యక్కలూరి సాహిత్య ధ్యేయం ఒక్కటే –సామాజిక శ్రేయస్సు
శ్రీ యక్కలూరి శ్రీరాములు గారి గురించి నాకు అంతగా తెలీదు .వారి రచన సర్వస్వం పై అధ్యయనం చేసి ,లోతులు తరచి ,అందులోని మణిమాణిక్యాలను లోకానికి స్పష్టంగా’’యక్కలూరి సాహిత్యం –అనుశీలన ‘’ద్వారా తెలియ జేసినవారు ఆత్మీయులు ,విజయవాడ వెటనరీ డాక్టర్ ,సాహిత్యోపజీవి ,కండగలకవిత్వాన్ని పండించిన ఆచార్య డా మక్కెన శ్రీను గారు . ఈపుస్తకం పంపి నెలరోజులు దాటినా దానిపై నా చూపు పడలేదు . అదొక రిసెర్చ్ గ్రంథం.కనుక నేను విడిగా చెప్పాల్సిన అవసరం లేదనే ఉపేక్ష కూడా కారణం .కానీ చదివి నాలుగు మాటలు రాసి మర్యాద నిలబెట్టుకోవటం ధర్మం అని పించి ఇవాళే చదివి .నా భావాలు తెలియజేస్తున్నాను .ఇందులో డాక్టర్ గారి రచనగురించి తక్కువగా, శ్రీరాములుగారి సాహిత్యం గురించి ఆయన ఒక్కగానొక్క సాహిత్య ధ్యేయం పరిచయం అందులో ఉన్నమాటలతోనే చెప్పాలని మొదలు పెట్టాను .యక్కలూరి వారు కవి కథకులు ,వ్యాసరచయిత ,విమర్శకులు నాటిక నవలా రచయిత గా బహు ముఖీన ప్రతిభ ప్రదర్శించారు. వీటినన్నిటినీ మక్కెనగారు త్రాసులో తూచి నిగ్గు తేల్చారు .
కనుక శ్రీరాములు గారిది ప్రక్రియా వైవిధ్యం.కవిత్వానికి బంగారు గని ,వారి కొత్త చూపు అభి వ్యక్తీ లోకోత్తరం .ఒకకంట్లో కెమెరా ,మరో కంట్లో కవిత్వం ఉన్నవాడు .ఆయనరచనలు రసమయాలు .ఆయనొక కవితా ప్రబంధం ,నాటక మకరందం వ్యాస గంధం అనుభూతుల తరగని గని .ఆయన కవితలు కురిసిన భావపు మొయిళ్ళు ,తడిసిన హృదయపు లోగిళ్ళు. పదపదం లో రస వృష్టి పలికించిన కవితా పరమేష్టి ‘’ అచ్చు తప్పో ఏమోకానీ ‘’మెయిళ్ళు’’అని పడింది మొయిలు అంటే మేఘం . సువర్ణసుందరిలో ‘’హాయిహాయిగా ఆమని సాగే ‘’ మాధురమైన పాట లోకూడా మనకు పరిచయమే .శ్రీనుగారు వారు రాసిన 15 కవితలను 5వ్యాసాలను ,నాటికలు నవల వ్యాసాలులాంగ్ పోయెం,షేడ్స్ ఆఫ్ మూన్ లైట్ అనే కవిగారి స్వీయ ఆంగ్ల అనువాదాలను చక్కగా సమీక్షించారు .జలశిల్పంగా కొన్ని మలిచారు .
కవితామయమైన కవి గారి పంక్తుల్ని మీ ముందు ఉంచుతున్నాను .’’దేశం లోని ఆకలి వేకువతో ప్రారంభమై ,శోకం లో మిగులుతుంది ‘’.స్త్రీ ఔదార్యాన్ని సహనాన్ని మాతృత్వ మాధుర్యాన్నీ ‘’అన౦తతత్వం ‘’కవిత లో వ్యక్తీకరించారు .’’రాయల సీమసర్వస్వం –రగులుతున్న భాస్వరం ‘’,’’రాయలసీమలో విస్తరిస్తున్న ఇసుక ఎడారి –రానున్నకాలం లో అది ఒంటెలకు రహదారి ‘’,’’నువ్వు నా కలం లోంచి జారి-పరిగెత్తే జింక లాంటి గీతిక ‘’ బాల్యానికి సంకెళ్ళు వేసి సమాజం లోకి వదిలారు .అందుకే బంతులతోకాదు పూబంతులతో కాదు బాంబులతో ఆడుకుంటున్నారు ‘’అని సానుభూతి దీర్ఘకవితలో వర్షించారు .నాగరకత పెరుగుతుంటే మానవత వెనక్కి వెడుతోందని నిరాశచెందారు .’’కార్పోరేట్ నిర్ణయించిన వ్యవస్థకు –నా రెండు పాదరక్షలతో నమస్కారం ‘’అని చెప్పు దెబ్బలు కొట్టారు.
