‘’ఇహ కేన వేదీ దధ సత్యమస్తి-న చేదిదహా వేదిన్మహతీ వినష్టిః’’ అంటుంది కేన ఉపనిషత్ .అంటే ఈ జన్మలో బ్రహ్మం గూర్చి తెలుసుకొంటే అదే నిజమైన జన్మ .లేకపోతే పెద్ద నష్టమే .
వేదం లో కర్మకాండ విషయాలు చెప్పాక ,బ్రహ్మ విద్యను చెప్పేజ్ఞానకాండ ను ఉపనిషత్తులు అంటారు .అంటే వేద విద్య నేర్చి, విధివిధానంగా కర్మలు ఆచరిస్తే ఫలితంగా పొందే భార్య ,సంతానం వగైరాలన్నీ అనిత్యాలు అని తెలుసుకొని,నిత్య సత్యమైన బ్రహ్మను తెలుసు కోవాలనే వారికి ఉపనిషత్తులు సాయం చేస్తాయి .ఏదో కోరిక లోపలపెట్టుకొన్నవారికి స్వర్గం చేరి ,ఆ ఫలం ఖర్చుకాగానే మళ్ళీ భూమిపై పుడతారు .దీన్ని పునరావృత్తి ,దూమమార్గం ,కృష్ణ గతి దక్షిణాయనం అంటారు .ఇవే కర్మకాండలు వేదజ్ఞానం తో చేసేవాడు మళ్ళీ తిరిగి పుట్టడు..దీన్ని అపునరా వృత్తి,అర్చిరాది మార్గం ,శుక్లగతి ,ఉత్తరాయణం అంటారు .వీరుబ్రాహ్మలోకం చేరి బ్రహ్మ ఉన్నంతకాలం అక్కడే ఉండి,ప్రళయం లో ఆ లోకం లేకుండాపోతే ముక్తి పొందుతారు .దీన్ని క్రమముక్తి అంటారు .బ్రహ్మలోకం చేరినా ముక్తి పొందలేని వారు కూడా ఉంటారు .వీరిగురించి భగవద్గీతలో శ్రీ కృష్ణ పరమాత్మ ‘’ఆ బ్రహ్మ భువనాల్లోకాః పునరావృత్తినోర్జున ‘’అంటే బ్రహ్మలోకం మొదలైన లోకాలన్నీ తిరిగి రావాల్సిందే .కనుక మనసు నిర్మలం విశుద్ధం అయితే జ్ఞాన నిష్టకు మార్గం సులభమౌతుంది .ఇలాంటి చిత్తశుద్ధి ఉన్న ముముక్షువులు అంటే మోక్షం కోరేవారికే ఉపనిషత్తులు ఉద్దేశింప బడ్డాయి .
సమస్త కోరికలు అంటే ఈషణాలు త్యాగం చేసినవారికి ,మోక్షం కోరేవారికి మాత్రమె ఉపనిషత్తులు .ఆదిశంకరాచార్య ‘’సన్యాసికే తప్ప ,భార్యాపిల్లలున్నవాడికి జ్ఞాననిష్టకు ,ఉపనిషత్ విద్యకు యోగ్యత లేదు ‘’అన్నారు .అందులో ఎన్నో కష్టాలుంటాయి కనుకనే ఆమాట అన్నారు ..కోర్కెలు లేకుండా సంసారం లో ఉంటె సన్యాసి కిందే లెక్క .అందరూ ఉండగలరా .శంకరాచార్య అపరిమితంగా అభిమానించే యాజ్ఞవల్క్య మహర్షికి మైత్రేయి ,కాత్యాయని ఇద్దరు భార్యలు . ఒంటి మీద బట్టల్ని ,భిక్షా పాత్రనూ వదిలేసి,హాయిగా చెట్టుకింద పడుకొనే వాడికీ ఆశాపాశం పోదు అన్నారు శంకరుడు భజగోవిందం లో ‘’అగ్రే వహ్నిఃపృష్టే భానూ ,రాత్రౌ చిబుక సమర్పిత జానుః-కరతలభిక్షా తరుతలవాసః తదపి న ముంత్యత్యాశాపాశః ‘’.మరి సంసారి సన్యాసి అవటం ఎలా ?భార్యాపుత్రులు దేవుడు మనకిచ్చిన వరంగా ,వారి పోషణ భగవంతుడిచ్చిన బాధ్యతగా ,వారి సేవ కూడా భగవదారాధనగా భావిస్తే సంసారం’’ బంధం కాని సంబంధం ‘’అవుతుంది .ఇదే సన్యాసం.ఇదే సంసారం అనే కొలనులో తామరాకు.అంటే నీటిలో ఉంటూ నీటిని అంటనట్టుఉండటం .తామరాకు మీద నీటి బొట్టు ఎక్కి కూచోవాలను కొంటుంది ,కానీ నిలవలేక నీళ్ళల్లోకి జారి కనిపించదు .కనుక నీటి బొట్టుగా కాకుండా తామరాకుగా అంటనట్లు ఉండాలన్నమాట .
