శ్రీ ముఖలింగేశ్వరశతకం -1
శ్రీ ముఖలింగేశ్వరం అనే ‘’శివ మహిమ’’ పుస్తకాన్ని నరసన్నపేట తెలుగు ఉపన్యాసకులు శ్రీ మొసలికంటి వెంకట రమణయ్య తిరుమల తిరుపతి దేవస్థానం ద్రవ్యసాయం తో నరసన్నపేట సిద్ధాశ్రమం ద్వారా ప్రచురింఛి తిరుమలేశునికి అంకితమిచ్చి శివ కేశవాద్వైతాన్ని చాటారు . .వెల అమూల్యం .
ముఖ లింగేశ్వర దేవాలయం
ముఖలింగ క్షేత్రం శ్రీ కాకుళం జిల్లాలో వంశధార నదీ తీరాన ఉన్నది .ఒకప్పటి గంగ వంశ రాజుల రాజధాని .దీనికి రెండు కిలోమీటర్ల దూరం లో ‘’నగరి కటకం ‘’ఆ రాజుల అంతఃపుర ప్రాంతం .నగరి అంటే రాజాంతఃపురం .తూర్పు గంగవంశ 12వశతాబ్దికి చెందిన రాజు అనంత వర్మ చోడ గంగడు బాగా ప్రసిద్ధుడు .రాజ్యాన్ని ఒరిస్సాలోని మహానది వరకు విస్తరింఛి ‘’ఉత్కళ ప్రబువు ‘’,త్రికళింగాధిపతి ‘’బిరుదులు పొందాడు .భువనేశ్వర్ లోని మేఘేశ్వర అనంత వాసుదేవ ,పూరీ జగన్నాథ స్వామి దేవాలయాల శిల్పాలు గంగవంశరాజులవే .ముఖలింగేశ్వర శిల్పాలు ఈ శిల్పాలనే పోలి ఉంటాయి .
ముఖలింగ౦ లో మూడు దేవాలయాలున్నాయి .ప్రథాన ఆలయలయం కాకుండా ఊరి బయట పశ్చిమాభిముఖంగా ఉన్న సోమేశ్వరాలయాన్ని చంద్రుడు తనకుష్టు వ్యాధి నివారణకోసం నిర్మించాడు గంగవంశ రాజు హస్తి వర్మ క్రీ.శ.573ఈ ప్రాంతాన్ని పాలిస్తూ ముఖలింగేశ్వరాలయం నిర్మించాడు 11వ శతాబ్దం లోఅనంత వర్మ కట్టిందని కొందరి అభిప్రాయం , హస్తి వర్మ నిర్మిస్తే అనంతవర్మ పునరుద్ధరణ చేసి ఉండచ్చు .ఆలయ గోడలపై గణపతి ,మహిషాసురమర్దిని ,అర్ధనారీశ్వర శిల్పాలు నయన మనోహరాలు .సున్నం ఎక్కడా వాడిన జాడ లేదు .ఎర్ర రాళ్ళను చెక్కి వరుసగా అమర్చారు అంతే.ఇది ఇండో- ఆర్యన్ శిల్ప విధానం .ప్రధానమైన ‘’మధుకేశ్వరాలయ’’శిల్పకళ భీమేశ్వరాలయ శిల్పకళ భిన్నంగా ఉంటాయి .కనుక ఒకే కాలం నాడు కట్టినవి కాదు .
పాండవ భీముడు భీమేశ్వరాలయ శ్రీ భీమ లింగ ప్రతిష్ట చేశాడని ,గంగవంశరాజు రెండవ వజ్రహస్తుడు11వ శతాబ్ది మొదట్లో ఆలయ నిర్మాణం చేశాడని తెలుస్తోంది .దీనిలో చోళ శిల్ప కళ ద్యోతకం .వేంగి చాళుక్యరాజు శక్తివర్మ సోదరుడు విమలాదిత్యుడు ఈ ఆలయ నిర్మాణానికి సహాయం చేసినట్లు చారిత్రకాధారాలున్నాయి .
ప్రథాన ఆలయ శిల్పకళ ముచ్చటగా ఉంటుంది .ఆలయం నాలుగుమూలల నాలుగు చిన్న ఆలయాలున్నాయి .పడమటి ఆలయం లో హరిహర మూర్ర్తి మతసామరస్యానికి ప్రతీక .ఆలయ గోడలపై శివలీలలు చెక్కారు .కాశీ ‘’ఆనంద కాననం ‘’అయితే ,శ్రీ ముఖలింగం’’ గోవింద కాననం ‘’గా అభి వర్ణిస్తారు .అందుకే దక్షిణ కాశి అంటారు .స్కాంద పురాణంలో ఈ ఆలయ వివరాలున్నాయి .శివుని శాపానికి వ్యాసుడు కాశీ వదలాల్సి వచ్చి బాధ పడుతుంటే దేవ సేనాని కుమారస్వామి ప్రత్యక్షమై ‘’శ్రీ ముఖలింగేశ్వర క్షేత్ర మహాత్మ్యం వివరించి అది దక్షిణ కాశి అని భరోసా ఇచ్చాడు .కృతయుగం లో గోవి౦దేశ్వర సువర్ణలింగం , త్రేతాయుగం లో మధుకేశ్వర రజత లింగం ద్వాపరం లో జ౦తీశ్వర కాంస్యలింగం గా వెలసిన పరమేశ్వరుడు కలియుగం లో లింగం లో ముఖం దాల్చి శ్రీ ముఖ లి౦గేశ్వరుడుగా వెలసి పూజల౦దు కొంటున్నాడు .అందుకే ముఖలింగ క్షేత్రం అయింది .
