ప్రొఫెసర్ గిడుగు సీతాపతిగారు వేటూరి వారి ప్రత్యేకతను వివరిస్తూ ‘’మన ప్రాచీన ,మధ్యయుగ రచయితలు తమ వచన రచనలలో కొన్ని వ్యావాహారిక పద్ధతులు అనుసరించారు అసలు రచనలో మరోరకమైన వ్యాకరణ భాష ,శైలి లో రాస్తూనే . తాళపత్రాలలో ఉన్న ఈ విషయాలను అంతకు ముందు ఎవరూ గుర్తించనే లేదు .వాటినన్నిటినీ తేటతెల్లంగా ఉదాహరించారు వేటూరి ,మా తండ్రి రామమూర్తి ,గురజాడ గార్లు .అలాంటి వాటిని కొన్ని ప్రముఖ ప్రచురణ సంస్థలు సవరణ చేసి గ్రాంధికం అక్కడ చొప్పించి ముద్రించాయి.దానివలన భాషా సౌందర్యం దెబ్బతిన్నది అని ప్రభాకర శాస్త్రిగారన్నారు ‘’.
వ్యావహారిక భాషోద్యమం లో వేటూరి వారి ప్రతిస్పందనలు –
‘’నవ్య సాహిత్య పరిషత్ ,ప్రతిభ పత్రిక స్థాపనలో గురజాడ, గిడుగు వారి ముఖ్య పాత్ర ఉన్నది వారిద్దరూ నాకు ముఖ్యమిత్రులే .నేనూ వారితో చేతులు కలిపి పని చేశానుకనుక .మీరు ఆనందంగా అనుభవిస్తున్న ఆధునిక తెలుగు పునర్జీవన వైభవం అంతా మా సమష్టి కృషి యే.మా ఆ నాటి స్నేహానికి సాక్షులెవరూ ఇక్కడ మీలో కనిపించటం లేదు .ఇదంతా 1916-17కాలం నాటి విషయాలు అంటే ఇప్పటికి సుమారు ముప్ఫై ఏళ్ళ క్రిందటిమాట అన్నమాట .గురజాడ కొత్తకవిత కన్యక లేక పూర్ణమ్మ వైభవంగా ఆనందంగా ఆవిష్కరించిన వారిలో నేనూ ఉన్నాను .ఆయనవి ముద్రించాల్సినవి ఇంకాచాలా ఉన్నాయి .గురజాడ కవిత్వ సూక్ష్మ నైపుణ్యాలు ,సమర్ధత ,శ్రేష్టత ఇక్కడున్నవారికి ఎవరికీ తెలియదు .గురజాడ కుమారుడు రామదాసు తనతండ్రి కవితా సంపుటికి ముందుమాట రాయమని నన్ను కోరాడు .సరే నన్నాను .కాని అది మేము అనుకొన్నట్లు జరగలేదు .వాడుక భాషా ఉద్యమ౦ విషయం లో నేను ,నా స్నేహితుడు గిడుగు అభిప్రాయంతో ఏకీ భావిస్తాను .1912-13కాలం లో నేను గ్రాంధికవాదులు అడ్డు పడుతున్నా,వాడుక భాషలోనే కొన్ని పుస్తకాలు రాసి ప్రచురించాను .అది అలాఉంచితే ,వాడుక భాషలో వేదికలపై మాట్లాడటం కూడా నిషిద్ధమే అప్పుడు .గురజాడ చనిపోయి చాలాకాలమైనా, గిడుగు ఒక్కడే ఆఉద్యమాన్ని కడదాకా నిర్వహించి విజయం సాధించాడు రెండవ ప్రపంచ యుద్ధం లో ప్రెసిడెంట్ రూజ్ వెల్ట్ లాగా . భట్టబాణభట్టు కొడుకు భట్టు భూషణుడు లాగా నా స్నేహితుడు గిడుగు రామమూర్తి కొడుకు సీతాపతి ఆ మార్గం లో తండ్రి ఆశయాలు సాధించటానికి పూర్తిగా సర్వ సన్నద్ధ మై పని చేస్తున్నాడు .’’అన్నారు వేటూరి ప్రభాకర శాస్త్రిగారు .ఈ విషయాలను కుమారుడు డా. ఆనందమూర్తి తెలియ జేశారు .
