శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -1
శ్రీ తిరునారాయణ పురక్షేత్రాన్నే ‘’మేల్కోటయాదగిరి క్షేత్రం’’ అంటారు .ఈ క్షేత్ర మహాత్మ్యం నారదీయ పురాణం లో ఉన్నది .నారదునికి బ్రహ్మ సవిస్తరంగా ఈక్షేత్ర మాహాత్మ్యాన్ని వివరిస్తాడు .సహ్యపర్వతాలకు తూర్పున ఉన్న కావేరీ ప్రక్కన ఉన్న క్షేత్రమే ఇది .కర్ణాటకలో మాండ్యా జిల్లాలో ఉన్నది . కృతయుగం లో సనత్కుమారుడు నారాయణాద్రి అనీ ,త్రేతాయుగం దత్తాత్రేయుడు వేదాద్రి అనీ ,ద్వాపరం లో కృష్ణ బలరాములు యాదవాద్రి అనీ , కలియుగం లో యతి శేష్తుడు యతిశైలం అనీ పిలిచారు .108 దివ్య తిరుపతులలో ముఖ్యమైనది ,దివ్య క్షేత్రాలలో నాలుగవదిగా ,జ్ఞానమంటపం గా పేరుపొందింది .దీనికి రెండు క్రోసులదూరాన్ని అంతటినీ వైకుంఠ వర్ధన క్షేత్రం అంటారు .పర్వతం పై శ్రీ యోగ నృసింహస్వామిదేవాలయం దిగువన కళ్యాణీ తీర్ధం,దీని చుట్టూ శ్రీ వరాహ క్షేత్రం ,పంచభాగవత క్షేత్రం,ఉత్తర పశ్చిమం లో తార్ఖ్య, నయన క్షేత్రం ,చుట్టూ అష్ట తీర్ధాలున్నాయి .తిరు నారాయణ స్వామి స్వయంభు గా విమానం తో సహా ఆవిర్భవించి వేలాది సంవత్సరాలుగా ఆరాధింపబడుతున్నాడు .సనత్కుమారుని కోరికపై బ్రహ్మ నారాయణుని ప్రార్ధించి ఆయన హృదయం నుంచి వేరొక మూర్తిని ఇవ్వమని కోరితే అర్చారూప మైన శ్రీ తిరునారాయణస్వామి అనే శ్రీరామప్రియ విగ్రహం ఇస్తే ,ఆయన సనత్కుమారునికిస్తే విమాన సహితంగా తిరునారాయణపుర క్షేత్రం లో దేవతలందరి సమక్షం లో ప్రతిష్టించాడు .తర్వాత దేవతలు ఋషులు ,ఆతర్వాత దత్తాత్రేయుడు ,బలరామ కృష్ణులు ఆరాధించారు .
యతిరాజులు శ్రీ రంగం నుండి దిగ్విజయ యాత్ర చేస్తూ ,మైసూర్ ప్రాంతంలో ద్వార సముద్రం లోని పోసలరాజు విఠల దేవారాజు కూతురికి దయ్యం పడితే వదిలించి ,అతడిని శిష్యుని చేసుకొని ,తొండనూరిలో జైనులను వాదం లో ఓడించి ,ఆరాజుకు విష్ణు వర్ధన రాయడు అనే పేరుపెట్టి ,స్వామి స్వప్నాదేశం తో తిరునారాయణపురం వచ్చి శిథిలమైన గోపుర విమానాలు పునర్నిర్మించారు .
యాదగిరి సమీపం లో దర్భ తీర్ధం గట్టుమీద శాండిల్యమహర్షి శ్రీమన్నారాయణుడికై తపస్సు చేయగా ప్రత్యక్షమై, అతడు బదరికాశ్రమం వెళ్లి తపస్సు చేయాలనుకొన్నానని తెలిపితే ,అక్కడ ఉన్నదీ తానే అని చెప్పి ,తను కొద్దికాలం లో ఇక్కడికే వచ్చి ఇక్కడే ఉంటానని చెప్పి వెళ్ళవద్దన్నాడు .సరే అని శాండిల్యమహర్షి ఇక్కడే ఉంటూ బద్రీనాధుని సేవించాడు .ఈ దేవుడే శెల్వప్పిళ్ళ దేవర గా పూజలు అందుకొంటున్నాడు.
