సాధారణంగా ఆత్రేయ రాత్రిళ్ళు మెరీనా బీచ్ కు వెళ్లి రాస్తూ ఉండేవాడు .వెలుగు నీడలు సినిమాకు ఆత్రేయతో అర్ధవంతమైన డైలాగ్స్ రాయించాలని నిర్మాత దుక్కిపాటి మధుసూదనరావు ఆత్రేయకు ఒకకారు అసిస్టెంట్ డైరెక్టర్ కేవిరావు, బాయ్ నీ అప్పగించి కేరళలోని పీచీ డాం గెస్ట్ హౌస్ కు పంపాడు. నెలరోజుల్లో స్క్రిప్ట్ రెడీ చేసేశాడు ఆత్రేయ మధురస్వప్నం సినిమాకు మాటలు రాస్తూ క్లైమాక్స్ సీన్ డైలాగులుగోదావరిలో పడవ మీద రాస్తానంటే డైరెక్టర్ రాఘవేంద్రరావు ఏర్పాటు చేశాడు. అయిదు వందలకోసం ఒకసారి మూడు వందలు ఖర్చుచేసి టాక్సీలో వెళ్ళిననఘనుడు ,డబ్బు పుష్కలంగా ఉంటే ఖర్చు చేసేదాకా నిద్రపోయేవాడు కాదు .డబ్బులేకపోతే డబ్బుకోసం నిర్మాత చుట్టూ తిరిగేవాడు .సిల్క్ బట్టలు సెంట్లు పెన్నులు నాజూకు కాగితాలు ఫైల్స్ కోసం పిచ్చగా డబ్బు తగలేసేవాడు .తను నిర్మించి డైరెక్ట్ చేసిన వాగ్దానం సినిమాలో దాశరధి చేత పాట రాయించిన సహృదయుడు .’’నా కంటిపాపలో నిలిచిపోరా ‘’పాట రాశాడు దాశరధి .శ్రీ శ్రీ రెండు పాటలు 1-కాశీపట్నం చూడర బాబు 2-రేలంగి చెప్పిఅన హరికథ .
రుణానుబంధం ,దేశమంటే మట్టికాదోయ్ మొదలైన సినిమాలకు కథారచయిత .మూగమనసులు కు ఆత్రేయ ముళ్ళపూడి , డా ఆనంద్ కు ఆత్రేయ వి మధుసూదనరావు వాగ్దానం కు ఆత్రేయ ,బొల్లిముంత ,తోడికోడళ్ళు కు ఆత్రేయ ఆదుర్తి ,కథానుసరణలు చేశారు .సతీ సావిత్రి ,ఆదర్శకుటుంబం లకు ఆత్రేయ ,ప్రత్యగాత్మ ,మంచిమనసులుకు ఆత్రేయ ఆదుర్తి ,కన్నతల్లికి ఆత్రేయ జగన్నాథం స్క్రీన్ ప్లే రాశారు .కోడెనాగు, ఆదర్శం సినిమాలలో ఆత్రేయ నటించాడు .కోడెనాగులో రామశర్మ పాత్రలో జీవించాడు. భామాకలాపం లో అతిధిపాత్ర వేశాడు .తెలుగు సినీ పరిశ్రమలో ‘’అ’’త్రయం అంటే అక్కినేని, ఆదుర్తి, ఆత్రేయ కాంబినేషన్ కనకవర్ష మే కురిపించింది .
ఆత్రేయ ఆత్మకథ రాస్తుంటే ,భార్య పద్మావతి గారు ఆయన ప్రవర్తనతో విసిగిపోయి ఒక కార్డు రాస్తూ ‘’ఊరికే ఆత్మకథ రాయటం కాదు, అవతలివారికి జరిగినఅన్యాయాన్ని కూడా అందులో రాయండి ‘’అని రాసి ఆ విషయం మర్చి పోయింది .తన ఆత్మకథలో భార్యగురించి రాయటమే కాదు ఆ ఉత్తరాన్ని సీలు చేసి ఆంద్ర జ్యోతికిచ్చి తాను చనిపోయాక ప్రింట్ చేయమని వాగ్దానం కూడా తీసుకొన్నాడు .
