మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-3
హోంరూల్ ఉద్యమం ఉవ్వెత్తుగా ఎగసి పడుతున్నకాలం లో అనిబిసెంట్ శిష్యుడు రాం కాకినాడ వచ్చి గంభీర ఉపన్యాసాలతో ప్రేరణ కల్గించాడు .ప్రిన్సిపాల్ నాయుడు గారు విద్యార్షులు ఆ సభలలో పూల్గొన కూడదని నిషేధం విధించారు .ఏం జరిగితే అది జరుగుతుందని మొండి ధైర్యంగా పూర్ణయ్యగారు మీటింగ్ కు వెళ్లి ,మర్నాడు ప్రిన్సిపాల్ కు తాను ఉత్తర్వు దిక్కరించాననీ ఏ శిక్షకైనా సిద్ధమే అని చెప్పారు .ఆయన వార్నింగ్ ఇచ్చి వదిలేశారు .బిసెంట్ తన ‘’న్యు ఇండియా ‘’పత్రికలో బ్రిటిష్ వారిపై నిప్పులు కక్కుతూ రాసేది .ఈయన వాటిని భగవద్గీత లా పవిత్రంగా భావించి చదివే వారు .కాలేజి ఎక్సెల్సియర్ సైటీకి రెండేళ్ళు కార్యదర్శి గా పని చేసి ,’’ఇండియా స్వరాజ్యానికి అన్ని విధాలా అర్హమైనది ‘’అని ప్రసంగించారు .
రాజమండ్రి కాలేజీలో బి ఏ చదువుతూ పూర్ణయ్యగారు ‘’బ్రిటిష్ రాజరికమే మన దేశ దారిద్ర్యానికి కారణం ‘’అని ఎలుగెత్తి చాటారు.కోపం వచ్చిన ప్రిన్సిపాల్ ను ‘’అడుగో ఆ దొంగ మీ ముందే నిలబడ్డాడు ‘’అనగానే అందరూ ఫక్కుననవ్వారు . అప్పటికే అన్నపూర్ణయ్య అంటే ‘’ఎదిరించే వాడు ‘’అనీ ‘’ఈ సీతయ్య ఎవరిమాటా వినడు ‘’అనే ముద్ర పడి పోయింది .’స్వాతంత్ర్య సమరం లో తాను ఎలా ప్రవేశించిందీ అన్నపూర్ణయ్య గారు తన ‘’జయభారత్ ‘’పత్రికలో ధారావాహిక గా రాశారు .1920 సెప్టెంబర్ 1న కలకత్తాలో జరిగిన ‘’స్పెషల్ కాంగ్రెస్ ‘’లో విద్యార్ధులు చదువులు మానేయాలని తీర్మానం చేసింది అది. పూర్ణయ్య గారి పై గొప్ప ప్రభావం కలిగించినా ,ఆర్ధిక బలం లేదు .భార్య కాపురానికి ఇంకా రాలేదు .కుటుంబ పోషణ భారం కూడా ఉంది .భార్య ‘’తొందరపడి నాన్ కో ఆపరేషన్ ఉద్యమం లో చేరకండి ‘’అని ముందే రాసి హెచ్చరించింది కూడా .
ఆ సమయం లో డా పట్టాభి రాజమండ్రి వస్తే విద్యార్ధులుగా ఆయనకు సహాయపడ్డారు .న్యాపతి సుబ్బారావు గారుకూడా వచ్చి 1907లో ఏం జరిగిందో గుర్తు చేసుకోమని హెచ్చరించారు .అంటే గాడి చర్ల మొదలైన విద్యార్ధులు విపరీతంగా నష్ట పోయారని అర్ధం . నవంబర్ 30రాత్రి అంతా దీర్ఘం గా ఆలోచించారు పూర్ణయ్య.అల్లూరి జ్ఞాపకం వచ్చాడు .ఇక ఆలోచించలేదు దేశ సేవకు అ౦కిత మవ్వాలని నిర్ణయించుకొన్నారు .డిసెంబర్ 2న జాతీయ విద్యాలయ లెక్చరర్ డా సుబ్రహ్మణ్యం గారి దగ్గరకు వెళ్లి,వెంటనే ‘’ఆంద్ర యువజన స్వరాజ్య సభ ‘’స్థాపించారు .1907లో బిపిన్ చంద్రపాల్ రాజమండ్రి వచ్చినప్పుడు ,ఆయన విజ్ఞప్తి మేరకు న్యాపతి సుబ్బారావు సత్యవోలు గున్నేశ్వరరావు ,డాక్టర్ శివరాజు వెంకట సుబ్బారావు మొదలైన వారు భూరి విరాళం అందించి జాతీయ కళాశాల స్థాపించారు .1920వరకు దీని నిర్వహణ భారం డా.బ్రహ్మాజోష్యుల సుబ్రహ్మణ్యం వహించారు .
