మనకు తెలియని మహాయోగులు—16
31-అనుభవ యోగి -నిత్యానందస్వామి -1893-1965
కడపజిల్లా పొద్దుటూరు తాలూకా పర్లపాడు లో బీరెడ్ది చిన్న చెన్నారెడ్డి అనే పేద కర్షక దంపతులకు ఐదవ సంతానంగా బాల వెంకట సుబ్బారెడ్డి 1893 డిసెంబర్ లో విజయ మార్గశిరమాసం లో పుట్టాడు .బాల్యం లోనే తలి దండ్రులు చనిపోతే పెద్ద జొన్నవరం వెళ్లి సంస్కృతాంధ్ర సాహిత్యాలు బాగా నేర్చాడు .16వయేట ఈ రెండుభాషల్లో కవిత్వమూ రాశాడు .పరాపర విద్యలు గణిత సూత్రాలు శుర్ది సూత్రాలు భూమి కొలతలు ,కరణీకం నేర్చాడు 1914లో రాయచోటిలో ఉపాధ్యాయ శిక్షణ పూర్తి చేసి పెద్ద జొన్నవరం లో ఉపాధ్యాయుడుగా చేరాడు .సత్యాన్వేషణపై దృష్టి మరలి ,ఆళ్లగడ్డ తాలూకా రాంపల్లిలో రంగారెడ్డి అనే సత్పురుషుని చేరి ,శిష్యుడై ,సన్యాస దీక్ష ,నిత్యానంద స్వామి అనే ఆశ్రమ నామం పొందాడు.అష్టాంగ యోగం మొదలైనవి గురువు వద్ద నేర్చాడు .1925నుండి తీవ్ర తపోదీక్షలో ఉంటూ ‘’విశ్వం భరీయ ‘’ శ్రీమన్నారాయణ శాస్త్ర శరణాగతి ,రామనామం ,జానకీ రామ శతకం ,నారాయణ స్తవం ,శతపత్రం పుత్ర హితబోధిని వంటి గ్రంథా లెన్నో రాశాడు .
ప్రొద్దుటూరులో ఒక భక్తుని ఇంట్లో 17-2-1965తెల్లవారు ఝామున 4గంటలకు 72వ ఏట చనిపోయాడు నిత్యానందస్వామి.ఆయనకోరిక పై శవాన్ని దహనం చేసి ,కుందూ నదిలో చితాభస్మం కలిపారు .మహిమలు వగైరా చూపేవాడు కాదు. అనుష్టాన వేదాంతం బోధిస్తూ అనుభవ యోగిగా గడిపాడు .
32-రేపల్లె చిన్నమ్మ -1887-1963
గుంటూరు జిల్లా రేపల్లె తాలూకా గొరిగ పూడిలో రేపల్లె లక్ష్మయ్య ,శాయమ్మ కాపు దంపతులకు చివరి సంతానం మాచమ్మ.14వ ఏట గరిగపాటి గోవిందయ్య తో పెళ్లి జరిగింది .అత్తవారి ఊరిలో బొబ్బర్లంక లక్ష్మీ దేవమ్మ యోగినితో పరిచయమైంది .ఏడుగురు సంతానాన్ని కని ,పరమేశ్వర సాక్షాత్కారం పొందిన మాచమ్మకు ఎనిమిదవ బిడ్డ పుట్టాక భర్తపై పితృభావం భర్తకు ఆమె పై మాతృ భావం ఏర్పడ్డాయి .మాచమ్మమహాత్మురాలని లోకం గ్రహించింది .
మంగళ సూత్రం వదిలేసి మాచమ్మ 12ఏళ్ళు మౌన దీక్ష పూని 7ఏళ్ళు మాట్లాడి మళ్ళీ 5ఏళ్ళు మౌనంగా ఉన్నది .నల్లూరుపాలెం బొబ్బర్లంక ,గొరిగపూడి గ్రామాల్లో ఎందరికో వ్యాధులు నయం చేస్తూ 7ఏళ్ళు అన్నం తినకు౦డా ఒక నిమ్మతొన, కొద్దిగా సోడా నీరు తాగుతూ గడిపింది .గాంధీజీ ఆమెను దర్శించి ప్రభావితుడై ఆమె బోధలు అందరూపాటించాలని ‘’య౦గ్ ఇండియా ‘’పత్రికలో రాశాడు .రేపల్లెలో స్థిరపడి రేపల్లె చిన్నమ్మగా ప్రసిద్ధి చెంది౦ది .రేపల్లె బావాజీ పేటలో భక్తుడు కట్టించిన కుటీరం లో ఉంటూ ,టైఫాయిడ్ జ్వరం వచ్చి దుర్ముఖి మార్గశిరశుద్ధ పంచమి 12-5-1956 సాయంత్రం 4గంటలకు ,76వ ఏట చిన్నమ్మ పరమపదించింది .మర్నాడు రాత్రి సమాధి చేశారు .భక్తులకు, ముముక్షువులకు అది గొప్ప యాత్రాస్థలమైంది. ఒక్క మెతుకు కూడా వృధా చేయవద్దనీ ,నీరు కూడా అనవసరంగా వాడవద్దనీ ,అన్ని వృత్తుల రాహిత్యమే జన్మరాహిత్యమనీ చిన్నమ్మ ఉద్బోధ.
