మనకు తెలియని మహాయోగులు—20
56-నాగండ్ల ప్రతాప కోటయ్య శాస్త్రి -1854-1896
బాపట్లతాలూకా నాగండ్లలో ప్రతాప జోగయ్యశాస్త్రి దంపతులకు కొటయ్యశాస్త్రి 1854లో పుట్టాడు .బాల్యం నుంచే సర్వభూతాలయడ దయ సానుభూతి ఉండేది .దాన ధర్మాలు చేసేవాడు .20ఏట మహాలక్ష్మమ్మతో పెళ్లి జరిగింది .ధనసంపాదనకోసం నిజాం రాష్ట్రం వెళ్ళాడు .ఒక వ్యాధి గ్రస్తుడు నారాయణ కు స్వస్తత కూర్చటం తో పేరు మారు మోగింది .అతడు కోటయ్య తలిదండ్రులకు అపార ధనంపంపి ,కోటయ్య కోరిక మేరకు కాశీ పంపాడు .కాశీలో బాలసరస్వతి స్వామి త్రిపురసుందరి మంత్రోపదేశం చేయగా దీక్షగా జపించి మంత్ర, యోగ సిద్ధులు పొందాడు .గురువు అనుమతితో స్వగ్రామ౦ వచ్చి అన్నదానం నిరంత భగవధ్యానం చేస్తూ ,జపతపాలాచరి౦చాడు..మళ్ళీ కాశీ వెళ్లి 42ఏట 1896లో కోటయ్యశాస్త్రి బ్రహ్మ రంధ్రం చేదించుకొని దేహత్యాగం చేశాడు .
57-కర్తవ్య కరి బసవ స్వామి -1762-1832
రాయ చూరు జిల్లా నారద క్షేత్రం లో యాదవ గిరి శైవ పీఠాధిపతి చన్న బసవస్వామి ,కౌండిన్య నగరం లో ఒక బాలుడిని చూసి ,అతడి తేజస్సు గుర్తించి యాదగిరి పీఠానికి తీసుకువెళ్ళి హస్త మస్తక సంయోగం చేయటం తో అతడికి జ్ఞానోదయమై సమస్త విద్యలలలో శివా నుభవ శాస్త్రం లో ,సాంఖ్యం లో నిష్ణాతుడయ్యాడు .అతడికి కరిబసవ స్వామి పేరుపెట్టి ,కొంతకాలం తర్వాత మఠం బాధ్యతలు అప్పగించి చన్నబసవస్వామి నారద క్షేత్రానికి వెళ్ళిపోయాడు .
గురవాజ్ఞ మేరకు దేశ సంచారం చేస్తూ ,తపోబలం తో రోగులకు ఆర్తులకు సౌఖ్యం కలిగిస్తూ జ్ఞానార్ధులకు జ్ఞాన బోధ చేస్తూ కరిబసవస్వామి శిష్య ప్రశిష్యులను పొందారు .ఆతని కర్తవ్య దీక్షకు మెచ్చినగురువు ‘’కర్తవ్య కరి బసవ స్వామి ‘’బిరుదు ప్రదానం చేశారు .ఆంద్ర ,కర్నాటక నిజాం రాష్ట్రాలలో 800మఠాలు స్థాపించి వాటి పోషణకు 20 వేల ఎకరాల భూమి సేకరించి పటిష్ట పరచారు .
