కొమరి పురీశ్వర శతకం
తూర్పు గోదావరి జిల్లా రామ చంద్ర పురం తాలూకా కొమరిపాలెం గ్రామ కాపురస్తులు సహజకవి,ఈశ్వర భక్తుడు శ్రీ తగరం పూడి అప్పస్వామి ‘’అందరు కవులలాగా సీస ,కంద చంపక ఉత్పలమాల తేటగీతాదులతో కాకుండా కేవలం ’ పంచ చామర వృత్తం తోరాస్తున్నాన’’ని చెప్పి, సవాలుగా శ్రీ కొమర్పురీశ్వర శతకం ‘’బాహ్యాభ్యంతర అర్ధాలతో రాశాడు .చివరలో నీతిపద్యాలు ,తత్వాలు ఆధ్యాత్మ రామాయణం నేపధ్యంగా దండకం ,పిమ్మట విభిన్న రాగాలలో ఆధ్యాత్మ కేర్తనాలు కూడా రాసి చేర్చాడు .ఇది రాయవరం మేరీ ముద్రాక్షర శాలలో శ్రీ మల్లిడి సత్తి రెడ్డి గారి చే 1931 లో ముద్రింపబడింది .వెల కేవలం నాలుగు అణాలు మాత్రమే.
తాను మహాకవిని ,బుధుడను ,కోవిదుడను ‘’విశేష శాస్ర్తి ‘’,కూడా కానని తజ్ఞుడనుమాత్రమె నని ,గొప్పకోసం కాదని ముక్తి కోసమే రాశానని విద్వజ్జన విధేయుడుగా ఉత్పలమాలలో చెప్పు కున్నాడు కవి .మహారాజ ఠీవిగా ‘’పంచచామరం’’ వీచాడుకవి కొమరపురి ఈశ్వరుడికి శతక పద్యాలతో .మహా ప్రవాహ శైలి .తాత్విక చింతన లోతుగా కనిపిస్తుంది .నిండిన ఈశ్వర భక్తి కవి సొమ్ము .మొదటిపద్యం –
1-‘’నమోస్తుతే గజాసురారి నాగరాజ కంకణా-సమాన భూత రక్షితార్ధ సర్వ వ్యాపి శంకరా –సుమోక్ష లబ్ధ నీలకంఠ చంద్ర శేఖరా హరా –సుమాశరా౦తకా మహేశ శ్రీ కొమర్పురీశ్వరా ‘’
3-శుభాంగ లింగ ఫాలనేత్ర శుద్ధ తత్వ కోవిదా –కు౦భేంద్ర నెచ్చెలీ కపాలి గోతురంగ నిర్గుణా –ప్రభా౦తరంగ పాపభంగ బ్రహ్మ వేద్దిగంబరా – శుభాంకరేసుపూజితా౦ఘ్ర శ్రీ కొమర్పురీశ్వరా ‘’
‘’శబ్ద లక్షణాలు నిఘంటు ,కావ్యాలూ ,యతులు గణాలు ప్రాసలు వగైరా ‘’ఎరూంగ’’అని వినయంగా చెప్పుకొని ‘’నీ కృపన్ రచిస్తి ‘’అన్నాడు స్వామితో .
8-ధనంబు కౌను రాజుగా ,గుణంబు కౌనెరాజుగా –గుణ౦బె రాజు పూర్తి యైన గొప్ప చక్రవర్తియే –వనంబు కౌనె రాజుగా ,దినంబు కౌను నెంచగా ,ఇనున్డురాజుగా నిజమ్ము —‘’
21-జలంబు నగ్ని గాలిపృథ్వి జన్మ మూల దుంప ‘’అంటాడు
30-నరంబు నాళ్ళు కీళ్ళు తోళ్ళు నక్కకైన జొక్కదే-పరంబు పో దినంబునందుపనికిరాదు గవ్వకున్ ‘’అని తత్వ బోధచేశాడు ‘’అహం అహం అంటూ ఉంటె సతీసుతులు త్రిగుణాలు హంమెల్లగా నశిస్తుంది ‘.
‘’మొదటి’’ అనటానికి ‘’మొదాటి ‘’అ౦టాడుకవి సరదాగా .శరీరమే వనం చిత్తమే మృగం గురు కృప తుపాకి ‘’గొప్ప నిష్ఠ గుండు గా .-సరీగ జేస్తే బరు ఫైరు జచ్చు మాయ జంతువున్ ‘’అని ఆధునికంగా శంకరాచార్య శివానంద లహరి శ్లోకానికి భావం గా చెప్పాడు.’’మకార్వుకార మధ్యనున్న మాయదౌ ప్రపంచకం ‘’,’’ప్రకాశమైన పూర్ణ బ్రహ్మమందు నశ్యమే –వికారమౌ ప్రపంచకా విశేషం ‘’,’’మనస్సు కార్యకారణ౦బు మాతృ పితృ జాయలున్ ‘’’’ఫిరంగి గుండు నాటకుండ ఫెళ్ళు ఫెళ్ళు గూలునా –తరంతరాలనుంఛి యున్న దండి దిన కోటయున్’’లాగా అనాదిగా ఉన్నమాయ కూడా గట్టి దెబ్బకే కూలుతుంది .ఫిరంగి, తుపాకీ పేల్చేసత్తా ఉన్నవాడేమో కవి అనిపిస్తుంది.
98 -వ పద్యం లో తన ఇంటి పేరు తగరంపూడి అనీ కులం విశ్వ బ్రాహ్మణమనీ ,సనాతన గోత్రమనీ ,తనపేరు అప్పస్వామి అనీ చెప్పుకొన్నాడు కవి .
102వ చివరి పద్యం లో ‘’సమర్పణంబు నీకు నావి సర్వ రాగ ద్వేషముల్ –సమర్పణంబు నీకు నావి సర్వ పాప పుణ్యముల్ –సమర్పణంబునీకు పంచచామర సుమాళితో-సమర్పణంబు గైకొ దేవ’’శ్రీ కొమర్పురీశ్వరా ‘’
తర్వాత మాలిని సుగంధి వృత్త పద్యాలు చెప్పాడు. ఆతర్వాత ఆత్మ రామాయణ ‘’దండ’’కం కూడా అదే బిగువుతో కూర్చాడు .పిమ్మట కొన్ని సీసాలు తేటగీతులు పేర్చి ,కాఫీ నాదనామక్రియ ,ముఖారి వగైరా రాగాలలో ఆధ్యాత్మ బంధుర కీర్తనలు రాసి వాసి తెచ్చి సాహిత్యం తోపాటు సంగీతం లోనూ సహజకవినే అని తన సత్తా నిరుపించాడు కవి అప్ప స్వామి .ఈ కవి గురించీ ఎవరూ ఎక్కడా పొక్కకపోవటం కూడా ఆశ్చర్యజనకమే .
అయితే కవి స్తుతించిన ఈశ్వరుడు ఏ పట్టణం లోని దేవుడో ఎక్కడా పేర్కొన లేదు .ఆదైవం విశేషాలూ లేవు .మామూలు ఈశ్వర స్తుతి మాత్రమే కనిపిస్తుంది .నా ఊహ ప్రకారంప్రకారంకుమారారామ భీమేశ్వరాస్వామిలేక ద్రాక్షారామ భీమేశ్వర స్వామి అయి ఉంటాడు .
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -15-10-20-ఉయ్యూరు