మనకు తెలియని మహాయోగులు—17
36-పశి వేదల ప్రజ్ఞానంద స్వామి -1903-1983
పగోజి పాలకొల్లు దగ్గర చింతపల్లిలో వారణాసి రామకృష్ణయ్య మహాలక్ష్మమ్మ దంపతుల రెండవ కుమారుడుగా 7-10-1903శోభకృత్ ఆశ్వయుజ బహుళ పాడ్యమి బుధవారం వెంకటప్పయ్య పుట్టాడు . రామభక్తిఅలవాటై చదువుతో పాటు స్తోత్రాలు కీర్తనలు నేర్చి పాడేవాడు .స్వాతంత్రోద్యమమం లో దేశభక్తి బోధించేవాడు .బ్రహ్మచర్యం అపక్వాహారం గాయత్రీ జపం ,ప్రణవోపాసన ,ప్రాణాయామం యోగాసనాలు కుండలినీ యోగ సాధన చేశాడు. భగవద్గీత ,పంచదశి సీతారామంజనేయం చదివి జీర్ణం చేసుకొన్నాడు .1922లో తణుకు జాతీయ పాఠశాలలో హిందీ పండిట్ చేరి,హరిజనబాలల హాస్టల్ నిర్వహణ కూడా చేసేవాడు .స్వరాజ్యం కోసం పని చేశాడు .
1924లో గొరగనమూడి వచ్చి స్వామి జ్ఞానానంద వద్ద సన్యాస దీక్ష ,ప్రజ్ఞానంద నామం పొందాడు .ఉత్తర దేశ యాత్ర చేసి ఉత్తరకాశి చేరాడు .1932నుంచి పదేళ్ళు చాలా చోట్ల తీవ్ర తపస్సు చేసి ,1934లో నండూరు చేరి మౌనధ్యానంలో ఉంటూనండూరి స్వామిగా ప్రసిద్ధి చెందారు ప్రజ్ఞానంద .1936లో నాసికా త్రయంబకం దర్శించి ,హరిద్వారం వెళ్లి అనేకచోట్ల తపస్సు చేసి లక్ష్మీ వనం సహస్రధార చక్రతీర్ధం దర్శించి ,తీర్ధ విధులు నిర్వహించి ,చంద్ర ,సూర్య విష్ణు కుండాలమీదుగా స్వర్గారోహణ పర్వతం చేరారు .అక్కడ తపస్సు ఫలించి దివ్యానుగ్రహం లభించింది .బదరి వెళ్లి ,1937నుంచి రెండేళ్ళు అనేక చోట్ల తత్వోపదేశం చేశారు .1939లో కొవ్వూరు దగ్గర పశివేదల లో చిదానంద ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేశారు .
1940నుండి 42వరకు తిరుమల వైకుంఠ తీర్ధ గుహలో ఏకాంతంగా తపస్సు చేసి ,మళ్ళీ పషి వేదుల ఆశ్రమం చేరి,గోదారి వరదబాధితులకు అన్నసంతర్పణ వైద్యం ,నివాస ఏర్పాట్లు చేసి పశివేదల ప్రజ్ఞానందస్వామిగా ప్రసిద్ధి కెక్కారు .బాల వితంతువులకు మళ్ళీ వివాహం చేసిన సంస్కర్త .పటిష్టమైన గ్రామ సంఘాలు ఏర్పాటు చేసి గ్రామ రక్షణకు తోడ్పడ్డారు .వేలాది శిష్యులేర్పడ్డారు .14-9-1983రుధిరోద్గారి భాద్రపద శుద్ధ అష్టమి బుధవారం ఉదయం 11.45గంటలకు ప్రజ్ఞానందస్వామి 80వ ఏట బ్రహ్మైక్యం చెందారు .చిదానందాశ్రమ గోశాలలో సమాధి చేశారు .ఆరాధన ,జయంతి ఉత్సవాలు ఘనంగా చేస్తున్నారు .
