బాలు తో మాట -మంతీ

బాలు తో మాట -మంతీ

 

అవి  ఘంటసాల మాస్టారి పాటల స్వరాభి షేకం ఆంద్ర దేశం లో ఊరూరా జరుగుతున్నా సువ ర్ణ మయ కాలం .అంటే సుమారు పాతిక సంవత్సరాలకు ముందు .ఆయన శిష్యుడు శ్రీ గంగాధర శాస్త్రి మొదలైన వారు వీర విజ్రు౦భ ణ గా  బాద్య భుజాలపై వేసుకొని ,ఏకాహాలు మూడు రోజుల ముచ్చట్లుగా నిర్వహిస్తున్నారు .మాస్టారి శ్రీమతి సావిత్రిగారు కుమారుడు శ్రీ రత్నకుమార్ ,ప్రముఖగాయకుడు శ్రీ జి .ఆనంద్ మొదలు ఎందరెందరో వర్ధమాన గాయనీ గాయకులు ఘంట సాల వారి స్వరలహరిని తమ గాత్రాలలో  నింపుకొని ఉర్రూత లూగిస్తున్న పరమ పవిత్రకాలం .అందులో పాల్గొనటమే ,మాస్టారి అర్చనగా ,పరమ అదృష్టంగా వీక్షకులూ భావి౦చేకాలం  .అలా ఒక సారి మాస్టారి పాటల పల్లకీ ఊరేగింపు విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రం లో రెండు రోజులో ,మూడు రోజులో జరిగింది .ఒక రోజు శ్రీ శ్రీపతి ప౦డితారాధ్యుల బాల  సుబ్రహ్మణ్యం అనే బాలు గారు కూడా పాల్గొంటునట్లు పేపర్ లో చదివి ,ఆ రోజు సాయంకాల౦  ఆపండుగలోపాల్గొని తరిద్దామని నేను ఉయ్యూరు నుండి సాయంకాలం వెళ్లాను. బహుశా అది సమాపన ఉత్సవం అని గుర్తు .ఆరోజు శ్రీ గంగాధర్ ,శ్రీ ఆనంద్ మొదలైనసుప్రసిద్ధులతో పాటు శ్రీ బాలు కూడా ఇతర వర్ధమాన గాయకీ గాయకులతో పాటు ఘంటసాల వారి పాటలు పాడి ఘన నివాళు లర్పించి ,తన్మయం కలిగించారు .నేనూ మహదానంద పడ్డాను .నా మనసులో ఎన్నాళ్ళ నుండో ఒక విషయం సుళ్ళు తిరుగుతూ ,ఎవరికి చెప్పాలో అసలు చెప్పాలో చెప్పకూడదో అనే సందేశం పీడిస్తోంది .ఏమైనా అందరూ ఇక్కడ ఉన్నారు కనుక  నా దగ్గర ఉన్న నోట్ బుక్ లో ఒక కాగితం చింపి ,అందులో నా మనో భావం స్పష్టంగా రాసి ,బాలుకు అందివ్వమని ఒక కార్య కర్తకు ఇచ్చి కూర్చున్నాను .కార్యక్రమం దాదాపు పూర్తయ్యే సమయం అది .బాలు నేను రాసిన కాగితం చదివి ‘’ఉయ్యూరు నుంచి ఒక మేష్టారు దుర్గా ప్రసాద్ గారు వచ్చి ,కార్యక్రమ లో పాల్గొని ఆనందించి ,ఒకకాగితం లో ఒక ముఖ్య విషయం రాసి నాకు పంపారు .అది వారి నోటి మీదుగా అందరికీ తెలియ జేయాల్సింది గా  ఆయన్ను వేదికపైకి ఆహ్వానిస్తున్నాను ‘’అన్నాడు .సరే ధైర్యం తెచ్చుకొని వేదికపైకి చేరి బాలు కు అభివాదం చేసి నేను రాసి పంపిన కాగితం లోని విషయాన్ని ఇలా చెప్పాను ‘’అందరికీ నమస్కారం . ఘంటసాల  మాస్టారి  పై ఉన్న అత్యంత గౌరవం తో ఎంతో ఉత్సాహంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నవారికీ, పాల్గొన్న వారికి హృదయ పూర్వక అభినందనలు .హిందీ వివిధ భారతి లో ప్రతి రోజు ఉదయం కార్యక్రమం ప్రారంభమయ్యే ముందు హిందీ సినిమా పాటలకు అమరత్వం కలిగించిన సైగల్ గారి పాట రికార్డ్ వేసి స్మృత్యంజలి ఘటించి కార్యక్రమ౦ మొదలు పెడుతున్నారు .అలాగే మన తెలుగు సినిమా పాటలకు అజరామరమైన కీర్తి ప్రతిష్టలు తన అమరగానం తో చేకూర్చిన ఘంటసాల వారి పాటలకు సైగల్ కు చేసినట్లు మనం అలా న్యాయం చేయటం లేదు .ఇది చాలా బాధాకరమైన విషయం .ఎవరికీ ఈ ఆలోచన రాకపోవటం దురదృష్టం .కనుక ఈ వేదిక మీదుగా ప్రభుత్వానికి ,రేడియో వారికీ ,అందరికీ కూడా  చెప్పేదేమిటి అంటే ‘’తెలుగు వివిధ భారతి ప్రోగ్రాం ప్రతి రోజూ  ఘంట సాల వారి పాటతో ప్రారంభించి ఆ అమరగాయకునికి సైగల్ కు లాగా గౌరవ ప్రతి పత్తి కలిగించాలి .బాలుగారు ఈవిషయం లో చొరవ తీసుకొని సంబంధితమైన వారికి చెప్పి ఈ పని జరిగేట్లు చేయాలి ‘’అన్నాను .హాలంతా చప్పట్ల మోత మోగింది .బాలు ‘’నిజమే మనం ఎవరం ఇంత వరకు దీనిపై దృష్టి పెట్ట కపోవటం మనలోపమే .మీడియా వారు రేడియో వారు ఈ విషయం గమనించి తెలుగు వివిధభారతి  ఘంట సాల వారి పాటతో నే ప్రారంభించాలి. నేనూ నావంతు కృషి చేసి, అలా జరిగేట్లు చూస్తాను ‘’అనగా మళ్ళీ హోరున చప్పట్లు ప్రతిధ్వనించాయి .   అ తర్వాత అది వేదిక వాగ్దాన౦ గానే ఉన్నది కాని కార్యరూపం దాల్చినట్లు కనిపించలేదు .

