ప్రసార ప్రయోక్త, పారమార్థికుడు

దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియో కళాకారుడు వేలూరి సహజానంద. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు సహజానంద రూపొందిచిన అశ్రుఘోష కార్యక్రమం విలక్షణమైనది, అపురూపమైనది.
హైదరాబాదు ఆకాశవాణిలో సుమారు రెండు దశాబ్దాలు పని చేసి, సర్వీసులో ఉండగానే కనుమూసిన సాహిత్యవేత్త, ఆధ్యాత్మికవేత్త, ఆకాశవాణి ప్రయోక్త వేలూరి సహజానంద (1920–1978). తొలి నుంచి భగవద్గీత మీద ఎనలేని ఆసక్తితో రచనలు చేసిన సహజానంద ఆకాశవాణిలో కూడా గీత గురించి చక్కని ప్రసంగాలు ఎన్నో చేశారు. ఈ చిరు ప్రసంగాలు ‘గీతా దీపం’ అనే పేరుతో రెండు సంపుటాలుగా అందుబాటులో ఉన్నాయి. దేవులపల్లి కృష్ణశాస్త్రి, ఆచంట జానకిరాం, గుర్రం జాషువా, దాశరథి, రావూరి భరద్వాజ, భాస్కరభట్ల, గోపీచంద్, బుచ్చిబాబు వంటి ప్రముఖుల కోవలో చెప్పుకోదగ్గ రేడియోమూర్తి వేలూరి సహజానంద. 1920 అక్టోబరు 8న కృష్ణాజిల్లా చిరివాడలో యజ్ఞనారాయణ శాస్త్రి, లక్ష్మీనరసమ్మ దంపతులకు జన్మించిన సహజానందకు మహాపండితులు వేలూరి శివరామశాస్త్రి పినతండ్రి. అరవిందుల అనువాదకులు చంద్రశేఖరం మరో పినతండ్రి.
తొలుత ఆంధ్రరాష్ట్రం, పిమ్మట ఆంధ్రప్రదేశ్లో పౌరసంబంధాల శాఖలో ఎనిమిదేళ్ళు పని చేసిన సహజానంద 1960లో హైదరాబాదు ఆకాశవాణిలో పంచవర్ష ప్రణాళికల ప్రచార విభాగంలో ప్రొడ్యూసర్గా చేరారు. ఆ బాధ్యతలు నిర్వహిస్తూ ‘వ్యాఖ్య’ అనే కార్యక్రమాన్ని ప్రతి నిత్యం రూపొందించేవారు. ఆకాశవాణిలో ఎంతోమంది సాహితీమూర్తులను శ్రోతలకు పరిచయం చేశారు. జాతీయ కవిసమ్మేళనం కూడా నిర్వహించేవారు. ఆయన తర్వాత ఆ బాధ్యతలను రావూరి భరద్వాజ నిర్వహించారు. దాశరథి కృష్ణమాచార్యుల విదేశీ పర్యటన గురించి పరిచయం చేసింది వేలూరి సహజానందే. ‘మాలపల్లి’ నవల ఆధారంగా ప్రదర్శించిన నాటకం చూసి, రేడియోకు అనుగుణంగా దానిని రూపొందించమని నగ్నమునిని కోరారు సహజానంద. అలా రేడియోలో ‘మాలపల్లి’ మరోసారి తెలుగువారిని చేరింది, ఆకాశవాణి ఆణిముత్యంగా మిగిలింది. తెన్నేటి విశ్వనాథం, మాడభూషి అనంతశయనం అయ్యంగార్, యన్.జి. రంగా, కాసుబ్రహ్మానంద రెడ్డి, నార్ల వెంకటేశ్వరరావు ఇత్యాదుల అభిప్రాయాలతో టంగుటూరి ప్రకాశం గురించి సహజానంద రూపొందించిన కార్యక్రమం ఇప్పుడు యూట్యూబ్లో అలరిస్తోంది.
పటాటోపం లేకుండా అర్థవంతంగా, అలవోకగా రేడియోలో ప్రసంగించడం సహజానందలో గమనించవచ్చు. రేడియో సంపర్కంతో ఆయన మాట్లాడే చిన్నచిన్న వాక్యాలు, వినేవారికి ఆహ్లాదం కలిగిస్తాయి. ఆయన కనుమూసేదాకా ప్రతియేటా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రవేశపెట్టే వార్షికబడ్జెట్ను తెలుగులోకి అనువదించి ప్రతిని సిద్ధం చేసేవారు. కొన్ని సంవత్సరాలుగా ఆర్థిక విషయాల వ్యక్తీకరణ, పదాల వినియోగం స్థిరపడడంలో సహజానంద కృషి విశేషమైనదీ, విలక్షణమైనదీ. రెండు పదుల వయసు మించకముందే జర్నలిస్టుగా ‘తెలుగు విద్యార్థి’లో రచనలు చేశారు. మూడుపదులకు జిడ్డు కృష్ణమూర్తి రచన ‘ఎడ్యుకేషన్ అండ్ మీనింగ్ ఆఫ్ లైఫ్’ను ‘విద్యార్థి జీవితాశయాలు’ పేరిట అనువదించారు. జీవితపు సంక్లిష్టతను పరిశీలించడం ఆయనకు ఆసక్తి కావచ్చు. ఈడిపస్ కాంప్లెక్స్ లాంటి దాన్ని చిత్రించే వేలూరి చంద్రశేఖరం రచన ‘కాంచనమాల’ను రేడియో నాటకంగా సహజానంద చక్కగా రూపొందించి పేరు పొందారని, ఆ నాటకంలో ‘తిష్యరక్షతి’ పాత్ర ధరించిన శారదా శ్రీనివాసన్ అంటారు. 1977లో పెనుతుఫానుతో దివిసీమ కకావికలమైనపుడు ఆకాశవాణి చేసిన ప్రసార సేవ విలక్షణమైనది, అపురూపమైనది. ఈ నేపథ్యంలో వేలూరి సహజానంద రూపొందించిన ‘అశ్రుఘోష’ ఆకాశవాణి కార్యక్రమానికి జాతీయ వార్షిక బహుమతి లభించింది. 1920 అక్టోబరు 8న జన్మించిన వేలూరి సహజానంద 1978 నవంబరు 10న రిటైరు కాకుండానే కనుమూశారు.
హడావుడి, ఆర్భాటం లేకుండా నెమ్మదిగా కనబడే పరమ శాంతమూర్తి అని ఆయననెరిగిన సాహితీవేత్త నగ్నముని అంటారు.
డా. నాగసూరి వేణుగోపాల్
—