ధర్మవరం
ఒకప్పుడు పసపు లేటి నాయుడు అనే రాజు ,మైసూరు నుండి ఉత్తరంగా పరివారం తో వస్తూ పెన్నా మాగాణి దగ్గర ఒకగుట్ట మీద బస చేశాడు .కొన్ని రోజులు అక్కడే ఉండాల్సి వచ్చింది .దానిదగ్గరే చిత్రావతి నదిలో ఒక ఉదయం స్నానం చేస్తుంటే ,ప్రవాహం బాగా ఎక్కువై ,వెంటనే గట్టు మీదకు వచ్చి నెమ్మదిగా నడుస్తుంటే ప్రవాహం పెరుగుతూనే ఉంది .అతనికి ఈ నీటికి అడ్డుకట్ట వేసి నిలవ చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచన స్పురించింది .అప్పుడే ఒక ఆజానుబాహువైన సన్యాసిఅటు వస్తుంటే ఆయనకీ చెప్పగా ఆలోచన చాలామంచిదని వెంటనే పని ప్రారంభించమని ,మళ్ళీ వస్తానని ఆశీర్వదించి వెళ్ళిపోయాడు .
నది వరద తగ్గగా ,గ్రామ కరణాన్ని పిలిపించి ,తన ఉద్దేశ్యం చెప్పి కావలసిన డబ్బు తాను సమకూరుస్తానని చెప్పి పని మొదలుపెట్టమని ఆజ్ఞ జారీచేశాడు .మర్నాడే తొండ మాలలు ,హరికారులు (అరకాల వాళ్ళు) నేమర్సు జాతులలో త్రావాకం పనిలో నైపుణ్యం ఉన్న వారిని నియమించి పని మొదలు పెట్టించాడుకరణం .పని క్రమంగా పెరిగి పోతుండటం తో ,రాజు దగ్గర ఉన్న డబ్బు అంతా ఖర్చైపోయింది .అప్పటికి సుమారు మూదు వంతుల పని మాత్రమె జరిగింది.నాయడు విచారం లో మునిగిపోయాడు. అకస్మాత్తుగా ఆయన్ను ఆశీర్వదించిన సన్యాసి ప్రత్యక్షమై ,తన ఉత్తమ క్రియా శక్తితో పూర్తి చేశాడు .ఆయనే’’ శ్రీ క్రియా శక్తి ఒడయరు’’.కనుక ఈ చెరువు నిర్మాణానికి ముఖ్య ప్రోద్బలం ఒడయరు గారే .
నీటి వసతి ఏర్పాటైంది కనుక గ్రామ నిర్మాణం జరగాలని భావించారు అంతకు ముందు ఇక్కడ ‘’చిలుముత్తూరు ‘’అనే పల్లె ఉండేది .దీనికి 1133-34లో తుమ్మల మల్లరుసు కరణం గా ఉండేవాడు .ఇతని తాత మాదయ .తండ్రి నాగరుసు .క్రియా శక్తి ఒడయారు ఒకరోజు వచ్చి అక్కడ గ్రామం నిర్మించాలను కొంటున్నానని మల్లరుసు తో చెప్పాడు .సంతోషించి 1153-54 శ్రీ ముఖ నామ సంవత్సర వైశాఖ శుద్ధ పౌర్ణమి సోమవారం ముహూర్త౦ నిర్ణయించారు .పని ప్రారంభం కాగా నే జనం తండోపతండాలుగా వచ్చి సాయం చేశారు .క్రియా శక్తి ఒడయరు కీర్తి దశదిశలా వ్యాపించింది .కూలీలు సాయంత్రం దాక పని చేసి ,ఒక్కొక్కడు తన ఎదుట చిన్న మట్టి కుప్ప చేయటం ,స్వామి వచ్చి వెండి బెత్తం తో వాటిని తాకుతూ ‘’మాడిదవనిగే మాడి దస్టుమహరాయా ‘’అంటూ వెళ్ళిపోయేవాడు. కూలీలు తర్వాత వచ్చికుప్పలో వెదికితే ఆ రోజు కూలి ఖచ్చితంగా అందులో దొరికేదట .గ్రామ నిర్మాణం చేసి దానికి తనతల్లిపేరు మీదుగా ‘’ధర్మవరం ‘’అని పేరు పెట్టాడు .ఇక్కడ పని అంతాపూర్తయ్యాక ఒడయారు స్వామి ఆనే గొంది కి వెళ్లి అక్కడి నుంచి చెన్న కేశవ స్వామి విగ్రహం తెచ్చి ధర్మవరం లో ప్రతిష్టించి ,ఆలయం కట్టించి పంచ విగ్రహ ప్రతిష్టలు కూడా చేశాడు .700ఏళ్ళక్రితం చిత్రావతీ నదీ తీరం లో ఒడయా-రు స్వామి నిర్మించిన ధర్మవర గ్రామం క్రమంగా వృద్ధి చెందింది .
