మనకు తెలియని మహాయోగులు—14
27-లింగాల దిన్నె బ్రహ్మస్వామి -1820-1889
తమిళనాడు సేలం జిల్లా సదాపేట లో కౌ౦డిన్యస గోత్ర వెలనాటి వైదిక బ్రాహ్మణులునుదురుపాటి లక్ష్మీ నరసయ్య ,గున్నమ్మ దంపతులకు 1920లో నరసయ్య పుట్టాడు .బాల్యం లో సేలం కొండపై జరిగే లక్ష్మీ నరసింహస్వామి జయంతి ఉత్సవాలు సమారాధనలకు స్నేహితులతో కలిసివెల్లి ,ఒకగుహలో ఉన్నయోగి దయకు పాత్రుడై శ్రీ లక్ష్మీ నరసింహ మహా మంత్రాన్ని ఉపదేశంగా పొందాడు .ఆయన ఉపదేశించినట్లు కళ్ళు మూసి తెరిచేలోపు కాశీకి చేరి ,అక్కడే ఆ మంత్రాన్ని దీక్షగా జపించాడు .మహిమలెన్నో చూపి,25 ఏళ్ళకే బ్రహ్మస్వామిగా గుర్తింపు పొందాడు .
బ్రహ్మస్వామి కీర్తి దేశమంతటా మారుమోగింది .పుష్పగిరి పీఠాథిపతి శ్రీశంకర భారతీ స్వామి సగౌరవంగా బ్రహ్మస్వామిని ఆహ్వానించి ,తూగుటుయ్యాలపై ఊగించి ఇష్టాగోష్టి జరిపారు .తొడుగుపల్లె అగ్రహారం లో బ్రహ్మస్వామి ఒక బావి త్రవ్వించి ఆ బావి నీటిని కాశీ గంగ గా చెప్పారు .ఇప్పటికీ జనం గంగాజలంగా పవిత్రంగా భావిస్తారు .ఒక భక్తుడు స్వామిని పరమేశ్వరూపంగా భావించి నిర్మల భక్తితో పూజిస్తే లింగాకారం లో సాక్షాత్కరించారు .
బ్రహ్మ స్వామి 32లక్ష్మీ నరసింహ సాలగ్రామాలను బంగారు మూతతో సహా ధరించేవారు అవిచ్చిన్నంగా అన్నదానాలు జరిపేవారు .కవులు,పండితులు కృతులు రాసి స్వామికి అంకితమిచ్చారు .75ఏళ్ళు నిండగానే దేహం చాలిస్తున్నట్లు ప్రకటించి 13-10-89వికృతి భాద్రపద అమావాస్య సోమవారం బ్రహ్మ రంధ్ర ఛేదనం చేసుకొని బ్రహ్మానందస్వామి బ్రహ్మైక్యం చెందారు .లింగాల దిన్నె శివాలయం లో ఆయన సమాధి నిర్మించి ,దానిపై శివ లింగం ప్రతిష్టించి ఆలయ నిర్మాణం చేసి పూజిస్తున్నారు .ఆయన గతించి నూరేళ్ళు దాటినా నేటికీ ఆరాధనోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు .స్వామి వారి వెండి పాదుకలు ,,మేనా దర్భాసనం ,చిత్రాసనం రుద్రాక్షమాల ,చిత్రపటం దేవాలయం లో పూజల౦దు కొంటున్నాయి .
28-లద్ద గిరి రామ దాసు -1833-1893
కర్నూలు జిల్లా కోడుమూరు మండలం హ౦ద్రీనది ఒడ్డున ఉన్న లద్దగిరి కి 30ఏళ్ళ వయసులోఉత్తర భారతం నుంచి 1833లో రామదాసు చేరి లద్దగిరి రామ దాసుగా ప్రసిద్ధి చెందాడు .జి౦కచర్మం పై కూర్చుని తపస్సు చేస్తూ అవసరమైతే దాన్నే కప్పుకోనేవాడు .అందరినీ సమానంగా ఆదరించేవాడు .బాధితుల కస్టాలు తీర్చేవాడు .
ఒక వర్షాకాలం లో కుంభ వృష్టి కురిసి ,కొండ చరియలు విరిగి రామదాసు హంద్రీ నదిలో పడి కొట్టుకు పోయి నీటిలో మునగకుండా నీటిపై తేలుతూ సమాధి నిష్టలో కనిపించి ఆశ్చర్యం కలిగించాడు .లయ ,హఠ యోగాలు రామ దాససామికి స్వాదీనమయ్యాయి .నిరంతర రామనామ జపం చేసేవారు .జలస్తంభన విద్యలో ఆరితేరారు .వింత చర్యలతో సూచనలతో రాబోయే ప్రమాదాలు తెలియ జేసేవారు .ప్రజలలో శాంతి సుహృద్భావం కలిగించి జ్ఞానమార్గం లో నడిపించారు .
తన శరీర త్యాగాన్ని 5 నెలల 10రోజులు ముందుగానే తెలియజేసి .60ఏళ్ళు నిండాక ఆరుమాసాలతర్వాత తన సమాధిని తెరచి చూడమని ఆదేశించి 5-12-1893 విజయనామ సంవత్సర కార్తీక బహుళ ఏకాదశి గురువారం దేహం చాలించారు రామదాసస్వామి .స్వామి చెప్పిన చోటనే ఊరి బయట సమాధి చేశారు . ఆరు నెలల తర్వాత సమాధి తెరచి చూడగా ,స్వామి నిద్రలో ఉన్నట్లే కనిపించి ,చిరు నవ్వుతో కళ్ళు తెరచి మూడు సార్లు ఓంకారం పలికి కళ్ళు మూసుకొని శాశ్వత సమాధి చెందారు .స్వామి సమాధి నేటికీ భక్తులకు కల్పవృక్షంగా ఉంటూ మనోభీష్టాలను నెరవేరుస్తోంది .మూడేళ్ళ తర్వాత భక్తులకు కనిపించి ,తన సమాధిపై మందిరం నిర్మించమని ఆదేశించగా ,ఆలయ నిర్మాణం చేశారు .ప్రతియేటా కార్తీక బహుళ ఏకాదశి ద్వాదశి నాడు ఆరాధనోత్సవాలు ఘనం గా చేస్తారు .మాజీ ముఖ్యమంత్రి శ్రీ కోట్ల విజయ భాస్కర రెడ్డి స్వామివారికి వెండి రథం చేయించి 1953లో సమర్పించారు .అప్పటినుంచీ రథోత్సవంకూడా వైభవంగా చేస్తున్నారు .ఆప్రాంత ప్రజలు స్వామిపేరునే తమపిల్లలకు పెట్టుకొంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -18-9-20-ఉయ్యూరు