37-పద్మశ్రీ ప్రణవా నంద స్వామి – 1896-1989
తూగోజి కొత్తపేట మండలం మండపల్లి దగ్గర ఏనుగుల మహల్ లో భారద్వాజస గోత్రీక తెలగాణ్య వైదిక బ్రాహ్మణ కుటుంబం లో కనకదండి విశ్వపతి శాస్త్రి ,సీతమ్మ దంపతుల మొదటి కుమారుడుగా 14-1-1896దుర్ముఖి మాఘ శుద్ధ పాడ్యమి నాడు వెంకట సోమయాజులు పుట్టాడు .ఎంఏపాసై స్వాతంత్రోద్యమం లో చేరదలచి ,పంజాబ్ లోని లాహోర్ లోఉన్న లాలాలజపతిరాయ్ స్థాపించిన డిఎవి కాలేజీలో చేరి 1919లో డిగ్రీ పొంది,వాయవ్య రైల్వేలో అకౌంట్స్ ఆఫీసర్ గా పనిచేసి ,1920-26మధ్య పగోజి కాంగ్రెస్ హరిజన సంక్షేమం ఖద్దరు శాఖలో సేవలందించి ,సహాయ నిరాకరణ ఉద్యమం లో కారాగార శిక్ష అనుభవించాడు . 1927లో హిమాలయాల్లో తిరుగుతూ స్వామి జ్ఞానానంద వద్ద దీక్ష , ప్రణవానంద నామం పొందాడు .హిమాలయాల్లో కఠిన తపస్సు చేసి హఠయోగ రాజయోగ ఖేచర ముద్రలు సాధించి యోగం లో ఉన్నతస్థాయి పొందారు .భగవద్గీత కు ‘’జ్ఞాన దీపిక ‘’వ్యాఖ్యానం రాసి గురువు స్వామి జ్ఞానానందకు 29-5-1928న అంకితమిచ్చారు .అమరనాద్ గుహలో 15రోజులు ఏకాంతవాసం చేసి ,మానససరోవర కైలాసపర్వత ,పశ్చిమ టిబెట్ బౌద్దారామమాలలో తపస్సు చేశారు .హిమాలయాలలొ25 చాతుర్మాస్యదీక్ష నిర్వహించి ఘన ప్రతిష్ట పొందారు .కైలాస పర్వతాన్ని 36సార్లు ,మానస సరోవరాన్ని 33సార్లు ప్రదక్షిణ చేసి రికార్డ్ నెలకొల్పారు .భూ ఉపరితలానికీ భూగర్భసంబంధిత పరిశోధనలు చేశారు .దేశ సంస్కృతీ చరిత్ర రాజకీయాలకు అసమాననిష్కామ సేవ చేశారు .1929లో అమరనాథ్ గుహలో 15రోజులుండి,శివ పార్వతి గణేశ లింగాలు ఏర్పదేతీరును పరిశోధించి వ్యాసాలూ రాశారు .1937,42,46లలో అనేక సాహస యాత్రలు చేసి కైలాస శిఖరానికి అనేక కొత్తమార్గాలు కనిపెట్టిచారిత్రిక విశేషాలు రాశారు .1947లో భారత ప్రభుత్వం స్వామి ప్రణవాన౦దకు ‘’పద్మశ్రీ ‘’పురస్కారం ఆ౦దించి గౌరవించింది
ప్రనవోపాసకులైన ప్రనవానందులు శ్రీ చక్రం పై గోప్పసిద్ధాంత గ్రంధం రాశారు .ఏనుగుల మహల్ చేరి ఏనుగుల మహల్ ప్రణవానంద స్వామి గా ప్రసిద్దులై అక్కడ 28-3-1983న రెండుటన్నుల శ్రీ మహాత్రిపుర సుందరీ అమ్మవారి శ్రీ చక్ర మేరు యంత్రాన్ని ప్రతిష్టించారు .మానస సరోవరం దగ్గర ‘’తుగోల్హో’’లో ఒక యజ్ఞ వాటిక నిర్మించారు .అక్కడ అప్పటినుంచి ఇప్పటిదాకా శ్రీ కృష్ణ జన్మదినోత్సవాలు అద్భుతంగా జరుపుపుతూనే ఉన్నారు .గాయత్రీ మంత్రార్ధం తో సహా చాలా గ్రంథాలు రచించారు .1978లో ఎండ దెబ్బ బాగా తగిలి జ్ఞాపక శక్తి తగ్గింది .17-5-1989శుక్లనామ సంవత్సర వైశాఖ శుద్ధ ద్వాదశి బుధవారం ప్రణవానంద స్వామి 93ఏట హైదరాబాద్ లో విశ్వ చైతన్యం లో కలిసిపోయారు .తన అవశేషాలేవీ మిగల్చవద్దని స్వామి వారి ఆదేశం ప్రకారం విద్యుత్ స్మశాన వాటికలో దహనం చేశారు .మాఘ శుద్ధ పాడ్యమినాడు ఆరాధనోత్సవాలు జరుపుతారు .