ద్వాపరం చివరకు ఇదంతా గొప్ప కీకారణ్యం .మనోహర వంశధార నదీ తీరం లో పరమేశ్వరా౦శ సంభూతుడు వామ దేవ మహర్షి యజ్ఞం చేశాడు .ఈ క్షేత్రం చుట్టూ చాలా పుణ్య తీర్దాలేర్పడ్డాయి .ఈ క్షేత్రసందర్శనంచేసిన మునులు యోగులు అనేక శివలింగాలు ప్రతిస్టించారు .మంకణేశ్వర,స్వప్నేశ్వర ,సూర్యేశ్వర ,సోమేశ్వర ,భీమేశ్వర మొదలైన లింగాలున్నాయి .
ఈ క్షేత్రానికి తూర్పున రత్నగిరి దానిపై విష్ణుమూర్తి పద్మనాభస్వామిగా వెలసి క్షేత్ర పాలకుడుగా ఉన్నాడు .దక్షిణాన వటాద్రిపై మంకణేశ్వరుడు వెలిస్తే ,దక్షిణాన స్వప్నేశ్వరుడు వెలసి దుస్వప్న దోషనివారణ చేస్తున్నాడు .ఉత్తరాన సూర్య ప్రతిష్టిత సూర్యేశ్వరలింగం సూర్య తీర్ధం ఉన్నాయి .చర్మవ్యాధులను నివారిస్తాడు .దక్షిణాన సిద్దేశ్వర లింగం తీర్ధం సర్వ సిద్ధులు కలిగిస్తుంది .ఇంత ప్రసిద్ధమైన ఈ క్షేత్రానికి ప్రచారం చాలా తక్కువగానే ఉన్నది .
ఈ క్షేత్ర మహాత్మ్యం రాసిన కవి చిన్నతనం లో చాలాసార్లు ఈక్షేత్ర దర్శనం చేశారు .1988 తన దగ్గర బంధువులతో దర్శించినపుడు అర్చకస్వామి శ్రీ తమ్మా తిరుపతి రావు ‘’ఈ క్షేత్రం గురించి మీరేదైనా రాయరాదా ?”’అని ప్రేరణకలిగిస్తే అది స్వామి ప్రేరణ అనిపించి మనసులో సీసపద్యం లోని ఎత్తుగీతి చివరి రెడుపాదాలు –‘’ముక్తి దాయక సర్వేశ భక్తవరద –అంగ భవ భంగ శ్రీ ముఖ లింగవాస ‘’ మకుటంగా భాసించింది.అనేక విషయాలు సేకరించి ,శివలీలలు కూడా చేరిస్తే బాగుంటుంది అనిపించి ,పురాణ గాథలను లఘు టీకా తో సహా సంపూర్ణం చేశారు ఇలాంటి ప్రయత్నం శతక వాజ్మయం లో అంతవరకూ రాలేదని కవి చెప్పారు చిన్నతనం లోనే తల్లిని కోల్పోయిన తనను అక్కగారినీ అనురాగం పంచి పెద్ద చేసిన పినతండ్రి శ్రీ మొసలికంటి వెంకటసన్యాసయ్య గారిని స్మరించారు .విజయనగర మహారాజ కళాశాలవిశ్రాంత అధ్యక్షులు శ్రీమానాప్రగడ శేషసాయి ‘’రసతరంగం ‘’అనీ ,అరసవల్లి సూర్య దేవాలయ ఆగమపాఠశాల సంస్కృత అధ్యాపకులు శ్రీ ఆరవెల్లి లక్ష్మీ నారాయణా చార్యులు మున్నుడిలో ‘’ఇక్కడి లింగ౦ ఇప్పచెట్టు అంటే ‘’మధూకం ‘’మూలం నుండి ఉద్భవి౦చి నందున ‘’మధు కేశ్వరలింగం అనటం సార్ధకం .దారురూపంగా స్వామి దర్శనమివ్వటం ఆశ్చర్యం ‘’అన్నారు .పూరీలోజగన్నాథస్వామి అన్నబలరాముడు సోదరిసుభద్ర లతో దారు శిల్పాలుగా దర్శనమిస్తారనిమనకు తెలుసు ఇక్కడ శివుడు అరుదైన దారు లింగంగా ఉద్భవించాడు .ఇదీ ఈక్షేత్ర విశేషం ..శ్రీకాకుళం ప్రభుత్వ కళాశాల విశ్రాంత ఆంద్ర భాష ఉపన్యాసకులు శ్రీ గెడ్డావు సత్యం ‘’ధారాళంగా సీసపద్య రచన జరిగింది .వివిధ క్షేత్రాలలో వివిధనామాలతో వెలయు భవుని వర్ణన భవ నాశకంగా ఉన్నది .చదివి శివుని కారుణ్యా మృతం ‘’పొందుతారు ‘’అని ఆశీస్సులదించారు .
సశేషం
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -16-10-20-ఉయ్యూరు .
—