అనంతపురం జిల్లా ఉరవకొండలో భక్తులకోరికపై ఒక మఠం ఏర్పాటు చేసి ,దానికి’’ గవి మఠం’’పేరు పెట్టి దానికి అనుబంధంగా మైసూరులో ‘’కరంబి మఠం’’స్థాపించారు స్వామి .పల్లకీ లో ఉరవ కొండ వెడుతూ మేనా తలుపులు మూసుకొని కరి బసవ స్వామి శివైక్యం చెందారు ఫాల్గుణ శుద్ధ పంచమి నుంచి 8రోజులు ఘనంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .చుట్టుప్రక్కల రాష్ట్రాలను౦చి కూడా భక్తులు అశేషంగా వస్తారు .స్వామి 1762లో పుట్టి 1832లో 70వ ఏట శివైక్యం చెందినట్లు భావిస్తారు .,
58-మహాయోగిని మాణిక్య నగరం వెంకమ్మ -1808-1862
చిన్నతనం లోనే పెళ్లిఅయి భర్త చనిపోగా వెంకమ్మ మనసు ఆధ్యాత్మిక భావం వైపుమరలి ధ్యానం ధారణా అలవాటయ్యాయి .ఒకసారి కర్ణాటకలోని మాణిక్ ప్రభు సామ్రాజ్యం లో దత్తావతారం అయిన మాణిక్ ప్రభు దర్శనం కోసం ఆమె తలిదండ్రులతో బండీలో వెడుతుంటే ,దారిలో రాళ్ళవాన కురిసి వాగులూ వంకలు పొంగి ఎద్దులబండి మునిగి పోయే పరిస్థితి వస్తే వెంకమ్మ భక్తిగా ఆర్తిగా మాణిక్ ప్రభువును మూడు సార్లు గొంతెత్తి పిలువగా ,ఒక 16ఏళ్ళ బాలుడి రూపం లో వచ్చి కాపాడటం తో ఆమె మాణిక్ ప్రభుకు మహా భక్తురాలై,ఆయన చరణాలే నమ్ముకున్నది .ఆమెను అనేక రకాలుగా పరీక్షించి ప్రభు,ఆత్మ సాక్షాత్కారం కలిగించి యమ నియమ ఆసన ప్రాణాయామ నిధి ధ్యాన మానస సమాధులు పొందేట్లు అనుగ్రహించారు .జప ధ్యానలలో ఉన్నతోన్నత్సి స్థితి సాధించి,మాణిక్యనగరంవెంకమ్మగా పేరుపొందింది .భక్తులకు సాధకులకు హితోప దేశం చేసేది .ఆహ౦కారం నశిస్తే సద్గురుకటాక్షం లభిస్తుందనీ ,సాధకుడు సద్గురువుతో ఏకరూపం పొందాలని ఉపదేశించేది. 23-8-1862దుందుభి శ్రావణ బహుళ త్రయోదశి శనివారం 54వ ఏట మహా యోగిని వెంకమ్మ దేహత్యాగం చేశారు.మాణిక్య ప్రభువు వెంకమ్మను దేవతలాగా పూజించి ,స్వయంగా సమాధిలో కూర్చోబెట్టి సమాధి చేశారు .సమాధి ను౦చి కూడా చాలా అద్భుతాలు చేసేది .1982లో భక్తుల కరసేవతో ఆమె మందిర నిర్మాణం జరిగింది .ఆశ్వయుజ పంచమి నుంచి ,నవమి వరకు పంచ రాత్ర ఉత్సవాలు చేస్తారు .వెంకమ్మ మందిరం లో దేవీ నవరాత్రులు వైభవంగా నిర్వహిస్తారు .దత్తాత్రేయ శక్తి వెంకమ్మ రూపం లో ఇక్కడ ఉన్నదని అందరి విశ్వాసం
59-నారాయణ రెడ్డి అవధూత -1834-1915
కడప జిల్లా కమలాపురంతాలూకా గంగిరెడ్డిపల్లె లో నర్రెడ్డి సింగిరెడ్డి రామాంబ దంపతులకుశ్రీ నారాయణ అంశతో నారాయణ రెడ్డి 1834లో పుట్టాడు .పూర్వ జన్మలోబెస్తవాడుగా పుట్టి బ్రహ్మం గారిని సేవించినట్లు కథనం .చిన్నతనం నుంచే ఏకాంతం లో ఉండటం ఇష్టం .పసువులను మేపుతూ ఏకాంతం లో ధ్యానం చేసుకోనేవాడు .ఒకసారి కుంభ వృష్టికురిసినా అందరు గోపబాలురూ తడిసిపోయినా యితడు తడవక ఆశ్చర్యం కలిగించాడు .లీలలూ అద్భుతాలు చూపేవాడు .ఉన్న ఊరు నచ్చక 16వ ఏట ఊరు వదిలేసి 60ఏళ్ళ వరకు తిరిగి రాలేదు .
