మిసిమి ‘’విజ్ఞాన సర్వస్వ కలిమి ‘’
అక్టోబర్ మిసిమి మహాత్ముని స్మృతి నీరాజనంగా ముఖ చిత్రాలతో ,ఆయనకు వచ్చిన ఆధ్యాత్మిక సందేహాలూ , శతావధాని రాజచంద్ర వివరణాత్మక సమాధానాలతో మోక్ష గామిని చేయటం మనకు దాదాపుతెలియనివే ,తెలిసిన బాపూ పురుడుపోసిన కావూరు వినయాశ్రమ విశేషాలు కమ్మగా ఉంటే ,నాట్య సంస్కృతికి కూచి పూడి ఆభరణమైన విషయాలను అందులో నిష్ణాతులైన శ్రీ పప్పు గారు వివరించిన తీరు పప్పు ధప్పళమే అయింది .యక్షగాన ప్రక్రియ వివరిస్తూ దాని జానపద రూపం’’ కొరవంజి’’ అని పరిశోధన చేసి చెప్పింది పంచాగ్నుల ఆది నారాయణ శాస్త్రి అని చాటుతూ అడపా వారు ‘’భద్రాయువు ‘’చరిత్రను క్లుప్తంగా గొప్పగా రాశారు .’’నేను భారతీయుడను ‘’అని చెప్పుకున్న కె..కె. మహమ్మద్ నిజాయితీ ప్రభుత్వోద్యోగి అనీ ,పురాతత్వ శాస్త్ర వేత్త అనీ ,చాలా పురాతన దేవాలయ ,మసీదు,చర్చి లను వెలుగులో కి తెచ్చిన ఘనుడని నటుడు భరణి భరోసాగా చెప్పాడు .ఒరిస్సా మాజీ ముఖ్యమంత్రి బిజూ కుమార్తె, నేటి ముఖ్య మంత్రి నవీన్ సోదరి పద్మశ్రీ గీతా మెహతా పై రావెళ్ళవ్యాసం లో ఫెమినిజం ఇంకా పాశ్చాత్య దేశాలలో పాకకముందే గీత ఒక కోఆపరేటివ్ సొసైటీ SEWA పేరుతొ స్థాపించి సభ్యులు వారికి వారే లోన్లు ఇచ్చుకొనే పధ్ధతి కి నాంది పలకటం ఆశ్చర్యం ,మార్క్ ట్వేన్ మిసిసిపి నది ఎలా పైకి పైకి తీసుకు వెళ్ళాడో,మెహతాకూడా నర్మదా నదిని ఆస్థాయికితీసుకు వెళ్ళిందన్నదన్న సత్యం తెలిసి గర్విస్తాం .ఆమె రాజ్ నవల కర్మాకోలా ఆలోచనలు రేకెత్తి౦చేవే .బర్మాకు వెళ్ళిన మొదటి వారు తెలుగువారేనని ,వారిని ‘’తలైంగులు’’ అని అక్కడ అంటారని వారిలో సోమరాజు రామారావు ఆదికవి అన్న బద్రి వ్యాసం బంగారం.నల్లవారి నిరసన సంగీతమైన ఉడ్ స్టాక్ ఉత్సవం ,సబాల్టర్స్ చైతన్యం పై కట్టు చాలాగాట్టిగా నిర్మొహమాటం గా రాశాడు .మహాచిత్రకారుడు పికాసో ‘’మృగ’’తృష్ణ ‘’కు బలైన ప్రేయసి , సమానస్థాయి చిత్రకారిణి ‘’టేడ్ మాడరన్ ‘’జీవిత దయనీయ గాథను కళ్ళకు కట్టించిన తంగెడప్రసాద్ అభినందనీయుడు .విలక్షణ కంఠస్వరమున్న నాటకనటుడు సూరిబాబు ,తెలుగు రాముడు, కాకతీయ సాహిత్యం ,కుప్పా వారి తత్వ కవితా కల్యాణం వంటి విలువైన వైవిధ్యభరిత రిసెర్చ్ లాంటి వ్యాసాలతో’’అక్టోబర్ మిసిమి విజ్ఞాన సర్వస్వ కలిమి’’లా భాసించింది . సుమారు పదేళ్ళక్రితం నేను శూద్రకమహాకవి భాణ౦ పై రాసిన ‘’ ‘పద్మ ప్రాభృతకము’’అంటే తామరపువ్వుకానుక వ్యాసం మిసిమికి ఎలా చేరిందోతెలియదు కాని చోటు చేసుకొని నాకూ ఆకలిమిలో భాగస్వామ్యం కల్పించింది . .ఒకప్పుడు గ్రీకు ఇతర పాశ్చాత్య వాసనలు ,ఆ తర్వాత బౌద్ధ సిద్ధాంత రాద్ధాంతాలతో ఉండే మిసిమి ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా భారతీయతతో మిసమిస లాడటం సంతోషంగా ఉంది . సంపాదకులకు ధన్యవాదాలు .
గబ్బిట దుర్గాప్రసాద్ -13-10-20-ఉయ్యూరు