ఆరు నెలల కరోనా కష్ట కాలం లో నేను- నా సాహిత్యం -2(చివరిభాగం )
నా ప్రసంగవిశేషాలు
అందరికీ నమస్కారం .నవరాత్రి దసరా శుభాకాంక్షలు .ఇంతటి మంచి అర్ధవంతమైన కార్యక్రమం నిర్వహిస్తున్న కృష్ణా జిల్లా రచయితలసంఘాన్నీ ,పాల్గొంటున్న రచయితలను మనసారా అభినందిస్తున్నాను .కరోనా కాలం లో మరణించిన భారత రత్న మాజీ రాష్ట్ర పతి ప్రణబ్ ముఖర్జీ ,పోర్ట్రైట్ చిత్రకారుడు బాపుగారి తమ్ముడు శ్రీ శంకరనారాయణ ,గాంధర్వ గాన శ్రీ బాల సుబ్రహ్మణ్యం ,హాస్యనటుడునాటక రచయిత,శ్రీ రావికొండలరావు ,పౌరాణిక నటుడు శ్రీ లవకుశ నాగరాజు ,విలక్షణ వాచికాభినయ నటుడు శ్రీ జయప్రకాష్ రెడ్డి ,నాట్యకలహంస శ్రీమతి శోభానాయుడు ,ఉత్తరాంధ్ర వాయిస్ కవి ,గాయకుడు శ్రీ వంగపండు ప్రసాదరావు,కరోనా వైద్య సేవలో అసువులుబాసిన డాక్టర్లు నర్సులు పోలీస్ సిబ్బంది ,కవులు కళాకారులు అధికారులు ఉపాధిలేక మరణించిన ఉద్యోగులు కార్మికులు , వేలాది మైళ్ళ దూరం నడుచుకొంటూ స్వగ్రామాలకు కుటుంబాలతో తరలి వెడుతూ మరణించిన వలసకార్మికులనే ‘’జాతీయ కార్మికులు ‘’వారి కుటుంబాలు ,దేశ విదేశాలలో కరోనా బారిపడి చనిపోయిన లక్షలాది ప్రజలకు అశ్రు నివాళి అర్పిస్తున్నాను .మానవత్వం తోఆదుకున్న వారిని ,ముఖ్యంగా బాలీ వుడ్ నటుడు సోను సూద్ ను అభినందిస్తున్నాను .కరోనా మనుషుల మధ్య దూరాన్ని పెంచింది .వైరాగ్యం నేర్పింది .తోటి వారు స్వంత ఆత్మీయులు చనిపోయినా పలుకరించే ధైర్యాన్ని లాగేసింది ,ఇంతటి ఘోర విపత్తు మనం ఎప్పుడూ చూడనిదే .ప్రపంచం కుగ్రామం అయి కుటుంబమే అయిపోయి౦ది .అంతటి వైపరీత్యం కలిగించింది .శోకభీకర లోకైక తిమిరమే ఆవహించి భయ భ్రాంతులను చేసింది .ఉద్యోగులు,ఉపాధ్యాయులు విద్యార్ధులు ఇళ్లకే పరిమితమయ్యారు .దేవాలయ అర్చనలు ఉత్సవాలు నామమాత్రమయ్యాయి .ఇలాంటి సమయం లో మెదడుకు పదును పెట్టి కవులు రచయితలూ కళాకారులు కాలాన్ని సద్వినియోగం చేసుకొని సృజనను సుసంపన్నం చేసుకొన్నారు .లోకానికి మేలైన అనుభూతి పూర్వక సాహిత్యం అందించారు .అందరూ అభినందనీయులే .
నేను కరోనాలాక్ డౌన్ ప్రారంభమైన మార్చి 21 నుండి జూన్ 15వరకు చేసిన సాహిత్యకృషిని జూన్ 25న ‘’లాకౌట్ లోనూ అంతర్జాలం లో అవిచ్చిన్నంగా సాగిన నా సాహిత్య ప్రస్దానం ‘’అని రోజువారీ గా చేసిన సాహిత్య కృషి రాశాను .శ్రీ పూర్ణ చ౦ద్ వారం క్రితం ఇలాంటి ప్రోగ్రాం చేస్తున్నామని, నన్నూ పాల్గొనమని కోరినప్పుడు జూన్ 26నుండి అక్టోబర్ 16వరకు నా సాహిత్య కృషిని క్రోడీకరించి సిద్ధం చేసుకొన్నాను .ఈ రెండూ కలిపి ఐటెం వారీగా వివరాలతో మీకు అందిస్తున్నాను .
