నడిగడ్డ పుర శ్రీఆంజనేయ దేవాలయం
గుంటూరు జిల్లా వినుకొండ తాలూకా నడిగడ్డ గ్రామం లో వేంచేచసి ఉన్న శ్రీ ప్రసన్న ఆంజనేయ స్వామి ఆలయం భక్తులకోరికలను తక్షణమే తీర్చే మహిమకలది .ఈ స్వామిని దర్శించి ,పరవశించి,ధ్యానమగ్నమైన అన్న సముద్రం కవి శ్రీ శిష్టు వేంకట సుబ్బయ్య శాస్త్రి గారికి అప్పటికప్పుడు ‘’నడిగడ్డ పురా౦జ నేయ నతజన గేయా ‘’అనేమకుటం గల పద్య పంక్తి మనసులో స్పురించి ఆయనకే ఆశ్చర్యం కలిగింఛి, నిండారు భక్తి ప్రపత్తులతో బయటికే చెప్పేశారు .అక్కడి భక్తబృందం పరమానందం పొంది కవిగారిని ఆ దివ్య మకుటంతో స్వామిపై శతకం రాయమని ప్రార్ధించారు .ఏక ప్రాస తో రాయటం కష్టమే అనిపించినా భారమంతా ప్రసన్నాంజనేయుని పై వేసి,తనజన్మ కృతార్ధమైనదని భావించి క౦ద౦ లోఅందమైన శతకం రాయటానికి సిద్ధపడి ‘’సరే ‘’అన్నారు శాస్త్రిగారు .
కందపద్యాలలో ‘’నడిగడ్డ పురా౦జ నేయ శతకం ‘’ భక్తి తాత్పర్యాలతో రచించి ప్రముఖ కవి పండితులు బ్రహ్మశ్రీ గాడేపల్లి వీర రాఘవ శాస్త్రి గారికీ ,శ్రీ ఉప్పల పిచ్చయ్య శాస్త్రి గారికీ ,మద్దులపల్లి గురు బ్రహ్మ శర్మగారికి చూపించి ,వారి మెప్పును ఆశీర్వాదపూర్వక పద్యాలను పొందారు .శతకముద్రణ కు కావలసిన ద్రవ్యాన్ని కవిగారి అనుజుడు శ్రీ శిష్టుపురుషోత్తమయ్య అందించగా ఆశీర్వాదకపద్యాలు చెప్పారు .నరసరావు పేట శ్రీ కోటీశ్వర ముద్రాలయం లో 1937లో ప్రచురించారు .వెల కేవలం 2అణాలు మాత్రమే . ఈ శతకం లో కవి గారి మిత్రుడు శ్రీ గురుబ్రహ్మ శర్మ రాసిన ఆంజనేయ దండకం ,శ్రీ సత్యనారాయణ స్తోత్ర అష్టకం,శ్రీ భారతుల పేరి శాస్త్రి అనే శ్రీ రంగకవి రచించిన శ్రీ త్రిపుర సుందరీ స్తోత్ర చూర్ణిక కవిని ,శతకాన్నీ ప్రశంసించిన విద్వత్కవుల ప్రశంసలు కూడా చేర్ఛి సుసంపన్నం చేశారు .
గాడేపల్లి వారి ప్రశంస –‘’నడిగడ్డ యా౦జనేయుని-కడు చిత్ర చరిత్ర నీవు కందశతకమే – ర్పడ జేసి తుడిచి తఘముల-గడచితి సంసార వార్ధి కవికులతిలకా ‘’
అంటూ ‘’ఏక ప్రాసతో అనేక చారిత్రాత్మక ప్రహేలలను రాయటం ఆయనకే తగినదని మెచ్చారు
. ’లాలిత కందపద్య సమలంకృత కావ్య వచోను ష౦గభా –వావళి ననేక రీతులుగా హర్ష మనస్కుడవై రచించి దే
వాళి శిరః కిరీట మణిహారివిభాలసదంఘ్రి మారుతిన్ –లాలన చేసి వేడితివి లాక్షణికాగ్రణు లెల్లమెచ్చగన్’’
ఉప్పలవారు-‘’అనుపమ శబ్ద గు౦ఫన రసార్ద్ర పరి స్ఫురణంబుగల్గి-‘’న శిష్టు వంశ భానుడైనకవి రాసిన శతకం ‘’కేవలమోదము గూర్చె నా మనంబునకు ‘’అని భుజం తట్టారు .
