మనకు తెలియని మహాయోగులు—14
27-వెంకయ్య స్వామి -1887-1982
1887లో నెల్లూరు జిల్లా చేజెర్ల మండలం ఆత్మకూరుతాలూకా ,నాగురి వెల్లటూరు లో సోంపల్లి పిచ్చమ్మ ,పె౦చ లయ్యనాయుడు కమ్మ దంపతులకు వెంకయ్య స్వామి పుట్టాడు .బాల్యం నుంచే అడవుల్లో ఏకాంతంగా తిరిగేవాడు . షిర్డీ సాయిబాబా ఒక సాధువు రూపం లో వచ్చి అతడి నాలుకపై బీఆక్షరాలు రాసి వెళ్ళగా అవధూత వెంకయ్యస్వామి గా ఆరాధనలు అందుకొన్నాడు .గ్రామాలు తిరగటం ,ప్రతి చోటా ధుని వెలిగించటం చేసేవాడు. బొటన వ్రేలుపై సిరా తో అద్ది తెల్లకాగితం పై ముద్రవేసి ప్రసాదంగా అందించేవాడు .చెడు లక్షణాలున్నవారిని కులహీనులుగా, సద్గుణాలున్న వారిని బ్రాహ్మణులుగా భావించేవాడు .చేతి స్పర్శతో అన్నం ఔషధంగా మారి రోగాలు మాన్పించేది .అతి పేదగా జీవిస్తూ ఆశ్రితులకు సిరులు ఇచ్చేవాడు .తాను ఎక్కడికీ పోననని ,వారిమధ్యనే ఉంటానని ,పిలిస్తే పలుకుతాననీ చెప్పేవాడు .24-8-1982న 95ఏళ్ళ వయసులో అవధూత గొలగమూడి వెంకయ్య దేహం చాలించారు .అంతకు ముందురోజు ‘’సంపన్నత్వం ,సాధారణత్వం ,సద్గురు సేవ’’అని చాలాసార్లు స్వామి అనటం అందరూ విన్నారు .అదే ఉపదేశంగా భావించి అనుసరిస్తున్నారు .
28-నిత్యానంద స్వామి -1905-1959
రామానుజ మతావలంబులైన కమ్మ దంపతులు అప్పాస్వామి నాయుడు ,రుక్మిణీ అమ్మాళ్ లకు తిరునల్వేలి జిల్లా కోయిల్ పట్టి లో 2-11-1905 విశ్వావసు కార్తీక శుద్ధపంచమి ద్వితీయ సంతానం గా రంగనాథ స్వామి పుట్టి తర్వాత నిత్యానందస్వామిగా కీర్తి పొందాడు.ఊరిలోనే 8వ క్లాసు వరకు చదివి ,తల్లి పూజలో చేసే ప్రాణాయామం అభ్యాసం చేస్తూ ఉంటె ,ఒక రోజు కలలో ఒక సిద్ధ పురుషుడు కనిపించి తలపై చేయిపెట్టి ప్రాణాయామం నేర్పి అదృశ్యమయ్యాడు .దీక్షగా కొనసాగించాడు .
విమలానందుని పరీక్షలలో నెగ్గి శిష్యుడై , 15వ ఏట తల్లి అనుమతితో సన్యసి౦చాడు . రమణమహర్షి ఆశ్రమం లో కొంతకాలం గడిపి ,మద్దికెర లో విమలానందుని ఆశ్రమం లో స్వామికి శుశ్రూష చేస్తూ గీతారహస్యాలు యోగరహస్యాలు గ్రహించాడు .16ఏళ్ళు అక్కడే ఉండి అనేక పరీక్షలకు తట్టుకొని చిన్నస్వామిగా గుర్తింపుపొంది విరాగి అయ్యాడు .గురువు వదిలేసిన ధనుశ్శాల ఆశ్రమాన్ని ఏకా౦త వాసంగా చేసుకొని తపస్సు చేశాడు .తర్వాత వనముల పొద లో నిర్మించి ఇచ్చిన ఆశ్రమం చేరాడు .శిష్యులనేకులేర్పడ్డారు .1946లో బొల్లవరం లో విమలానందుని నుంచి సన్యాస దీక్ష పొంది నిత్యానంద దీక్షానామం పొందాడు .అద్భుతాలెన్నో చూపేవాడు .2-11-1959 వికారి కార్తిక శుద్ధ తదియ సోమవారం శవాసనం వేసి ,ప్రాణాన్ని సహస్రారం చేర్చి ,తనను త్వరగా సమాధి చేయమని శిష్యుడు శివయ్యకు చెప్పారు .వైద్యులనుపిలిపించి వైద్యం అందించారు కాని ఫలితం శూన్యం .30-1-1959 అమావాస్యనాడు శిష్యులు,సోదరులు ప్రముఖులు లింగనవాయి కి బండీలో తీసుకు వెళ్లి జీవ సమాధి చేశారు .చాలాచోట్ల ఆరాధనోత్సవాలు కార్తీక అమావాస్యనాడు ఘనం గా నిర్వహిస్తున్నారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -17-9-20-ఉయ్యూరు