మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-6
‘’చిచ్చులపిడుగు ‘’ ఏకాంకిక రాసిన రామచంద్రుని వెంకటప్ప స్వగ్రామం ఒంగోలుదగ్గర టంగుటూరు .అచ్యుతుని వెంకటరావు అనే మారు పేరుతొ కాంగ్రెస్ ప్రచారం చేసి ఆరునెలలు జైలు కెళ్ళాడు .రాజమండ్రి జైలులో బులుసు సంబమూర్తిగారితో పరిచయమేర్పడి కుడిభుజంగా ఉంటూ ,విడుదల తర్వాత ఆయనతో కాకినాడ చేరాడు .సీతానగరం ఆశ్రమం ఏర్పడినప్పుడు మూర్తిగారు అతనిని డా సుబ్రహ్మణ్యం గారికి అప్పగించారు .వెంకటప్ప మద్రాస్ లో జరిగిన ‘’నీల్ ‘’సత్యాగ్రహం లో ముఖ్యపాత్ర పోషించాడు .ఆంగ్ల సంస్కృతాలు క్షుణ్ణంగా అభ్యసించినవాడు ,గొప్ప పరిశోధకుడుకూడా .’’చెన్నపట్నం తెలుగు పట్నం ‘’అనే ఆయన పుస్తకం బాగా ప్రచారమైంది .ఆంధ్రులలో స్వాతంత్ర కాంక్ష పెరటానికే చిచ్చుల పిడుగు రాశానని చెప్పాడు .
నాటిక మొదటి రంగం లో మంగల్ పాండే స్వగతంగా ‘’ఓ ఆంగ్లపిశాచామా ఇంకా నీ ఆకలి తీరలేదా ఎప్పటికి తీరుతుందే రాక్షసీ ‘’అన్న డైలాగ్ ఉద్రేకం కలిగిస్తుంది .రెండవ రంగం లో పాండే -హ్యూసన్ ,బౌ అనే ఆంగ్ల అధికారులను కాల్చగా గురి తప్పుతుంది .చివరికి బౌ ను అనేక కత్తిపోట్లతో చంపేస్తాడు .ఈలోగాహ్యూసన్ లేవబోతుంటే ఒక సిపాయి తుపాకిడమతో కొట్టి చంపేస్తాడు .కాసేపటికి వీలర్ అనే సైనికాదికారివచ్చి మంగలపా౦డ్యాను బంధించమని ఆర్డర్ ఇస్తాడు .పాండ్యా బ్రాహ్మణుడు కనుక అతనిపై ఎవరూ చెయ్యి వెయ్యరని జిమేదారు చెబుతాడు .ఇంతలో హీర్సే అనే మరో సైనికాధికారి తన ఇద్దరు కొడుకులతో అక్కడికి వచ్చి పాండే ను చంపటానికి సిద్ధపడితే ,పాండ్యా తనను తానే కాల్చుకొనగా, గాయపడిన అతడిని జమేదారు ఆస్పత్రికి చేరుస్తాడు .పా౦డ్యా ఉరితీసే ఘట్టం తో మూడవ రంగం ముగుస్తుంది .ఉరి తీసేముందు చివరి కోరిక ఏమిటి అని అడిగితే ‘’మీ జాతి వాళ్ళందరికీ ప్రాణాలపై ఆశ ఉంటే ,మా దేశం విదిచిపొండి’’అంటూ ఉరికంబం ఎక్కుతాడు మంగళ పాండ్యా .రచయిత నాటకం చివర అహింసావాదం ప్రవేశపెడితే అన్నపూర్ణయ్యగారు దాన్ని తీసేసి పత్రికలో వేశారు .నాటికను ప్రభుత్వం నిషేధించటం దువ్వూరిగారికి రెండేళ్ళు శిక్షపడటం మనకు తెలిసిన విషయమే .1929లో గుంటూరులోయూత్ లీగ్ ఈ నాటికను మునిసిపల్ చైర్మన్ బారిస్టర్ నడింపల్లి నరసింహారావు ,అండ దండలతో పోలీసుల కళ్ళు కప్పిఆమంచర్ల గోపాలరావు ,కోనవల్లి సుబ్రహ్మణ్యం ,మాడభూషి వెంకటా చారి ప్రదర్శించారు .ప్రేక్షకులలో కొండా వెంకటప్పగారు కూడా ఉన్నా ,సాక్ష్యం దొరక్క యెవరినీ ఆరెస్ట్ చేయలేదు .నాటిక రచయిత పేరు చెప్పమని దువ్వూరి వారిని ,లింగారజుగారినీ యెంత ఒత్తిడి పెట్టినా పత్రిక నైతిక సూత్రాలనను సరించి చెప్పటానికి నిరాకరించారు .