ఆత్రేయ రచనలపై పరిశోధనలు జరిగాయి .’’ఆత్రేయ నాటికా సాహితి ‘’లఘు సిద్ధాంత వ్యాసం శ్రీ ఎ.వి .రవీంద్రకుమార్ రాసి వెంకటేశ్వరాయూని వర్సిటీలో 1980లో సమర్పించాడు .పైడిపాల సత్యనారాయణ రెడ్డి ‘’ఆత్రేయ నాటకాలు –పూర్వాపరాలు ‘’లఘుసిద్ధాంత వ్యాసం రాసి 1984లో ఆంధ్రాయూని వర్సిటీలో సమర్పించాడు .ఆత్రేయ – అభ్యుదయ ఆదర్శాలు ‘’పరిశోధనా గ్రంథం కే .రాధాదేవి రాసి మద్రాస్ యూనివర్సిటీకి 1990లోసమర్పించింది .కే స్వర్ణలత ‘’ఆత్రేయ –విశ్వశాంతి వైశిష్య౦ ‘’పరిశోధన గ్రంథం రాసి ,నాగార్జున విశ్వవిద్యాలయం లో 1992లో సమర్పించారు .డా కే.బి .లక్ష్మి ‘’ఆత్రేయ సినీగీతాలు ‘’సిద్ధాంతవ్యాసం రాసి 1994 కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం లో సమర్పించారు .’’ఆత్రేయ –కణ్ణదాసన్ పాటలు –ఒక పరిశీలన ‘’వ్యాసాన్ని ఆదుర్తి వెంకట నాగ శోభ రాసి,మద్రాస్ యూని వర్సిటీకి సమర్పించింది .’’మనసుకవి ఆత్రేయ నాటక సాహిత్యం –సంభాషణలు ‘’పరిశోధన గ్రంథం ‘’ఆత్రేయ సినిమా సంభాషణలు –ఒకపరిశీలన ‘’అంశం పై పరిశోధన గ్రంథంకూడా రాసి 2000లో ఆంద్ర విశ్వ విద్యాలయానికి శ్రీ తలకోటి పృధ్వీ రాజ్ సమర్పించారు .ఈయనే ‘’మహాకవి ఆత్రేయ ‘’డాక్యుమెంటరి చిత్రం కూడా రూపొందించారు .
డా. తలకోటి ‘’ఆత్రేయ సాహితీ స్రవంతి ‘’స్థాపించి జాలాదికి ,ఆత్రేయ శిష్యుడు గురు చరణ్ కు పురస్కారం అందించారు .ఆత్రేయ ఆణిముత్యాలు సిడి విడుదల చేశారు .గొల్లపూడి మొదలైన ప్రముఖులతో ఇంటర్వ్యు చేసి ‘’ఆత్రేయ సాహిత్యం వ్యక్తిత్వం ‘’ఆడియో సిడి తెచ్చారు .ఆత్రేయపాటలు ,సంభాషణా చాణక్యుడు అనే వీడియో, సిడిలు తెచ్చారు .ఆత్రేయ జీవితం సాహిత్యం ,ఆత్రేయమొదటి చివరిపాటలు, వీణపాటలు సినీ సంభాషణలు మొదలైన డాక్యుమెంటరీలు తయారు చేసి యుట్యూబ్ లో పెట్టారు .’’ఆచార్య ఆత్రేయ. కాం ‘’పేరుతొ వెబ్ సైట్ నిర్వహించారు .అనకాపల్లిలో ఆత్రేయ విగ్రహం నెలకొల్పాలని ఆలోచనలో ఉన్నారు .
సమాప్తం
ఆధారం –‘’డా తలకోటి పృధ్వీరాజ్ ‘రాసిన ‘’నేనూ –ఆత్రేయ ‘’’eబుక్ ‘’