ఆదర్శ మూలాల కు అనురూపమైన శ్రీ మతి కోపూరి పుష్పాదేవి ‘’ఒక్క క్షణం ‘’కథలు
తొమ్మిది కథా సంపుటాలు, రెండుకవితా సంపుటాలు వెలువరించి ఆంధ్ర దేశం లోలబ్ధ ప్రతి ష్టురాలైన సాహితీ మూర్తి శ్రీమతి కోపూరి పుష్పాదేవి .సాహితీ సంస్థలకు వెన్ను దన్ను .నిలువెత్తు ఆంద్ర సంప్రదాయ మహిళా స్వరూపం .రచనలో నవ్యత,భావం లో నవీనత ,అవసరమైతే షాట్ గన్ గా పేల్చగల సామర్ధ్యం ,సాధారణంగా సర్దుకుపోయే తత్త్వం ఆమెకు సహజ ఆభరణాలు .నాకు దాదాపు రెండు దశాబ్దాలుగా ,సరసభారతికి ఒక దశాబ్దిగా పరిచయమున్న అక్కలాంటి అమ్మ .తాజాగా 2020లో ప్రచురించిన ‘’ఒక్క క్షణం ‘’కథలు,విలక్షణం, విశేష గుణం కలవి .ఆదర్శాలకు ఆయువు పట్లు .ఇందులో ఉన్న 33 కథలు సగటు తెలుగు వారి వే.సంఘటనలు నిత్యం మనం చూస్తున్నవే .వాటికి ఆమె అక్షరారూపమిచ్చి సార్ధకం చేశారు .ఇవన్నీ ప్రముఖ పత్రికలలో చోటు చేసుకొన్నవీ ,కొన్ని బహుమతులు పొందినవీ కూడా .
తండ్రి రైసు మిల్ లో గుమాస్తాగా చేరి ,ఆమెను పెళ్ళాడి అదృష్టం తేనె తుట్టెలా ఎక్కడో పట్టి కార్పొరేటర్ అయి ,అక్రమాలు, అతివలవేటలో ఆరి తేరి ,తను వద్దని వారిస్తుంటే విడాకులతో బెదిరిస్తూ ,నరకం చూపిస్తూ ఇప్పుడు ఎం .ఎల్ .ఏ .టికెట్ కోసం హైదరాబాద్ వెడుతున్న భర్త ,కొంపదీసి గెలిచి మంత్రి ఐతే ,నేరాలు ఘోరాలకు అంతూ దరీ ఉండదని భావించి తననుకూడా రమ్మంటే రైలు ఎక్కి ,అతడు అభిమాన గణం వీడ్కోలు హడావిడిలో కదుల్తున్న రైలు ఎక్కే ప్రయత్నం చేసి,భార్యకు చెయ్యి అందించి లోపలికి లాగమంటే ‘’ఒకసారి చెయ్యందించి నా జీవితం నాశనం చేసుకొన్నాను ,మళ్ళీ చేయ్యందుకొని రాష్ట్రాన్ని దుంప నాశనం చేస్తావా “’అని మనసులో’’ ఒక్క క్షణం ‘’అనుకొని , జాపిన చెయ్యి వెనక్కి తీసేసుకొన్నది .అంతే’’ఇంకేమీ చెప్పలేదు రచయత్రి .అతడు జారిపడటం చావటం దేశాని పీడా వదలటం మన ఊహకు వదిలేసింది .ఈ ‘’ఒక్క క్షణం’’ ఈ కథకు, సంపుటికి మకుటాయమానమైనసార్ధకమైన శీర్షిక .
