మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య -1
భార్యా పిల్లల్ని పోషించే బాధ్యతకూడా దేవుడిపై భారం వేసి ,దేశం కోసం 55ఏళ్ళు దీక్షగా శ్రమించి ,అందులో 11సంవత్సరాలు జైలులో గడిపిన మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య ఈ తరం వారికి ఎవరికీ తెలియదు .కాంగ్రెస్ ,నవశక్తి , జయభారత్ ,వెలుగు పత్రికలు నడిపి ,స్వతంత్రం ముందూ ఆతర్వాత కూడా నిర్భయంగా ‘’కల౦ ఖడ్గాన్ని ‘’ విశ్రు౦ఖల౦గా ప్రయోగి౦చిన నిస్వార్ధ పాత్రికేయ ప్రముఖుడు .స్వాతంత్ర్యం వస్తే కులం ,గిలం పోయి ,ఆస్తిపాస్తులన్నీ అందరివీ అవుతాయని ,అందరూ సమానంగా అనుభవి౦చ వచ్చువని నమ్మిన సామ్యవాద స్వప్నాలు కన్నస్వాతంత్ర్య సమర యోధుడు .అల్లూరి ,నేతాజీవంటి విప్లవ నాయకులతో ,గాంధీ ,జయప్రకాష్ వంటి అగ్రశ్రేణి జాతీయ నాయకులతో భుజం భుజం కలిపి సాగిన అగ్రశ్రేణి దేశీయ నాయకుడు .జర్నలిస్ట్ ,కవి, నవలాకారుడు .ప్రకాశం ,,పివిజి రాజు పుచ్చలపల్లి ,రంగాలకు అభిమానుడు .కానీ స్వాతంత్ర్యం వచ్చాక ఆయనకు ప్రాధాన్యమే లేకుండా పోయింది .అసెంబ్లీకి రాజమండ్రి నుంచి పోటీ చేసి ఓడిపోయాడు .స్వతంత్ర భారత దేశ రాజకీయాలకు పనికి రాని వాడు అనిపించుకొన్న లౌక్యమెరుగని పెద్దమనిషి .మొక్కు బడిగా ఆయన శతజయంతి ఉత్సవం జరిపారు .స్వాతంత్ర్య ఉద్యమకాలం లో అనేక అపూర్వ త్యాగాలు చేసి స్వతంత్రం రాగానే జాడ కనిపించకుండా పోయిన మహోన్నతనాయకులలో మద్దూరి వారుకూడా ఒకరు .
అన్నపూర్ణయ్యగారు జైల్లో మగ్గుతుంటే ఇంటిదగ్గర కుటుంబం గర్భ దరిద్రం లో మగ్గిపోయేది .భార్య రమణమ్మ గారు మహా సాధ్వి .ఆయనకు కార్డు రాయటానికి కూడా ఆమెచేతుల్లో కాణీ ఉండేదికాదు .ఒక కార్డు మాత్రం ‘’ఏ దినం కార్డు కోసం ఎదురు చూస్తారో ,ఆ దిన౦ ఈకార్డు ను చూసి తృప్తి పడండి ‘’అని తేదీ కూడా వేయకుండా రాసింది ఆమహా ఇల్లాలు . . ఈడొచ్చిన ఆడపిల్లలకు చేతనైన రీతిలో పెళ్ళిళ్ళు జరిపి బాధ్యత తీర్చుకొని ఆత్యాగమయి అసువులు బాసింది .భార్య మరణ వార్త విన్న అన్నపూర్ణయ్య తన బాధకు అక్షరాకృతి కల్పించి ‘’చేత కాసు లేదు ,చెరసాలలో భర్త –పిల్ల పెళ్లి కూడా పెనిమిటి లేకనే –నీవే చేయవలసి వచ్చె నీలవేణి-జనులసాయమైన ,ధనసాయమైన –లేకపోయేనే నీకు లేమి గల్గె-వలదు నా బాధ పరమ శత్రువునకైన –బ్రతికి యున్నాడ జీవచ్ఛవంబ నగుచు ‘’’
గ్రంథాలయోద్యమనాయకులు గాడి చర్ల హరి సర్వోత్తమరావు గారి తర్వాత పత్రికలలో రాసి జైలు కెళ్ళి పుష్కరకాలం కారాగారం అనుభవించిన జర్నలిస్ట్ మద్దూరి అన్నపూర్ణయ్య గారు .ఈ గాంధీ జయంతి నాడు అలాంటి త్యాగ మయుని గురించి తెలుసుకొందాం .
ఆధారం –మహాత్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య గారి జీవిత చరిత్ర –రచయిత-శ్రీరావినూతల శ్రీరాములు .
సశేషం
గాంధీ జయంతి శుభాకాంక్షలతో
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -2-10-20-ఉయ్యూరు ,