శ్రీ తిరునారాయణ పుర క్షేత్ర మహాత్మ్యం -3-చివరిభాగం
యాదవగిరికి నాలుగు వైపులా అష్టాక్షరీ మహా మంత్రాలతో అష్ట తీర్దాలు ఏర్పడి భక్తులను ఆదుకొంటున్నాయి .ఒక యదువంశరాజు పర్వతం చుట్టూ నాలుగు వైపులా కోటకట్టించి ‘’మేలు కోట ‘’అని పేరుపెట్టాడు .అప్పటినుంచి యతి నారాయణపురం ను మేల్కోట అంటున్నారు .ఫాల్గుణ శుద్ధ రోహిణీ నక్షత్రం రోజున స్వామికి బ్రహ్మోత్సవ ధ్వజారోహణం ,ముందురోజు కళ్యాణ పుష్కరిణీ తీర మంటపం లో కల్యాణం ,పుష్యమి నక్షత్రం నాడు వైరముడి ,మర్నాడు రాజముడి ,రధోత్సవం ,హస్తా నక్షత్రం నాడు తీర్ధ వారిఉత్సవం ,తర్వాత రోజు సహస్ర కలశ తిరు మంజనం ,చూర్నాభిషేకం ,మర్నాడు ఉత్సవమోర్తులను గర్భ గుడిలో ఉంచి, ఆమర్నాడు అన్నకోటి మహోత్సవం చేస్తారు .
రామానుజాచార్యులు విఠలదేవుని శిష్యుడిని చేసుకొని జైనులను ఓడించి ,స్వామి ఆనతితో,తిరునారాయణపురం వచ్చి అతని సాయంతో కోవెల, మండపాదులు కట్టించి ,బ్రహ్మోత్సవాలు వైభవంగా జరిపిస్తూ 12ఏళ్ళు ఉండి,శ్రీరంగానికి మళ్ళీ వెళ్ళే ప్రయత్నం లో ఉంటె ,ఇక్కడి అర్చక,పరిచారక బృందం 52 మంది ఆచార్యస్వామిని వదిలి ఉండలేమని బాధ పడుతుంటే తన ప్రతిబి౦బ౦తో ఒక అర్చా విగ్రహం చేయించి ,ప్రతిష్టించి గాఢాలింగనం తో ప్రాణ ప్రతిస్ట చేసి తెర చాటు చేయింఛి ,వాళ్ళు మాట్లాడితెతనవిగ్రహం కూడా మాట్లాడుతుందని చెప్పగా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడిగితే, విగ్రహం అన్నిటికీ చక్కని సమాధానాలు చెప్పగా, వారు చాలా సంతోహించి ఆచార్యులవారి శ్రీరంగ ప్రయాణానికి ఆమోదం చెప్పగా, ఆయనా వదలలేక వదలలేక బయల్దేరి శ్రీంగం చేరి శ్రీ రంగనాథ స్వామి సేవ చేస్తూ ఉన్నారు .
తిరునారాయణ స్వామి సన్నిధికి తూర్పున కురుత్తాళ్వార్ సన్నిధి ,దానిప్రక్క పిళ్ళలోకాళ్వార్ సన్నిధి, సంపత్కుమార సన్నిధి, ఎదురుగా స్థంభంలోరాజ ఉడయార్ విగ్రహం ,బయట ఉమ్మడి కృష్ణరాయలు నలుగుర భార్యలతో ఉన్న విగ్రహం ఉన్నాయి.ముఖ్య దేవాలయానికి ముందు అతిపెద్ద బదరీ వృక్షం బద్రీ నాథ దేవాలయం ,దానివెనుక రామానుజ మఠం,పట్టాభిరామ దేవాలయం ,దానిప్రక్క శెల్వరాజ మంచినీటి కొలను ,ఉత్తర మాడ వీధిలో మనవాళ మహాముని గుడి ,రాజవీధిలో వసంతోత్సవ బంగాళా ,దానికెదురుగా వేదాంత దేశికుల గుడి ఉన్నాయి .
వైరముడి మహోత్సవానికి ముందురోజు మైసూర్ రాజాస్థానం నుంచి వైరముడి ,రాజముడి రాజభటులతో గౌరవంగా బయల్దేరి ఆరాత్రి శ్రీరంగపట్నం చేరి ,అక్కడ స్వామి సన్నిధిలో పూజాదికాలు పొంది, మర్నాడు ఉదయం బయల్దేరి దారిలో పూజలు అందుకొంటూ సాయంత్రానికి తిరునారాయణ పురం చేరి, మాడ వీధి ప్రదక్షణాలయ్యాక ముందుగా రామానుజ ఆలయం చేరతాయి .వైరముడి సంపత్కుమారులకు సమర్పించి గరుడవాహనం పై తిరువీధి ఉత్సవం జరిపించుకొని ,వాహనమంటపం చేరి ,వైరముడి ని ఎత్తించి, రాజముడి ని సమర్పిస్తారు .మర్నాడు ఉదయం 10గంటలకు వైరముడిని మాత్రమె భటుల సాయం తో మైసూర్ సంస్థానానికి చేరుస్తారు .బ్రహ్మోత్సవ సమయం లో పాదుషా అతడికొడుకు ,వరనందిని ఇక్కడికి వచ్చి కనులారా చూసి తమ అల్లుడికి పాదుషా అరుదైన కానుక లర్పించి బలిపీఠం దాకా వెళ్లి దర్శించి వెడతారు .
