సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

సమాజ సేవే ఉచ్చ్వాస నిశ్వాసాలైన డా .చర్ల సిస్టర్స్ డా. విధుల ,డా .మృదుల-100 – గబ్బిట దుర్గా ప్రసాద్

చర్ల సిస్టర్స్ అంటే కళాప్రపూర్ణ శ్రీ చర్ల గణపతి శాస్త్రి ,కరుణామయి శ్రీ మతి చర్ల సుశీల దంపతుల కుమార్తెలు .ఒకే నాణానికి ఇరు పార్శ్వాలు.చర్ల సిస్టర్స్ అంటే డా శ్రీమతి చర్ల విదుల ,డా శ్రీమతి చర్ల మృదల గార్లు .వివాహాలు చేసుకోకుండా తమ జీవితాలను సాంఘిక సేవారంగానికి ,తండ్రిగారి సాహితీ సేవా రంగానికి అంకిత భావంతో కృషి జేస్తున్న ఆదర్శ మహిళామణులు .తలిదండ్రుల ఆదర్శ జీవన విధానం వీరిని ప్రభావితులను చేసి ఆమార్గంలోనే పయని౦చేట్లు చేసింది .అకు౦ఠిత దీక్షతో ,మొక్కవోని ధైర్యం తో ముందుకు సాగుతున్నారు .తండ్రి గారికి ఆంగ్ల విద్యపై ఆసక్తి లేకపోవటంతో,ఈ ఇద్దరూ ఇంటి వద్దనే చదువుకొన్నారు .

క్రమంగా తల్లి సుశీల,సోదరుడు శ్రీ బుద్ధ నారాయణ శాస్త్రి గారల ప్రోత్సాహం తో ఉన్నత విద్య అభ్యసించారు .వీరిలో పెద్దవారైన శ్రీమతి విదుల13-3-1939న నిడదవోలు లో జన్మించారు .రాజమండ్రి ఆర్ట్స్ కాలేజిలో 1960లో బి. ఏ.,విశాఖ ఆంద్ర విశ్వ విద్యాలయం లో ఎం.ఏ. చదివారు .తర్వాత హైదరాబాద్ ఉస్మానియా యూని వర్సిటి లో హిందీలో పి.హెచ్ .డి .చేశారు .విశాఖ పట్నం సెయింట్ ఆన్స్ కాలేజిలో లెక్చరర్ గా 20ఏళ్ళు పని చేశారు .అదే సమయం లో ఎన్ .ఎస్. ఎస్ .ప్రోగ్రాం అధికారిగా 15సంవత్సరాలు సేవ చేశారు .ఎయిడ్స్ కంట్రోల్ బోర్డ్ మెంబర్ గానూ సామాజిక సేవ చేశారు .విశాఖ లో ఉద్యోగం లో ఉన్నప్పుడే 1996లో అక్కడ ‘’విశ్రాంతి ‘’పేరున వృద్ధాశ్రమం ప్రారంభించి వృద్ధుల సేవకు నాంది పలికారు .తండ్రి గారి ‘’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’కు విశాఖ చైర్మన్ గా వ్యవహరించారు .తల్లిగారి పేరిట నిడదవోలులో చర్ల సోదరీమణులు2000వ సంవత్సరం లో స్థాపించిన’’ చర్ల సుశీల వృద్ధాశ్రమ౦’’కు విదులగారు అధ్యక్షురాలు . ‘’చర్ల సుశీల –గణపతి శాస్త్రి ఫౌండేషన్’’కు ప్రెసిడెంట్,నిడదవోలు ‘’కస్తూరిబాయి మహిళా సమాజం ‘’కు కార్య దర్శి .నిడదవోలు లయన్స్ క్లబ్ అధ్యక్షురాలుగా పని చేశారు .విశాఖ ‘’విశ్రాంతి వృద్ధాశ్రమం ‘’కు సహాయ కార్య దర్శి. విశాఖ ‘’ బాలప్రగతి’’ సెంటర్ సభ్యురాలు .ఇలా వివిధ సంస్థలతో కార్యనిర్వాహక బాధ్యతలను 81ఏళ్ళ వయసులో 18ఏళ్ళ యువతిలాగా చలాకీగా సెల్ ఫోన్ లో అనుక్షణం ఎవరితోనో ఒకరితో మాట్లాడుతూ సలహాలిస్తూ గడిపే మానవ యంత్రం విదుల గారు .

