మనకు తెలియని మహా యోగులు -21
61-పూదోట లింగావదూత -17వ శతాబ్దం
కర్నూలు జిల్లా పాలేరు నదీ తీరాన అవుకు గ్రామం లో సోమమ్మ సోమిరెడ్డి దంపతులకు లింగమూర్తి పుట్టాడు .ఐదవ ఏటనే చెట్టు కింద శివనామం జపిస్తూ గడిపేవాడు .తలిదండ్రులు చనిపోగా ఏగంటి శివరామ యోగి మంత్రోపదేశం చేసి,శివ లింగగుహకు తీసుకు వెళ్లి,సమస్త విద్యలు నేర్పాడు .దృశ్య భేదన యోగం ,చైతన్య జడ సంధాన చిన్మయయోగం వంటి అనేక యోగాలు నేర్పి తీర్చి దిద్దాడు .
శివరామ గురుడు ‘’పూదోట గురు పీఠం’’స్థాపించి ,లింగమూర్తిని మొదటి పీఠాధిపతి ని చేసి ,’’పూదోట లింగావదూత ‘’ నామకరణం చేసి ,విశ్వమతాన్ని స్థాపించి వేద వేదాంగాలు అందరికీ అందుబాటులోకి తీసుకు రమ్మని ఆదేశించాడు .రవ్వలకొండ గుహలో గోచీ మాత్రమే ధరించి మహిమలు చూపుతూ ఆశువుగా వేదా౦తతత్వాలు రాసి పాడుతూ పండిత పామరులను ఆకర్షించాడు .ఈ గీతాలను ఆశ్రమ వారసుడు 13దళాలుగా ,715పాటలను తాటాకులపై రాస్తే ,10వ పీఠాధిపతి’’పూదోట తత్వ గీతామృతం ‘’పేరిట శ్రీ ఆనందన స్వామి 1962లో ప్రచురించారు .తాను తనువు చాలించే విషయం ము౦దేచెప్పిచ జ్యేష్ట పూర్ణిమనాడు దాసావదూతను పీఠాదిపతిని ,చేసి ,జ్యేష్ట బహుళ ఏకాదశి నాడు సంగమేశ్వర తీరాన చిన్న వనం చేరి భక్తుల జయజయ ధ్వానాల మధ్య లింగమూర్తి అవధూత స్వామి కృష్ణా నదిలో మోకాలి లోతు నీటిలో ,చివరగా ఒక తత్వాన్ని ఆశువుగా పాడి ,కృష్ణాజినంపై పద్మాసనం లో కూర్చుని ,ప్రవాహం మధ్యలోకి వెళ్ళగా ,ఆయన దేహం చుట్టూ మంటలు లేచి అవి ప్రకాశంగా మారి సూర్యమండలం వైపు సాగి పోయాయి .ఏటా జ్యేష్ట బహుళ ద్వాదశినాడు ఆరాధనోత్సవాలు పరమవైభవంగా చేస్తారు .శివ కేశవ భేదం లేదని చాటిన శివా౦శ సంభూతుడుస్వామి .‘
62-త్రికాలజ్ఞాని ధరణి సీతారామ యోగీంద్ర స్వామి -1714-1796
కాశీ నుంచి ఆంధ్రదేశానికి వచ్చి స్థిరపడిన తర్కశాస్త్ర మాధవభట్టు వంశం లోని వశిష్ట గోత్రీకుడు ధరణిసుబ్బయ్య ,తిమ్మాంబ దంపతులకు కడపజిల్లా పొద్దుటూరు తాలూకా కోర్రపారు లో 4-1-1714 జయ పుష్యబహుళచవితి సోమవారం సీతారామ స్వామి మూడవ సంతానం గా పుట్టాడు .నాలుగేళ్ళకే తండ్రి చనిపోగా ,ఆవులను కాస్తూ వాగు గడ్డ పై ఉన్న గుడి దగ్గర ఆడుకొంటు౦టే ,ఒక యోగి వచ్చి అతనిలోని వర్చస్సు గుర్తించి నాలుకపై బీజాక్షరాలు రాసి దత్తాత్రేయ మంత్రోప దేశం చేశాడు .అప్పటినుంచీ ఆమంత్రాన్ని జపిస్తూ ,మహిమలు చూపుతూ తల్లి అనుమతితో బ్రహ్మ చర్యం పాటించి సన్యాసం తీసుకొన్నాడు .పుణ్యక్షేత్ర దర్శనం చేసి శ్రీశైలం ,అహోబిలం లలో తపస్సు చేసి భగవత్ సాక్షాత్కారం పొంది ,అష్ట సిద్ధులు వశం చేసుకొని దేశ సంచారం చేస్తూ ,ధర్మ ప్రబోధం చేస్తూ అరిష్టాలు వ్యాధులు తొలగిస్తూ ,కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ దగ్గర లింగాలదిన్నె చేరి ,ఆశ్రమమ శివాలయం తటాకం ఏర్పరచుకొని తపస్సు చేస్తూ లింగాలదిన్నె సీతారామ యోగీ౦ద్రస్వామిగా ప్రసిద్ధి చెందారు .