త్రేతాయుగం లో శ్రీరాముడు వనవాసం చేస్తూ తిరునారాయణ క్షేత్రానికి వచ్చి,కళ్యాణీ తీరం లో ఉంటూ సీతా లక్ష్మణ సమేతంగా శ్రీతిరునారాయన మూర్తి పూజాదికాలు త్రికరణ శుద్ధిగా చేశాడు .ఒకరోజు స్వామి స్వప్నం లో కనిపించి ,ఆయన రావణ సంహారం తర్వాత అయోధ్యలో పట్టాభి షేకం జరిగాక ,రామరాజ్యపాలన లో తాను వేరొక అంశతో అక్కడికి వస్తానని చెప్పాడు . శ్రీరామ పట్టాభి షేకం తర్వాత విభీషణుడు లంకకు తిరిగి వెడుతుంటే ,తరతరాలుగా ఇక్ష్వాకుల ఇలవేల్పు అయిన శ్రీ రంగనాథ స్వామి అర్చామూర్తిని అతడికిచ్చిపంపాడు రాముడు .దారిలో శ్రీరంగం దగ్గర ఆగగా ,అక్కడినుంచి కదలక పొతే అక్కడే ప్రతిష్టించాడు .ఇంట్లో అర్చామూర్తి లేదు కదా అని బాధపడుతుంటే బ్రహ్మ తాను అర్చించే తిరునారాయణ హృదయోద్భవంబైన శ్రీ రామప్రియ మూర్తినిచ్చాడు .
శ్రీరాముని కుమారుడు కుశుడి కూతురు కనకమాలికను చంద్ర వంశ యదు శేఖర మహారాజుకిచ్చి పెళ్లి చేసి ,స్త్రీధనం తో పాటు తన అర్చామూర్తి రామప్రియను కూడా ఇచ్చేశాడు .అప్పటినుంచి యాదవ వంశం వారంతా రామప్రియ అర్చారూపాన్నే పూజించారు .ఇలాసూర్యవంశ అర్చామూర్తి చంద్ర వంశ అర్చామూర్తిగా మారింది .తిరునారాయణ దివ్య క్షేత్రం లో ,దివ్య విమానానికి వాయవ్యం లో శ్రీ యతుగిరి నాచ్చి ఆలయం ఉంది.విష్ణు వర్ధన రాయలకాలం లో ఆ దేవి అనేక యుద్ధాలలో అతడికి విజయం చేకూర్చింది .ఆమె వీరావేశాన్ని ఉపశమించ జేయటానికి నారాయణ మూర్తి గజేంద్ర వరదుని రూపంలోతనభార్యకు కనిపి౦చగా, శాంతించింది .అప్పటినుంచి శౌర్యనాయకి గా పిలువబడి అర్చనలు అందు కొంటోంది .తురుష్కులలనుంచి దేశాన్ని రక్షిస్తూ యుద్ధం చేస్తున్న తిరుమలనాయక రాజు కలలో దేవి కన్పించి అభయమిచ్చి గెలిపించింది .హిరణ్యకశిపుని కొడుకు భక్త ప్రహ్లాదునికి స్మృతితి సంతాన రూప ధ్యానానికి ప్రత్యక్షమై న ప్రహ్లాద వరదుడు ,తూర్పున నృసింహ గిరిశిఖరం పై యోగ నృసింహస్వామిగా ఉంటూ భక్తుల కోరికలు తీరుస్తున్నాడు .
పూర్వం ఒకసారి వ్యాస అంబరీష శుక పుండరీక ,రుక్మాంగద మొదలైన మహా భక్తులు ,రాక్షసుల బాధ లేకుండా తపస్సుకు భద్రమైన ప్రదేశం ఏది అని చర్చించి ,తిరునారాయణపురమే శ్రేష్టమైనదని నిశ్చయించారు ..అందరూ ఇక్కడే కొంతకాలం తపస్సు చేసి యోగ నరసింహస్వామిని సేవించారు .అది కలియుగ వైకుంఠం లాగా ఉందని భావించి ,ఇక్కడే స్వామిని శాశ్వతంగా ఉండిపొమ్మని ప్రార్ధించారు .కల్యాణి తీర్దానికి పడమట జ్ఞానాన్న అశ్వత్ధ వృక్షం క్రింద తపస్సు చేశారు .