శ్రీమతి చర్లమృదులగారు 26-7-1941న నిడదవోలు లో జన్మించారు .హిందీసాహిత్యం లో ఎం .ఏ.,బి.యి.డిచేసి ,తర్వాత డాక్టరేట్ పట్టా పొందారు ‘’సేక్రేడ్ హార్ట్స్ హైస్కూల్ లో హిందీ అధ్యాపకురాలుగా కొంతకాలం పని చేసి ,తర్వాత విశాఖ ఏ .ఎయెన్.రాజా జూనియర్ కాలేజిలో లెక్చరర్ గా పని చేస్తూ పదోన్నతి పొందారు .విశాఖ మునిసిపల్ కార్పోరేషన్ వారి ‘’విద్యా పీఠ్’’డిగ్రీ కాలేజి ప్రిన్సిపాల్ చేసి రిటైరయ్యారు .తండ్రిగారి ‘’ఆర్ష విజ్ఞాన పరిషత్ ‘’కు అధ్యక్షురాలు .నిడదవోలు లయన్స్ క్లబ్ సెక్రెటరి .’’ఆత్మ విద్య చారిటబుల్ ట్రస్ట్’’కు వైస్ ప్రెసిడెంట్ .‘’చర్ల శుశీల వృద్ధాశ్రమ౦ ‘’,చర్ల సుశీల గణపతి శాస్త్రి ఫౌండేషన్ ‘’లకు కోశాధికారి .బాలప్రగతి సెంటర్ మెంబర్ .వివిధ సంఘాలలో వివిధ హోదాలలో సమాజ సేవ చేస్తున్నారు .80వ పడిలోకూడా నిత్యోత్సాహంగా కృషి చేస్తూ 8ఏళ్ళ కన్యలా ఉండటం ముచ్చట గొలుపుతుంది .

చర్ల సిస్టర్స్ ‘’రెస్ట్ ఇన్ సర్వీస్ ‘’కు ఉదాత్త ఉదాహరణ .సేవా రంగం లో కలిసి పని చేస్తున్నఅరుదైన జంట ఈ చర్ల సిస్టర్స్ .మానవ సేవే మాధవ సేవ అన్నమహాత్ముని ఆదర్శాన్ని పాటిస్తూ, సమాజానికి మనం ఏం చేశామన్న స్పూర్తితో పని చేస్తూ ,స్వార్ధ సంకుచిత కుల,మత,జాతి,ప్రాంత , భాషాభేద భావాలకు అతీత౦గా కృషిచేస్తున్న ఆణిముత్యాలు వీరు .తల్లిదండ్రుల ఉద్బోధలను నిరంతరం పాటిస్తూ వారిని తాము చేస్తున్న సేవలలో ప్రతిఫలించేట్లు చేస్తున్న త్యాగ మూర్తులు .తండ్రిగారిలాగా గా౦ధీమార్గంలోనే నడుస్తూ సాధారణ జీవితాలు గడుపుతూ ఖద్దరు వస్త్రాలు మాత్రమే ధరిస్తూ అందరిలో కలిసిపోతూ ఉంటారు .స్త్రీ జనోద్దరణ ,మహిళా చైతన్యం ఈ సిస్టర్స్ కు రెండు కళ్ళు .వివాహం చేసుకొంటే తలిదండ్రుల, తమ ఆశయాలకు అడ్డం వస్తుందని భావించి అవివాహితలుగా ఉండిపోయిన చైతన్య స్రవంతులు .గుడిలో దీపాలకంటే జీవితాలలో సుఖ శాంతి దీపాలు వెలిగించాలన్న తపన వారిది .అన్నదానం ,విద్యాదానం వారి ఉచ్వాస నిశ్వాసాలు.ప్రతి రోజూఉదయం 11-12గంటల మధ్య నిడదవోలు రైల్వే స్టేషన్, బస్టాండ్ ,ఇతర ప్రధాన కూడళ్ళకు మొబైల్ వాన్ లో వారే స్వయంగా వెళ్లి యాచకులకు భోజనం పెడతారు .ఇదే ఉత్కృష్ట దైవ సేవగా భావిస్తారు .దరిద్ర నారాయణ సేవ దామోదర, శంకర దైవ సేవగా చేస్తారు .నిదదవోలె కాక మల్లవరం ,బొబ్బర్లంక,రామ చంద్రాపురం గ్రామాల్లోనూ సమర్ధవంతంగా వృద్ధాశ్రమాలు నడుపుతూ సమాజ సేవ చేస్తున్నారు.