చాలా చోట్ల నందీశ్వర ఆలయాలు దత్తాత్రేయ మఠాలుతోటలు ఆలయాలు నిర్మిస్తూ జీర్ణ దేవాలయాలను పునరుద్ధరించారు .శిష్యులను గ్రంధ రచనకు ప్రోత్సహించి సాహిత్య సేవచేశారు 17-12-1796 నల మార్గశిర బహుళ తదియ శనివారం 82వ ఏట సమాధిలో ప్రవేశించి ,700 ఏళ్ళు సజీవ చైతన్యంలో ఉంటాయని శిష్యులకు అభయమిచ్చి సమాధి గతులయ్యారు మైసూరు దత్తగురువు శ్రీ గణపతి సచ్చిదానందస్వామి తమకు సీతారామ యతీంద్రుల సాక్షాత్కారం కలిగిందని చెప్పారట .మార్గశిర పౌర్ణమి నుంచి మూడు రోజులు వైభవంగా ఆరాధనోత్సవాలు చేస్తారు .
63-సొరకాయల స్వామి -1700-1902
తిరుపతి దగ్గర నిరుపేద గొల్ల కుటుంబం లో 1700లో రామ స్వామి పుట్టి , కొండ కోనలలో మేకలు గోర్రేలుకాస్తుండగా ఒకయోగి మంత్రోపదేశం చేయగా ఇహలోక బంధాలన్నీ తెంచుకొని ,నాలు గిళ్ల భిక్షం ఎత్తి ఆకలి తీర్చుకొంటూ ఉండేవాడు .బుజాన గుడ్డలమూట, నెత్తిన ముతక గుడ్డ తలపాగా, మోకాళ్ళవరకు చిరుగుల పంచె ,ఒక చేతిలో పేలికలతో అల్లిన తాడు కు కట్టిన రెండుకుక్కలు ,బుజం పై కావడి ,దానికి ఒకవైపు మలమూత్రాలకుండ ,మరో వైపు తినటానికీ తాగటానికీ పనికి వచ్చే సొరకాయ బుర్రలు ఆయన అవతారం .అందుకే సొరకాయల స్వామి అనే ఏరు వచ్చింది .