గ్రామ నిర్మాణం పూలన్నీ విజయవంతంగా అయ్యాక కరణం మల్లరుసు క్రియా శక్తిఒడయరు స్వామిని తన ఇంటికి సాదరంగా ఆహ్వానించి ,ఆతిధ్యమిచ్చి సన్మానించి గౌరవించాడు .తాను కడుపేదననీ కుటుంబ పోషణకు కరణం వృత్తిచాలటం లేదనీ స్వామికి విన్నవించగా ,ఆయన తనతో వస్తే విజయనగరరాజు ప్రౌఢ దేవరాయలకు మనవి చేయవచ్చునని సలహా ఇవ్వగా ,వెళ్లి రాజును కలిసి,స్వామి విషయం తన విషయం చెప్పుకొన్నాడు మల్లరుసు .చాలా సంతోషించి స్వామి ఆజ్ఞగా భావించి ,తుమ్మల సీమలోని ధర్మవరానికి చెందిన 32గ్రామాలు ,పండపేటి స్థలం లో కనగానిపల్లెలకు చెందినా 20గ్రామాలు ,పినాకినీ గడ్డకు పప్పూరికి చెందినా 37గ్రామాలు యాడికి వణితానికి 34గ్రామాలు మొత్తం 123గ్రామాలను శ్రీముఖ ఆశ్వయుజ పౌర్ణమి నాడు తామ్రాశాసనంగా రాయించి అందజేశాడు .ఈ విజయనగరం హంపీ విజయనగరం కాదనీ 1156-57లో తుంగభద్రా తీరం లో విజయధ్వజరాజు నిర్మించి పాలించిన చిన్న విజయనగర పట్టణం అనీ విజయధ్వజుడే ప్రౌఢ దేవరాయలు కావచ్చునని అంటారు.
మల్లరుసు మరొకసారి విజయనగరం వెళ్లి ప్రౌఢరాయలకు కార్యనిర్వాహకుడైన సోమదేవ రాయని ఆశ్రయం పొందాడు .
విజయనగర రాజుల తర్వాత హండే దొరలూ ,తర్వాత రాయదుర్గం దొరలూ తర్వాత అనేకమంది పాలించాక శ్రీరంగాపట్టణ పాలకుడు హైదరాలీకి,తర్వాతకొడుకు టిప్పు సుల్తాన్ కు ధర్మవరం చేరింది ,తర్వాత ఇంగ్లీష్ వారు పాలించారు. కాలక్రంగా బాగా అభివృద్ధి చెంది విద్యా వైద్య సదుపాయాలూ రోడ్లు దేఆలయాలు మసీదులు మొదలైన ప్రార్ధనామందిరాలు అన్నీ విస్తరించాయ.కళలకుకాణాచి అయింది .క్రియా శక్తి ఒడయరు సమాజం ఏర్పడి సా౦ఘికాది సేవలు నిర్వహిస్తోంది .అనేక క్షామాలను ,ఉపద్రవాలను ఆటు పోట్లను తట్టుకొని ఎదుర్కొని నిలిచింది .
ధర్మవరానికి చెందిన ప్రముఖులలో సంస్కృత నిధి కోడేకొండ్ల పెద్దయాచార్యులు ,ఆయుర్వేద సంస్కృత విద్వాంసులు వైద్యం కృష్ణమాచార్యులు ,ఆంధ్రనాటక పితామహ ధర్మవరం రామకృష్ణమాచార్యులు ,సంస్కృతపండితుడు దుద్దాల నారాయణ శాస్త్రి,బంధకావ్యాలను కంఠస్థం చేసిన ఉచితంగా బోధించిన అంధులు పంచకావ్యం రామాచార్యులు ,హఠయోగిగోపాలం చిన్నప్ప ,పోలీస్ ఇన్స్పెక్టర్ మద్దిపి హనుమంతనాయుడు గార్లు ధర్మవరాని కి యెనలేని కీర్తి నార్జి౦చి పెట్టారు .
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -27-9-20-ఉయ్యూరు