1950లో ఈ నాటికపై నిషేధం తొలగింది .రచయిత స్వయంగా దాన్ని ప్రచురించి అన్నపూర్ణయ్య గారి దివంగత వీర ధర్మపత్నిమద్దూరి వెంకట రమణమ్మగారికి అంకితమిచ్చాడు .తానే రచయితను అని కోర్టులో చెప్పటానికి సిద్ధపడినా, పూర్ణయ్య గారు వద్దు అని వారించటమేకాక వేలూరు జైలుకు వెడుతూ ఒక ఉత్తరం లో ‘’నీ రచన మూలంగానేను బాధ పడ్డానని ఎప్పుడూ అనుకోలేదు .నేను దాన్ని చూసి చదివి మెచ్చి ప్రచురించాను .పూర్తి బాధ్యత నాదే .నువ్వు బాధపడకు .నేనేదో మర్యాద కోసం రాయటం లేదు మనఃపూర్వకం గా ఈలేఖ రాస్తున్నాను ‘’అని రాసిన మహోత్కృష్ట హృదయం .ఉత్తమ సంపాదకత్వ లక్షణం అన్నపూర్ణయ్య గారిది.
తనపై మోపిన నేరానికి సమాధానంగా దువ్వూరి వారు కలెక్టర్ ఎదుట సుదీర్ఘ ప్రకటన చేశారు-‘’1857నాటి స్వాతంత్ర్య సమరాన్ని సహజంగా చరిత్ర ఆధారంగా చూపటమే నా ఉద్దేశ్యం .పాండ్యా ధైర్యశాలి అయిన నాయకుడు ఇది నిజగా జరిగిన కథ .కాని అతడిని ఆదర్శ ప్రాయుడుగా చూపించలేదు .నేను దౌర్జన్య రాహిత్యవాదిని.నాకతడు ఎలా ఆదర్శం అవుతాడు?.అతడు తొందరపడ్డాడు లేకపోతే ఇండియాకు స్వాతంత్ర్యం ఎప్పుడో వచ్చి ఉండేది నా పత్రిక దౌర్జన్యం సహించదు .నా కాంగ్రెస్ లోకాని ,యువజన సంఘం లోకానిదౌర్జన్యం అనే మాటే వినిపించదు.కనుక నాలో దౌర్జన్యం ఎలా వస్తుంది ?సర్వమత సమత్వాన్ని ఆచరించే యువజన సంఘం అధ్యక్షుడ నైన నేను మత విద్వేషాన్ని ఎలా పెంచుతానని అనుకొన్నారు మీరు ‘’?
వీర సావర్కార్ రాసిన ‘’భారత స్వాతంత్ర్య సమరం ‘’,చార్లెస్ బాల్ రాసిన ‘’మ్యుటిని చరిత్ర –రాబర్ట్స్ ప్రభువు ‘’,’’ఇండియాలో నా40సంవత్సారాల జీవితం ‘’అనే పుస్తకాలే తన చిచ్చులపిడుగు నాటికకు ఆధారం అని రచయిత వెంకటప్పయ్య చెప్పాడు. మెడోస్ టైలర్ ‘’రాసిన ‘’సీతా ‘’నవల దీనికి ఆధారమన్నారు లింగరాజుగారు ..
బెంగాల్ యువకుడు జతీన్ బోస్ జైలులో మానవతా దృక్పధం కోసం 63రోజులు నిరాహార దీక్ష చేసి 14-9-1929న అమరజీవి అయ్యాడు .అతడి దీక్షకు మద్దతుగా మద్దూరి,ఆచార్య రంగా రాజమండ్రి గోదావరీ తీరంలో గొప్ప సభ నిర్వహించారు .జతీన్ మరణంతో కళ్ళు తెరిచిన ప్రభుత్వం ఖైదీలను A.B,Cతరగతులుగా విభజిస్తూజైలు నిబంధనలు మార్చింది .అన్నపూర్ణయ్య గారి అరెస్ట్ కు ముందు ఈమార్పులు రాలేదు తర్వాత వచ్చినా అమలు చేయమని ఆయన కోరనూ లేదు .ప్రభుత్వానికీ ఆ ఇంగితం కలగలేదు .మద్రాస్ శాసనమండలి లో ఈవిషయం చర్చకు వస్తే ,అనంతపురం నుంచి వెలువడే ‘’శ్రీ సాధన ‘’పత్రిక ‘’న్యాయశాఖ చూసే కృష్ణన్ నాయర్ భారతీయుడై ఉండికూడా ఈ అకృత్యానికి ఒడిగట్టటం దారుణం ‘’అని విచారం వ్యక్తం చేస్తూ రాసింది . ప్రతిపక్షకాంగ్రెస్ నాయకుడు సత్యమూర్తి ఘోరం అని నిరసన తెల్పి’’ ఈ తీర్మానం తెచ్చిన ప్రభుత్వ సభ్యుడు మద్రాస్ చరిత్రలో నామరూపాలు లేకుండా చనిపోతాడు కాని అన్నపూర్ణయ్య పేరు మాత్రం సువర్ణాక్షరాలతో లిఖి౦చబడుతుంది .దేశ గౌరవ ,స్వాతంత్ర్యాలను పరిరక్షించిన వ్యక్తిగా భావితరం అన్నపూర్ణయ్య ను జ్ఞాపకం ఉంచుకొంటుంది ‘’అని అద్భుత ప్రసంగం చేశాడు .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -13-10-20-ఉయ్యూరు