నువ్వు కొండ మహాత్మ్యం
నువ్వు కొండకు వ్యవహారిక నామం బెండి కొండ .విశాఖ జిల్లా టెక్కలి తాలూకా పాత టెక్కలి జమీన్ లో ఉన్నది .ఒకప్పుడు ఈ కొండ ఇద్దరు వర్తకుల నువ్వుల రాశి .వారు తిలాధిపతి శనీశ్వరుని తృప్తి కలిగించకపోవటం వలన ఆగ్రహం కలిగి వాళ్ళ నువ్వుల రాశిని పెద్ద కొండగా మార్చాడట .పశ్చాత్తాపం చెంది మళ్ళీ స్వామిని ప్రార్ధిస్తే ,మళ్ళీ నువ్వుల రాశిగా మార్చటానికి వీలు లేదని చెప్పి ,వాళ్లకు ప్రీతి కలిగించటానికి తాను ఆకొండపై నివాసం ఏర్పాటు చేసుకొని భక్తుల కోరికలు తీరుస్తూ ఉంటానని చెప్పి , శనీశ్వరుడు అంతర్ధానమయ్యాడు .
రామయోగి అనే ఒక సాధువు పెరుగు మాత్రమె తింటూ ,మితభాషిగా ఉంటూ ఈ కొండపై తపస్సు చేసి ,40రోజులకు పైగా నిరాహారంగా ఉండి4-3-1938 న ఈశ్వరనామ సంవత్సర శుక్లపక్ష విదియ గురువారం అపరాహ్ణంలో సిద్ధి పొందాడు .అప్పటినుంచి ఈకొండ నువ్వుకొండ శ్రీ రామ క్షేత్రంగా ,శ్రీరామయోగి క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది .ఈ రామయోగిపై టెక్కలి ఆంగ్ల ఉన్నత పాఠశాల సహోపాధ్యాయుడు శ్రీ మండలీక సీతారామయ్య ‘’నువ్వు కొండ యోగి రామ శతకం ‘’రాశాడు .1941లో రాజమండ్రి శ్రీ రామాప్రెస్ లో ప్రచురింపబడిన ఈ శతకం వెల కేవల౦ నాలుగు అణాలు అంటే పావలామాత్రమే .రాసినవాడు రాయిన్చుకోన్నవాడు ,ముద్రించిన ప్రెస్ అంతా రామమయ౦ అవటం యాదృచ్ఛికం కాదు సుకృతంగా భావించాలి .
ఇందులో ప్రార్ధన ,శతకానికి ప్రేరణ ,సంక్షేపంగా నువ్వుకొండ చరిత్ర ,నువ్వు కొండ క్షేత్ర పాలక శనీశ్వర అష్టకం ,రామయోగి ద్వాదశ మంజరి స్తోత్రం ,శతక మాహాత్మ్యం ,శతక సంకల్పం ,రామయోగి శతకం ,టిప్పణి ఉన్నాయి .
కవిగారి వియ్యంకుడు ఒక సారిటెక్కలి వచ్చి,పక్షవాతంతో బాధపడుతున్న కవిని చూసి పద్యాలతో రామయోగిని ప్రస్తుతిస్తే నయం అవుతుందని సలహా ఇవ్వగా ,శతకరచనకు ఉపక్రమించాడు కవి .ఈ కవిగారే చాలా విపులంగా ‘’నువ్వుకొండ మహాత్మ్యం ‘’కూడా రాశానని చెప్పుకొన్నాడు .
మత్తకోకిలం లో శని దేవ స్తుతి
‘’శ్రీకరంబగు నువ్వుకొండ విచిత్రమొప్పగ నీ కృపన్ –నీకు శాంతి నివాసమౌనని నిశ్చయంబుగ బల్కుటన్
మాకు సర్వ శుభంబు లిచ్చుచు మమ్ము రక్షణ సేయుమీ-నీకు దండముపెట్టి ఎక్కితి నీదు శైలము గొల్వగాన్ ‘’
రామయోగి ద్వాదశ మంజరి స్తోత్రం లో ఒకపద్యం –
‘’శ్రీరామ భక్తుడై చెలగుచు నువ్వు కొండ రాల సందున డాగురామయోగి –రాముడే కాని వేరేమి లేదని చాటు పూర్ణ వైరాగ్యుడౌ పుణ్యమూర్తి
పెరుగుమాత్రమె త్రాగి పెను తపస్సును జేసి –పరమాత్ము నెరిగిన పరమహంస –పదునెనిమిది యగు వందలేబది తొమ్మిది శక మీశ్వర ఫాల్గుణ శుచి పక్ష
మందు విదియను భ్రుగువాసరాపరాహ్నమందు –నలువదినాళ్ళనిశమున
బ్రహ్మ పద మొ౦ది తిలరాశి పర్వతమున –రాముడి వెలసెను జూడీరంజితంబుగ
ఏ శబ్దం విన్న రామ శబ్డంగానే భావిస్తూ ,ఎవరు కనిపించినా రామునిగాతలుస్తూ,పంచేంద్రియాలకు ఏది సోకితే అది రాముడిదే అనుకొంటూ ,ఎవరుపిలిచినా రాముడే పిలుస్తున్నాడని బదులు పలుకుతూ ,అడుగో రాముడు ఇడిగో రాముడు అని పరిగెత్తుతూ,కనపడకపోతే నిరాశ చెందుతూ ‘’రాజిత విరాగి నువుకొండ రామయోగి ’’ భక్త రామదాసులా అంతా రామమయం గా భావించాడు.అధ్వాన్న౦గా ఉండే ఆకొండ రామయోగి వలన అగ్రగణ్య మైంది.ఆయన కులం జాతిచదువు,అర్హత ఎవరికీతెలీదు .నిజమైన ‘’యోగి రాముడే రామయోగి’’ .కనుక తన శతకం పఠిస్తే,అన్నీ లభించి మోక్షం కూడా కలుగుతుందని హామీ ఇచ్చాడు కవి .తాను కొండ ఎక్కలేను ,కానుక లివ్వలెను కనుక శతకమే తన సర్వస్వం అని ,దాన్నే స్వీకరించి దయచూపమని కవి రామయోగిని వేడుకొన్నాడు .