పూర్వం వరాహావతారం లో విష్ణు మూర్తి సముద్రం లో మునిగినన భూమిని పైకేత్తుటవలన హిరణ్యాక్షుడిని వధించటం వలన కలిగిన శ్రకు కారిన చెమట ఇక్కడ శ్రీ పుష్కరిణి అయింది .పూర్వం సనకాదులు ఇక్కడ స్నానాదులు చేసి ఆనంద పరవశం తో ‘’కళ్యాణ్ కళ్యాణ్’’అనటం చేత దీనికి కల్యాణి పుష్కరిణి పేరు వచ్చింది .గంగాది నదీ స్నాన ఫలితమే ఇందులో చేసినా లభిస్తుంది .ఈ తీర్దానికి తూర్పున వరాహ క్షేత్రం లో శ్రీ లక్ష్మీ వరాహస్వామి కొలువై ఉన్న దేవాలయం ఉన్నది .దక్షిణాన సీతారణ్య క్షేత్రం లో శ్రీరామాదులు ఇక్కడికి వచ్చినప్పుడు దప్పిక బాగా అయితే రాముడు చేసిన బాణ ప్రయోగం తో భూగర్భజలం పైకి వచ్చితీర్ధంగా మారి ధనుష్కోటి అనే పేరు పొంది,గిరికి దక్షిణంగా ప్రవహిస్తోంది .కల్యాణి తీర్దానికి పశ్చిమాన వ్యాసాంబరీషాదులు తపస్సు చేసిన భూమిని పంచ భాగవత క్షేత్రం అంటారు .దీనికి దగ్గరలో ఒకప్పుడు స్వేత ద్వీపం నుంచి ఇక్కడికి గరుత్మంతుడు వచ్చికొంతకాలమున్న ప్రదేశాన్ని తార్క్ష్యక్షేత్రం అంటారు .ఉత్తరాన ఉన్న నాయన క్షేత్రం లో శ్రీ కేశవ స్వామి దేవాలయం ఉన్నది .కల్యాణి పుష్కరిణి లో మూడు రోజులు స్నాన జపతపాలు చేసిన ,తిరునారాయణ,యోగ నరసింహస్వాములను అర్చిస్తే ,12అశ్వ మేధయాగాల ఫలితం లభిస్తుంది .
క్షీర సాగరం లో యోగ నిద్రలో ఉన్న మహావిష్ణువు కిరీటాన్ని ప్రహ్లాదుని కొడుకు విరోచనుడు ఎత్తుకు పోయి పాతాళం లో దాక్కున్నాడు .యోగనిద్ర నుంచి మేల్కొన్న విష్ణువు ఈ విషయన్ని గరుత్మంతుడికి తెలియజేయగా ,ఆయన పాతాళానికి వెళ్లి వాడిని జయించి కిరీటం తో సహా భూలోకానికి వచ్చి ,శ్రీ కృష్ణుని దర్శించి ,బృందావనం వెళ్లి ,గోపగోపికలతో వేణు వినోదలోలుడైన శిఖి పింఛఛమౌళిని దర్శించగా అతని చేతిలోని కిరీటం చూసి ఆశ్చర్యపోయి ,దాన్ని అడిగి తీసుకొని ధరిస్తే సరిగ్గా సరిపోయింది .తాను అర్చించేఅనిరుద్ధుని ఇంట్లో ఉన్న రామప్రియ అర్చామూర్తికి పెడితే సరిపోయింది .క్షీరాబ్ధి శయనుడైన మహా విష్ణువు శిరస్సు రెండున్నర లక్షల యోజనాల నిడివి అయినా కృష్ణుడి శిరస్సుకు ,అర్చామూర్తి శిరస్సుకుసరిపోవటం ఏమిటని ఆశ్చర్యపడ్డాడు వైనతేయుడు.వైకు౦ఠం చేరి స్వామికి జరిగినదంతా వివరించాడు .ఆయన సంతోషించి ఆకిరీటాన్ని శ్రీరామప్రియ అర్చామూర్తి కే అందజేయమని గరుత్మంతునికిఆనతిచ్చి సమర్పింప జేశాడు .వైనతేయుడు తెచ్చింది కనుక ‘’వైరముడి ‘’అనిపేరు .వైరము అంటే వజ్రం కనుక వజ్రాలు పొదగిన కిరీటం అనీ అర్ధం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -9-10-20-ఉయ్యూరు ,