గురుబ్రహ్మ శర్మ –‘’అబ్బా !’’డ’’ప్రాసంబును –బ్రబ్బి శతకమల్లు టెంతపని !యెట్టిదినీ –నిబ్బరము !శిష్టు వేంకట-సుబ్బయ కవి చంద్ర చిరయశో గణ సాంద్రా ‘’
అని కవి బ్రాహ్మలు ముగ్గురు కమ్మని ఆశీర్వాద పనసలు చదివి ప్రోత్సహించారు .ఇందులోనే కవిగారి ప్రతిభ ఎంతటిదో మనకు అవగత మౌతుంది .
కవిగారి శతక మకరందం లో మొదటి కంద పద్యం –
‘’అడుగులకు మడుగు లొడ్డుచు –నడుముం గట్టికొని పలు ప్రణామంబులనే-నిడికొలిచెద రక్షింపుము –నడిగడ్డ పురా౦జనేయ నతజన గేయా ‘’
తనకు గురువులు లఘువులు ప్రాసలు గణాలు తెలీవనీ వినయంగా చెప్పుకొని ,ఇన్నేళ్ళు బ్రహ్మచర్యం ఎలాగడిపావయ్యా అని ఆశ్చర్యపోయాడు కవి .’’వడి యోజన శతమొక్కు –మ్మడిదుమికి ,దశాస్యు వీటి మంగళ విభవం ‘’అడుగంట చేశావని స్వామిని పొగిడాడు ..’’ఒడబడ వన్యాయమునకు –దడ బెడ వెట్టెట్టిక్లిష్ట తరయోజనలన్-సుడివడవెంతటి శ్రమకు ‘’అంటాడు . 20వ పద్యం –‘’పడి భక్తి నీపదంబులు –విడువక పూజించుభక్త వితతికిసౌఖ్యం – బెడలేకయొసగిప్రోతువు – నడిగడ్డ పురా౦జనేయ నతజన గేయా’’
‘’గడియన్ మూడు జగంబులు –వాడకి౦పగజాలినట్టి వాడవు ‘’
‘’గుడిగుడిని దోకని౦చుక – ముడుచుక నిలుచున్ననీకు మొక్క విపత్తుల్ -విడుదల భరింతువు ‘’ అని తమాషాగాచెప్పాడు.
–‘’ఉడు గణముడుల్లజేయగ-నుడుపతిఖరకారుల తాళమొనరింప ‘’జగాలను ఉడికింప చేస్తావు . ‘’జడియక లంక౦ గాల్చెడు-నెడరావణు ననుజు గృహము ‘’తగలెయ్యకుండా కృప చూపావు .’’జడివానలలోన బడుపెను –పిడుగు క్రియన్ బంక్తికంఠుపీఠంపగుల గొట్టావు ‘’
‘’కడగి నవ వ్యాకృతుల౦ –గడి తీరిన పండితుడవు’’,’’జడు మైరావణుదునిమిన-యెడ ‘’ఇంతటి దీమంతుడవు నువ్వే అని కొనియాడాడు
‘’పుడమి శశి రవులు జుక్కలు –జెడకుండునొ,యెంతవరకు క్షితి నంతటిదా-కుడుగక నిల్పుము శతకము – నడిగడ్డ పురా౦జనేయ నతజన గేయా’’అని 99వ పద్యం చెప్పి ,100వ పద్యం లో తన ఇంటిపేరు శిష్టు అనీ, హరితస గోత్రం అనీ ,తండ్రి శేషయ అనీ తనపేరు వేంకట సుబ్బయ్య శాస్త్రి అని శతకాన్నిశాలివాహన శకం 1850లో అంటే 1937 సెప్టెంబర్ 5న పూర్తి చేశాననీ చెప్పుకొన్నాడు కవి .ఇంతకుమించి కవిగురించికాని శ్రీ నడిగడ్డ ఆ౦జ నేయదేవాలయం గురించికాని విశేషాలేమీ లేవు .శతకం లో ఆంజనేయ జననంనుంచి ఆయన విశేషాలనే కవి వర్ణించాడు క్షేత్రమాహాత్మ్యం గురించి చెప్పనే లేదు .కానీ ఒక మహా గొప్ప’’కందకవి’’ ని ,పరిచయం చేశానన్న సంతృప్తి, క్షేత్రం పేరుమాత్రమే చెప్పగలిగానన్న అసంతృప్తీ మాత్రం నాకు ఉండిపోయింది .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -14-10-20-ఉయ్యూరు