మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-4
22-3-1922న అన్నపూర్ణయ్య గారు ఆంధ్రయువజన స్వరాజ్య సభ తరఫున ‘’కాంగ్రెస్ ‘’అనే సైక్లో స్టైల్ వార పత్రిక ప్రారంభించారు .క్రొవ్విడి లింగరాజుగారు సహాయ సంపాదకులు .అందులోని ఒక వ్యాసం దేశ ద్రోహం నేరం కింద వస్తుందని సంపాదకులైన మద్దూరి వారికి 18నెలలు శిక్ష విధించింది బ్రిటిష్ ప్రభుత్వం 1923ఫిబ్రవరి నుంచి 1924జూన్ 13వరకు రాజమండ్రి ,వేలూరు జైళ్లలో మొదటి సారిగా శిక్ష అనుభవించారు .1924డిసెంబర్ లో రాజమండ్రికి 13మైళ్ళ దూరాన సీతానగరం లో డా సుబ్రహ్మణ్యంగారు ‘’గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం ‘’నిర్మించగా కాంగ్రెస్ పత్రిక అక్కడి నుంచే వెలువడేది .లింగరాజుగారితోపాటు రామ చంద్రుని వెంకటప్ప కూడా అందులో పని చేసేవారు .
దేశోద్ధారక నాగేశ్వరరావు పంతులుగారు ఈ పత్రిక కోసం ‘’జర్మన్ క్రెడిల్ టిప్ టాప్’’కొనిచ్చారు దాదాపు మూడు వేల పౌన్ల టైప్ మెటీరియల్ కూడా అందించారు.మొదట్లో చందాదారులు 600మంది ఉండేవారు క్రమంగా పెరిగారు .తేలికైన వాడుక భాషలో ఉండటం వలన యువకులను బాగా ఆకర్షించింది 1857నాటి విప్లవ వీరుల గాథలను ధారావాహికంగా ప్రచురించేవారు .కాంగ్రెస్ సంపాదకీయాలు బ్రిటిష్ ప్రభుత్వం పై నిప్పులు కురిపి౦చేవి.హిందూ ముస్లిం తగాదాలకు కారణం ప్రభుత్వమేననీ ,కోర్టుల్లో జరిగే విచారణ కేవలం బొమ్మలాటనీ ,కాంగ్రెస్ బరువు బాధ్యతలు మోయాలనీ అవసరమైతే’’ ఇండిపెండెంట్ పార్టీ ‘’కూడా పెట్టాలనీ ,పోలీసు దుష్క్రుత్యాలు బ్రిటిష్ వారికి కాలం చెల్లిందని తెలియ తెలియ స్తున్నాయనీ ,ఖద్దరు దారుల బట్ట లూడ దీసిన పోలీసు అధికారులు ముస్తఫా ఆలీ ఖాన్ , డప్పుల సుబ్బారావు లు అపర రాక్షసులు, దుశ్శాసనులు, నీ దేశం బతికి బట్టకడితే నువ్వు చస్తేమాత్రమేం ‘’వంటివి నిప్పుల్లో కొన్నిమాత్రమే .
1926జులై 16 సంచిక అల్లూరి జయంతి ప్రత్యేక సంచికగా కాంగ్రెస్ వెలువడింది గాంధీ గారి అభిప్రాయం రాసి పంపమని కోరితే ,ఆయన జీవిత విశేషాలు తెలుపమని రాయగా రాసి పంపిస్తే ,1929జులై 18 యంగ్ ఇండియా లో బాపూ ‘’రామరాజు శీలవంతుడు నిరాడంబర త్యాగి .ధైర్యం ఉన్నతాశయాలున్నవాడు .పితూరీ దారుడు కాదు .గొప్ప దేశభక్తుడు .ఆయన దేశ భక్తినీ చాతుర్యాన్నీ సాహసాలను యువకులు ఆదర్శంగా తీసుకొని ముందుకు సాగాలి .నాకు సాయుధ విప్లవం పై సానుభూతీ అభిమానం లేవు .రాజు అహింసా పద్ధతిలో పోరాడి ఉంటె యెంత బాగుండేదో ‘’అని నిష్కర్షగా రాశాడు .1927నుంచి అల్లూరి జయంతి ఘనం గా నిర్వహించాలని , అన్నపూర్ణయ్యగారు అనుకొన్నా , పెద్దలు సహకరించలేదు .అధ్యక్షత వహించటానికి కూడా ఎవరూ ముందుకు వచ్చేవారు కాదు .మొదటి సభకు వేమవరపు రామదాసు అధ్యక్షత వహించారు .
అల్లూరి రెండవ జయంతి రాజమండ్రి లో దండు నారాయణ రాజు అధ్యక్షతన జరిగింది .బెజవాడ మొదలిన చోట్లకూడా జరిగాయి .మద్రాస్ రిపబ్లికన్ కాంగ్రెస్ లోనూ ,1928డిసెంబర్ కలకత్తా కాంగ్రెస్ యువజన సభలో అల్లూరి ని కీర్తించారు .1929 మూడవ జయంతికి నేతాజీ సందేశం పంపారు .గుంటూరు ,బందర్ లలో కూడా అల్లూరి జయంతి జరిపారు .మచిలీపట్నం సభలో పట్టాభి సీతారామయ్య ఘన నివాళులు అర్పించారువిప్లవ వీరుడు అల్లూరి సీతారామ రాజు కు .1936జూన్ 23న ఏలూరులో జరిగిన అల్లూరి వర్ధంతి సభకు వెళ్లాలని ప్రయత్నం చేసిన మద్దూరి ,గారపాటి సత్యనారాయణ ,బసవరాజు రంగశాయి లపై ప్రభుత్వం నిషేధాజ్ఞలు జారీ చేసింది .1929మే 9 న గాంధీ ‘’కాంగ్రెస్ పత్రిక’’కార్యాలయాన్ని సందర్శించి ,అక్కడ సిబ్బంది అందరూ ,చాపలపై కూర్చుని ముందున్న రాతబల్లపై కాగితాలు పెట్టుకొని రాయటం చూసి బాగా సంతోషించాడు .అన్నపూర్ణయ్య ,పందిరి మల్లికార్జునరావు లు గాంధీతో సుదీర్ఘంగా చర్చలు జరిపారు .మే16 యంగ్ ఇండియా పత్రికలో ‘’కాంగ్రెస్ తెలుగు వారపత్రిక ఆశ్రమం నుంచే స్వయం పోషకం గా వెలువడుతోంది.సంపాదకుడు మద్దూరి అన్నపూర్ణయ్య రాజద్రోహం నేరం కింద నిర్బందితుడై గౌరవం పొందారు .ఆయన ఖైదులో ఉన్నా పత్రిక నడుస్తోంది ‘’అని రాశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గా ప్రసాద్ -5-10-20-ఉయ్యూరు