1-సరసభారతి తరఫున కృషి –శ్రీ శార్వరి ఉగాది వేడుకలలో ఆవిష్కరించాలనుకొన్ననేను రాసి(20,21,22 ),సరసభారతి ప్రచురించిన(31,32,33) 1-ఊసుల్లో ఉయ్యూరు 2-సోమనాథ్ నుంచి కాశీ విశ్వనాథ్ దాకా 3-ఆధునిక ఆంద్ర శాస్త్ర మణిరత్నాలు అనే మూడు పుస్తకాలు మా శ్రీ సువర్చలాన్జనేయస్వామి పాదాలవద్ద 21శనివారం సాయంత్రం పూజ తర్వాత ఉంచి స్వామి ఆవిష్కరించినట్లుగా భావించాం .మర్నాడు 22ఆదివారం అప్పటికే వచ్చిన అతిధులకు మా ఇంట్లోనే భోజనాలు ఏర్పాటు చేసి శాలువా, జ్ఞాపిక నగదు పురస్కారం ,పుస్తకాల సెట్ అందించాం .శ్రీ హనుమజ్జయంతి నాడు దేవాలయం లో 150 సెట్ల పుస్తకాలు స్వామి వారల కళ్యాణ సమయంలో భక్తులకు అందజేశాం .అమెరికాకు 50సెట్లు ఒంటిమిట్ట డాక్టర్ శివ గారితో అక్కడి మిత్రులకు సెట్లు పంపాం.జూన్ 6నుంచి పోస్ట్ కొరియర్ ద్వారా కనీసం 150సెట్లు కవులకు సాహిత్యాభిమానులకు బంధువులకు పంపాం.కరోనా కాలం ఇళ్ళల్లో వంట కూడా వండుకోలేని అత్యంత నిరుపేదలైన ఎరుకల యానాది వగైరా కుటుంబాలకు మా అబ్బాయి రమణ, ఆంజనేయులు, కోటేశ్వరావు మొదలైన మిత్రులు కేటరింగ్ ద్వారా అన్నం కూర పప్పు చట్నీ సాంబారు పెరుగు మొదలైన పాకెట్స్ తయారు చేయించి ఆహార పొట్లాలను కనీసం రోజుకు వందమందికి ఇళ్ళకు వెళ్లి అందించే కార్యక్రమంలో సరసభారతి కూడా భాగస్వామి అయి రెండు సార్లు ,మా అమెరికా మేనల్లుడు శాస్త్రి మా బావగారు పంపిన డబ్బుతో మా అక్కయ్య దుర్గ గారి తిధినాడు ఆతర్వాత మరో రోజుమొత్తం నాలుగుసార్లు ఆహార వితరణలో పాల్గొని ధన్యమైంది . జూన్ 27శనివారం నా పుట్టిన రోజు సాయంత్రం మా ఆలయం లో శాసనమండలి సభ్యులు శ్రీ రాజేంద్ర ప్రసాద్ అధ్యక్షత సభజరిపి పేదల అన్నదానానికి సహకరించిన కోటేశ్వరావు,ఆజనేయులు ,తో సహా స్వయం సిద్ధ ,శ్రమశక్తి పురస్కారాలు నగదు శాలువా జ్ఞాపిక పుస్తకాలతో అంద జేశాం . 28ఆదివారం నిడద వోలు కారులో వెళ్లి అక్కడ వారు ఏర్పాటు చేసిన ఫంక్షన్ హాలులోడా. శ్రీ చర్ల విదుల డా చర్ల మృదుల అనే చర్ల సిస్టర్స్ కు మా తలిదండ్రులు కీశే .గబ్బిట మృత్యుంజయ శాస్త్రి భవానమ్మ గారల స్మారక ఉగాది పురస్కారాలు అందజేశాం .చర్ల సుశీల వృద్ధాశ్రమానికి సరసభారతితరఫున 15 వేలు మా బావగారుశ్రీ వేలూరి వివేకానంద మా అక్కయ్య స్వర్గీయ దుర్గ పేరిట అందించిన 5వేలు ,అమెరికాలో ఉంటున్న మా బావగారి అన్నగారబ్బాయి శ్రీ వేలూరి పవన్ తన తండ్రిగారు స్వర్గీయ ముకుందం గారి పేరిట అందజేసిన 10వేలరూపాయలు మొత్తం 35వేలరూపాయలు నగదుగాచర్ల సిస్టర్స్ కు వేదికపైనే అందజేశాం .