కేనోపనిషత్ విశేషాలు -6(చివరి భాగం )
చతుర్ధ ఖండం
మొదటి మంత్రం –‘’సా బ్రహ్మేతి హో వాచ బ్రాహ్మణో వా ఏతద్విజయతే మహీ యధ్వమితి తతో హైవ విదా౦చకార బ్రహ్మేతి ‘’
భావం –ఉమా దేవి ఇంద్రునితో ‘’ఆ యక్షుడు పరమేశ్వరుడు .పరమేశ్వరుడే మీ విజయానికి కారణం ‘’అని చెప్పగా ఇంద్రుడు ఆ వచ్చింది పరమేశ్వరుడైన బ్రహ్మ స్వరూపం అని గ్రహించాడు .
రెండవ మంత్రం –‘’తస్మా ద్వా ఏతే దేవా అతితరా మి వాన్యాన్ దేవాన్ ,యదగ్నిర్వాయు రింద్ర స్తే హ్యేన న్నేదిస్టం పస్పర్శు స్తే హ్యేన ప్రథమా విదా౦ చకార బ్రహ్మేతి ‘’
భావం –అగ్ని ,వాయువు ,ఇంద్రుడు ఈ ముగ్గురే యక్షరూపంలో ఉన్న పరబ్రహ్మ ను చూసి విషయం తెలుసుకొన్నారు కనుక ఈముగ్గురు దేవతలు మిగిలిన దేవతలకంటే అధికులయ్యారు .
మూడవ మంత్రం –‘’తస్మాద్వా ఇంద్రోతితరా మి వాన్యాన్ దేవాన్ స హ్యేన న్నేదిష్టం పస్పర్శ న హ్యేన ప్రథమో విదా౦ చకార బ్రహ్మేతి ‘’
భావం –అగ్ని ,వాయువు, ఇంద్రులలో ఇంద్రుడు యక్ష బ్రహ్మ తో మాట్లాడి ఆయన స్వభావం స్వయంగా విని తెలుసుకొన్నాడు కనుక ఇంద్రుడు అగ్ని వాయువులకంటే గొప్ప వాడయ్యాడు .నాలుగవ మంత్రం –త స్యైష ఆదేశో య దేత ద్విద్యుతో వ్యద్యుత దా ఇతీ న్యమీష దా ఇత్యధి దైవత౦ ’’
భావం –బ్రహ్మ తత్త్వం మెరుపులాగా ప్రకాశ మానమైనదనీ ,మెరుపులాగా అంతలోనే అదృశ్య మౌతుందనీ దేవతా విషయకమైన విషయక మైన ఉపదేశం .
ఐదవ మంత్రం –‘’అధాధ్యాత్మం య దేత ద్గచ్ఛతీవ చ మనోనేన చైత ముపస్మరో త్య భీక్ష్ణ౦ సంకల్పః ‘’
భావం –ఇంకా అధ్యాత్మ ఉపదేశం చెప్పబడుతోంది .ఈ బ్రహ్మ తత్వాన్ని మనస్సు పొండుతున్నట్లున్నది .మనసు చేత బ్రహ్మ తత్వాన్ని స్మరించాలి అని జీవుడి సంకల్పం .
ఆరవ మంత్రం –త ద్ధ తద్వనం నామ తద్వన మిత్యుపాసి తవ్యం స య ఏత .దేవం వేదాభి హైనం సర్వాణి భూతాని సంవా౦ఛంతి’’
భావం –బ్రహ్మ తత్వాన్నే ఉపాసించాలి .ఎవడు బ్రహ్మ తత్వాన్ని ఉపాసిస్తాడో ,అతడిని సర్వ భూతాలూ కోరుకొంటాయి .వనం అంటే ఉపాస్య వస్తువు అని అర్ధం .
ఏడవ మంత్రం –‘’ఉపనిషదం భో బ్రూ హీ త్యుక్తా య ఉపనిషద్బ్రాహ్మీం వావ త ఉపనిషదమబ్రూ మేతి’’
భావం –శిష్యుడు గురువును బ్రహ్మ విషయం ఉపదేశించమని కోరితే గురువు బ్రహ్మకు సంబంధించిన ఉపనిషత్తు ను ఉపదేశి౦చాను అని చెప్పాడు .
ఎనిమిదవ మంత్రం –‘’’తస్యై తపో దమః కర్మేతి ప్రతిష్టా వేదాః సర్వా౦గాని సత్య మాయతనం ‘’
భావం –బ్రహ్మ సంబంధమైన ఉపనిషత్తు కోసం క్రుచ్ఛ ,చా౦ద్రాయణాది కర్మలు, బహిర ఇంద్రియ నిగ్రహం ,సంధ్యావందనాది విహిత కృత్యాలు ,రుక్ మొదలైన సంహితల .శిక్షా మొదలైన షట్ శాస్త్రాల అధ్యయనం ముముక్షువులకు అవసరమైన ముఖ్య విషయాలు .
తొమ్మిదవ మ౦త్రం –‘’యోవా ఏతా మేవ౦ వే దాపహత్య పాప్మాన మనంతో స్వర్గే లోకే జ్యేయే ప్రతి తిష్టతి ప్రతి తిష్టతి’’
భావం –ఈ ఉపనిషత్తు ను గురు ముఖతా అధ్యయనం చేసి ,అందులోని విషయాలను మననం చేసే ముముక్షువు కర్మ బంధనాలు విడిపోయి బ్రహ్మలోకం లో శాశ్వత స్థితి పొందుతాడు .
ఓం ఆప్యాయంతు మమా౦గాని వాక్ప్రాణశ్చక్షుః,శ్రోత్ర మథో బాల మింద్రియాణి చ సర్వాణిసర్వం బ్రహ్మౌపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరో దానిరాకరణ మస్త్వనిరాకరణం మేస్తు తదాత్మాని నిరతే య ఉపనిషత్సుధర్మాస్తే మయి సంతుతే మయి సంతు-ఓం శాంతిః శాంతిః శాంతిః
సమాప్తం
దుర్గాష్టమి శుభాకాంక్షలతో
మీ –గబ్బిటదుర్గాప్రసాద్ -23-10-20-ఉయ్యూరు