కేనోపనిషత్ విశేషాలు -4
ద్వితీయ ఖండం –
మొదటిమంత్రం-‘’యది మన్యసే నువే దేతి దభ్ర-నూనం త్వం వేత్ద బ్రహ్మణో రూపం
య దస్య త్వం య దస్యత చ దేవే ష్వధను –మీమా౦స్య మేవతే మన్యే విది-తం ‘’
భావం-పరమేశ్వరతత్వాన్ని బాగా తెలుసుకొన్నాను అనుకుంటే ,నీకు తెలిసింది చాలా తక్కువ .నీ రూపాన్నీ ,దేవతల రూపాన్నీ చూసి తెలుసుకొన్నది పూర్తిగా బ్రహ్మ రూపం కాదు .బ్రహ్మ రూపాన్ని అంతటినీ చక్కగా విచారించి మాత్రమేతెలుసుకోవాలి .
రెండవ మంత్రం –నాహం మన్యేనువే దేతి నో న వేదేతి వేద చ –యోనస్తద్వేద తద్వేదనో న వే దేతి వేదచ
భావం –నాకు బాగా తెలిసిందని అనుకోను .నాకు తెలియదు అనే విషయం కూడా తెలియదు .మాలో తెలిసిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది .ఇప్పటికీ నాకేమీ తెలియదనే విషయం కూడా నాకు తెలియదు .
మూడవ మంత్రం –‘’యస్యా మతం తస్య మతం మతం యస్య చ న వేద సః-అవిజ్ఞాతం విజానతాం విజ్ఞాత మవజానతాం ‘’
భావం –తెలియ బడని బ్రహ్మ తత్వాన్ని తెలుసుకోవాలను కొని ,తెలిసిన జగత్తును మరుస్తున్న వారిలో ఎవరికీ తెలియ బడని తత్త్వం ఉన్నది అనే భావం ఉన్నవాడికి కొంతవరకు తెలిసిందని అర్ధం .తెలిసింది అనే గర్వం ఉన్నవాడికి, ఏ మాత్రం తెలియదు అని గ్రహించాలి .
నాలుగవ మంత్రం –‘’ప్రతిబోధ విదితం మత మమృతత్వం హి విందతే-ఆత్మనా విందతే వీర్యం విద్యయా విందతే అమృతం’’’
భావం –గురువు ఉపదేశంపొంది , విషయ పరిజ్ఞానం పొంది ఆ కలిగిన జ్ఞానం తో మననం చేస్తూ మరణం లేని స్థితిని సాధకుడు పొందుతున్నాడు .శరీర కర్మలచే కర్మాచరణ పాటవం అనే వీర్యాన్ని ,ఉపాసనతో బ్రహ్మాన్ని పొందుతాడు .మతం అంటే మననం చేయబడిన అని అర్ధం .
ఐదవ మంత్రం –‘’ఇహ చే ద వేదీ దధ సత్య మస్తి-న చే ది హా వేదీ న్మహతీ వినష్టిః
భూతేషు భూతేషు విచిత్య ధీరాః ప్రేత్యాస్మా ల్లోకా దమృతా భవంతి ‘’
భావం –ఈ జన్మ ఉండగానే బాగా విచారించి చూస్తే ,పరమేశ్వర అస్తిత్వం గోచరిస్తుంది .ఇలా గమనించకపోతే నాశనం తప్పదు.కనుక ముముక్షువులు భూతముల ,ప్రాణముల విషయం లో బాగా ఆలోచించి తెలుసుకొని ,ఇహలోక సంబంధాన్ని వదిలి ప్రకృష్టస్థితి ఐన అమృతత్వం పొందుతున్నారు .
సశేషం
మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -21-10-20-ఉయ్యూరు