గోదావరి రచయితల సంఘం అధ్యక్షుడు శ్రీ శిష్టు సత్యరాజేష్ కు ,తణుకు కవయిత్రి గాయని అనేక అవార్డ్ ల గ్రహీత శ్రీమతి వాణీ ప్రభాకరి గార్లకు నగదు శాలువా పుస్తకాలు జ్ఞాపికలు తో స్వయం సిద్ధ పురస్కారం అందించాం .అక్కడి సాహితీ మిత్రులకు 30 సెట్ల పుస్తకాలు జ్ఞాపికలు శాలువ అందజేశాం .శ్రీకృష్ణాస్టమి వేడుకలు మా ఆలయం లో నిర్వహించి శ్రీకృష్ణ గోపీ రాధ వేష ధారులైన బాలబాలికలకు నగదు ,పుస్తకాలు అందించాం .గుడివాడ తెలుగు భాషా వికాస సమితి శ్రీ ప్రసాద్ ఆధ్వర్యం లో ఆగస్ట్ 29న గుడివాడ లైబ్రరీలో అందించిన గిడుగు రామమూర్తి సాహితీ పురస్కారం అక్కడికి వెళ్లి అందుకొన్నాను .సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవాన్ని మా గురువులు బ్రహ్మశ్రీ కోట సూర్య నారాయణ శాస్త్రి గారి గురు పూజోత్సవంగా మా గుడిలో జరిపి శ్రీ రాజేంద్ర ప్రసాద్ చేత ఈసంవత్సరం పదవ తరగతి ఉత్తీర్ణులైన పేద ప్రతిభగల విద్యార్ధులకు 2వేలరూపాయలు 7గురికి ,శ్రీ కోట సోదరులు తమతలిదండ్రులు సూర్యనారాయణ సీతమ్మ స్మారకం గా ఏర్పాటు చేసిన 20 వేలరూపాయలు ఇద్దరు పేద ప్రతిభగల బ్రాహ్మణ విద్యార్ధులకు ,సరసభారతి 5వేల రూపాయలు పుస్తకాలతో సహా అందజేశాం .ముగ్గురు ఉత్తమ ఉపాధ్యాయులకు శాలువా నగదు పుస్తకాలతో సత్కరించాం .
నా రచన –దాదాపు 10సంవత్సరాలుగా నా రచనా వ్యాసంగం అంతా అంతర్జాలం లోనే జరుగుతోందని మీకు తెలుసు .1090మంది సంస్కృతకవులపై ‘’గీర్వాణ కవుకకవితా గీర్వాణ౦ ‘’గా మూడు పుస్తకాలు రాసి ఆవిష్కరించిఅందజేశాం .నాలుగవ గీర్వాణ౦ నెట్ లో రాస్తూ 500 గీర్వాణ కవులను పరిచయం చేశాను ఇదంతా కరోనాకు ముందే .కరోనాలో సుమారు 100మంది సంస్కృత కవులపై రాశాను .
‘’ ప్రపంచ దేశాల సారస్వతం ‘’ అని మొదలుపెట్టి కరోనాము౦దు వరకు 30దేశాల సాహిత్యం రాశాను .ఆతర్వాత విజ్రు౦భి౦చి రోజుకు కనీసం మూడు ఆర్టికల్స్ గా రాసి 203దేశాలు అంటే 6ఖండలలో ఉన్న దేశాల సాహిత్యం గురించి సమగ్రంగా రాశాను అంటే లిపి లేనికాలం నుంచి 21వ శాతాబ్దివరకు నవల నాటకం కవిత్వం మొదలైన అన్ని ప్రక్రియలో రచయితల గురించి వారుపొందిన పులిట్జర్ నోబెల్ బహుమానాలగురించీ రాశాను .అమెరికా సాహిత్యం పై 20ఎపిసోడ్ లు రాశాను ఇంకారాయాలి .ఇది నాకు చాలా సంతృప్తి నిచ్చింది .