  రెండవ సారి బాలుగారిని 1997 అక్టోబర్ 7 న హైదరాబాద్ మారుతి  స్టూడియో ‘’పాడుతా తీయగా ‘’ప్రోగ్రాం నిర్వహిస్తున్నప్పుడు చూశాం .అప్పుడు మా అబ్బాయి శర్మ అక్కినేని కి చెందిన ‘’రాజ్య లక్ష్మి టెక్స్ టైల్స్ ‘’లో కంప్యూటర్ విభాగం లో పని చేస్తున్నాడు .వాళ్లకు  కాంప్లి మెంటరీ పాస్ లు ఇస్తారట .మేము. వస్తామంటే తీసుకొని ఉంచుతాను అంటే  సరే నని వెళ్లి  వాళ్ళింట్లో ఉండి ఆ పాస్ లతో నేనూ మా శ్రీమతి వెళ్లి ప్రేక్షకస్థానం లో కూర్చుని చూసి ఆనందించి ,అయిపోగానే ,ఆయన దగ్గరకు మేమిద్దరం వెళ్లి పరిచయం చేసుకోగా ఎంతో సంతోషించి నమస్కరించగా మేము ‘’మేము ఉయ్యూరు నుండి వచ్చాం .మీ బంధువు శ్రీమతి సీతం రాజు మల్లికగారు మాకు కుటుంబ స్నేహితురాలు .ఆమె తండ్రి బెజవాడలో ప్రసిద్ధ హోమియో డాక్టర్ తాడినాడ భోగ  మల్లికార్జునరావు గారు  వాస్తు జ్యోతిష్యులు ‘’అనగానే ‘’చాలా సంతోషం మాస్టారు .మల్లిక మాకు చాలా దగ్గర బంధువు .వారి నాన్నగారు మాకు దైవ సమానులు .తరచుగా వారితో మాట్లాడుతూ ఉంటాం ‘మల్లిక కూడా ఫోన్ చేస్తూ ఉంటుంది .అడిగానని చెప్పండి ‘’అన్నారు .ఈ విధంగా రెండు సార్లు మాత్రమే  చూసి మాట్లాడే అవకాశం కలిగింది .

