నో నో నో నో—
సీన్ -1
- అర్చకసంఘం –అయ్యా !కరోనా వల్ల ఆలయానికి ఎవరూ రావటం లేదు .మా రాబడీ లేదు నిండుగా ఉండే హుండీ గుండు సున్నా అయింది .విఐపిలు, మంత్రులు వస్తున్నా ,వారు జాగ్రత్తలు తీసుకోకుండా ఆలయం లోకి రావటం తో , వాళ్ళ రోగం అందరితో పాటూ మాకూ అంటుకొంటో౦ది.ఇప్పటికే మా అర్చకులలో,సిబ్బందిలో నాలుగోవంతు కరోనా పీడితులే మా ఆడాళ్ళు బెంబేలెత్తి పోతున్నారు .బ్రహ్మోత్సవాలూ తూనా బొడ్డు గానే చేశాం .వచ్చే నవరాత్రులూ అంతేగామరి .కనుక మాదో విన్నపం .ఉద్యోగుల్లాగానే మేము కూడా శ్రీవారి సేవలు వర్క్ ఫ్రం హోమ్ గా చేస్తాం .బాగానే ఉంది మరి నైవేద్యాల సంగతేమిటి అని అడుగుతారని తెలుసు .’’పోటుగాళ్ళ’’సారీ అంటే నైవేద్యాలు ప్రసాదాలు తయారు చేసే వారని మా అభిప్రాయం వాళ్ళ పని కూడా ఉండదు .వాళ్ళనీ ఇంట్లోనే వాటిని తయారు చేసి ఆన్ లైన్ లోపంపిస్తే ,నైవేద్యాలు పెట్టేస్తాం .ఖర్చూ కలిసొస్తుంది .ఇకపోతే తిరుక్షవరం
అంటారా ,అదే స్వామీ ౧కళ్యాణ కట్ట వాళ్ళపని .వాళ్ళు కూడా తలగొరుగుతున్నట్లు జుట్టు తీస్తున్నట్లు యాక్ట్ చేస్తారు .ఎవరింట్లో వాళ్ళే తలనరుక్కోవాలి సారీ జుట్టు నరుక్కోవాలి .తలనీలాలు కావాలంటే పోస్ట్ లోనో కొరియర్ లోనో అదీ దండగే ఆన్ లైన్ లో పంపేయచ్చు.వాళ్లకి డబ్బూ, శ్రమా మిగుల్తాయి .కరోనా కల్లోలమూ ఉండదు. అది అ౦ టుకుంటు౦దన్నభయమే ఉండదు . దిగులూ ఉండదు .ఆల్ హాపీ .అలాగే కళ్యాణ మండపాలలో కూడా పెళ్ళిళ్ళు ఇలానే జరుపుకోవచ్చు .మంగళవాద్యాల హోరు అక్కర లేదు వాళ్ళూ వాయించినట్లు నటిస్తారు ఆన్ లైన్ లో .పుస్తెలు మాత్రం ఇంట్లో నే ఎవరికి వారు కట్టుకోవాలి .తప్పదు .ఉపనయనాలూ అంతే .గర్భాదానాలూ వర్క్ ఫ్రం హోం లో నే జరగాలి అవి ఎలాగూ అలానే జరుగుతున్నాయనుకోండి .గృహప్రవేశాలూ అంతే అంతా యాక్షన్ తో సరి .తద్దినాలు కూడా వర్క్ ఫ్రం .తద్దినం పెట్టించే బ్రాహ్మణుడు తన ఇంట్లోనుంచి తంతు జరిపిస్తాడు .భోక్తలూ అంతే.కానీ అన్నీ యధా విధిగా జరగాలి. లేకపోతె పితృ దేవతలు శపిస్తారు .ఇదో పితలాటకం .
అధికారులు –బానే ఉందయ్యా మీ ఆలోచన .మేం యాక్సెప్ట్ చేస్తున్నాం తీర్మానం కూడా వర్క్ ఫ్ర్రం హోంచేసి పంపిస్తాం .ఇంతమందికి ఇన్ని భాషల్లో కంప్యూటర్లు ఎలా సప్ప్లై చేయాలి ? .దీనికి మీ సొల్యూషన్ ఏంటి?పోనీ ఆర్ధిక మంత్రి ని అడుగుదామా ?
సంఘం –ఆవిడ దగ్గరేముంది శివాలయం .బడ్జెట్ ప్రెజెంటేషన్ అంకెల గారడీ .రైతులకు ఇచ్చిందీ లేదూ .వలసకార్మికులకు అందించిందీ లేదు .వాళ్ళాయనే ఆమె బడ్జెట్ పై పెదవి విరుస్తుంటే ఆమెనడిగి లాభం ఉండదు సార్.