కోరికలు త్యాగం చేసి మోక్షానికి ప్రయత్నించే వాడు దారి చూపే గురువును వెతుక్కుంటూ వెడతాడు .బ్రహ్మజ్ఞానానికి గురువు తప్పని సరిగా కావాలి .జ్ఞానం కలిగితే బంధం తెగి పోతుంది .బంధం తెగితే మోక్షమేగా .బ్రహ్మాన్ని తెలుసుకోవటానికి వచ్చిన శిష్యుడికి ,ఆచార్యుడైన గురువుకు మధ్య జరిగే సంభాషణా రూపమే ‘’కేన ఉపనిషత్ ‘’.కేన అంటే దేనిచేత లేక ఎవని చే అని అర్ధం .ఎవరి ప్రేరణతో కన్ను చూస్తుంది చెవి వింటుంది .సృష్టి చేయబడుతుంది ?అంతటినీ చైతన్యం చేసే ప్రత్యగాత్మ ఎవరు లేక ఏది ?ఇదే కేనోపనిషత్ చెప్పే విషయం .ఇందులో శాంతి పాఠం తో పాటు నాలుగు ఖండాలున్నాయి .మొదటి ఖండం లో ప్రాణులను ప్రేరేపించిశక్తి ఏది ?,అన్నిటినీ నియమించేది ఆత్మ.ఆత్మ తెలియ రానిది,,చెప్పలేనిది ,బ్రహ్మ అనుపాస్యంఅంటే ఉపాశించ లేనిది .ఈ లోకం ఉపాసించేది బ్రహ్మం కాదు .రెండవఖండం లో బ్రహ్మజ్ఞానం గురించిన భ్రమ ,బ్రహ్మ౦ తెలియంది కాదు తెలిసింది కూడా ,తెలియని వాడు జ్ఞాని ,ప్రతిబోధలోనూ బ్రహ్మాను భూతి ,ఆత్మ జ్ఞానం పొందినదే నిజమైన జన్మ .మూడవ ఖండం ఉపాసన లో –దేవతలగర్వభంగం ,పరమేశ్వరుడు యక్షరూపం లో రావటం ,అగ్ని పరీక్ష ,యక్ష ప్రశ్న ,గడ్డిపోచ ,వాయువు బలం ,ఇంద్రుని ఎన్నిక ,ఉమా రూపం లో బ్రహ్మ విద్యావిర్భావం .నాల్గవ ఖండం లో బ్రహ్మోపదేశం ,బ్రహ్మ స్పృహ ,ఇంద్రుడే మొదటిజ్ఞాని ,ఉపాసనా విధానం –అధి దైవత౦,అధ్యాత్మం ,వన భజన ,చిత్త శుద్ధి సాధనాలు ,సత్వ శుద్ధి సాధనాలు ,ఫలశ్రుతి విషయాలవివరణ ఉంటాయి .
ఆధారం –కేన ఉపనిషత్ -శ్రీ సూరపరాజు రాధా కృష్ణమూర్తి గారి వ్యాఖ్యానం
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -18-10-20-ఉయ్యూరు