కర్నూలు జిల్లా ద్రోణాచలం తాలూకా గోవర్ధనగిరి లో యాదవకులం లో బద్దుల రంగయ్య చౌడమ్మ దంపతులకు చివరి సంతానంగా1850లో ముద్దయ్య పుట్టాడు .బాల్యం నుంచి దైవభక్తితో గడిపాడు .అడువులకు ఆవులను తోలుకు వెళ్లి మేపుతూ చెట్టు నీడన ఏకాంత ధ్యానం లో మునిగి పోయేవాడు .ఒక రోజు పెద్ద నాగుపాము ఆయనకు ఎండ తగలకుండా పడగా విప్పి గొడుగులాగా కాపాడింది .ఊళ్ళో ఉన్న మాలదాసరి కౌలుట్లయ్యను తమకోడుకును ప్రయోజకుడిని చేయమని తలిదండ్రులు కోరారు .యాగంటి క్షేత్రానికి తీసుకువెళ్ళి మంత్రోపదేశం చేయగా నిరంతరం మంత్రజపం దీక్షగా చేశాడు .ఒక రోజు కోటి పెట్టి బావి దగ్గర జ్యోతి వెలిగించి శివలింగం చెక్కటం మొదలు పెట్టాడు .విషయం తెలిసిన అన్నలు వచ్చిజ్యోతి ముందు ధ్యానమగ్నమై ఉన్న ముద్దయ్యకు తెలీకుండా శివలింగాన్ని ‘’భోజనం బావి ‘’లో పారేసిపశువులను ఇంటికి తోలుకుపోయారు .
ధ్యానముద్ర నుంచి లేచిన ముద్దయ్య విషయం తెలిసి నూతిలోకి దూకి ఒక చేతిలో శివలింగం మరో చేతిలో జింక చర్మం తో నీటిపై తేలాడు .నడి బావిలో జింక చర్మం పరచి పద్మాసనం లో కూర్చుని చేతిలో శివలింగంతో ధ్యానమగ్నడయ్యాడు .ఈ విషయం అంతటావ్యాపించి అతని మహిమలకుందరూ ఆశ్చర్యపోయారు .తలిదండ్రులు అతడికి బలవంతం తో పెళ్లి చేయగా రజస్వలకూడా కాని భార్య ఆకస్మాత్తుగాచనిపోవటం తో వైరాగ్యం పెరిగి జ్ఞానం కోసం దేశాటన చేశాడు .తల్లి మరణవార్త తెలిసి తిరిగివచ్చి ఆమెకు సమాధి కట్టి అక్కడ ఒక చెట్టునాటి ,చిన్న కుటీరం కట్టుకొని ఆశ్రమజీవితం మొదలుపెట్టాడు. ఆ పర్ణశాలను ‘’ముసలమ్మ కట్ట’’ అంటారు .శిష్యులు పెరిగారు రోగులకు వ్యాధి నయం చేసేవాడు .
పత్తికొండ తాలూకా గొనె గండ లో ఉన్న చింతలస్వామి నీ నే యాగంటీశ్వరుడిని అప్పుడప్పుడు వెళ్లి దర్శించి వచ్చేవాడు .బాల్యంలో చెక్కిన శివలింగాన్ని ఆశ్రమం లో ప్రతిస్టించాడు .తాను సమాధి అయ్యేరోజును అయిదేళ్లకు ముందే ప్రకటించి ,సమాధి నిర్మి౦ప జేసుకొని బ్రహ్మరంధ్రం ద్వారా ప్రాణవాయువును వదిలేసి 1940లో 90వ ఏట గోవర్ధనగిరి ముద్దయ్య స్వామి సమాధి చెందారు .శ్రావణ శుద్ధ సప్తమి నాడు ఆరాధనోత్సవం చేస్తారు .