33-స్థిత ప్రజ్ఞురాలు పిరాట్ల రామ లక్ష్మమ్మయోగిని -1882-1969
పల్నాటి సీమలో పల్లికుంత గ్రామానికి చెందినశ్రీరామభక్తులైన కంభంపాటి వెంకటప్పయ్య బుచ్చమ్మ బ్రాహ్మణ దంపతులకు 12-4-1882చిత్రభాను చైత్రబహుళనవమి బుధవారం కృష్ణాజిల్లా జుజ్జూరులో మేనమామ ఇంట్లో రామలక్ష్మమ్మ పుట్టింది.చిన్నప్పుడే పెద్దబాలశిక్ష రామాయణ భాగవతాలు చదివింది .ఆధ్యాత్మ రామ కీర్తనలు రామదాసుకీర్తనలు తండ్రి వద్ద నేర్చిపాడేది .8వ ఏట ముక్త్యాలకు చెందినపిరాట్ల మృత్యుంజయ శాస్త్రి తో పెళ్లి జరిగింది .నలుగురుకొడుకులు అయిదుగురు కుమార్తెలు పుట్టారు .ఇంత పెద్ద సంసారం ఈదుతూ కూడా ఆమె యోగిని అయింది
అనాధలకుసేవ ,సంసారం లో మునిగితేలే స్త్రీలకు మార్గదర్శనం చేయాలనిపించి ,జన్మ సాఫల్యంకలిగించాలని తలంపు కలిగి రాత్రిళ్ళు అత్తామామా నిద్రపోయాక ధ్యానం ,యోగ సాధనా చేసేది .ఒకరోజు ధ్యానం లో మనసు అంతర్ముఖమై సమాధి స్థితి పొందింది .తోటి స్త్రీలకూ భక్తివైరాగ్యాలు,యోగ రహస్యాలు బోధించేది . 1932 లో భర్తతో కలిసి హనుమకొండ వెళ్ళింది .అక్కడి వారు ఆమె ప్రతిభగుర్తించి ఆదంపతులకు ఒక ఇల్లు సమకూర్చి అక్కడే ఉండమని కోరారు .ఆ ఇంటికి ‘’సచ్చిదానంద ఆశ్రమం ‘’ అని పేరుపెట్టి సత్సంగం దేవతార్చన తపోధ్యానాలకు ఉపయోగించారు దంపతులు .
కొడుకు చదువుకోసం కాకినాడలో ఆమె ఉంటే, ఎందరో బాధితులకు మనశ్శాంతి కలిగించింది .7-1-1933 న భర్త మరణించాడు .1938లోకాకినాడ లో పెద్ద ఆశ్రమం స్థాపించి పేద విద్యార్ధులకు ఉచిత భోజనాలు ఏర్పాటు చేయించింది .అనాధలకు ఆవాసం సత్సంగానికి మందిరం కట్టించింది .హైదరాబాద్ లో భక్తులు ఆశ్రమ౦ నిర్మించారు .ఈమూడు ఆశ్రమాలలో జీవిత శేషాన్ని సేవలో గడిపింది .87వ ఏట 4-1-1969కీలక పుష్యబహుళ పాడ్యమి శనివారం నాడు శ్రీరామ చంద్రుని చరణార వి౦దాలను ను చేరింది నిరాడంబరయోగిని రామలక్ష్మమ్మ .మూడు ఆశ్రమాలలో ఆరాధనలు ఘనంగా జరుగుతాయి .ఆశ్రమ వార్షికోత్సవాలు శరన్నవ రాత్రులు సీతారామకల్యాణం వైభవంగా చేస్తారు. కాకినాడ ఆశ్రమం ప్రభుత్వ ఆధీనంలో ఉంది .