అధికారి –అన్నీ మీరే చెబుతున్నారు. మీకందరికీ వర్క్ ఫ్రం హోం కావాలని డిమాండ్ చేస్తున్నారు. మాకూ మీపై సానుభూతి ఉంది .దీనికీ మీరే పరిష్కారం చెప్పండి సాములూ
సంగం –వెరీ సింపుల్ .మోడీ గారికి ట్రంప్ జగిని దోస్త్ కదా .అందుకని అమెరికాలోని భారతీయ వోటర్లను ఆయనకే’’ గుద్దేస్తామని ‘’అదే సార్ ఓట్లు వేస్తామని ప్రకటన చేయమనండి .కావాల్సినన్ని క౦పులు అవే నండీ కంప్యూటర్లు క్షణాలలో వచ్చి వాలేట్లు ట్ర౦ప్ చేస్తాడు.ఫికర్ నై .మోడీ హూనా.
అధికారి –ఇప్పుడే ఆన్ లైన్ లోఆయనకు ఈవిషయం పంపించి అర్జెంట్ గా ట్రంపు నుంచి క౦పులు వచ్చేట్లు చేయమని తీరమానం చేసి యాక్షన్ తీసుకో మంటాం.
సంఘం –ధన్యవాదాలు సార్ మా అందరి దీవెన, స్వామి వారి ఆశీర్వచనం మీ కెల్లప్పుడూ లభిస్తాయి .కావాలంటే మీ ఇంట్లో ఏకార్యక్రమమైనా మేమే వచ్చి నిర్వహిస్తాం .
సీన్ -2
లచ్చి నుంచి ఫోన్ –అమ్మగోరో !నాను రేపటి నుంచీ ఇంటికొచ్చి పనిసేయనండి .మా సంగం అలా తీర్మానం సేసినాదమ్మా .అయ్యగోరు అదేదీ వక్క ప్రం హాంఫట్ చేస్తున్నట్లే మేమూ మీ పనులన్నీ ఇంటి నుంచే చేత్తామమ్మా .ఆరునెలలైనా కరోనా కోవిడ్ పెరిగిందే కానీ తగ్గింది లేదు .మా వర్కర్లు శానా మంది దాని బారినపడి సనిపోనారండీ .మీకైతే పెన్షన్లు వగైరా ఉంటాయికాదండీ. మాకేటి ఉంటాది ,చేస్తే జీతం లేకుంటే పస్తులు .మా మావ కూడా పని కెల్లద్దని రాత్రి తాగొచ్చిఇరగ్గొట్టి మరీ సెప్పాడమ్మా .
సీత ఫోన్ లో –ఇదేం చోద్యమే .అంట్లు ,పాచి వర్క్ ఫ్రం హోం చేస్తావా ?ఎలా కుదుర్తుందే అది .కోరిక గొంతెమ్మ కోరిక కాకూడదే.
లచ్చి-గొంతెమ్మో చితమ్మో నాకేటి తెల్సు .వా వోళ్ళు అన్నారు. నాను సెప్పాను .ఆళ్ళ మాట ఇనకపోతే ఎలేస్తారమ్మా.ఫైన్ కూడా కట్టాలంట .
సీత –సరే నే .నీ ఇంటినుంచి మా ఇంటి పని ఎలా చేస్తావే ?వివరంగా చెప్పు ?
లచ్చి- ఏటీ లేదమ్మ గోరో.తమరు నాకు కంప్యూటర్ ఇచ్చి నేర్పిస్తే నాను ఇంట్లో నుంచి చేత్తానన్నమాట,
సీత –ఎలా? హౌ ?
లచ్చి –చిమ్పుల్ అమ్మగారో .నేను మా ఇంట్లో కంప్యూటర్ లో ఇల్లు ఊడుస్తున్నట్లు అంట్లు తోముతున్నట్లు బట్టలు ఉతుకు తున్నాట్లు యాక్ట్ చేత్తానన్నమాట .మీరు హాయిగా ఆ పనులన్నీ మీ ఇంట్లో చేసుకోవాలన్నమాట .నెలజీతం ఖచ్చితం గా ఒకటో తారీకు నా అకౌంట్ లో పడితీరాలి .లేకపోతె రోజుకు పది రూపాయలు ఫైన్ కూడా మీరే కట్టాలని మా సంగం తీర్మానం .
సీత –నోనో నో
మా ఆవిడ –ఏమిటండీ నోనో నో అని నిద్రలో అరుస్తున్నారు ?పీడ కలేమైనా వచ్చిందా .చీపురుతో దిష్టి తీయనా ?
అనగానే మెలకువ వచ్చి ఇదంతా కల అని తెలిసి౦ది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -30-9-20-ఉయ్యూరు