పోరాడి గెలిస్తేనే దేని విలువైనా తెలిసేది .దానితో ఆత్మ సంతృప్తి లభిస్తుంది .ప్రగతి వైపుకు సాగిపోవటమే జీవితం అనే జీవిత సత్యం చెప్పే కథ‘’ప్రస్థానం’’. భర్త, కొడుకు ఒకే సారి చనిపోతే లలిత తనకోడలు ప్రత్యూషను కూతురులా చూసుకొంటూ ,ఆమెకడుపులో పెరుగుతున్నకూతురు రూపాన్ని భద్రపరచినది .రిటైర్ మెంట్ బెనిఫిట్స్ తనిష్టం వచ్చినట్లు అనాధ శరణాలయానికి ఇచ్చేసి సంతృప్తి పడిన లలిత చేసిన పనికి ప్రత్యూషను కోపం తార స్థాయికి చేరింది . ఆమె కూతురు బుద్ధి చెప్పేపని చేసి ,అమ్మమ్మ లలితతో కూతురు ప్రోమోదినీ ప్రణ య్ కు అక్షితలు వేయిస్తుంటేచూసిన ప్రత్యూష ఖంగు తింది .ఆల్ ఈజ్ వెల్ లా అంతా కలిశారు .లోకంలో రావణులు ,కీచకులేకాడు శూర్పణఖ లూ ఉంటారని చెప్పేదే ‘’మేమేం తక్కువా ?””కథ .తనూ పిల్లలు కూడా బెట్టిన డబ్బు పని మనిషి కొడుకు కు యాక్సిడెంట్ అయితే ఖర్చుకు ఇచ్చి సార్ధకం చేసిన భారతి,పుట్టిన రోజు డ్రెస్ కు భారీగా ఖర్చుచేసి’’ రిక్షాకూలి పది హేను రూపాయలు ఇచ్చి నా మందు బిళ్ళలు కొనుక్కోటానికి పుణ్యం కట్టు కొండి బాబయ్యా ‘’అన్న వాడి మాటలకు విలువ లేకుండా, ఎక్కువ అడిగాడని విసుక్కొని ఆదుకోవాల్సిన జంట ,నడిచి వెళ్ళిన సంఘటన ,వాడు తన డ్యూటీ చేశాడు ,మనమెందుకు సాయం చేయాలన్న సంకుచిత ఆలోచన ఉన్న మనుషులు ,అమ్మాయిల జీవితాలలో ఆడుకొనే వాడికి ధైర్యంగా గుండుగీసి సున్నం బొట్లు పెట్టి ,వీడియో తీసిన సగటు ఆడపిల్ల ధైర్యం మనకు ఆదర్శాలుగా కనిపిస్తాయి .పొగరు, అహంకారం పొరలుకమ్మి ,అంది వచ్చిన ఉద్యోగాలు కాలదన్నుకొని ,చివరికి గణపాఠం నేర్చి ,తాను జీవిత పరీక్షలన్నీ పాసైన ఉత్తమ విద్యార్ధిని అని తెలియజేసి , ‘’నమ్మితే మీ ఇంట్లో మీ పిల్లలకు తల్లిగా ఉద్యోగం ఇవ్వమన్న’’వందన ,అనుబంధాలూ ఆత్మీయతలూ పెంచుకోవటానికి బానే ఉంటాయి కాని తుచు కోవటం’’ ‘’అంత వీజీ కాదు’’. కాని దాన్ని అక్షరాలా ఆచరించి వానప్రస్థాశ్రమం తీసుకొని కొడుకుకు బుద్ధిచెప్పిన ముసలి జంట ,అందరూ చైతన్యవంతులైతే అశాంతి స్థానం లో శాంతి నెలకొంటుంది అన్న వసుంధర ధైర్యం,సొంత ఇంటికోసం ఉన్న దంతా ఖర్చు చేసి ,రేపటి సంగతి ఏమిటో తెలీని ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా అయోమయంలో ఉన్న సగటు మధ్యతరగతి జీవులు ,అహం వీడితే హళ్లికి హళ్లి అని గ్రహించిన నారాయణమూర్తీ అందరూ మనకు తెలిసిన వాళ్ళే .’’ఒక అన్నలాగా దగ్గరుండి మా పెళ్లి చేయి .మేమిద్దరం కలిసి అనాధ శరణాలయం నడుపుతాం ‘’అన్న తాను ప్రేమించిన వసుంధర అంటే మైండ్ బ్లాంక్ అయి ఇప్పటిదాకా తన ఆలోచనలు ఎంతగా దారి తప్పాయో తెలుసుకొని తనకు నిష్కృతి లేదు అనుకొన్న మూర్తి, ఆదర్శాల పేరిట ఆవేశంగా ప్రవర్తిస్తే అనర్ధం జరిగి ,అవసరం బ్రతుకు తెరువును శాసిస్తుందని గ్రహించిన శారద ,ఎక్కడో లేరు మనమధ్యే ఉన్నారు .
