మన సుకవి ఆత్రేయ -1
రోడ్డున పడ్డ మనిషికి రోడ్డుపై గాంధీ బొమ్మే ధైర్యం చెప్పి ముందుకు సాగేట్లు చేసింది .అదే ప్రబోధ గీతం అయింది .దాన్ని అందరికీ నచ్చేట్లు మొదటి చిత్రం ‘’దీక్ష ‘’లో ‘’పోరా బాబూ పో ‘’అని వెన్ను తట్టాడు ఆత్రేయ .సంగీతం పెండ్యాల అందిస్తే ,ఘంటసాల అమరగానం కొండంత బలం చేకూర్చింది .’’ఈమువ్వల గానం మన ప్రేమకు ప్రాణం ‘’అని 1990లో ‘’ప్రేమ యుద్ధం ‘’సినిమాలో చివరి పాట రాశాడు .నిజంగా నే అయన సినిమాలో రాసినవన్నీ ప్రేమయుద్ధానికి సంబంధించైనా పాటలే ఎక్కువ .వాటిలో ప్రేమ ,ఆరాధన ,శృంగారం ,లాలిత్యం ,విరహం, త్యాగం ,ఆత్మార్పణ ,బలిదానం ,ప్రేమ గెలుపు ఓటమి లపై తనదైన ముద్ర తో పాటలు రాశాడు .మనసు నిండా పలికాయి అవి మనసు లోతులు తరచాయి .మురిపెం చేశాయి ముద్దులొలికించాయి .ప్రేమ పాఠాలు నేర్పాయి .అంతర్వేదనను అక్షరీకృతం చేశాయి .అంతకంటే ఇంకెవ్వరూ రాయలేరు అన్న తీర్పునిచ్చాయి .అందుకే అందరి మనస్సులో నిలిచిపోయి మనసు కవి అయ్యాడు మన సుకవి ఆత్రేయ .మధ్యలో జానపద గీతాలు భక్తీ గీతాలు దేశభక్తి గీతాలు ,అభ్యుదయ గీతాలు ప్రబోధాత్మక గీతాలు ,హాస్యగీతాలు రాస్తూ ,లోకంతీరు విశ్లేషిస్తూ ,వీణ పాటలకు ముక్తాయింపు జోడించాడు .అంటే వైవిధ్యమైన సినీ గీతాలు సృష్టించాడు .అంతకు ముందు ఎందరో మహాకవులు సినీ రంగాన్ని ఏలారు .కాని ఒక విలక్షణమైన పదప్రయోగం ,గుండె లోతులు తడమటం ఆత్రేయకే చెల్లింది .అందుకే ముద్దుగా మనసుకవి అని కీర్తి కిరీటం పెట్టారు .ఇంతకీ ఎవరీ ఆత్రేయ ?
కిళాంబి వెంకట నరసి౦హా చార్యులు అంటే ఆత్రేయ .7-5-1921 పుట్టి ,13-9-1989న 68ఏళ్ళు జీవించి మరణించాడు .ఆత్రేయ గా చెలామణి అయ్యాడు .ఆయన గోత్రం ఆత్రేయస అందులోని ఆత్రేయ కు ముందు తన పేరులోని ఆచార్యులు లోని ఆచార్య శబ్దం తగిలించి తానే తన కలం పేరును ‘’ఆచార్య ఆత్రేయ ‘’అని పెట్టుకొన్నాననీ అంతేతప్ప తాను ప్రొఫెసర్ అనిపిలువబడే ఆచార్యను కాదనీ చెప్పుకొన్నాడు నెల్లూరు జిల్లా సూళ్ళూరు పేట మండలం మంగళం పాడు లో జననం .తల్లి సీతమ్మ ,తండ్రి కృష్ణమాచార్యులు .నాటకపద్యాలు రాగయుక్తంగా పాడే నేర్పు చిన్నప్పటి నుండీ ఉండేది .మధ్యతరగతి కుటుంబ సమస్యలను నేపధ్యంగా చేసుకొని నాటకాలు రాశాడు .వీటిలో పరివర్తన ఎన్జీవో నాటకాలు ఆంద్ర నాటక కళాపరిషత్ అవార్డుల౦దుకొన్నాయి ఆత్రేయ అంటే ఎన్జీవో నాటకం అనే పేరు స్థిరపడి పోయింది .వందలాది ప్రదర్శనలు జరిగాయి .తర్వాత ‘’కప్పలు ‘’నాటకం రాసి విశేష కీర్తి సాధించాడు .