మనకు తెలియని మహాయోగులు—1121-శాస్త్ర వేత్త యోగి –స్వామి జ్ఞానానంద -1896-1969
పశ్చిమ గోదావరిజిల్లా భీమవరం తాలూకా గొరగనపూడి లో భూపతి రాజు రామ రాజు ,సీతయ్యమ్మ అనే సంపన్న క్షత్రియ దంపతులకు 5-12-1896దుర్ముఖి సంవత్సర మార్గ శిర శుద్ధ పాడ్యమి శనివారం లక్ష్మీ నరసింహ రాజు జన్మించాడు .స్వగ్రామం ,వీరవాసరం ,నరసాపురం టైలర్ హైస్కూల్ లో ప్రాధమిక మాధ్యమిక ఉన్నత విద్య నేర్చి ,తణుకు లో చదివే రోజుల్లో 1908లో శ్రీ వాసు దేవానంద సరస్వతి ‘’వాసు దేవ మంత్రం’’ ఉపదేశించారు .అప్పటినుంచి రాజు కు శ్రీకృష్ణుడు ఆరాద్యదైవమయ్యాడు .వివాహం జరిగినా శ్రీ రామకృష్ణ పరమహంస శ్రీ శారదా మాత ల దివ్య దాంపత్యం లాగానే జీవితం సాగింది .తండ్రి లైబ్రరీలో ఉన్న అరుదైన వేదాంత గ్రంథాలన్నీ చదివి ,మద్రాస్ లో ఆనిబిసేంట్ ను దర్శించి దివ్యజ్ఞాన గ్రంథాలు రామకృష్ణ వివేకానంద గ్రంథాలు పఠించి బాలగంగాధర్ ఉపన్యాసాలతో ప్రేరితుడై అజ్ఞాతం గా ఉన్న త్యాగవైరాగ్యాలు బయట పడి ,1917 స్కూల్ ఫైనల్ పరీక్షా ఫలితాలలో నంబర్ కనపడ నందున ,విరక్తితో ఇల్లు వదిలి అజ్ఞాతం లోకి వెళ్ళిపోయాడు .
ఢిల్లీ ,హరిద్వార్ మీదుగా ఋషీకేశ్ చేరి స్వర్గాశ్రమమ లో చేరి సాధన చేశాడు .ఫలితంగా శ్రీ కృష్ణ పరమాత్మ సాక్షాత్కారం పొందేవాడు .ఆయన తీవ్ర యోగ సాధన చూసి యోగి రాజ్ అని సంబోధించేవారు .తర్వాత ఆబూ పర్వతం చేరి ,గురు శిఖరం పై ఉన్న దత్తాత్రేయ గుహలో ఆరు నెలలు పశ్చిమోత్తాన ఆసనం లో సాధన చేసి ,నీల కంఠ మాహా దేవ్ లో హఠయోగ ప్రక్రియలు సాధించి ,సవికల్ప సమాధి పొంది శ్రీ కృష్ణ దర్శన భాగ్యం పొందేవారు . రుషీ కేశ్ లో శరశ్చంద్ర అనే సిద్ధ పురుషుడు ఈయన 25వ ఏట ఉపదేశం చేసి ‘’స్వామి జ్ఞానానంద ‘’అనే దీక్షానామ మిచ్చారు .గురువుల అనుమతితో బారాముల్లా వెళ్లి సంత్ సింగ్ గుహలో నాలుగు నెలలు ,ప్రాణాయామ ఆసన ధ్యానాలు చేశారు .శ్రీనగర్ కాళీ పర్వత గుహలో ,పర్వతం పై గుహలలో కొంతకాలం తపస్సు చేశారు .జాడీ పురా యాపిల్ తోట కుటీరం లో ధ్యాననిమగ్నుడై నిర్వికల్ప సమాధిలోకి వెళ్ళేవారు .