34-పాకల పాటి గురువులు -1911-1970
పగోజి ముండూరు అగ్రహారం లో దామరాజు గంగరాజు వెంకమ్మ ఆరువేల నియోగి దంపతులకు మూడవ సంతానంగా వెంకట్రామయ్య 1911లో పుట్టాడు.ఆరు నెలల వయసులో తల్లి , 9వ ఏట తండ్రీ చనిపోయారు.8వ తరగతి చదువుతూ డాంబికాకాచారులను సంస్కరించే ప్రయత్నం చేశాడు .అసాధారణ గ్రహణ ధాణలతో అందర్నీ మెప్పించాడు.గారపాటి పుల్లయ్య అనే కమ్మ భూస్వామి చేరదీసి గౌరవంగా ‘’బాబుగారూ ‘’అని సంబోధి౦చేవాడు .అదే సార్ధకమై అందరూ అలానే పిలిచేవారు .ఏలూరులోటికెట్ లేకుండా కలకత్తా రైలు ఎక్కితే నర్సీపట్నంలో టికెట్ కలెక్టర్ దించేశాడు.అక్కడదిగి బీళ్ళూ కొండలు కోనలు తిరుగుతూ ,బొబ్బిలి దగ్గర కలువరాయి చేరి ,అక్కడ బ్రహ్మర్షి కావ్యకంఠ గణపతి ముని ని సేవించి ఎన్నో విద్యలు నేర్చాడు .నిష్టగా గాయత్రీ జపం చేసి మంత్రం సిద్ధుడయ్యాడు .ఆయనది కంప్యూటర్ మేధస్సు .ఒకరోజు అకస్మాత్తుగా కలువరాయి వదిలేసి ,అరణ్యాలు క్షేత్రాలు నదీ తీరాలు యోగభూములు ,టిబెట్ బర్మా ,రంగూన్ సిలోన్ అడవుల్లో సుందర దృశ్యాలు చూస్తూ పులకిస్తూ గడిపాడు. ఇతిహాస ,పురాణ జ్యోతిష ,మంత్రం మూలికా వైద్య పాక శాస్త్రాలలో నిష్ణాతుడయ్యాడు .ఎందరెందరో మహా యోగులను దర్శించాడు .
1930-31లో మళ్ళీ నర్సీపట్నం చేరి లంబసింగి ఆశ్రమ౦ లో స్థిరపడ్డాడు .కసర్లపూడిలో ఒక భజన సమాజం ఏర్పాటు చేసి ,ఏజెన్సీ అడవులలో ఆటవికులకు లౌకిక పారమార్ధిక విషయాలు బోధిస్తూ చాలా ఆశ్రమాలు స్థాపించాడు .భక్తులు పాకలపాడులో ఒక ఆశ్రమం నిర్మించి ఇచ్చారు .ఇందులో నిరాహారం గా చాలానెలలు కఠోర తపస్సు చేశాడు .జయపురం మహారాజు బాబుగారిని ఆస్థాన కవీశ్వరుని చేశారు .ఆటవికులకు భక్తిప్రపత్తులు నేర్పి వారి ఆరాధ్యదైవంగా ఉన్న బాబుగారు 6-3-1970సౌమ్య మాఘ బహుళ చతుర్దశి శుక్రవారం మహాశివరాత్రి పర్వదినాన 59ఏళ్ళకే లింగోద్బవ సమయం లో సిద్ధాసనం లో కూర్చుని రామనామ జపం మూడు సార్లు చేసి రామునిలో ఐక్యమయ్యారు .
35-అవధూత -రామ చంద్ర మాలిక్ బాబా -1910-1990
కర్నూలు జిల్లా ద్రోణాచలం లో 1960లో చేరి ,నిత్యాన్నదానం తో అందరి ఆకలి తీర్చి ,విభూతితో ఆదివ్యాధులను నయం చేసి అందరినీ సమానంగా ఆదరించి ద్రోణాచల పరిసరాల్లో ఆరాధ్యుడయ్యాడు అవధూత రామ చంద్రమాలిక్ .తనపేరు రాం చందర్ అనీ తనుపుట్టింది బదరీ నాథ్ అనీ మాత్రమె చెప్పారు .ద్రోణాచలం చేరేటప్పటికి ఆయనవయసు 50కనుక 1910లో పుట్టినట్లు భావించారు .చాకిరేవు వెనక మర్రి చెట్టుకింద ధ్యానం చేస్తూ కనిపించారు .రేయింబవళ్ళు ధుని వెలుగుతూనే ఉంచేవారు .ఆబూడిదనే ప్రసాదంగా ఇచ్చేవారు .వింత లీలలు ప్రదర్శించేవారు .చిన్న చిట్కాలతో వ్యాధులు నయం చేసేవారు .డబ్బు ఖర్చు చేసి షిర్డీ వెళ్ళేవారిని మందలించేవారు .ద్రోణాచలం మాణిక్ బాబాగా ప్రసిద్ధిపొందారు .
20రోజులముందే శరీరత్యాగం విషయం చెప్పి ,27-2-1990 శుక్ల ఫాల్గుణ శుద్ధ విదియ మంగళవారం ఉదయం అవధూత రామ చంద్రమాలిక్ బాబా 80వ ఏట శరీరం చాలించారు .ఆయన తపస్సు చేసిన మర్రి చెట్టుకింద సమాధి చేసి ,20-4-1992న మందిరం నిర్మించి విగ్రహ ప్రతిష్ట చేసి నిత్యపూజలు చేస్తున్నారు .మాఘబహుళ విదియనుంచి అయిదురోజులు ఆరాధనోత్సవాలు జరుపుతారు వైభవంగా .సమాదినుంచే భక్తుల కోరికలు తీరుస్తారుబాబా అని నమ్ముతారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -20-9-20-ఉయ్యూరు