అన్నపూర్ణయ్య గారు కాలేజి మానేసిజాతీయ పాఠశాలలో లెక్చరర్ గా చేరారు .1924లో ఆయనతోపాటు ‘’కాంగ్రెస్ ‘’పత్రిక కూడా సీతానగరానికి మారింది .విద్యాలయం ఆధ్వర్యం లో దీన్ని ముద్రించేవారు .1928 మార్చి 11న జనరల్ బాడీ మీటింగ్ లో తీర్మానం చేసి ప్రెస్ ను ఆశ్రమానికి ఉచితంగా అందించారు .పూర్ణయ్యగారు జైలులో ఉండగా ,పత్రిక వారు బకాయి ఉన్న డబ్బునూ రద్దు చేస్తూ తీర్మానించారు .విద్యాలయానికి సుబ్రహ్మణ్యం గారి సోదరుడు సీతారామయ్యగారు అధిపతిగా ఉండేవారు .ఈయన 1922లో ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేసి ఇందులో చేరారు .
1921జనవరి 23న రాజమండ్రి లో గోదావరి జిల్లా మహాసభలు వైభవం గా జరిగాయి .సుబ్రహ్మణ్యం గారు ఆహ్వాన సంఘాధ్యక్షులు .అయ్యదేవర కాళేశ్వరరావు వంటి ప్రముఖులు పాల్గొన్న ఈ సభకు ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణగారు అధ్యక్షత వహించి ‘’ఆత్మ గౌరవం పెంచని ,జీవన భ్రుతికి తోడ్పడని ఆంగ్ల విద్య వదిలేసి విద్యార్ధులు దేశ సేవకు నడుం కడితే ఏడాది లోపే స్వతంత్రం సిద్ధిస్తుంది ‘’అని ప్రకటించగానే ,అప్పటికప్పుడు పూర్ణయ్య గారు మొసలికంటి తిరుమలరావు ,కాండ్రేగుల రామచంద్రరావు ,సబ్నవీసు కృష్ణారావు ,క్రొవ్విడి లింగరాజు మొదలైన 55మంది విద్యార్ధులు దేశ సేవకు అ౦కిత మౌతామని ప్రతిజ్ఞ చేశారు .1921లో మద్దూరి, సబ్నవీసు ల ఆధ్వర్యం లో విద్యార్ధి మహాసభలు భారీగా నిర్వహించారు .అక్కడే ‘’ఆంధ్రయువజన స్వరాజ్య సభ ‘’ప్రారంభమైంది .
1922లో అన్నపూర్ణయ్యగారు ‘’తిలక్ మహారాజు చరిత్ర ‘’30పేజీలలో రాసి ప్రచురించారు .తిలక్ ను పరశురామునిగా ,గాంధీని,ఆతర్వాత అవతారమమైన శ్రీ రామునిగా వర్ణించారు .’’తిలక్ అంటే స్వరాజ్యం అని అర్ధం.తిలక్ స్వరాజ్య నిధి కోటీ పది లక్షలు పోగు చేసి ,నిత్యం ఆయన నామస్మరణ చేస్తున్నాం ‘’అని రాశారు .ఆంధ్రయువజన స్వరాజ్య సభ గత మార్చిలో ప్రారంభమైందనీ ,ఐకమత్యం తో భారత స్వాతంత్ర్యం సాధించటమే ధ్యేయమని ,16నుండి 30ఏళ్ళ వయసున్నవారంతా దీనిలో సభ్యులవటానికి అర్హులని ,సంవత్సర చందా కేవలం ఒక్క రూపాయి మాత్రమె ననీ ,కాంగ్రెస్ సంఘాలలో సభ్యులుగా చేర్చటం రాట్నాలు నెలకొల్పటం అప్పటికే చేశామని ,మద్యపాన నిషేధం మొదలైన జాతి ఉద్ధరణ కార్యక్రమాలు చేబట్టాలని ,దీనికి దేశభక్తులు శ్రీ టంగుటూరు ప్రకాశం పంతులుగారు అధ్యక్షులనీ .కేంద్రస్థానం రాజమండ్రి అనీ తెలియ జేశారు అన్నపూర్ణయ్యగారు.
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -4-10-20-ఉయ్యూరు