సామాజిక సేవారంగం లో ఊపిరాడనంత పనులలో గడుపుతున్నా, ఈ చర్లద్వయ౦ సాహిత్య రంగం లోనూ రాణిస్తున్నారు .తండ్రి గణపతి శాస్త్రిగారి సాహితీ సంపదను అవిచ్చిన్నంగా తరతరాలకు అందించే కార్యక్రమం చేస్తున్నారు ..’’మీ పుస్తకాలను ఆజన్మాంతం ప్రచారం చేస్తాం ‘’అని తండ్రిగారికిచ్చిన వాగ్దానం నిబద్ధతతో నిలబెట్టు కొంటున్నారు ఈ సరస్వతీ మూర్తులు .తమకుమార్తెల సాహితీసేవకు ముచ్చటపడి తండ్రిగారు ఒకపద్యం రాసి వారుభయుల్నీ ఆశీర్వదించారు –

‘’మదమిడి సద్గుణముల చే-విధిగా కుడి భుజములవలె బ్రియులగు తనయుల్

విదుల,మృదులకృతి రథసా-రాధులయి కన దీర్చినాక రామాయణమునన్ ‘’

కనుక సేవ ,సాహిత్యం కూడారెండు కళ్ళుగా భావించింది చర్ల సోదరీమణులద్వయం .

తండ్రి గారి సాహిత్య వ్యాప్తి తో తృప్తి పడకుండా, తామూ రచనలు చేసి సరస్వతీ పుత్రికలనిపించారు .శ్రీమతి విదులగారు ‘’తీరం చేరిన నావ ‘’,మురళీ కృష్ణ ,సృజన స్మృతి,పునర్జన్మ ,బ్రహ్మ సూత్రాలు మొదలైనవి రచించారు .శ్రీమతిమృదులగారు ‘’మృదుభావ వీచికలు ‘’,గీతామృతం ,ప్రతిభకు పట్టాభి షేకం ,పరివర్తన ,అమృత గుళికలు,చర్ల గణపతి శాస్త్రి చరిత్ర ,సుశీలమ్మ చరిత్ర ,చర్ల గణపతి శాస్త్రి శత వసంత ప్రత్యేక సంచిక ,వామన పురాణం (ఆధునీకరణ )రచించారు .ఏమైనా ఇంగువకట్టిన గుడ్డలు కదా తండ్రిగారి సాహిత్య గుబాళింపు ఎక్కడికి పోతుంది ?అనువంశికంగా అబ్బి పరిమళించింది .

చర్ల సిస్టర్సను ఆహ్వానించి సన్మానించని సాహిత్య , సాంస్కృతిక సేవా సంస్థలు లేవు అంటే అతిశయోక్తికాదు .జూన్ 28ఆదివారం సరసభారతి నిడదవోలు వెళ్లి, వీరిని సత్కరించి,మా తలిదండ్రులు కీ శే గబ్బిట మృత్యుంజయ శాస్త్రి ,శ్రీమతి భవానమ్మగారల స్మారక శ్రీ శార్వరి ఉగాది పురస్కారం అందజేసి ధన్యమైంది .జిల్లా ,రాష్ట్ర స్థాయి అవార్డులెన్నో అందుకొన్నారు జాతీయ స్థాయిలో పద్మ పురస్కారం త్వరలో రావాలని ఆశిద్దాం.

డాక్టరేట్ లు అయినా ,ఎన్నో పదవులలో రాణిస్తున్నా ,శక్తికి మించి సేవాధర్మ౦ నిర్వహిస్తున్నా అలుపు సొలుపు ఎరుగని థీమూర్తులు వీరిద్దరూ .దైవీ శక్తి ఆవహించిన మానవీయ సేవా తత్పరులు .’’లీడ్ కైండ్లీ లైట్ ‘’కు ప్రత్యక్ష ఉదాహరణలు ‘’.సుగుణ సంపత్తికి ,వినయ సౌజన్యాలకు మారుపేరు .అందుకే వీరు ఏ బృహత్ కార్యక్రమం నిర్వహించినా స్వచ్చందంగా దాతలు ముందుకు వచ్చి అండగా నిలబడి విజయవంతం చేస్తారు .లయన్స్ క్లబ్ మిత్రుల చే స్థాపించబడిన’’డాక్టర్ చర్ల విదుల , డాక్టర్ చర్లమృదుల లయన్స్ క్లబ్ వృద్ధాశ్రమం ద్వారానూ సేవలందిస్తున్నారు ఈ సిస్టర్స్ . ‘’లాంగ్ లివ్ చర్ల సిస్టర్స్’’.

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in వార్తా పత్రికలో and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.