రాయలసీమ కరువు పై ‘’మాయ ‘’నాటకం రాసి ప్రభుత్వాల కళ్ళు తెరిపించాడు .1942లో చిత్తూరు జిల్లాలో ఉపాధ్యాయ శిక్షణ పొందుతూ ,’’క్విట్ ఇండియా ‘’ఉద్యమం లో పాల్గొంటే ,పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెడితే ,కొంతకాలం కారాగార వాస శిక్ష అనుభవించిన నిఖార్సైన దేశభక్తుడు ఆత్రేయ .ఉదర పోషణకోసం చాలా ఉద్యోగాలు చేశాడు .ఎక్కడా స్థిరంగా లేడు.నెల్లూరు జిల్లా మున్సిఫ్ కోర్ట్ లో కాపీయిస్ట్ గా కొంతకాలం ,తిరుత్తని సెటిల్ మెంట్ ఆఫీస్ లో గుమాస్తాగా ,నెల్లూరులోని ‘’జమీన్ రైతు ‘’పత్రికకు అసిస్టెంట్ ఎడిటర్ గా కొంతకాలం ,ఆంద్ర నాటక కళా పరిషత్ లో ‘’పెయిడ్ సెక్రెటరిగా కొంతకాలం ఉద్యోగాలు వెలగబెట్టాడు .
.స్వాతంత్రం సాధించాక దేశం లో జరిగిన హిందూ –ముస్లిం హింసా కాండకు ప్రతిబింబంగా ‘’ఈ నాడు ‘’అనే మూడు అంకాల నాటకం రాశాడు .రచయిత సమాజం లో ఉన్న కుళ్ళును కడిగిపారేయటమే కాదు పరిష్కార మార్గం కూడా సూచించాలి అని భావించి ,విశ్వశాంతి కోసం ‘’విశ్వ శాంతి ‘’నాటకం ,రాసి రాష్ట్ర స్థాయి అవార్డ్ పొందాడు .ప్రపంచం లో హింస పెరిగిపోవటం వలన అశాంతి ప్రబలటం గుర్తించి ‘’సామ్రాట్ అశోక ‘’,గౌతమ బుద్ధ’’ నాటకాలు ,దేశంలోని పరిస్థితికి సూచన గా ‘’భయం ‘’నాటకం రాశాడు .ఇంత నాటక రచనాను భవం ఉండటం తో ఆత్రేయ ను తెలుగు చిత్ర రంగం సగౌరవం గా ఆహ్వానించింది .మాటలరచయితగా పాటలరచయితగా,స్క్రీన్ ప్లే రచయితగా కూడా రాణించాడు .స్వయంగా శరత్ నవల ‘’వాగ్దానం ‘’ను తెరకెక్కించి దర్శకత్వమూ చేసి చేతులు కాల్చుకున్నాడు .
మూడ్ ఉంటేనే రాసేవాడు ఆత్రేయ .లేకపోతే కారణాలు చెప్పి ఆలస్యం చేసేవాడు .రాయకుండా నిర్మాతలను ఏడిపిస్తే ,రాసి ప్రేక్షకులను ‘’మనసారా’’ ఏడ్పించేవాడుఅనే జోక్ ఆత్రేయకే చెల్లింది .అందుకే యెంతఆలస్యమైనా ఆయన రచన కోసం ఎదురు చూసేవారు నిర్మాత దర్శకుడు సంగీత దర్శకుడు .మనసు పెట్టాడా క్షణం లో బంగారం వంటి పాట రాసేసేవాడు .సగటు తెలుగు పలుకు బడులు ఆయన రాసిన మాటలలో, పాటలలో జీవం పోసుకోనేవి .మహదేవన్ సంగీతం, ఆత్రేయ, పాట ,ఆదుర్తి దర్శకత్వం త్రివేణీ సంగమం గా చాలాకాలం సాగి, కనకవర్షం కురిసింది .భక్తి పాటలలో పరవశం కలిగించాడు .హాస్యం తో గిలిగింతలు పెట్టాడు .విషాదం లో శిఖరాగ్రం చేరాడు .అందుకే ఆయన జీవితంలో కూడా విషాదం చోటు చేసుకొని ఉండవచ్చునని ఊహించారు కొందరు. ద్వంద్వార్ధాల పదాలూ ప్రయోగించి ‘’బూత్రేయ ‘’అనే ముద్ర కూడా తగిలించుకున్నాడు .అది ఆ నాటి కాలమాన పరిస్థితి కూడా .అందుకు అందరూ బాధ్యులే .