38-రాయదుర్గం భంభం స్వామి -1886-1969
చిప్పగిరి భంభం స్వామిశిష్యుడే రాయదుర్గం భ౦భం స్వామి అనే షేక్ అబ్దుల్ సాహెబ్ 1886లోఆదోనిలో ఆలీసాహేబ్ రాజాజీ దంపతులకు అబ్దుల్ వహాబ్ పుట్టాడు .అతడి ఆగడాలకు తట్టుకోలేక 12వ ఏటనే చిప్పగిరి భంభం స్వామి దగ్గర చేర్చారు .ఆయన ఈయన చెవిలో ద్వాదశాక్షరి మంత్రం ఉపదేశించిలింగం , జందెం గాజులుధరి౦ప జేసి ‘’భం షేక్ అబ్దుల్ ‘’దీక్షానామమిచ్చి పంపించేశాడు .14వ ఏట ఆలూరుకు తిరిగివచ్చి వివాహమాడి గృహస్థాధర్మం నిర్వర్తిస్తూ రాజయోగం సాధించాడు. తర్వాత హఠయోగం నేర్చి,పోలీసు శాఖలో ఉద్యోగం లో చేరి ,గురుబోదను మతసామరస్యాన్నీ బోధించేవాడు .అనుచరులు శిష్యులు పెరిగారు .రోగగ్రస్తులకు గ్రహపీడితులకు మానసిక వైకల్యమున్నవారికి పూర్తిగా నయం చేసి మంచి పేరు పొందాడు .ఆయన్ను ‘’జిమేదారు స్వామి ‘’గా పూజించేవారు. లీలలు అద్భుతాలు చూపేవాడు .201కీర్తనలు ,11తత్వాలు రాశాడు .తన సమాధి స్థలాన్ని నెలరోజులు ముందే ఎంచుకొని 21-2-1969కీలక ఫాల్గుణ శుద్ధ దశమి శుక్రవారం ఉదయం 9-25గంటలకు గురుమంత్రం జపిస్తూ 83వ ఏట పరమాత్మలో లీనమయ్యారు .ఏటా ఆరాధనోత్సవాలు బాగా చేస్తారు .
39-నీల కంఠ సచ్చిదానంద ఘనే౦ద్రులు -1788-1907
కర్ణాటకలోచిక్కమగుళూరు తాలూకా దాసమాస గ్రామం లో వైదికాచార పరులైన భాగీరధీ ,గోపాల పండితులకు 1788కీలక నామ సంవత్సర ఆషాఢ బహుళషష్టి శనివారం నంజుండయ్య పుట్టాడు.ఐదవ ఏట అక్షరాభ్యాసం జరిగి 12ఏళ్ళకే అసమాన ప్రజ్ఞావంతుడైనమేదావి గా పేరు పొందాడు .
శ్రీ రామానంద ఘనేన్ద్రులనే యోగి నంజుండయ్య ప్రతిభ గుర్తించి ,ఇంటికి వచ్చి తల్లికి ఒక కాగితమిచ్చి అదృశ్యమయ్యాడు .ఆకాగితం చదవగానే వైరాగ్యభావన కలిగి ,రామానందుని అన్వేషణ కోసం బయల్దేరి చము౦డేశ్వరి కొండ గుహలో సమాధి నిష్టలో ఉన్న ఆయన్ను చేరాడు .గురు శుశ్రూష కొన్నేళ్ళు చేసి ,యోగాలన్నీ నేర్ఛి సచ్చిదానందుడు అయ్యాడు .గురుదీవనతో దాస మాస కు చేరి ,తలిదండ్రులను కొంతకాలం సేవించి వారి అనుమతితో శ్రీశైలం చేరి భ్రమరాంబా మల్లికార్జునులను దర్శించి పాతాళగంగ దగ్గర ఒకగుహలో 24ఏళ్ళు దీక్షగా తపస్సు చేసి పూర్ణ హఠయోగ సిద్ధిపొందారు .అష్టసిద్ధులు ,ఘటికా పాదుకా గమనాదులు ,పరకాయ ప్రవేశం మొదలైన విద్యలన్నీ కరతలామలకం చేసుకొన్నారు .
