉయ్యూరు వాసి అక్కడి యూని వర్సిటీలైబ్రరీలో అత్యుత్తమ పోస్ట్ లో ఉన్న శ్రీ మైనేని గోపాలకృష్ణగారు వచ్చారు  .అదే తొలి పరిచయం .దాని నిర్మాణకమిటీకి నేను కన్వీనర్ .దక్షిణభారతం లో తొలి ఎసి లైబ్రరీ అది . 2008 లో అమెరికాకు మూడవసారి మా దంపతులం మాఅమ్మాయి వాళ్ళు ఉంటున్న మిచిగాన్ రాష్ట్రం లోని ట్రాయ్ దగ్గరున్న స్టెర్లింగ్ హైట్స్ కు వెళ్లాం .అప్పుడు మైనేనిగారితో పరిచయం బాగా ఎక్కువై ,రోజూ ఫోన్ లో మాట్లాడటం ,మెయిల్స్ రాసుకోవటం జరిగింది .అప్పుడు ప్రేంచంద్ గారి గురించి చెప్పి ఫోన్ లో పరిచయం చేశారు .ప్రేమచంద్ గారు తమ జీవిత చరిత్రను నాకు పోస్ట్ లో పంపితే ఆబగా చదివి వారం లో దాదాపు 40పేజీల సమీక్ష’’’’ఒక సమర్ధుని జీవిత యాత్ర ‘’గా  రాసి మైనేని గారికి ,పంపితే ఆయన ప్రేమ్చంద్ గారికి పంపగా చదివి ఎంతో బాగా నచ్చి అభినందించి ఫోన్ చేశారు .అప్పటినుంచి తరచూ ఫోన్ లో మాట్లాడుకోనేవారం .మైనేనిగారు ఒక సారి నాకు ఫోన్ చేసి ‘’ఉయ్యూరులో ప్రేమ్చంద్ గారికి మీరు నిర్వహిస్తున్న సాహితీ మండలి ద్వారా ఘన సన్మానం చేయాలి .ఖర్చు అంతా నేను భరిస్తాను .పట్టు బట్టలు ఆదంపతులకు పెట్టాలి, మీదంపతులూ కొనుక్కోవాలి ‘’అని ఆజ్ఞలాంటి కోరిక తెలియ జేశారు .సరే అని 2008 అక్టోబర్ చివర్లో ఇండియా వచ్చి ,మైనేనిగారి కోరికపై మద్రాస్ వెళ్లి మైనేని గారి దగ్గర బంధువు శ్రీమతి రోజా గారు మా ఇద్దర్నీ రిసీవ్ చేసుకొని  మా మేనకోడలు వాళ్ళింటికి తీసుకు వెళ్లి , వెళ్లి  మద్రాస్ లో  ఉన్న ప్రేమ చ౦ద్ గారి పెద్ద కుమార్తె దంపతులను డిసెంబర్ 24 న ఉయ్యూరులో జరిగే ప్రేమ చ౦ద్ గారి సన్మాన సభకు ఆహ్వానించి ,మైనేని గారికీ శ్రీ బాపు రమణ ల గారికి ఉన్న అపూర్వ స్నేహం వలన రోజా ను మమ్మల్ని బాపు రమణల ఇంటికి వెళ్లి కలిసే ఏర్పాటు ముందే చేసి ఆ మహానుభావులను  కలిసే అదృష్టం  మా దంపతులకు  దక్కించారు  .మద్రాస్ లోనే పట్టు బట్టలు కొని ఉయ్యూరు చేరి ,పోరంకి లో విశాల భవంతి ఐన స్వగృహం లో ఉన్న ప్రేంచంద్ దంపతులను  ఆహ్వానించి వచ్చాం .