రామయోగి శతకం మకుటంగా ‘’నువుకొండ యోగిరామ ‘’అనికాని శ్రీరామ యోగిరామ ‘’అనికాని ఎవరికి ఎలా ఇష్టం అయితే అలా చదువుకో వచ్చుననని కవి చెప్పాడు .మచ్చుకు కొన్ని పద్యాలు చూద్దాం –
‘’ఆదిత్య హృదయ నిన్నాహ్వానము జేతు –నధ్యాత్మ ఫలదాత యాసనమిదె-‘’
‘’వేయి కన్నుల దొరవీక్షి౦పగాలేని –నీ రూపమెప్పుడు నిరతి జూతు’’
‘’యెందుంటివో రామ ఇట కేలరావయ్య –యొక లిప్త దర్శన మొసగ రాదె’’
‘’శిడికీ నీకు భేదం లేదు .ఒకడు పందిని కొడితే ఇంకోడు కోతిని కొట్టాడు –‘’ఇద్దరు వ్యాథులె ఎంచి చూడ ‘’అని చమత్కరించాడు కవి .ఒక తమ్ముడికి పాడుకలిచ్చి బైరాగిని చేసి ఇంకో తమ్ముడికి ఆహార నిద్రలు లేకుండా చాకిరి చేయి౦చు కొన్నావని ,అన్నను గుహలో పెట్టి అతని భార్యను అపహరించినవాడి పక్షం చేరావు ,అన్నకు ప్రతిపక్షి ఐనవాడిని శరణాగతుని చేసి రాజ్యం అప్పగించావు అంటూ మన కాసులపురుషోత్తమకవి లాగా నిందా స్తుతి చేశాడు .దాన ధర్మాన్ని నిర్వర్తించే దాతను పాతాళం లోకి పంపి కూడా జగద్రక్షకుడవు అయ్యావని మేలమాడాడు .చివరి పద్యం –
‘’మంగళమో రామ ,మంగళమో శ్యామ –మంగళమరిభీమ మంగళంబు-మంగళము శివాత్మ మంగళమధ్యాత్మ-మంగళము మహాత్మమంగళము –మంగళమోశౌరి ,మంగళమో సూరి-మంగళము మురారి మంగళము
మంగళము బుధాయ ,మంగళము ధృవాయ –మంగళ మమలాయ మంగళంబు
హారతిం గొను మాది మధ్యంత రహిత –హారతిం గొను విశ్వేశ యఘ వినాశ –
హరతిం గొను మవ్యయాహ్లాద రూప –యోగ గణధామ నువుకొండ యోగి రామ ‘’
అని 108వ పద్యం తో శతకం పూర్తి చేశాడుకవి .గ్రేడ్ వన్ తెలుగు పండితుడు అవటం వలన కవిత్వమూ గ్రేడ్ వన్ గానే సాగింది .ధారాపాతంగా ఈ పద్యాలన్నీ సీసపద్యాలుగా తేటగీతులు తో కూర్చాడు. చక్కని భావన ,ఊహ చమత్కారం గుండెనిండా భక్తిభావం మాధుర్య విలసిత౦ గా శతక పద్యమాలకూర్చి ఆరామునికీ, రామయోగికీ సమర్పించిన పరమభక్తాగ్ర గణ్య కవి మండలీక సీతారామ సుకవి .ఈ కవి గురించి ఎంతమదికి తెలుసో నాకు తెలియదు .సరసభారతి అలాంటి భక్తికవి ని పరిచయం చేసే భాగ్యం పొందిందని వినయంగా తెలుపుకొంటున్నాను .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-20-ఉయ్యూరు