24-మౌనస్వామి -1868-1943
బాపట్ల తాలూకా నూనె వారి పాలెం అచ్యుతుని బాపనయ్య ,సీతమ్మలకు 20-4-1968 న పిచ్చయ్య మూడవ కొడుకుగా పుట్టాడు .పందిళ్ళ పల్లి వాసి అచ్యుతుని లక్ష్మీ నరసయ్య సుందరమ్మలు దత్తత తీసుకొని శివయ్యగా పేరు మార్చి చదువు చెప్పించారు .కామేశ్వరమ్మతో పెళ్లి జరిగి ఆబ్కారీ శాఖలో ఉద్యోగం లో కొంతకాలం ఉద్యోగం చేశాడు .
1943లో రాజమండ్రి వెళ్లి ధాన్యం వ్యాపారిదగ్గర గుమాస్తాగిరీ చేస్తూ ,దేవీ ఉపాసన మొదలుపెట్టాడు .రాత్రిళ్ళు పురాణప్రవచనాలు .హరికథా కాలక్షేపాలు చేసేవాడు .క్రమంగా దృష్టి అంతర్ముఖమై ,1906లో ఇల్లువదిలేసి గురువు అన్వేషణ కోసం దివ్య క్షేత్రాలు యోగభూములు దర్శిస్తూ దేశాటనం చేశాడు .తిరువన్నామలై లో శ్రీ రమణమహర్షి ఆశ్రమం లో ఒకఏడాది గడిపాడు .
ఉత్తర దేశ యాత్రలో అచ్యుతానంద సరస్వతీ స్వాముల దర్శనం కలుగగా ఆయన ‘’’’శివ చిదా నంద సరస్వతి ‘’దీక్షానామం తో సన్యాసం ఇచ్చారు .గురువు అనుమతితో యోగ సాధన చేస్తూ మళ్ళీ దేశయాత్ర చేశారు .1908లో నైమిశారణ్యం చేరి ,అక్కడ వంద సంవత్సరాలుగా తపస్సుచేస్తున్న’’ వెంకటాచలం పంతులు’’గారిని సేవించి ,అనేక యోగ శక్తులు సాధించారు దత్తాత్రేయుని అపరావతారమైన శ్రీ వాసు దేవానంద సరస్వతి శుశ్రూష చేసి, సమస్త శాస్త్రాలు యోగం లలో నైపుణ్యం సాధించారు .సిద్ధ పురుషులైన చిదానంద అప్పటినుంచి మౌనంగా ఉంటూ ‘’మౌనస్వామి ‘’గా పేరు పొందారు .పంచవటి వద్ద గుహలో యోగ సాధన చేశారు .తర్వాత కర్నాటక మూకాంబికా క్షేత్రం చేరి ,అక్కడనుండి మంగులూరుకు బయల్దేరి మధ్యలో చిత్రకూట పర్వత ప్రాంతం లోసమాధి లో ఉంటూ అనేక అద్భుతాలు ప్రదర్శించారు .చివరకు తమిళనాడు చేరి కుర్తాళం వద్ద స్థిరపడి ‘’కుర్తాళం మౌనస్వామి ‘’అని పిలువబడ్డారు
తమ మఠాలకు,మందిరాలకు ట్రస్ట్ ఏర్పాటు చేసి 28-12-1943న 75వ ఏట మౌనస్వామి అనంత మౌనం లో కలిసిపోయారు .దండాయుధ పాణి మందిరం లో సమాధి చేశారు .13-7-1951న సమాధిపై శివ లింగ ప్రతిష్ట జరిగింది .ఆనాడు ఆయన దత్తాశ్రమ౦ లో స్థాపించిన ‘’సిద్దేశ్వరీ పీఠం’’,ఈ నాటి పీఠాధిపతి –శ్రీ సిద్దేశ్వర చిదానంద భారతీ స్వామి (పూర్వాశ్రమంనామం ప్రసాదరాయ కులపతి )ఆధ్వర్యంలో ప్రశస్తిపొంది ,దేశం లో గొప్ప అద్వైత పీఠంగా భాసిల్లుతోంది .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -12-9-20-ఉయ్యూరు