స్వగ్రామం గొరగన పూడి చేరి తోటలో కుటీరం ఏర్పరచుకొని ‘’మాన్ టు బుద్ధ ‘’ అనే ఇంగ్లీష్ కవిత రాశారు .తర్వాత కైలాస మానస సరోవర యాత్రలు చేసి అక్కడకూడా మూడు రోజులు తపస్సు ఆచరించి ,తన యోగ సాధన అనుభూతులను స్వామి జ్ఞానానంద 30పూర్ణ సూత్రాలుగా రాశారు .పరబ్రహ్మ సాక్షాత్కారం పొంది తర్వాతజర్మని ఇంగ్లాండ్ అమెరికాలలో అకు౦ఠిత దీక్షతో చదివి న్యూక్లియర్ ఫిజిక్స్ లో అత్యున్నత శిఖరాలు అందుకున్నారు .భారత ప్రధాని నెహ్రూ ఆహ్వానం పై నేషనల్ ఫిజిక్స్ లేబరేటరి పరమాణు విజ్ఞాన పరిశోధనా విభాగం అధిపతిగా 17ఏళ్ళు సేవలందించారు .1965నుండి 69వరకు ఎందరికో మంత్రం దీక్ష అనుగ్రహించారు .1954లో ఆంధ్ర విశ్వవిద్యాలయంలో పరమాణు భౌతిక విజ్ఞాన విభాగం మొట్టమొదటి సారిగా ఏర్పాటు చేసి లో10ఏళ్ళు ఆచార్యులుగా, శాఖాధ్యక్షులుగా వెలుగొంది వాటికి అంతర్జాతీయ ఖ్యాతిని సంపాదించారు. వీరి జ్ఞాపకార్ధం పరమాణు భౌతిక శాస్త్రంలోని ప్రయోగశాలకు “స్వామి జ్ఞానానంద పరమాణు పరిశోధన ప్రయోగశాల” (Swami Jnanananda Laboratories for Nuclear Research) గా నామకరణం చేశారు. సన్యాసి వస్త్ర ధారణతోనే ఉండేవారు 117వ మూలకం కనిపెట్టిన డా ఆకునూరి వెంకరామయ్యగారు జ్ఞానానంద శిష్యులే .ఆయన ప్రోద్బలం తోనే అమెరికా వెళ్లి అనేక పరిశోధనలు చేసి 117 వ మూలకం టెన్నెస్సీకనిపెట్టి ఆంద్ర దేశానికి భారతదేశానికీ అత్యంత గౌరవం తెచ్చారు .
జ్ఞానానంద రచించిన పూర్ణ సూత్రాలు తెలుగులోకి అనువదించబడ్డాయి. పరమాణు భౌతిక విజ్ఞాన ప్రాథమిక పాఠాలు, ఫిలాసఫీ ఆఫ్ యోగ, రాజయోగ గ్లిమ్సెస్, హై వాక్యుయా మొదలైనవి ఆంగ్లంలో ముద్రించబడ్డాయి.
ఆచార్యోత్తములు, పరమహంస, దర్శనవేత్త, కర్మయోగి అయిన స్వామి జ్ఞానానంద 1969 సెప్టెంబరు 21 తేదీన సౌమ్య సంవత్సర భాద్రపద శుద్ధ దశమి ఆదివారం ఉదయం 7-45 గంటలకు 73వ ఏట పరమపదించారు. గొరగనమూడిలోరామజ్ఞాన మందిరం లో వీరి సమాధిని పలువురు దర్శించుకొంటారు.
వీరి స్వీయచరిత్ర “శ్రీ స్వామి జ్ఞానానంద చరితామృతము” వీరు మరణించిన తరువాత వెలువడిన గ్రంథం.
స్వామి జ్ఞానానంద ఆశ్రమం విశాఖపట్నంలో వెంకోజీపాలెంలో ఉంది.
22-అనునిత్య భగవదను భూతి పొందినపరిపూర్ణ యోగి – బూర్లె రంగన్నబాబు -1895-1979
ఒంగోలు జిల్లా దర్శి తాలూకా శ్రీరమ భద్రపురం నుండి వీరి పూర్వీకులు పగోజి ఏలూరుకు తరలి వచ్చారు .వీర బ్రహ్మేంద్రస్వామి భక్త దంపతులు బూర్లె పుల్లయ్య ,జాలమ్మలకు 1895లో రంగన్నబాబు పుట్టాడు.ఒక అపరిచయ బాలుడు ఆతన్ని చిన్నతనం లో ఆరు నెలలు దేశ మంతా తిప్పి భద్రంగా ఇంటికి చేర్చాడు .సత్సంగాలు ధ్యానాలకు వెళ్లి రంగన్న ధ్యానం తో ఇష్టదైవాన్ని పొందవచ్చు అని తెలుసుకొన్నాడు .హృదయం రామకృష్ణ ఆ౦జ నేయులని ప్రతిస్టించు కొన్నాడు .లక్ష్మీ దేవమ్మను పెళ్ళాడి ఆరుగురు సంతానం పొందాడు . నీళ్ళ కావిళ్ళు మోసి వారిని పెంచాడు .ఆయన భక్తులు ఈపని తప్పించి గుంటూరులో పెట్టుకొని ‘’బాబు గారు ‘’అని గౌరవంగా పిలిచేవారు .తాత్విక విషయాలు జన్మ కర్మ విషయాలు బోధించేవాడు .నామం చేస్తే కర్మకరిగిపోతుందని చెప్పేవాడు .మహిమలు ప్రదర్శిస్తూ అవన్నీ శ్రీరామకరుణా కటాక్షమే అనే వాడు .22-7-1979 సిద్ధార్ధి సంవత్సర కార్తీక శుద్ధ విదియ సోమవారం పూర్ణయోగి రంగన్నబాబు 84 వ ఏట శ్రీరామ సన్నిధి చేరాడు .ఆయనకు సమాధి మందిరం లేవు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-9-20-ఉయ్యూరు