కేనోపనిషత్ విశేషాలు -2
శాంతి పాఠం-ఓం ఆప్యాయంతు మమా౦గాని వాక్ప్రాణశ్చక్షుః,శ్రోత్ర మథో బాల మింద్రియాణి చ సర్వాణిసర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో దానిరాకరణ మస్త్వనిరాకరణం మేస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్సుధర్మాస్తే మయి సంతుతే మయి సంతు-ఓం శాంతిః శాంతిః శాంతిః
భావం –నా శరీర అంగాలు దృఢంగా ,వాక్కు ప్రాణం కన్ను చెవి బలం పొందుగాక .సర్వేంద్రియాలు శక్తి పొందాలి .అంతా ఉపనిషత్ బ్రహ్మమే . నేను బ్రహ్మాన్ని నిరాకరించ రాదు .బ్రహ్మ నన్ను నిరాకరించకూడదు ..అనిరాకరణం ఉండాలి ,అనిరాకరణం ఉండాలి .ఉపనిషత్ ధర్మాలు నాలో ఉండాలి ,నాలో ఉండాలి .
అన్ని ఇంద్రియాల పని సామర్ధ్యం ఇచ్చేది బ్రహ్మమే .బ్రహ్మ ప్రాప్తికి ఇంద్రియాలే సాధనం .ఇవి బ్రహ్మజ్ఞానానికి ద్వారాలు .అన్ని ఇంద్రియాలు వాటిపనిఅవి చేసుకొనే సామర్ధ్యం బలం ఇవ్వమని ప్రార్ధన .కావలసింది ఆత్మబలం కదా .ఇంద్రియ బలం దేనికి ?’’నాయమాత్మా బలహీనేన లభ్యః ‘’అని ముండక ఉపనిషత్ చెప్పింది .అంటే కండబలం లేకపోతే ఆత్మబలం ఉండదు .శరీరం బలంగా ఆరోగ్యంగా లేక పొతే ఆత్మసాధనకు సహకరించదు.ధర్మ అర్ధ కామాలు సాధించటానికే కాదు మోక్షసాధనకుకూడా శరీరం కావాలి .అందుకే అన్ని ఇంద్రియాలు శక్తిపొందాలి అని ప్రార్ధన
ఇంద్రియాలు మనల్ని నడిపించకూడదు .మనమే వాటిని నడిపించాలి .దీనికి ఆత్మబలం కావాలి .అంగాలకు లొంగ రాదు.ఆత్మవల్లనే బలం పొందాలి ‘’ఆత్మనా విందతే వీర్యం ‘’అంది కేనోపనిషత్ .అంటే ఈ దేహమే నేను అనే దేహ భావం వదిలేసి ,ఈ దేహం కూడా నేనే అనే సర్వాత్మ భావం పొందాలి .బ్రహ్మం నేనే .ఆత్మనే .’’ఆత్మై వేదం సర్వం ‘’.అంతా ఆత్మా అయినప్పుడు వేరే ఏదీ లేదు కనుక ఈ దేహమూ నేనే .అంతా ఉపనిషత్ బ్రహ్మమే
నేను బ్రహ్మను నిరాకరించకూడదు బ్రహ్మ నన్ను నిరాకరించరాదు .కంటితో చూసేదే బ్రహ్మం .కన్ను ఉన్నా చూపు ఉంటేనే చూడగలం .ఆచూపు నిచ్చేదే బ్రహ్మం –‘’చక్షుషశ్చక్షుః—అంది కేన .బ్రహ్మాన్ని తెలియకపోవటమే నిరాకరణం .అన్నిటినీ నడిపించేది బ్రహ్మ మాత్రమే అని తెలుసుకోవటమే బ్రహ్మాన్ని తెలుసుకోవటం లో మొదటి మెట్టు .బ్రహ్మం ఉన్నది అనే తెలివి కలిగితే ,అనిరాకరణం బ్రహ్మ జిజ్ఞాసకు ప్రారంభం అవుతుంది .