‘’విత్తనమంత అక్షరం లో మహా వృక్షమంత అర్ధం కవిత-బిందువంత పదం లో సింధు వంత పరమార్ధం కవిత ‘’,’’ఉప్పు కూడా ఒకప్పుడు –నిప్పులా మండిన ఆయుధమే ‘’అని ఉప్పుసత్యాగ్రహం గుర్తుకు తెస్తారు .’’మనిషి సమస్త ఆలోచనలు –ఆయుధాల అవయవాలే ‘’ మనిషి మానవాళి శ్రేయస్సుకోసం పాటుపడితే ఇలలో స్వర్గమే అన్నది ఆయన ఆంతర్యం .’’ప్రజాస్వామ్యం –హస్తి నలో దేహీ ‘’అని అడుక్కునే దీనస్థితిలో ఉన్నందుకు వ్యధచెందారు .’’పంచభూతాలే మన పంచ ప్రాణాలు ‘’,’’ఉగ్రవాద పిడికిలిలో ప్రపంచం ఒక సజీవ శవం ‘’అని వాపోయారు .వారినాటకాలలోని పాత్రలు సజీవ మానవులే .వాటిలో శైలీ ప్రాయోజితకల్పన సంభాషణా చాతుర్యానికి హాట్సాఫ్ చెప్పారు మక్కెన గారు .
‘’చెట్టుకు విత్తనం ,చేపకి సముద్రం ,పిట్టకుఆకాశ౦,భాషకు మాండలికం అవసరం’’ అన్నారు .భాషా పరిణామమే మనిషి నిర్మాణం అంటారు ,భాషకే స్వాతంత్ర్యం లేకపోతే దేశానికిస్వతంత్ర్యమా అని ఎద్దేవాచేశారు .’’అక్షరాలూ చినుకులు –కవులు మేఘాలు –సాహిత్యం సముద్రం ‘’అని గొప్ప నిర్వచనం చేశారు ‘’కవి ఒక స్రష్ట –కవిత్వమే జీవిత పరాకాష్ట ‘’మరో కోటబుల్ కోట్. ‘’ఒక్కో చినుకూ ఒక్కో వీర్య కణం-భూమితో సంగమిస్తూమళ్ళీ మొలకెత్తేబీజం ‘’అద్భుత భావన . ప్రేమ యెంత మధురమైనదో చెప్పే కవితా పంక్తులు ‘’నా హృదయం ఒక్కసారే ప్రేమిస్తుంది న్రంతరం –నీతోనే ఉంటుంది .మరణాన్ని కూడా జయిస్తుంది ‘’
‘’మేఘం చినుకుల ధారగా –వాన దారంగా మారి-భూమికిచిలక పచ్చచీర సారెగా ‘’ఇచ్చిందట .’’ఆకు దాహం తీరుస్తూ –విశ్వ వీధుల్లోంచి జారే పతాకమై –సకలజనులకు విజయ బావుటా ‘’గా దర్శనమిచ్చింది భావుకకవికి .అందుకే శ్రీనుగారు ‘’ఆయన కవిత్వం జీవ, వర్ష ధారల సజీవకవనం ‘’అని చక్కగాఎస్టిమేట్ చేశారు.’’అమ్మడానికి మందు మాంసాలతో పాటు –దేశం లో మగువ శరీరాలూ వేలాడు తున్నాయి ‘’అని నిట్టూర్చాడు కవి .ఈ భావంతో రాసినదే-‘’టెన్ డౌనింగ్ స్ట్రీట్ ‘’ కథ .’’రియల్ ఎస్టేట్ విపణిలో రాజకీయ పాచికలతో చెరచబడుతున్న ద్రౌపది ఈ భూమి .వేలం పాటలో నిర్లిప్తంగా నిలుచున్న చంద్రమతి ‘’లాగా కనిపించింది .చిన్నప్పుడు కవిగారు చూసిన పాత దృశ్యాన్నీ చిత్రించారు పలనాటి వీర చరిత్రను రక్తి కట్టించిన కోరమీసాల వీరన్న ,కోలముక్కు లచ్చుమక్కల కళావిహీన బతుకు చిత్రాలు శిల్పించారు అక్షరాలతో .కుదేలౌతున్న కుటీర పరిశ్రమలకు పునర్వైభవం తెచ్చే కథలు మనసుకు హత్తు కొంటాయి .కవి గురించి కవి గారి స్పందన గొప్పగా ఉంటుంది –‘’ వేటగాడికో బాణం ,జాలరికో గాలం అవసరం దేన్నైనా కొట్టటానికి పట్టటానికి .కానీ ‘’ఏ కాలం లో నైనా ,ఏ ప్రాంతం లో నైనా ఎన్ని హృదయాలైనా ,ఒక్కసారిగా ప్రేమించటానికి ఒక్క క్షణం చాలు ఒక్క హృదయ స్పందన చాలు ‘’