మూడో సారి శ్రీ వేటూరి వారు తమ స్వగ్రామం పెదకళ్ళేపల్లిలో రెండు రోజులు అన్ని ఖర్చులు తానె భరించి ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేశారు1999ఫిబ్రవరి లో  ఆయన స్వంత ఇంట్లో .దానికి మేమిద్దరం వెళ్లాం .కళాస్రష్ట శ్రీ విశ్వనాథ్ ,శ్రీదేవదాస్ కనకాల దంపతులు ,సప్తపది హీరోయిన్ సబిత మొదలైన వారంతా  వచ్చారు .అందరికీ  కాఫీ టిఫిన్లు మధ్యాహ్న భోజనాలువేటూరి గారి పెంకు టింట్లో నే .వంటబ్రాహ్మణులతో  రుచిగా కమ్మని వంటలు చేయించారు నవకాయ పిండివంటలతో .కడుపు నిండా అందరం తిన్నాంఅందరం . ప్రతివారినీ వేటూరి పలకరించారు .ప్రక్కనే ఉన్న ఆడిటోరియం లో ఉదయం మీటింగ్ .బాలు కూడా రావాలి కాని ఉదయం రాలేదు .సాయంత్రం వస్తారన్నారు .ఆయన  ఆ రోజో మర్నాడో  ప్రక్కనే ఉన్న ఘంటసాలవారు పుట్టిన టేకుపల్లి లో విగ్రహా విష్కరణ  చేయాలి .సాయంత్రం దాకా చూసి మేము ఉయ్యూరు వచ్చేశాం .కనుక మూడోసారి బాలును మిస్ అయ్యాం.

   మాట అయింది ఇక మంతి-బాలు 40వేలపాటలు 16భాషలలో పాడటం ,డబ్బింగ్ చెప్పటం  నటించటం సంగీత దర్శకత్వం ,సినిమాలు నిర్మించట మొదలైన వాటిలో ఆరితేరినవాడు .బహుశా ఈ రికార్డ్ అధిగమించే అవకాశం ఇంక ఎవరికీ దక్కక పోవచ్చు .అది ఆయనదీ, మన  అదృష్టం కూడా .అంటే ‘’ఆల్ రౌండర్ ‘’ఆయన భారీ శరీరం లాగానే .శంకరాభరణం సినిమా పాటలు ఆయనకు చిరకీర్తి  నార్జించి పెట్టాయి .ఇవేం పాటలు అని బాలమురళి లాంటి వాళ్ళు అన్నా ,ఎవరూ పట్టించుకోకుండా బ్రహ్మ రథం పట్టారు జనం .సంగీతలో నిష్ణాతుడై పాడటం వేరు అందులో ప్రవేశం లేకుండా కేవలం శ్రుత పాండిత్యం తో పాడి భేష్ అనిపించుకోవటం పూర్వ జన్మ సంస్కారం ,తండ్రిగారి వారసత్వం ,దీవన . ఆపాటలను నేను కేసెట్లలో  వినని రోజు ఉండేదికాదు .అంత తన్మయత కలిగించేవి .తర్వాత బాపుగారి ‘’త్యాగయ్య ‘’మరో గొప్ప మలుపు .ఇప్పుడు కొద్దో గోప్పోసాధన చేసి పాడాడు .త్యాగయ్యగారి జీవితం లో ప్రతిఘట్టానికీ సంబంధిన కృతి పెట్టి పాడించి బాపు త్యాగయ్యగారిని చిరస్మరణీయులను చేశాడు .అవి ఫీలింగ్ లకు సంబంధిన పాటలు .అవి అనుభవిస్తూ పాడాలి అలా పాడి తనకు సాటి లేరని పించాడు బాలు .ఈ కేసెట్లు కూడా నేను రోజూ వినేవాడిని .కారణం అందులో లైఫ్ ఉంది .జీవితగమనం  ఒడి దుడుకులు రామునిపైఅచంచల భక్తీ విశ్వాసాలు ఉన్నాయి .సోమయాజులు పాత్రలో జీవిస్తే బాలు పాటలలో జీవించాడు .కాని సినిమా కొందరికి డాక్యు మెంటరి లా అనిపించి ఆదరించలేదు .నాకు మాత్రం బాపు బాలు యాజుల త్రివేణీ సంగమం అని పిస్తుంది .ఇక్కడ కూడా నామార్కులు బాలు కు సెంట్ పర్సెంట్ .