ఉయ్యూరు లైబ్రరీ లో కృష్ణా జిల్లా రచయితల సంఘం అధ్యక్ష కార్యదర్శులు శ్రీ గుత్తికొండ సుబ్బారావు శ్రీ పూర్ణ చ౦ద్ ,విజయవాడ రేడియో స్టేషన్ డైరెక్టర్ శ్రీ మంగళగిరి ఆదిత్య ప్రసాద్ .శాసనమండలి సభ్యుడు శ్రీ వవైవిబి రాజేంద్ర ప్రసాద్ మొదలైన ప్రముఖుల సమక్షంలో ప్రే౦ చాంద్ గారికి పట్టుబట్టలు పుష్పహారాలు శాలువాలాతో ఘన సన్మానం చేశాం .ఒక రకంగా అది ‘’ఆర్ధిక పూర్ణ ప్రేమ చంద్రుని ప్రతిభకు’’కు చంద్రునికో నూలు పోగు .  వారిపై నేను రాసిన  కర పత్రం  అందరికి పంచాం .ఆయనకోరికపై ఆయన చిన్నతనం లో పరిచయమైన వారినీ ఆహ్వానించాం .ఖర్చు అంతా మైనేని గోపాల కృష్ణగారిదే.శ్రీ సుంకర కోటేశ్వరరావు, శ్రీ రామినేని భాస్కరేంద్ర,శ్రీ దేవినేని మధుసూదనరావు గార్లు  కూడా వచ్చారు .అదొక చిరస్మరణీయమైన సంఘటన . మీడియా అంతా బాగా ఇంటర్వ్యు చేసి గొప్ప ప్రచారం కల్పించారు .రేడియో వారు స్టూడియోకి పిలిపించి ఇంటర్వ్యు చేశారు .ఉయ్యూరు కాలేజీ వారు ఆతర్వాత ఆహ్వానించి ప్రసంగం ఏర్పాటు చేసి సత్కరించారు .మాది నాందీ ప్రస్తావన అవటం గర్వకారణం .దీని వెనకున్న మైనేని వారి అమృత హృదయం  వెలకట్ట  లేనిది. ప్రేమ్ చంద్ గారంటే అధికమైన గురు భక్తి గోపాలకృష్ణ గారికి .

2012లో మేమిద్దరం నాలుగో సారి అమెరికా వెళ్ళేటప్పుడు హైదరాబాద్ లో ప్రేమ చంద్ దంపతులను చూసి ఆశీస్సులు పొంది వెళ్లాం .ఆతర్వాత సరసభారతి పుస్తకాలు  ఎప్పటికప్పుడు పంపేవాడిని .అందినట్లు తెలియ జేసేవారు మెయిల్ లో. ఎప్పుడూ నన్ను ‘’మాస్టారూ ‘’అని సంబోధించే సంస్కారం ఆయనది . సరసభారతి బ్లాగ్ రెగ్యులర్ గా చదివేవారు .చక్కని కామెంట్స్ రాసేవారు .ఒక సారి ‘’యక్ష ప్రశ్నలు ‘’గురించి పూర్తి వివరాలు కావాలని మెయిల్ రాస్తే సమగ్రంగా బ్లాగ్ లో రాసి పంపితే మహాదానందపడ్డారు .కెమటాలజి పిత డా. కొలాచల సీతారామయ్య గారి పుస్తకానికి ముందు మాటలు వారితోనే రాయించాలని నేనూ, మైనేని గారు భావించి ఫోన్ లో తెలియ జేస్తే, గొప్ప గా ఇంగ్లీష్ లో రాశారు .నేను ‘’అజ్ఞాత మార్గదర్శి ‘’గా అనువదించి వారిద్దరికీ పంపి, ఓకే చేయించి అందులో చేర్చాను .శ్రీ శార్వరి ఉగాదికి సరస భారతి ఆవిష్కరించిన పుస్తకత్రయం లో’’ ఆధునిక ఆంద్ర విజ్ఞాన శాస్త్ర మణి రత్నాలు  ‘’పుస్తకం లో వారి గురించి విపులంగా రాసి ఋణం తీర్చుకోన్నాను .

ఒక గొప్ప ఆర్ధిక శాస్త్ర వేత్త మనకు దూరమయ్యారు .వారి ఆత్మకు శాంతి కలుగజేయమని భగవంతుని కోరుతున్నాను .

మీ –గబ్బిట దుర్గా ప్రసాద్ -10-9-20-ఉయ్యూరు

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in మహానుభావులు and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.