మనకు తెలియని మహాయోగులు—13
25-మునీంద్ర స్వామి -1876-1961
ఆంద్ర ప్రదేశ చిత్తూరుజిల్లా తిరుమలదగ్గర స్వర్ణముఖీ నదీ తీరం లో యలమండ్య గ్రామం లో గాలిమాసి లక్ష్మణ రెడ్డి ,అన్జేరమ్మ అనే పాకనాటి రెడ్డి దంపతులకు మునిస్వామి రెడ్డి 1876లో పుట్టాడు .చీరాల సుబ్బయ్య అనే భాగవతోత్తముడు అక్షరాభ్యాసం చేసి తారకమంత్రం ఉపదేశించగా ,వ్యవసాయపనులతో సహా అన్ని పనులూ చేస్తూ కూడా దీక్షగా జపించాడు .ఒక రోజు సృష్టి రహస్యం భధించాలన్న ఆలోచన కలిగి ,ఏకాంతం లో ఉండటం మొదలుపెట్టాడు. 18వ ఏట చెంగమ్మతో పెళ్ళిచేశారు కాని దాంపత్యం పరమాత్మజీవాత్మ బంధంగా ఉన్నది
5-1-1925రక్తాక్షి సంవత్సర పుష్యశుద్ధ ఏకాదశి నాడు మునిస్వామి వ్రత దీక్షతో తదేక రామతారకనామాన్ని జపిస్తుంటే శుద్ధ నిర్వికల్ప సమాధి లభించింది .ఆత్మదర్శనమై ప్రపంచమంతా పరమాత్మ స్వరూపంగా కనిపించింది .నిద్రాహారాలు మాని 8 నెలలు బ్రహ్మానంద మగ్నుడయ్యాడు.ఒక శ్రావణ పౌర్ణమి నాడు వేదవేదా౦త జ్ఞాని నారాయణాచార్యులు ,అష్టాక్షరీ మంత్రముపదేశించి భ్రూమధ్యం లోకి చూడగా బాహ్య దృష్టి నశించి ఆత్మ దృగ్గోచరమైంది .మునీంద్ర స్వామి దీక్షానామమిచ్చి వేదాంత రహస్యాలు బోధించాడు .అప్పటినుచి ఏకాంత తపస్సు చేస్తూ ,ఆత్మశక్తితో సమస్తవిషయాలూ తెలుసుకొంటూ మహిమలెన్నో చూపాడు.నాస్తికులను ఆస్తికులుగా మార్చాడు శిష్యకోటి పెరిగింది .
అనుష్టాన వేదాంతి మునీంద్ర స్వామి జిజ్ఞాసువులకు కల్ప వృక్షమైన ‘’బ్రహ్మజ్ఞానామృత సంగ్రహం ‘’గ్రంథం రాశారు .పుత్తూరుతాలూకా కదిరి మంగళం లో ఆశ్రమమ స్థాపించి కదిరి మంగళం మునీంద్ర స్వామిగా ప్రసిద్ధి చెందారు .తన నిర్యాణ సమయాన్ని వారం రోజులు ముందే ప్రకటించి 18-5-1961 ప్లవనామ సంవత్సర జ్యేష్ట శుద్ధ పంచమినాడు 85వ ఏట కళ్ళు తెరచి భక్తులను శిష్యులను ఆశీర్వదించి మునీ౦ద్రస్వామి జీవ సమాధి చెందారు .ప్రతి పూర్ణిమ నాడు గురుపూజ ,వార్షికోత్సవాలు ఘనంగా చేస్తారు .ప్రస్తుత పీఠాధిపతి బ్రహ్మానంద భారతీ స్వామి .
26-యోగానంద నరసింహ మహర్షి-1886-1960
ఒంగోలు జిల్లా మార్కాపురం తాలూకా తోకపల్లి లో 1886లో సుబ్బారాయుడు పుట్టాడు .వీధి బడి లో చదివి ,నాట్యనాటకాలపై అభిరుచి పెరిగి ,ఒకనాటక సమాజ నటుడయ్యాడు .ఒక వైష్ణవ పండితుడు చేరదీసి ,పురాణ వేదాంత సారం వంట బట్టించి మంత్రాలు ఉపదేశించాడు దీక్షతో మంత్రం రాత్రి పగలు చేస్తూ అడవిలోకి వెళ్ళిపోయాడు.ఒక పాశ్చాత్య సర్వేయర్ అతడికి ఉద్యోగమిచ్చి ,తీరిక వేళల్లో అతడి భక్తి గేయాలువింటూ భక్తుడైపోయాడు .అతడు ఏది చెబితే అది జరిగేది .
ఉద్యోగ రీత్యా వీరరాఘవ క్షేత్రం ఐన తిరువళ్ళూరు వెళ్లి అక్కడ నిద్రాహారాలు మాని రామనామ జపంచేశాడు .దొర ఇతడిని మద్రాస్ కు మార్చాడు.ఒక రోజు ఒక అవధూత కనిపించగా ఆయనపాదాలపై మూడు రోజులు పడిఉండగా ,నాల్గవ రోజు దీవి౦చగా సుబ్బారాయుడి ముఖం దివ్య తేజస్సుతో వెలిగిపోయింది .మంత్రాలు సిద్ధులు యోగామర్మాలు వచ్చేశాయి . ఆ దిగంబర అవధూత తన శక్తులన్నీ సుబ్బారాయుడికిదారపోసి,అదృశ్యమయ్యాడు .
ఎన్నెన్నో అద్భుతాలు లీలలు ప్రదర్శిస్తూ కపిలగిరిపై చేరి తపస్సు చేయగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ప్రత్యక్షమై ఆలయం కట్టమని కోరగా కట్టించి స్వామిని ప్రతిష్టించి ,నిత్యపూజా నరసింహ జయంతి ఉత్సవాలు జరిపించారు కపిలగిరి యోగానంద మహర్షి .తనను జీవ సమాధి చేయమని శిష్యులకు ఆదేశించి తనవారసునిగా నారాయణ దాసును పీఠాదిపతిని చేసి 30-12-1960 శార్వరి పుష్యశుద్ధ త్రయోదశి శుక్రవారం 75 వ ఏట సమాధి స్థితులై బ్రహ్మ రంధ్రాన్ని చేదించుకొని యోగా నంద మహర్షి లక్ష్మీ నరసింహస్వామిలో ఐక్యమయ్యారు .కపిలగిరి మెట్ల ప్రక్క ఈశాన్యం లో సమాధి చేశారు .ఏటాగురుసమారాధనలు వైభవంగా జరుగుతాయి .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -13-9-20-ఉయ్యూరు