భర్తను అదుపు చేయలేక తనకున్న ఉక్రోషం పిల్లలపై చూపి ,చెయ్యి దాటిపోతే జీవితం లో ఓటమి పాలై విలపించిన వినోదినీ ,ప్రతి సమస్యకూ పరిష్కారం ఉంటుందని,కొంత మూల్యం చెల్లించటం తప్పదనీ , వాళ్లకు ఆత్మస్థైర్యం అందించాలని ధైర్యం చెప్పిన ఆమె అక్క వసంత సగటు తెలుగింటి ఆడపడుచులే .స్వామీజీల డొల్లతనం తెలివిగా బయటపెట్టిన జానకి ఆధునిక విజ్ఞానం తెలిసిన స్త్రీ .మనిషి ప్రశాంతంగా బతకటానికి డబ్బూ దస్కమే కాదు ,’’ఆక్సిజన్ వంటి ఆత్మీయత’’ కావాలి .ఆత్మీయత అందుకోవాలి, అందించాలి ప్రేమను పొందటం పంచటం మనిషి ఉచ్చ్వాస నిశ్వాసాలు కావాలి ‘’అనే ఎరుక చెప్పిన కథవెలుగురేఖలు లో అనంతలక్ష్మీ తనపాపను తీర్చిదిద్దుకొంటానని ఆత్మ విశ్వాసం తో చెప్పి నిజం చేసుకొన్నది .తండ్రి వ్యసనం నుంచి మరల్చటానికి మనవడిని ప్రయోగించిన కొడుకు ఆదర్శంగా కనిపిస్తాడు .భర్త చనిపోతే కారుణ్య నియామకం కింద ఆఫీస్ లో చిన్న ఉద్యోగం పొంది ,క్రమమక్రమంగా చదువులో ఎదిగి ఉద్యోగం లో ఉన్నతి సాధించి ,అత్తమామలను ఆదరిస్తూ ,తనపిల్లలనూ ఆడబడుచు పిల్లల్నీ సమానంగా చదివిస్తూ ,ఆదరిస్తూ ఉన్న భవాని ఉత్తమ గృహిణి గా ,ఆమె ఇల్లు ఉత్తమ గృహం గా జడ్జీలు ఎంపిక చేయటం ఆదర్శ జీవితానికి పట్టాభి షేకమే .’’మనసుకు నచ్చిన పని చేయటానికి ఆత్మ సంతృప్తి ఒక్కటి చాలు’’అన్న స్థిర నిశ్చయం ఉన్న జమున ఎవరిమెప్పులూ ,మేకతోలూ ఆశించదు. .మనకర్తవ్యాలు మనం చేస్తే అదే గొప్ప దేశ సేవ .తమ తలిదండ్రులను వాళ్ళ అమ్మా నాన్నలు ఆదరించి ,గౌరవిస్తే ,అదే బాటలో నడిచి వాళ్ళ వివాహ రజతోత్సవం చేసి అదే సత్కారం అని భావించిన రాజశేఖర్ ,రజని దంపతులు.నీరు లాంటి ప్రేమ పల్లానికే ప్రవహిస్తుంది .తాముకన్నవారి ఉన్నతి గురించే ఆలోచన తప్ప తమను కన్నవారి బాగోగుల గురించి పట్టించుకోని సమాజం లో భారతి లాంటి వారు నూటికి ఒక్కరు మాత్రమే ఉంటారు .ఆదర్శంగా ‘’డెఫ్ అండ్ డంబ్ ‘’అమ్మాయిని పెళ్లి చేసుకొన్నకొడుకు హిమాలయం అంత ఎత్తుగా కనిపించాడు తల్లికి . కలకాలం ఆ అమ్మాయితో కలిసి కాపురంచేస్తానని మాటకూడా ఇచ్చాడు .ఆమాట మీద నిలబడమని హితవు చెప్పింది . రెండేళ్లకే వాడి బండారం బయటపడి ,రెండో పెళ్లి చేసుకొంటానని,తల్లితో అంటే ,అది తప్పు అని ఎన్నిరకాలుగా చెప్పినా వినక తనను ఎవ్వరూ ఏమీ చేయలేరని ధీమా ప్రకటిస్తే ‘’మేమేమీ చెయ్యక్కర్లేదు నీ ఉద్యోగం ఊడి, జైల్లో చిప్పకూడు తినాల్సి వస్తుంది ‘’అని గట్టిగా చెప్పి ‘’బిడ్డకు అన్యాయం జరుగుతుంటే ఏ తల్లీ చూస్తూ ఊరుకోదురా పిచ్చి సన్నాసీ .నాకోడలుకూడా ఇవాల్టినుంచీ నా బిడ్డేఅని కళ్ళల్లో నిప్పులు కరిపించిన వాడి తల్లి . అత్తగారు కాదు నిజంగా తల్లి ,మాతృమూర్తి గా మన అభిమానం పొంది , అపర మహిషాసుర మర్దినిగా జేజేలు అ౦దు కొంటుంది ‘’విజయదశమి ‘’కథ లో .
మంచి ఆదర్శాలు ఆదర్శభావనాలు అనురూపమైన కథా సంవిధానం ,నిర్వహణ ,ఏదో క్లైమాక్స్ ఉండాలన్న తపన లేని సాధారణ వర్ణన లతో ,జీవ భాష తో కథలన్నిటికీ జీవం పోసిన పుష్పాదేవి గారు అభిన౦దనీయులు. తెలుగు కథ వారి కలం లో జీవ కళతో సాక్షాత్కరించింది .
మీ- గబ్బిటదుర్గాప్రసాద్ -14-9-20-ఉయ్యూరు
—