  ఆతర్వాత సిరివెన్నెల సినిమాలో బాలు పాడిన మొదటి పాట అదోలోకం లోకి తీసుకు వెడుతుంది .సీతారామ శాస్త్రి గీతం ,మామ మహదేవన్ సంగీతం బాలు గాత్రం  ఇక్కడకూడా  త్రివేణిగా ప్రవహించింది .ఎన్నెన్నో  వెరైటీ సినిమాలలో చాలా వెరైటీగా పాడుతూ సోపానాలు అధిరోహించాడు బాలు .సాంఘిక సినిమాలలో మొదట్లో కౌ బాయ్ గా పాడిన పాటలునటుడు  కృష్ణ కు బాగా నప్పాయి .అప్పుడే మొనాటనివచ్చి కొంత ఈస డింపు కూడా కలిగింది .’’మంచి మనుషులు ‘’సినిమాలో శోభన్ బాబు కు పాడిన పాటలలో స్థాయి పెరిగింది .ఘంటసాలగారికి ఒక ఆల్టర్నేట్ గాత్రం వచ్చింది అని నాకు అనిపించింది .దాన్ని చక్కగా కాపాడుకొని దున్నేశాడు. రామారావు నాగేశ్వరరావు వంటిదిగ్గజాలకు కూడా గొంతు సవరించుకొని దీటుగా భేఫర్వాగా పాడి సెభాష్ బాలు అనిపించాడు .బహుశా కృష్ణకు రావి సీతారాం గొంతు కూడా సింహాసనం మొదలైన సినిమాల్లో గొప్పగా నే ఉండేది .కనుక తనగొంతు తానే సవరించుకొని  మంచి మనుషులు సినిమాతో పునర్జీవి అయ్యాడు బాలు. అక్కడి నుంచి ఆయనను పట్టుకోవటం ఎవరి తరం కాలేదు .వామనుడు విరాట్ రూపం పొందినట్లు ఎదిగి పోయాడు .కోదండరామి రెడ్డి ,రాఘ వేంద్రరావు ,ఇళయరాజా,చిత్ర ,చక్రవర్తి  కాంబినేషన్ లో వచ్చిన చిత్రాలు హిట్లే హిట్లే చప్పట్లే చప్పట్లు .

  అన్నమయ్య లో చివరి పాట విని స్పందించని హృదయం లేదు. అక్కడ సుమన్ కు శ్రీవారి మాటలు  పాటలు ,సంగీతం మళ్ళీస్వర త్రివేణి అయింది మరోలోకం లోకి చేర్చింది కళ్ళు చెమరించని వారు ఉండనే ఉండరు  .ఈ అదృష్టం ఎందరికి దక్కింది ?బాలు అదృష్టవంతుడు .రామదాసులో అంతారామమయం పాటలో రామదాసుగారు చూసిన రామమయ లోకాన్ని ప్రత్యక్షంగా చూస్తూ వీనుల విందుగా వింటూ ఆనందపు హరి విల్లు అనుభవించాం .ఇంతటి అనుభూతి అందించాడు బాలు ,మామ ,రాఘవేంద్రుడు .విశ్వనాథ్ సినిమాలలో ఒకరకమైన పునర్జీవనం కలిగితే ,కమ్మర్షియల్ హిట్ సినిమాలలో మరో విశ్వరూపం ప్రదర్శించి మరో రకమైన ఆనందం అందించాడు .అంతటా స్వయం కృషి ,స్వయం శిక్షణ కనిపిస్తుంది .

  ఆదిత్య ,శుభసంకల్పం లాంటి సినిమాలు తీసినా చేతి చమురు భాగోతమే అయి౦దంటారు .డబ్బింగ్ లో కింగ్ మాత్రమె కాదు,  ఎంపరర్ అయ్యాడు .జంధ్యాల మల్లె పందిరి సినిమా నుంచి పక్కింటి అమ్మాయి ,మిథునం దాకా వెరైటీ సినిమాలలో నటించాడు .కానీ పాత్రలు కాక అన్నిట్లో బాలు మాత్రమే కనిపిస్తాడు .అందుకని అతని నటన నాకు నచ్చదు.మిథునం లో ‘’అరవ పయ్యా’’లాగా ఉన్నాడని సినిమా చూసిన మొదట్లోనే రాశాను .భరణి అయితే బాగా ఉండేది. ఎల్బీ శ్రీరాం ఐతే పెర్ఫెక్ట్ అని నా నమ్మకం .సరే గతం గతః .అరవ దేశం లో ఉంటున్నందున వాళ్లకు సహజమైన అతి నటనలోపొంగి ప్రవహించి వెగటు పుట్టిస్తుంది .అంటే ఓవర్ యాక్షన్ స్పష్టంగా కనిపిస్తుంది .

  ఎవరూ చేయని చేయలేని పని బాలు చేశాడు ‘’పాడుతా తీయగా ‘’తో .తెలుగు పాటకు విశ్వ కీర్తి సాధించిపెట్టాడు .మొదట్లో జెమిని వారు చేబట్టినా, తర్వాత రామోజీ సహకారం తో సెంచరీలు దాటించాడు .యువ గాయకులకు ఊపిరులు అందించాడు .పాటకు ఇంటర్నేషనల్ మార్కెట్ క్రియేట్ చేశాడు శాశ్వతం చేశాడు .పాటతోపాటు పద్యానికీ స్వరాభి షేకం చేశాడు జరిపించుకొన్నాడు .బహుశా ఏ భాషలోనూ ఇంతటి ఘన చరిత్ర ఎవరూ సృస్టించ లేదను  కొంటాను .అది చాలు. ఆయన కీర్తి ఎవరేస్ట్ శిఖరారోహణ చేసింది .