తర్వాత ఆసేతు హిమాచలపర్యంత పుణ్య క్షేత్ర సందర్శనం యోగ భూములు దర్శించి ,వివిధ యోగాలు నేరుస్తూ ,అడిగినవారికి నేర్పిస్తూ ,60ఏళ్ళు దివ్యయోగ జీవితం గడిపారు .1890లో బళ్ళారి జిల్లా విరూపాక్ష క్షేత్ర సమీపం లోని గౌరీపురం చింతామణి పీఠానికి భక్తులకోరికపై పట్టాభి షిక్తులయ్యారు .అప్పటినుంచి’’ శ్రీ సచ్చిదానంద నీలకంఠ సదానంద చింతామణి ‘’ సార్ధక నామధేయులయ్యారు .తమ శక్తులను తనకోసం ఎన్నడూ వాడుకొని యోగి పురుషులాయన .30-11-1907ప్లవంగ కార్తీక బహుళ దశమి శనివారం మధ్యాహ్నం 12గంటలకు 119వ ఏట నీలకంఠ సచ్చిదానంద ఘనే౦ ద్రులు ఆ నీలకంఠుని సన్నిధానం చేరారు .చైత్రమాసం లో శ్రీరామ కల్యాణోత్సవం ,ఆశ్వయుజంలో శరన్నవరాత్రి ఉత్సవాలు దశమినాడు స్వామి వారి ఆరాధనోత్సవం జరుగుతాయి .
40-తుంగతుర్తి బుచ్చయ్యయోగి -1760-1854
గుంటూరు జిల్లా నరసరావు పేట తాలూకా చేజెర్ల శ్రీ కపోతేశ్వరస్వామి దేవాలయం లోనే జీవితం గడిపి ,94వ ఏట 7-9-1954ఆనంద భాద్రపద బహుళ పాడ్యమి గురువారం తుంగతుర్తి బుచ్చయ్యయోగి బ్రహ్మైక్యం చెందారు .ఆలయ చరిత్రలో ఆయన గురించి కొంత సమాచారం లభిస్తుంది .కరణకమ్మ వైదిక బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన బుచ్చయ్య వ్యవసాయం చేస్తూ గడిపేవాడు.ఒకసారి మేఘాల మల్లికార్జున కొండ దగ్గరపొలం దున్నుతుంటే దాహమేసి నీటికోసం కొండగుహలోకి వెడితే అక్కడి రుషి ఆయన నాలుకపై బీజాక్షరాలు రాసి ‘’మధుమతి ‘’విద్య ఉపదేశించాడు .అప్పటినుంచి కవి జ్ఞాని మహిమాన్విత యోగి అయ్యాడు బుచ్చయ్య .
శ్రీగిరికి వెళ్లి ఆరేళ్ళు తపస్సు చేసి ,వారానికో పదిహేను రోజులకో సమాదినుంచి బయటికి వచ్చేవాడు .కాయ కసరులు తినేవాడు .ఆరేళ్ళ తర్వాత తనపుట్టిన ఊరు కురిచేడు చేరి దేవాలయం లో ఉండేవాడు .తర్వాత చేజెర్ల కపోతేశ్వరస్వామిని దర్శించి,శ్రీశైలం వెళ్లగా అమ్మవారు భ్రమరాంబ సాక్షాత్కరించింది .ఆసమయం లో అమ్మవారి బింబం కదిలిపోతే ,తన తపోమహిమతో యధాస్థానం లో పునః ప్రతిష్ట చేశాడు .ఇప్పుడు శ్రీశైలం లో పూజలందుకొంటున్న అమ్మవారి బింబం బుచ్చయ్యయోగి ప్రతిస్టించిందే ఈ అమ్మవారి ఆదేశం తోనే చేజర్లకపోతేశ్వరాలయం లోదేవీ ప్రతిష్ట చేశారు .ఆకాశగమన విద్యతో దేశంలోని క్షేత్రాలన్నీ సందర్శించాడు బుచ్చయ్యయోగి .సహజ పండితుడైన బుచ్చయ్య ఆధ్యాత్మిక గీతాలు రచించి తన్మయత్వం తో గానం చేసేవాడు .ఆయన రచించిన ‘’కపోతేశ్వర అష్టకాన్ని ‘’బ్రాహ్మణ సమరాధనలలో పాడుతూ ఉంటారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -21-9-20-ఉయ్యూరు