రోగగ్రస్తులకు తాను తినే ఆకులు భోజనం నీళ్ళు ఇచ్చి నయం చేసేవాడు .వచ్చే ప్రమాదాలను ముందే హెచ్చరించేవాడు .పశుపక్షాదులనన్నిటినీ ప్రేమిస్తూ పిచ్చివాడుగా కనిపించేవాడు .ఆయన అగ్ని హోత్రం వెలిగిస్తే దత్తాత్రేయ స్వామిగా కనిపించేవాడు .ఎక్కడికైనా ఎంతదూరమైనా కాలినడకే .ప్రకృతి శక్తులైన పంచభూతాలు ఆయన అధీనం లో ఉండేవి .1902ఆగస్ట్ లో మద్రాస్ చేరి ,నారాయణవనం ఆరణి నది ఒడ్డున ,ఒక గులకరాయి విసిరి అది పడిన చోటే తనసమాది అని ము౦దేచేప్పి,తనవయసు యెంత అని ఎవరో అడిగితె 500ఏళ్ళు అని తెలిపి , 2-8-1902 శుభకృత్ శ్రావణ శుద్ధ పంచమి శనివారం మధ్యాహ్నం 12గంటలకు 202 ఏళ్ళ వయసులో శరీరం వదిలారు .ఆయన కోరిన చోటనే సమాధి చేశారు.మొదటి ఆరాధన’’కైంకర్య సమాజం ‘’అధ్యక్షుడు రత్న సభాపతి పిళ్లే అనే భక్తుడి ఆధ్వర్యంలో జరిగాయి.ఈ సమాజం వసతి గృహాలు కళ్యాణ మండపాలు భోజన శాలలు కట్టిస్తూ ఘన౦గాఆరాధనొత్సవాలు చేస్తున్నారు
64-ఆర్తత్రాణ పారాయణ మహాకవిజ్ఞాని భక్త శిరోమణి -శ్రీధర వేంకటేశ అయ్యావళ్-1635-1720
సదాశివ బ్రహ్మేంద్ర స్వామి సహాధ్యాయి ,గురువు ,పండితుడు ,కవి శ్రీధర వేంకటేశ అయ్యావళ్,వైదిక బ్రాహ్మణ కుటుంబం లో ,కౌశిక గోత్రీకుడు శ్రీధర లింగార్యుని కుమారుడుగా 1635లోపుట్టాడు. గొప్ప శివ భక్తుడు. గృహస్థ రాజయోగి .తంజావూరు మహారాజు షహాజీ కావేరీ తీరం లో తిరువశ నల్లూరు గ్రామాన్ని శాహరాజవు అనే పేరుగా మార్చి,1693లో 46గురు వేదపండితులకు దానమిచ్చాడు .అందులో మన శ్రీధర వెంకటేశకూడాఉన్నాడు .
మధ్యార్జునం అనే పేరున్న తిరువిడ మరుదూరు లోని మహాలింగస్వామి శ్రీధరుని ఇలవేలుపు .ఆ భజన సంప్రదాయానికి ఆద్యుడుకూడా .సంస్కృత గ్రంథాలు చాలారాశాడు .శాలేంద్ర విలాసం అనే ఎనిమిది సర్గల మహాకావ్యాన్ని, భక్తీ వేదా౦త పరంగా ఆఖ్యా షష్ఠి,దయాశతకం , ఆర్తిహర స్తోత్రం,కుళీరాష్టకం , అచ్యుత శతకం ,శివ భక్త లక్షణం ,శివభక్తి కల్ప లతికా మాతృ భూతాష్టకం, తారావళీ స్తుతి,స్తుతిపద్దతి ,డోలా నవరత్నమాల ,దోష పరిహరాష్టకం, భగవన్నామ భూషణం మొదలైనవి ముఖ్యమైనవి . షాజీ మహారాజు కోరికపై నల్లాధ్వరి, వేంకటేశ శాస్త్రి అనే ఇద్దరు పండితులతో కలిసి ‘’పదమణి మంజరి ‘’అనే నిఘంటు నిర్మాణం చేశాడు .శ్రీధరునికి ఉన్న శివకేశవ భేదాతీతమైన భక్తీ ,శమదమాదుల షట్క సంపత్తి,సర్వభూత దయాగుణం చూసి సమకాలీనులు ‘’అయ్యావాళ్’’అని గౌరవంగా సంబోధించేవారు .