‘’సుందరకాండ లో హనుమ బహుముఖీన వ్యక్తిత్వం ‘’పేరుతొ వాల్మీకం ఆధారంగా నాకు తోచిన విధంగా 70 ఎపిసోడ్ లలో రాశాను .’’బకదాల్భ్యుడు ‘’అనే వేద,ఉపనిషత్ పురాణాలలో వచ్చే ఆయన గురించి మనకు పెద్ద గా తెలీదు .ఆయనపై ఆంగ్ల రచన ఆధారంగా సమగ్రంగా 21 ఎపిసోడులు రాశాను .’’ఆరామ ద్రావిడుల ఆరామం –కాకరపర్రు ‘’పేరిట అక్కడి సుప్రసిద్ధులైన వేదవేత్తలు కవులు దానశీలురు మొదలైన వారిపై 9 ఎపిసోడ్ లు రాశాను .’’మనకు తెలియని మహా యోగులు ‘’గా 70మందియోగుల జీవిత చరిత్రలు రాశాను .డా తిరుమల రామ చంద్ర గారి ‘’హంపీ నుండి హరప్పా దాకా ‘’ఆధారంగా ‘’తిరుమల రామ చా౦ ద్రాయణమే-హంపీ నుంచి హరప్పాదాకా ‘’పేరిట ముఖ్యమైన విషయాలను 24ఎపిసోడ్ లుగా రాశాను .’’అగర్తా ‘’అనే భూగర్భ లోక విశేషాలను ఆంగ్ల గ్రంథం ఆధారంగా -11ఎపిసోడ్ లు రాశాను .ఇంకారాయాలి .మహాత్యాగి శ్రీ మద్దూరి అన్నపూర్ణయ్య అనే దేశభక్తుని జీవిత చరిత్ర ఆధారంగా 8ఎపిసోడ్ లు రాశాను ఇంకారాయాలి .,పద్మ భూషణ్ ఖ్వాజి నజ్రుల్ ఇస్లాం ఉర్డుకవితలు ఆంగ్ల అనువాదం ఆధారంగా 15కవితలకు తెలుగు అనువాదం చేశాను .అలనాటి ‘’రేడియో బావగారి కబుర్లు ‘’చెప్పిన శ్రీ గాడేపల్లి సూర్యనారాయణ శాస్త్రి శ్రీ ప్రయాగ నరసింహ శాస్త్రి గార్ల ముచ్చట జ్ఞాపకం వచ్చి అదే పేరుతొ శంకరజయంతి అన్నమయ్య జయంతి నృసింహ జయంతి బుద్ధజయంతి లపై 4 ఎపిసోడ్ లు రేడియో బావగారి కబుర్లుగాడైలాగుల రూపంగా రాశాను .విహంగ మహిళా వెబ్ మాసపత్రికకు నెలకొక ఆర్టికల్ వంతున 6 ఆర్టికల్స్ ప్రపంచ ప్రముఖ మహిళలపై రాసి ఆపత్రికకు ఇప్పటికి సెంచరి రచనలు అంటే 100 రచనలు పంపి సంతోషించాను .వారునాకు మూడేళ్లక్రితం విహంగ సాహితీఅవార్డ్ ను రాజమండ్రి నన్నయ యూని వర్సిటీలో అందజేశారు .
పుస్తక సమీక్షలు –హోసూరు తెలుగు సంఘం వారు ఉగాదికి తెచ్చిన కవిత సంకలనం ,డా అగరం వసంత రాసిన ‘’అంజనప్ప స్వామి ‘’పుస్తకాల సమీక్ష రాశాను .శ్రీ చలపాక ‘’కాలం కథలు’’సమీక్ష ,ట్రాన్స్ జ౦డర్స్ కథలు శ్రీమతి కోపూరి పుష్పాదేవి గారి కథలపైనా ,శ్రీ యక్కలూరి శ్రీరాములు గారి సాహిత్యంపై డా మక్కెన శ్రీను గారి పరిశోధన పుస్తకం పైనా సమీక్షలు రాశాను ‘.
కరోనా పై కవితలు,హాస్య రచనలు -నిజం ,కరోనాభాష్య౦ ,ప్రపంచ కుగ్రామం కునారిల్లుతోంది ,గిరీశ భాష్యం ,కరోనా కల్యాణం ,కరోనాలో జంతువుల కళకళ ,మానవుల విలవిల ,రక్తబీజుని రక్త సంబంధివా?ఆర్ధికంగా క్యా కరోనా ?కరోనాకు కరోనా చెప్పు ,లాక్ డౌన్ బ్రూస్లీలు ,కరోనా-కామాక్షీ మీనాక్షీ కబుర్లు ,స్టేహోం జీరోలు ,కరోనా భువన విజయం ,నోనోనో .జనం రావాలంటే .
