, శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -2
ఒకసారి బలరాముడు ఇక్కడకు వచ్చి పుష్కరిణీ స్నానం చేసి తిరునాయణ దర్శనం చేసి ,తమింట్లో ఉన్న రామప్రియ మూర్తికీ ఇక్కడి స్వామికీ తేడా ఏమీ లేదని గ్రహించి ,బృందావనం వెళ్లి కృష్ణుడికి చెప్పాడు .ఆయనక్కూడా స్వామిని దర్శించాలనే కోరికకలిగి పరివారంతోనూ తామ అర్చామూర్తి రామప్రియ తోనూ తరలి వచ్చి ,స్వామిని అర్చించి ,రామప్రియమూర్తిని తిరునారాయణ స్వామిప్రక్కనేసింహాసనం పై ఉంచి ప్రతిష్ట చేసి పూజించి ఆనందించాడు .అప్పటినుంచి యదు వంశ రాజులందరూ యాదవగిరి నుంచే రాజ్యపాలన చేశారు.అందుకే యాదవాద్రి గా పేరుపొందింది .
ఢిల్లీ పాదుషా హిందూ విగ్రహ ధ్వంసం చేస్తూ ,ఇక్కడి రామప్రియ స్వామి విగ్రహాన్నికొల్లగొట్టి తీసుకు పోతే ,అతడి కూతురు వరనందిని ఆవిగ్రహం ముచ్చట గా ఉన్నందున ఆటలాడుకోవటానికి తన అంతః పురానికి తీసుకు వెళ్ళింది .తిరునారాయణపుర దేవాలయ జీర్ణోద్ధారణ చేసిన యతిరాజులు అంటే భగ వద్రామానుజులు ,బ్రహ్మోత్సవాలు చేయటానికి ఇక్కడికి రాగా ఉత్సవమూర్తి అయిన రామప్రియ కనిపించకపోతే చి౦తి స్తుండగా స్వప్నం లో నారాయణస్వామి కనిపించి ఢిల్లీ పాదుషా దగ్గర ఉందని ,వెంటనే తెమ్మని ఆజ్ఞాపించాడు .
రామానుజులు శిష్య ప్రశిష్యులతో ఢిల్లీ వెళ్లి,పాదుషాను కలిసి తాము వచ్చినపని చెప్పారు .తన ఉగ్రాణం తెరిపించి అందులో ఉందేమో చూడమన్నాడు .అందులో లేదు .స్వామి కలలో కనిపించి అతనికూతురు దగ్గర ఆవిగ్రహం ఉందని చెప్పగా మర్నాడు పాదుషాకు ఆవిషయం తెలియజేయగా ,అతడు ‘’మీ దేవుడు మీరు పిలిస్తే వస్తాడా ?’’అని అడిగితే రామానుజులు తప్పక వస్తాడని చెప్పగా ,యతిరాజు ధ్యానించి స్వామిని రమ్మని పిలిచారు .అంతః పురంలోని రామప్రియ విగ్రహం కాలిఅందెల సవ్వడితో నడుచుకొంటూ రామానుజులవద్దకు రాగా వారు పరమానందంతో స్వామి శిరస్సు మూర్కొని ‘’ఎనదు సెల్వ పిళ్ళయే’’అంటే’’ నా సంపత్కుమారా’’ అంటూ అత్యంత ప్రేమతో కౌగలి౦చు కొన్నారు .పాదుషాకూడా అన౦దాతిరేకం తో రామానుజస్వామినీ బృందాన్ని అత్యంత గౌరవంగా సన్మానించి రామ ప్రియ విగ్రహాన్ని అందించి పంపాడు .అతని కూతురు వరనందిని విరహం తాళలేక ఏడుస్తుంటే ,వారి వెంటనే ఆమెనూ పంపాడు పాదుషా .అప్పటినుంచి రామప్రియమూర్తికి ‘’శెల్వప్పిళ్ళ’’నామం స్థిర పడింది .పాదుషా కూతురు వరనందినికి ‘’బీబీ నాచ్చియార్ ‘’అనే పేరు కలిగి ,ప్రత్యేకమందిరం కట్టించారు .గర్భగుడిలో ఉన్న బిలద్వారంగుండా ఆమె వచ్చిశెల్వ ప్పిళ్ళతిరునారాయణ స్వామిపాదాలలో కూర్చుంటుంది .ఆతర్వాత రామానుజులు ఉభయనాచ్చి యార్లు మొదలైన అర్చా విగ్రహాలు ఏర్పాటు చేశారు .సంపంగి వృక్షమూలం లో కనిపించిన తాయారు విగ్రహానికి ‘’యతుగిరి నాయకి ‘’అని పేరుపెట్టి నిత్యోత్సవ పక్ష మాస కళ్యాణ బ్రహ్మోత్సవాలు ,వైరముడి బ్రహ్మోత్సవం ,రథోత్సవ, తెప్పోత్సవాలు వైభవంగా జరుపుతూ సేవించారు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-20-ఉయ్యూరు