  తనకు నచ్చిన గాయకుడు ‘’రఫీ ‘’అనటం తెలుగు వారి హృదయాలకు కారం రాసి నట్లయింది .ఘంటసాల సంగీత దర్శకుడు రఫీ కి అది లేదు .మాస్టారిని కాదని రఫీ అంటే ఒకసారికాదు చాలా సార్లు అంటే భరించలేని వేదన కలిగింది .రఫీ యే స్వయంగా తనక౦టే ఘంటసాల గారే చాలా బాగా పాడారని పలు సందర్భాలలో చెప్పాడు .ఇది మర్చిపోతే ఎలా .రఫీ పాడిన ‘’చల్ఉజ్ జారే పంచీ ‘’కంటే ఘంటసాల పాడిన ‘’పయనించే ఓ చిలుకా ‘’పాట వెయ్యి రెట్లు అనుభూతిని  కురిపించిందని  రఫీ చెప్పాడు .

  ఘంటసాల బాలు ఇంటికి స్వయంగా వెళ్లి తనసినిమాలో ఒక పాటపాడమని అడిగినట్లు మొన్నజ్యోతిలో బాలు చెప్పినట్లు చదివా .మరి ఇలా వర్ధమానగాయకులుఎ౦దరికి బాలు అవకాశం ఇచ్చాడో నాకు తెలీదు .ఏకవీర లో మాస్టారితో కలిసి పాడిన పాట ఎవరైనా మెచ్చారా ?మణి శర్మ హేమ చంద్ర ,కారుణ్య వంటి వారికి అద్భుత మైన అవకాశాలు కల్పించాడు .పాడుతా తీయగా లో గాయకులను అందర్నీ సమదృష్టి తో చూసినట్లు గా కొన్ని ఎపిసోడ్ లు అనిపించవు .మనస్పూర్తిగా గాయక ,గాయని ప్రతిభను మెచ్చటం కూడా తక్కువే అని పిస్తుంది నాకు .అతని మాట హృదయం లోంచి రాదేమో అనే అభిప్రాయం కల్గిస్తుంది .అక్కడ కూడా నటన చోటు చేసుకొంటుంది .మనో చాలా భావ యుక్తంగా పాడుతాడు .కానీ అతడికి సరైన న్యాయం జరగలేదు ,జరగట్లేదు.ఎంత లేదన్నా డామినేషన్ ప్రభావం ఇండస్ట్రీని శాసిస్తూనే ఉంది ఎప్పుడూ .

  బాలు తన శరీరం లావు అయిందని బరువు తగ్గించుకొన్నట్లు  తెలుస్తోంది .అలా చేయించుకొన్న ఆర్తీ అగర్వాల్ ,దాసరి లు ఆరోగ్య సమస్యలు ఎదుర్కొని  చేయించుకొన్న అతి తక్కువ కాలం లోనే చనిపోయినట్లు మనకు తెలుసు .ఈ అనుభవం చూసి, తెలిసికూడా బాలు ఎందుకు ఆ సాహసం చేశాడో అంతు చిక్క లేదు నాకు . ఎవరూ అతనికి నచ్చ చెప్పలేక పోయారా ?చెప్పినా విని పించుకోలేదా .తోసుకు వస్తే ఎవరూ ఏమీ చేయలేరను కోండి .పైగా కరోనా సోకటం పరిస్థితి తీవ్రతరం చేసింది .హాస్పిటల్ లో చేరిన రోజు ఫోటో పేపర్ లో చూశాక నాకు బాలులో ‘’జీవ కళ ‘’తప్పినట్లు కనిపించింది .మా ఇంట్లో ఆమాట అనుకొన్నాం కూడా అందరం . . ఏమైనా సంగీతం లో లెజెండ్ అనిపించుకొన్న గాన గ౦ధర్వ బాలు  ఇక లేరు అన్నమాట  జీర్ణించు కోలేని, కలత కలిగించే విషాద విషయం .ఆయన ఆత్మకు శాంతి కలగాలని పరమేశ్వరుని ప్రార్ధిస్తూ   ఆ కుటుంబానికి సానుభూతి తెలియ జేస్తున్నాను .

మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -28-9-20-ఉయ్యూరు

 

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in సమయం - సందర్భం and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.