20వయసులో కర్నూలు వెళ్లి అడవుల్లో తిరుగుతూ తీవ్రంగా తపస్సు చేశాడు.అవధూత అయి అమనస్క యోగం లో ఆరి తేరాడు .అష్ట సిద్ధులు వశమైనా ఎప్పుడూ ప్రదర్శి౦చ లేదు .రాత్రీ పగలూ తిరుగుతూనే ఉండేవాడు .వస్త్రాలు అడిగి తీసుకొని పేదలకు పంచేవాడు .అడిగినవారికి మంచీ చెడ్డా చెప్పేవాడు .కంది మల్లయ్యపల్లి వెళ్లి బ్రహ్మం గారి సమాధిని సేవించాడు .చివరికి ఓబుళరాజుపల్లె చేరి ,ఓబుళరాజు నారాయణ రెడ్డి అవధూత అనిపించుకొన్నాడు.గ్రామాధికారి వీరారెడ్డికి తాను దేహం చాలిస్తున్నట్లు చెప్పి 12-3-1915ఆనంద ఫాల్గుణ బహుళద్వాదశి శుక్రవారం 81వ ఏట శ్వాస బంధించి ప్రాణం వదిలారు .వీరారెడ్డి అంత్యక్రియలు ఘనం గా నిర్వహించి ,గ్రామానికి పడమరవైపు తన స్వంతపోలం లో సమాధి మందిరం నిర్మించాడు .సమాధి నుంచి ఘంటారావం,వీణా,తాళ మృదంగ ధ్వనులు వినిపిస్తాయి .ఫాల్గుణ బహుళ ద్వాదశినాడు ఆరాధన జరుగుతుంది .
60-రెడ్డి సుబ్రహ్మణ్య మహర్షి -1860-1949
రెడ్డి సుబ్రహ్మణ్య మహర్షి రౌద్రనామ సంవత్సర జ్యేష్ట శుద్ధ చవితి గురువారం పుష్యమీ నక్షత్రం లో 1860లోగోదావరి జిల్లా ఈతకోటలో బ్రహ్మన్న శేషమ్మ దంపతులకు సపుట్టాడు .చిన్నప్పటినుంచి భూతదయ ,పాపభీతి భక్తీ అలవాటయ్యాయి .తులసి కోటవద్ద శ్రీ రామ ధ్యానం చేస్తుంటే శ్రీరాముడు ,రాత్రి ఆకాశంలో చూస్తుంటే సీతారాములు దర్శనమిచ్చేవారు .12వ ఏట ఉపనయనం జరిగి ,పోణంగిలోని రామభక్తుడు సోమయాజుల పాపయ్యశాస్త్రి రామతారక మంత్రం దీక్ష ఇచ్చి ,మానసిక పూజా విధానం నేర్పాడు .ఆయనవద్ద ఆరేళ్ళు సాధన చేశాడు .జప సమయంలో సీతారాములు కనిపిస్తే ఆశువుగా పద్యాలు చెప్పి స్తుతి౦చే వాడు .బలవంతంగా పెళ్లి చేస్తే ,సంసారం వదిలేసి తీర్ధయాత్రలు చేస్తూ వివిధ మతాలకు చెందిన 72మంది యోగులను దర్శించి ,రాజమండ్రి లో శ్రీ విశ్వ నాథ అవధూత సన్నిధికి చేరాడు.
ఆయనవద్ద హఠ యోగాదులు రాజయోగం సాధన చతుస్టయ౦ అభ్యసించగా గురువు ‘’స్వేచ్చానం ‘’అనే దీక్షానామమిచ్చి గృహస్థ ధర్మం పాటించమని ఆదేశించాడు .ఒకసారి మహారాష్ట్ర బ్రహ్మ చారి బాబ్ కోకిల్ 60ఏట సన్య సించి ,పామర్రులో ఉంటున్న సుబ్రహ్మణ్య యోగి ఇంటికి వచ్చి భిక్ష చేసి అనేక యోగరహస్యాలు బోధించగా అష్ట సిద్ధులు వశమై అనేక అద్భుతాలు చూపేవాడు .అద్వైత రహస్యం మానసబోధ గాయత్రీ నాటకం ,అచల బ్రహ్మానంద ప్రబోధం ,పరవాసుదేవ శతకం ,దండకాలు మొదలైన 17రచనలు చేశారు .22-3-1949 సర్వధారి ఫాల్గుణ బహుళ అష్టమి మంగళవారం 89వ ఏట మహేంద్రవాడ లో పీఠస్తులై,మూలాధారం బిగించి హంసను షట్చక్రాలు దాటించి భ్రూమధ్యలో చేర్చి నాసాగ్రం పై దృష్టి నిల్పి షట్చక్ర సీతారామ తారక బ్రహ్మం లో ఐక్యమయ్యారు సుబ్రహ్మణ్య యోగి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-9-20-ఉయ్యూరు .