ప్రథమ ఖండం
మొదటి మంత్రం –‘’కేనేషితం పతతి ప్రేషితం మనః –కేనప్రాణః ప్రథమః ప్రైతియుక్తః
కేనేషితాంవాచ మిమాం వదంతి –చక్షుఃశ్రోత్రం క ఉ దేవో యునక్తి ‘’
భావం –ఏ దేవుని చేత ప్రేరేరి౦పబడి మనసు కోరే విషయాలగురించి ప్రసరిస్తోందో ,ఏ దేవుడి తోకలిసి ప్రాణవాయువు మొదటగా చలిస్తోందో ,ఏ దేవునిప్రేరణ చే వాక్కు పలుకుతోందో ,ఏ దేవుడు కన్ను చెవి ఇంద్రియాలను ప్రేరేపిస్తున్నాడో
రెండవమంత్రం –‘’శ్రోత్రస్య శ్రోత్రం మనసో మనో య-ద్వాచో హ వాచం స ఉ ప్రాణస్య ప్రాణః
చ్చక్షుష శ్చక్షు రతిముచ్య దీరాః –ప్రేత్యాస్మా ల్లోకా దమృతా భవంతి ‘’
భావం –ఏ దేవుడు చెవికి చెవి ,మనసుకు మనసు ,వాక్కు కు వాక్కు అయి ఉన్నాడో ,ఆదేవుడే ప్రాణవాయువుకు ప్రాణవాయువుగా నేత్రానికి నేత్రమూ అవుతున్నాడు .ఈలోకాన్ని విడిచి ధీరులు ప్రకృష్ట దశ పొంది,మరణ రహితులు అంటే అమృతులు ఔ తున్నారు .
మనసు ప్రేరణ ఉంటేనే ప్రసరిస్తు౦ది.ఆప్రేరకుడు ఎవరు ?జీవుడు ఇష్టమున్నా ఏ అవయవాన్నీ కదిలించలేడు కనుక మనస్సుకు ప్రేరకుడు జీవుడు కాదు.ప్రాణవాయువు మహావాయువులో భాగమే .వాయువు జడపదార్ధం .జీవుడు ఈశ్వరుడు తప్పమిగిలిన తత్వాలన్నీ జడాలే .వాయువు కదుల్తున్నట్లు మనకు అనిపిస్తుందికదామరి జడం ఎలావుతుంది ?ఒక్కోసారి వాయువు వీచక ఉక్క అనుభవిస్తూ విసినకర్రతో విసురుకొంటూ అనుభవిస్తాం .కనుక వాయువుకు చలనం సహజం కాదు .శ్వాస క్రియలో మన ప్రాణం ప్రయత్నం ఏమీ ఉండదు .కనుక వాయువుకు చలనం సహజగుణం కాదు . కనుక ఇవన్నీ ఇతరములలైన వాటి ప్రేరణచే శక్తి పొందుతున్నాయని మొత్తం మీద అర్ధం .
శ్రోత్రం అంటే వినటానికి సాధనమైనది .ఏది శ్రోత్రానికి శ్రోత్రమో మనసుకు మనస్సో వాక్కుకు వాక్కోదాన్ని వివరించాలి .శ్రోత్ర వాక్ మనసులు జడాలు కనుక కర్తృత్వం లేదు .కనుక చెవికి వినే సామర్ధ్యం మనసుకుప్రతిఫలన సామర్ధ్యం ,వాక్కుకు ధ్వని ఉత్పాదక సామర్ధ్యం తత్త్వం ఏదో బయట ఉన్నది .మనసో మనః అంటే మనసుకు మనసైనవాడు ఎవడు ?అది తెలియాలి .మనసు జడం కాని అది శరీర కర్తవ్యాలను చేయిస్తోంది .దీనికిశక్తి ఎక్కడి నుంచి వచ్చింది ?బయటినున్చేవచ్చి ఉండాలి అంటే పరమేశ్వరుని వలననే .వాచోహ వాచం అంటే వాగింద్రయానికి వాక్కు అయినవాడు .ఇలా ఇంద్రియాల పనులను చేయించేవాడు దేవుడు .ఆయనే మనసుకు మనసు వాక్కుకు నేత్రానికి నేత్రం వాక్కు శ్రోత్రానికిశ్రోత్రం అయిఉన్నాడని భావం .మోక్ష విషయం లో గొప్ప బుద్ధిగల ధీరులైన వారు ఈ లోకం వదిలి ఉత్కృష్ట స్థితి పొంది అమృతులౌతున్నారు .
ఆధారం –శ్రీ ప౦డితారాధ్యుల శరభారాధ్య వ్యాఖ్యానం .
సశేషం
మీ-గబ్బిట-దుర్గాప్రసాద్ -19-10-20-ఉయ్యూరు