మర్రి గుంట శ్రీ పాండురంగ స్వామి దేవాలయం
కలియుగం లో భక్త పుండరీకుని ఉద్ధరించాలని పు౦డరీకాక్షుడైన శ్రీ మహా విష్ణువు మహారాష్ట్ర చంద్ర భాగా నదీ తీరం లో పండరీపురం లో పాండురంగ నామం తో వెలిశాడు .జ్ఞాన దేవ నామదేవ ,ఘోరాకుభార్ ,తుకారాం ,తులసీదాస్ ,సక్కూబాయి, మీరాబాయ్, జ్ఞానాబాయ్ గోమాబాయ్ మొదలైన భక్తులను రక్షించాడు .చాలాకాలం అక్కడే ఉండి,విసుగుపుట్టి ,కలికాలంలో భక్తులు కస్టపడి తన దగ్గరకు రాకపోవటం తో కలత చెంది ,తానేభక్తులను వెతుక్కుంటూ అన్ని లోకాలు తిరుగుతూ చిత్తూరు జిల్లా ఏర్పేడు తాలూకా మర్రి గుంటపురం (వట గర్త పురి )చేరాడట.అక్కడి భక్తుల భక్తిశ్రద్ధాలకు ఆనంద పడిఅక్కడే ఉండిపోవాలని నిశ్చయించాడు .ఆ గ్రామవాసి అయిన శ్రీ అరి గొండ శ్రీనివాస కవి ఈ వృత్తాంతాన్ని ‘’మర్రి గుంట పాండు రంగ శతకం ‘’గా రాశారు .
ఈ శతకం రాయాలని అనుకొన్నప్పుడు ఒకరోజు మధ్యాహ్నం భోజనం చేసి నిద్ర పోతుంటే ఆగ్రామవాసి అయిన బ్ర వే.పత్తంగి రాఘవాచార్యులు కలలో కనిపించి మంచి ప్రయత్నమే అనీ ,కానీ అందరికీ అర్ధమయేట్లు ‘’లీలా వృత్తం ‘’లో రాయమని హితవు చెప్పారు .నిద్ర లేచిన కవికి అది పాండురంగ స్వామి ప్రబోధమే అని పించి,వెంటనే అలవోకగా అయిదు ప్రార్ధన పద్యాలు స్పురించగా కాగితం పై వ్రాసి శతక రచన శ్రీకారం చుట్టాడు కవి .దీనికి తప్పొప్పులను సవరించినవాడు కవి ,పౌరాణికుడు శ్రీ కన్నె గంటి చిన లింగా చార్యుడు .శతక ముద్రణ చేసినవారు పౌరాణిక పితామహులు కొత్త పేటకు చెందిన శ్రీ కాకుమాను సూర్య నారాయణ రావు .గుంటూరు చంద్రికా ముద్రాశాలలో 1944లో ముద్రింపబడిన దీని వెల అర్ధరూపాయి మాత్రమే.
ప్రతి పద్యం చివర’’ పాండురంగా ‘’అని వస్తుంది .ఇస్ట దేవతా ప్రార్ధన చేసి ,పురవర్ణన చేశాడు కవి .ద్వాపరం లో ద్వారక గా ,గోపికలకు ఉనికి పట్టుగా ఉండేది మర్రిగుంట. కవి తాతపుల్లయ్య కాళహస్తి ప్రభువు మంత్రి .తల్లి పేరమ్మ తండ్రి కాళప్ప .భార్య కన్నమ్మ .కవి వంశంవారు ఈ ప్రాంత ప్రభువులు .అని చెప్పి దశావతారాలు వర్ణించి ,పాండురంగ స్వామి ఆపురం లో ఎలా ప్రవేశించాడో చెప్పాడు .1936లో ఈ సంఘటన జరిగిందట .
‘’పదియు తొమ్మిది వందలున్ -గడిచి ముప్పది దాటి యటు మీదటన్ –గదియు నారవ యేటను –నీమహిమ గా౦చి తిమి పాండురంగా’’ గొల్ల ఇళ్ళల్లో చోటుదోరక్క మర్రి గుంటవచ్చావా అంటాడు .స్వామి ఇక్కడికి రావటం ఇష్టం లేక ,ఓర్వలేక కొందరు పోరాటం చేసి ఓడిపోయారు .తిట్టిన వాళ్ళు, పూజ చెడగొట్టిన వాళ్ళూ మట్టిలోకలిసిపోయారట .న్యాయాన్యాలు తెలీకుండా పక్షపాతం చూపినవారు’’ పాడైరి పాండురంగా’’అన్నాడు .
‘’శృంగారదేవ రంగా నా నమస్కృతి నీకు పా౦డుర౦గా – రంగత్కృపా౦తర౦గా –రుక్మిణీ రమణ జై పాండురంగా ‘’అని 62పద్యాలు రాశాడు కవి .తర్వాత రామాయణం ఆరు కాండలు ఇలాగే 90వ పద్యం వరకు రాశాడు .91నుంచి108వరకు ‘’నీతిలీలావళి ‘’రాసి ఫలశృతి చెప్పాడు .శతకం పఠిస్తే సంతానం కలుగుతుందని ,ముక్తి’’ తంగేటి జున్ను’’ ఔతుందని భరోసా ఇచ్చాడు .శ్రీ స్వభాను నామసంవత్సర కార్తీక శుద్ధ దశమినాడు కావ్యం పూర్తి చేశానని కవి చెప్పుకొన్నాడు .చివర్లో మంగళం పాడాడు –
‘’మంగళము శ్రీనివాసా మంగళము మరిగుంట పురనివాసా –మంగళము చిద్విలాసా –నీకు జయ మంగళము పాండురంగా ‘’
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -8-10-20-ఉయ్యూరు