ప్రత్యేక వ్యాసాలు – పోర్ట్రైట్ చిత్రకారుడు శ్రీ శంకరనారాయణ గారి మరణం పై –‘’శాంత సౌజన్య మూర్తి ‘’ప్రఖ్యాత గాయకుడు బాల సుబ్రహ్మణ్యం మరణం పై –బాలూతో మాటా –మంచీ ,పౌరాణిక చిత్రనటుడు శ్రీ లవకుశ నాగరాజు పై ‘’నాగరాజుతో నా పరిచయం ‘’నటుడు జయప్రకాష్ రెడ్డి మృతిపై ‘’విలక్షణ వచికాభినయ నటుడు ‘’ప్రపంచ ప్రసిద్ధ ఆర్ధికవేత్త శ్రీ ఆరిగపూడి ప్రేం చంద్ గారి మరణంపై ‘’ఉయ్యూరుకు చెందిన ప్రముఖ ఆర్ధిక వేత్త శ్రీ ప్రేం చ౦ద్ ప్రత్యేక వ్యాసాలు రాశాను .
శ్రీ వాసుదేవానంద సరస్వతిపై ‘’అశ్వ త్దామ వంటి మహాపురుషులను దర్శించిన వాసుదేవానంద స్వామి -5ఎపిసోడ్ లుగా ,మచిలీ బందరుయోగి రామావదూత ,ఆత్రేయపై ‘’మన ‘’సుకవి’’ఆత్రేయ 3 భాగాలు రాశాను .కార్త వీర్యార్జునుడు ,దధి క్షీర సముద్రాలు సృష్టించిన ఉపమన్యువు వ్యాసాలు రాశాను .
శ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారికుమారుడు మహా పరిశోధకుడు శ్రీ ఆనందమూర్తిగారిపై ‘’పరిశోధన ఆనంద మూర్తి వేటూరి ,పౌరాణిక సార్వభౌమ బ్రహ్మశ్రీ మల్లాది చంద్ర శేఖర శాస్త్రి గారిపై సవివరమైన వ్యాసం రాశాను .
దేవాలయాలు శతకాలు –అల్లాడు ,చిత్రాడ ,ఝ౦గోళ,పరాశరేశ్వర ,సర్పవరం ధర్మవరం ,,లక్కవరం ,మర్రిగుంట, నువ్వుకొండ నడిగడ్డ దేవాలయాలు ,,తిరునారాయణ క్షేత్రం,కొమర్పురి శతకం ,ముఖలి౦ గేశ్వర శతకం .
ఫేస్ బుక్ లో సరసభారతి ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాలు –మార్చి 25 సాయంత్రం సాయంత్రం 5నుండి 6-30వరకు శ్రీ శార్వరి ఉగాది పంచాంగ శ్రవణం లైవ్ ,బ్రహ్మ శ్రీ మద్దులపల్లి మాణిక్య శాస్త్రి గారి జీవితం పై కరదీపికలైవ్ ,సరసభారతి పుస్తక పరిచయం -5భాగాలు లైవ్ ,కథాసుధ –రోజూ ఉదయం 10గంటలకు ,15రోజులు లైవ్ ,శ్రీ హనుమత్కథా నిధి , శ్రీ ఆంజనేయస్వామి మహాత్మ్యం -15భాగాలు లైవ్ ,’’అనంతకాలం లో నేనూ ‘’నా చిన్నప్పటినుంచి ఇంటర్ చదువు పూర్తయ్యేదాకా విశేషాలు -12భాగాలు లైవ్ ,భారతీయ విజ్ఞాన సర్వస్వం భారతం –‘’తిక్కన భారతం పై -10ఎపిసోడ్ లు లైవ్ ,శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర వైభవం –సెప్టెంబర్ 1నుంచి అక్టోబర్ 11 వరకు 41భాగాలు ప్రత్యక్ష ప్రసారం .
మీ గబ్బిట దుర్గాప్రసాద్ -19-10-20-ఉయ్యూరు