ఆత్రేయ భార్య శ్రీమతి పద్మావతి గారు .’’సమాజం లోని అన్యాయాలు,అక్రమాల గురించి ఆత్రేయగారు వ్యధ చెంది ,వారిజీవితాలలో మార్పు రావాలని ఆయనపడిన వేదన నాకు తెలుసు ‘’ . .ఆత్రేయ గొప్ప వేదాంతి .లోకాన్ని వాస్తవ దృష్టితో పరికిస్తాడు .అందుకే ఆయనమాటలు అంతప్రభావం కలిగిస్తాయి .పరస్పర ప్రేమానురాగాలు ఆత్మీయతా అనుబంధాలతో ఒకరినొకరు సంభాషించుకోవటమే ఎమోషనల్ దృశ్యాలన్నాడు .ఇలాంటి సెంటిమెంటల్ డైలాగ్స్ రాయటం లో ఆత్రేయ ఘనాపాటీ.’’వేదాంతం ,వైరాగ్యం జోలికి వెడితే మనిషిలోని కార్యదీక్షను ,విశ్వాసాన్ని దెబ్బతీస్తాయి . శృంగారం మితి మించితే అశ్లీలం అవుతుంది .అలాంటి సందర్భం లో నేను రాయను అని రచయిత అంటే పరిశ్రమలో ఎవరూ నిలబడ లేడు’’అన్నాడు .
‘’’’భాషను అదుపు చేయటం ,భావాన్ని అదుపు చేయటం లోనూ’’తిమ్మెర ‘’వంటి తేలిక మాటలతో తేనెలు ,తీయని తావులు వెదజల్లటం లోనూ ఆచార్యుడే ఆత్రేయ .తిక్కనకు వారసుడు ఆత్రేయ ‘’అన్నారు శ్రీ వేటూరి సుందరరామ మూర్తి ..’’తినని దేవుడికి బలవంతంగా తిండిపెడతావు ‘.తిండిలేక ఏడ్చే వాడిని తరిమి తరిమి కొడతావు’’ .,’’పని దొరకని పేదవాడిని సోమరి పోతంటారు .పని చేయని గొప్పవాణ్ణి పల్లకీ లో మోస్తారు ‘’ ఇంతకంటే ఏ కమ్యూనిస్ట్ పవర్ ఫుల్ గా చెప్పగలడు?అందుకే తోడికోడళ్ళు సినిమాలో ‘’కారులో షికారు కెళ్ళే పాలబుగ్గల పసిడీచానా –నీ బుగ్గమీద గులాబి రంగు ఎలా వచ్చెనో చెప్పగలవా ?’’అనే పాట ఆత్రేయ రాశాడు అంటే ఎవ్వరూ నమ్మలేదు శ్రీశ్రీ రాసి ఉంటాడని భ్రమపడ్డారు మన కమ్మీలు .’’కాటికెడితే అందరూ ఒకటే అనుకో బోకు .అక్కడ కూడా తేడాలున్నాయ్ కాలేవరకు’’,’’బతికుండగా నిన్ను ఏడిపింఛి నోళ్ళు –నువ్వు చస్తే ఏడుస్తారు దొంగ నాయాళ్ళు’’ఇలాంటి పకడ్బందీ మాటలబందీ ఆత్రేయది .
కళా వాచస్పతి కొంగర జగ్గయ్య ఆత్రేయకు పరమ ఆప్త మిత్రుడు .ఆత్రేయ సాహిత్యాన్ని ‘’మనస్విని ‘’ట్రస్ట్ ద్వారా 7సంపుటాలుగా వెలువరించటానికి ప్రత్యేక శ్రద్ధ చూపింఛి ఆత్రేయకు ఘన నివాళి అర్పించి మిత్ర ఋణం తీర్చుకొన్నాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -6-10-20-ఉయ్యూరు