రామానుజులు ఢిల్లీ కి వెడితే తే పాదుషా గౌరవ సన్మానం చేస్తాడు .ఆచార్యులు తన సేవలో ఉన్న పంచములకు ‘’కులత్తారు ‘’బిరుదు నిచ్చి ,బ్రహ్మోత్సవాలలో వీరందరికీ పుష్కరిణీ స్నాన ,స్వామి సన్నిధి సేవ ఏ ఆటంకం లేకుండాజరిగేట్లు చూస్తారు .పూరీ జగన్నాథంలో ప్రసాద పావనత్వం ,తిరుమలలో తీర్ధ పావనత్వం ఉంటె, ఇక్కడ తిరునరాయణ పురం లో స్పర్శ పావనత్వం ఉంటుంది .ఈవిషయం రామాయణం,గురుపరంపరాప్రభావం ,ప్రపన్నామృతం వంటి గ్రంథాలలోనూ ఉంది .
‘’కళ్యాణీ ఎలసద్యతుగిరినారాయణార్ధి కల్ప తరో-సంపత్కుమార భవ తే నిత్య శ్రీర్నిత్య మంగళం భూయాత్ ‘’
కమలా కుచ కస్తూరీ కర్దవా౦కిత వక్షసే –యాదవాద్రి నివాస సంపత్పుత్రాయ మంగళం ‘’
ఈ పురం లో చాలా కుల్లం లు అంటే కొలనులున్నాయి .మంచినీటికి వేరే స్నానికి వేరే ,స్వామి అభిషేకపూజాదులకు వేరే ప్రత్యేక కొలనులున్నాయి .వైష్ణవ భక్తులు ముందుగా రామానుజ దర్శనం చేసి తర్వాత తిరునారాయణ మూల విరాట్ దర్శనం చేస్తారు .కొండపై శ్రీ యోగ నరసింహస్వామి దేవాలయం ఉంది.మెట్లు శిధిలమై ఉంటాయి .క్రీశ.798కి చెందిన కులశేఖర మహారాజు అనే కులశేఖర ఆళ్వార్ తన రాజ్య సర్వస్వాన్ని తిరువనంతపుర శ్రీ అన౦త పద్మనాభస్వామికి సమర్పించి ,కొడుకు తో తరచుగా ఈ ఆలయానికి వచ్చి తిరునారాయణ స్వామి దర్శనం చేసుకొని తనకవిత్వం వినిపించేవాడు .జీవితం చివరి రోజులలో కూడా వచ్చి దర్శించినట్లు ఆధారాలున్నాయి .’’దక్షిణ బదరి క్షేత్రం అని ప్రసిద్ధి చెందిన’’క్షేత్రం ఇది .
ఒక సారి రామానుజాచార్యులవారిని చోళ రాజులు శ్రీరంగం నుండి వెడలగొడితే ,ఆయన తిరునారాయణపురం దగ్గరున్న తొండనూరు వచ్చి ,ఇక్కడి విఠలదేవరాజుకు ,ఆయన కూతురికి పిశాచం పట్టి పీడిస్తుంటే మంత్ర ప్రభావంతో వదలించ దలచగా .ఆచార్యులవద్దపవిత్ర విభూతి అయిపోయిందని గ్రహించగా నారాయణ స్వామి కలలో కనిపించి ,కొండప్రక్క గోతిలో ఉంది చూడమని చెప్పగా ,విఠలదేవుడితో అక్కడికి వెళ్లి మూలవిరాట్ ను కనుగొని ప్రతిష్టించి దేవాలయం నిర్మించారు .
ఆధారం – ‘’ఆరు అధ్యాయాల నారదీయ పురాణా౦ర్గత మహాక్షేత్ర శ్రీ తిరు నారాయణపుర మహాత్మ్యం ‘’
ముద్రణ –శ్రీరంగం ఎ. సుదర్శన్ అండ్ సన్స్ వారిచే 1927లో శ్రీనికేట ముద్రక్షరశాలలో ముద్రింపబడింది .వెల –అణాలు 6.
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -10-10-20-ఉయ్యూరు