వ్యావహారిక భాషోద్యమం లో వివిధ దశలు
1- గురజాడ అప్పారావు కన్యాశుల్కం నాటకం ను వ్యావహారిక భాషలో 1897లో మొదటి ముద్రణను ,1907 లో రెండవ ఎడిషన్ గానూ తెచ్చాడు .
2-1910లో రాజమండ్రిలో గురజాడ ‘’ఆంద్ర భాషా ప్రవర్తక సంఘం ‘’స్థాపించాడు .
3-1913లో మద్రాస్ ప్రభుత్వం ‘’కాంపోజిషన్ కమిటీ ‘’ని నియమించింది .చాలావాడి వేడి చర్చలు జరిగాక ‘’వ్యావహారిక భాషా సంస్కరణ ‘’తీర్మానం చివరికి ఓడిపోయింది .గురజాడ దీనిపై ‘’డిస్సెంట్ నోట్’’రాసి కమిటీకి సమర్పించాడు .ఇదే ఉద్యమంలో మైలురాయిగా నిలిచింది .
4-1919లోవ్యావహారికం పై ప్రజాదృక్పధం లో క్రమమైన సానుకూలమైన మార్పుకనిపించింది
5-సవర భాష ఉద్ధరణ కార్యక్రమం గిడుగు చేబట్టాడు .
6-1936లో నవ్య సాహిత్య పరిషత్ ఏర్పాటై, దానికిఅనుబంధంగా,ఉద్యమ వ్యాప్తికి తోడ్పాటుగా ‘’ప్రతిభ ‘’పత్రిక స్థాపన జరిగింది .
7-1937లో ఉద్యమాన్ని బలపరుస్తూ తాపీ ధర్మారావు ‘’జనవాణి ‘’పత్రిక నెలకొల్పాడు .
8- 1940లో గిడుగు ‘’ప్రజామిత్ర ‘’పత్రికలో ‘’తుది విన్నపం ‘’ప్రచురితమై చర్చ విజయవంతమైంది
9-వ్యావహారిక భాషోద్యమ నాయకుడు గిడుగు వెంకట రామమూర్తి 1940జనవరి 22న ప్రశాంతంగా కన్ను మూశాడు .
సమాంతర మారిషస్
1-1965కు ముందుఅంతరించే తెలుగు భాష అద్భుత మాయాజాలంగా స్థానికుల పట్టుదల బయటివారి సహకారం వలన మారిషస్ దేశం లో బ్రతికింది . ఈ విషయం లో పండిట్ రామమూర్తి ,పండిట్ గున్నయ్య ఒట్టు,పండిట్ గురయ్యలు చిరస్మరణీయులు .వీరుకాక 1966లోనూ ,ఆతర్వాత ఊతం ఇచ్చిన డజన్లకొద్దీ ఉత్సాహవంతులైన టీచర్లూ అభినందనీయులే .
2- SAAMS అనేది MAMS ను బాగా ప్రభావితం చేసింది .
3-1966-70లోభారతీయ భాషల మొదటి దశ ITEC నిపుణులు వచ్చారు
4-1976-79లో వ్యావహారిక భాష ప్రైమరీ , సెకండరీ స్థాయిలలో ప్రవేశ పెట్టబడింది .మహాత్మాగాంధీ ఇన్ స్టిట్యూట్ స్థాపన జరిగింది .
5-2014లోనూ, ఇప్పుడూ-ఉత్సాహం ఉత్తేజం కలిగించే క్రమానుగత ప్రభుత్వ తోడ్పాటు లభించింది .తెలుగు స్పీకింగ్ యూనియన్ అంటే తెలుగు ‘’మాట్లాడే వారి సమాఖ్య’’ ప్రభుత్వ ఆర్ట్స్ అండ్ కల్చర్ శాఖ సంరక్షణలో సంయుక్తంగా ఏర్పడింది
6-మారిషస్ జాతీయతపై ప్రేమ , ,తెలుగు భాష పై ప్రేమ ,ధర్మం పై ప్రేమ అనేవి శారీరక మానసిక ఆధ్యాత్మికత గా రూపొందాయి మారిషస్ లో .
ఆధారం –ప్రొఫెసర్ వేటూరి ఆనందమూర్తి గారి రచనలు
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -11-10-20-ఉయ్యూరు