ఆర్తత్రాణ పరాయణుడు ,నిరంతదైవ సాక్షాత్కారం పొందినవాడు శ్రీధరపండితుడు .తిరువిశనల్లూరులో అనావృష్టి సంభవిస్తే ‘’కుళీరాష్టకం ‘’స్తోత్రం రాసి గానం చేసి వానలు కరిపించాడు .మృత్యువుతో పోరాడుతున్న శిశువుని తారావళి స్తోత్రం తో కాపాడాడు .భగవన్నామ సంకీర్తనకు ఉచ్చనీచాలు ఉండరాదని బోధించేవాడు .ఒకసారి కావేరీ నది దాటి తిరువిడ మరుదూర్ లోని తన ఇష్ట దైవమైన దేవాలయానికి వెళ్లి గర్భాలయం ప్రవేశించి అదృశ్యమై పరమ శివునిలో ఐక్యంచెందారు శ్రీధరులు .,మానవీయ విలువలను పాటించిన మహా సంస్కర్త శ్రీధరులు 85ఏళ్ళు సార్ధక జీవితం గడిపారు .
65-సనారీ విశ్వనాథ అవధూత -1856-1914
కాశీ విశ్వనాథుని అవతారంగా భావింపబడే సనారీ విశ్వనాథ అవధూత 3-11-1856 నల కార్తీక శుద్ధపంచమి సోమవారం శ్రీకాకుళం జిల్లా నాగావళీ నదీ తీరాన పాలకొండకు చెందిన సింహాద్రి వీరాచారి ,గౌరీ దేవి భక్త దంపతులకు విశ్వనాథాచార్యులుగా జన్మించాడు .ఏక సంథాగ్రాహి .,అయిదేళ్ళకే వేదం ,శాస్త్రాలు కావ్యాలు ఇతిహాసాలలో నిష్ణాతుడయ్యాడు .రసవాద విద్యలో ఉద్దండుడు .తలిదండ్రులు చనిపోతే పెదతండ్రికొడుకు నీలయ్యాచార్యుని దగ్గర పెరిగి ,ఏటి ఒడ్డున శివాలయం లో రోజూ ఏదో ఒకటి రాస్తూ ఉండేవాడు .అతని వైరాగ్యభావన గ్రహించి అన్నగారు పంచబాణ విద్యలు నేర్పాడు .రాగి బంగారం పనుల్లో శిల్పాలు చెక్కటం లో కుస్తాగిరి మాలామా పనుల్లో గొప్ప నేర్పు సాధించాడు .పెళ్లి ప్రయత్నాలు చేస్తుంటే తనకోసం పుట్టిన అమ్మాయి పాలకొండలో ఉందని చెప్పి వెళ్ళగా ,అక్కడ అన్నపూర్ణ అనే కన్య అతడే తన భర్త అని నిశ్చయించింది .1873వైశాఖ శుద్ధ ఏకాదశి శుక్రవారం ఇద్దరికీ వివాహం చేశారు .
భార్యకు అజపాగాయత్రి బోధించి తాను రాజయోగిగా గృహస్థాశ్రమ ధర్మం పాటించాడు .శిష్యులకు ఎన్నో విషయాలు శాస్త్రాలు బోధించాడు .సనాతన ధర్మ ప్రచారం కోసం దేశ సంచారం ప్రారంభి౦చి ,రాజమండ్రి కోటి లింగాల రేవు దగ్గర పర్ణశాల నిర్మించుకొని చాలాకాలం తపస్సు చేశాడు .’’సనారీ విశ్వేశ్వర సంవాదం ‘’అనే గ్రంథంరాశాడు .12ఏళ్ళ తర్వాత ముద్రణకోసం మద్రాస్ బయల్దేరుతూ ,శ్రీశైలం చేరి 23-10-1914ఆనంద కార్తీకశుద్ధ పంచమి శుక్రవారం 58వ ఏట బదరికావన గుహలోఅంతతర్ధాన మయ్యారు .ఇప్పటికీ సజీవంగా ఉంటూ శుక్రవారం దర్శనమిస్తూ భక్తులకోరిక తీరుస్తున్నారు .పాలకొండ దుర్గామందిరం లో ఇప్పటికీ అలా జరుగుతూనే ఉందని భక్తుల నమ్మకం ,విశ్వాసం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -25-9-20-ఉయ్యూరు