ఒక సాధారణ స్త్రీ సమాజ వైచిత్రి వలన ఎలా పరిణామం చెంది ,ఎలాంటి స్థితికి ఎదిగిందో ఆస్త్రీ ధీరోదాత్త ను చూపే నవల కూడా రాశారు యక్కలూరి .ప్రపంచానికి అన్నం పెట్టే రైతన్నపై లోతుగా కవిత్వం రాసినకవిగా కవిగారికి కితాబు ఇచ్చారు డాక్టర్ గారు .క్రీడలు కూడా వ్యాపారమై ,క్రీడాకారుల ఎంపికలో పక్షపాతాలు ప్రతిభను అణగ ద్రొక్కటాలు పోయి ,రాజకీయ అవసరాలు లేని ప్రజాస్వామ్య వ్యవస్థ కు శ్రీకారం చుట్టాలని కోరుకొన్నారు కవి .కవిగారు ‘’చెట్టు ను చూసినా ,మట్టిని చూసినా ,కాలానికి అతీతంగా –లోకానికి శాశ్వత సంకేతంగా –విశ్వం లోని శూన్యతగా అనిపించి ,-ఊగితే భోగిగా ,ఆగితే యోగిగా ఉంటాను .నేనొక అనేకం ‘’అంటారు .’’నీ సాహిత్యం నీ బొటన వేలు ముద్ర ‘’గా ఉండాలి అనే గొప్ప సందేశమిచ్చారు .’’పాణినీయ వ్యాకరణం ను ఇతర దేశాలు ప్రతిశాస్త్రానికి అనుసంధానం చేసి లబ్ది పొందారు ‘’అని పాణినికి లాల్ సలాం చేశారు .
సాధారణంగా ఈ నాటి కవులు పోతనలాంటి కవులను మెచ్చుకోవటం అరుదైన విషయం .కానీ యక్కలూరి వారు పోతనభాగవతాన్ని ‘’భక్తీ రసం .శాస్త్ర విజ్ఞానం ,సాంఘిక అవసరం ‘’గాగుర్తించటం ఆయన విశాల దృక్పధాన్ని తెలియజేస్తుంది ‘సాహిత్యం లో సర్వం సాధించిన పోతన ఆధ్యాత్మిక తత్వవేత్త .అయిన్ స్టీన్ కంటే ముందే వ్యాసుడు ,పోతన పరమాణువు అణువుల గురించి కాలజ్ఞానం తో చెప్పారు .పోతన భాగవతం లో యెంత ప్రపంచాన్ని చూపాడో అంతే లేదు .అన్ని శాస్త్రాల పరిచయం సృష్టి రహస్యాలు శోధించి చెప్పాడు .సాహిత్యమే అన్ని శాస్త్రాలకు మూలం అనిపోతన నిరూపించాడు ‘’అని గొప్ప కీర్తి కిరీటం పెట్టారు యక్కలూరి .దీనిపై స్పందిస్తూ మక్కెన గారు భాగవతం తెలుగు వారి స్వంతం ప్రతి తెలుగు వాడూ చదవాల్సిన ,చదివించాల్సిన గ్రంథం’’అని ఫినిషింగ్ టచ్ ఇచ్చారు .
యక్కలూరి సాహిత్యాను శీలనం చాలా వైవిధ్య భరితంగా ,రక్తిగా లోతులను తరచి అందించి యక్కలూరి శ్రీరాములు గారి రచనా వైశద్యాన్ని కళ్ళకు కట్టించిన డాక్టర్ మక్కెన శ్రీను గారు అభినందనీయులు .
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -16-9-20-ఉయ్యూరు