పెద వేగి దేవాలయం
పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు కు 12కిలో మీటర్ల దూరం లో పాడుపడి ఉన్న ఊరే పెదవేగి.ఒకప్పుడు వేంగీ రాజ్యానికి ముఖ్య పట్టణంగా వర్ధిల్లిన వేంగీ నగరమే ఇది .పురాతత్వ సర్వేక్షణ తరఫున డా కార్తికేయ శర్మ చేసిన పరిశోధనలలో అపురూప శైవ విగ్రహాలు కనిపించాయి .ఇవి క్రీ .శ. 4-6శతాబ్దాల నాటివి .ఇవే కాక తూర్పు చాళుక్యరాజుల పాలన నాటి ఆలయ శిల్పాలు ,ప్రతిష్టా మూర్తులు దొరికాయి .వాటి వివరాలు తెలుసు కుందాం
1-సోమాయ ఫలకం –ఇది దాచేపల్లి తెల్లరాయి తో చేయబడింది .12,9,2సెంటిమీటర్ల కొలతలు కలిగింది .పార్వతీ పరమేశ్వరులు ఒకే ‘’మంచక ‘’అధిష్టానం పై కూర్చుని ఉంటారు శివుని జటలు చక్కగా బంధింపబడి ఉంటాయి .త్రినేత్రుడు . యజ్ఞోపవీతం మూడు పాయలు స్పష్టంగా కనిపిస్తుంది. శివుని వామభాగం లో అర్ధ పర్యంకం పై అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది .పరమేశుడు ఎడమ చేతితో అమ్మవారిని దగ్గరకు తీసుకోవటం చూడగలం .నూతన దంపతులైన ఈ ఆది మిధునం విలక్షణముఖ వర్చస్సుతో వేంగీ పురవాసులకు అర్చా దేవతలయ్యారు .చిన్న ఫలకమే కనుక ఇది ఒక శివ భక్తుని పూజా మందిరం లో అర్చనకు స్థాపింపబడి ఉండవచ్చు .ఈ సోమాయ ఫలకం అత్యంత ప్రాచీనమైనది .తర్వాత పాలించిన పల్లవ,విష్ణు కుండిన రాజుల కాలం లో దేవాలయ ఫలకాలపై శివ పార్వతి, చిన్న పిల్లాడుగా స్కందుడు ,వినాయకుడు చేరారు .శివ పార్వతి అర్చా ఫలకం మాత్రం ‘’పెద్దమడియం ‘’ వాటికన్నా చాల పురాతనమైనది .
2-పంచలింగ ఫలకం -7,7,2 సెంటీ మీటర్ల ఫలకం పై అర్ధశిల్పంగా పంచలింగాలు ఒకే అధిష్టానం పై ప్రతిష్టించి న ఫలకం .పద్మ బంధం గా అధిష్టానం ఉంటుంది .పంచలింగాలు ఒకే వరుసలో ఉన్న శిల్పం ఇంకెక్కడా లేదు .ఇవి రుద్రుని పంచ భూతాలూ లేక ముఖాలకు ప్రతి రూపాలు కావచ్చు .ఈ మూర్తులుకూడా ఆకాలం లో చక్కగా అర్చనలు అందుకొన్నారు .శివుడిని పంచ శర(బాణ)ఆననుడిగా అంటే ముఖాలు ఉన్నవాడిగా చాలా ఆగమ గ్రంథాలు పేర్కొన్నాయి .
3-నాగ దేవత –ఇది కాల్చిన మట్టి ఫలకం .అండా కారం గా 11,9,2 సెంటి మీటర్ల ఫలకం విచిత్రమైన స్త్రీ రూపం ఇందులో కనిపిస్తుంది .ఆమె సింహాక్షి ,సింహ ముఖి ,లంబ స్తని , సన్నని నడుము, చక్కని నాభి ,పూర్ణ వక్షోభాలతో ఉంటుంది .సర్ప శిరస్సుపై యోని నుంచి మోకాళ్ళవరకు వంగి కూర్చుని ఉంటుంది .పాములే భూషణాలు కుండలాలు కంఠమాల ,కేయూరాలు ,మేఖల శిరోజాలు అన్నీ సర్పాలే .రెండు చేతులలో ముకుళించిన కమలాల కాండాలు ఎత్తి పట్టుకొని ఉంటుంది .కనుక ఈ దేవత కుమారి అని చెప్పటానికి ఇదే నిదర్శనం .ఏ సంప్రదాయానికి చెందిందో చెప్పలేక పోయారు. బహుశా అదితి కాని ,పృధ్వీ దేవత కాని అయి ఉండవచ్చునని అభిప్రాయం .
4-ఏకాదశ రుద్రులు –ఈ శిల్పం పెదవేగి కి దగ్గరలో దొరికింది .ఎరుపు రంగు ఇసుక రాయి శిల్పం .11తలలు ,24చేతులు ఉన్న ఈ శిల్పం ఒకమీటరు ఎత్తు,85 సెంటీ మీటర్ల వెడల్పు ,32 సెంటీ మీటర్లమందం కొలతలు కలది .ఇది ప్రతిష్ట చేయబడిన విగ్రహమే అని కిందున్న బుడుపు ను బట్టి చెప్పవచ్చు .ఈ ఆలయం ఎక్కడ ఉండేదో తెలియటం లేదు .ఊరికి మధ్యలో ఉన్న శివాలయం లో ఉండి ఉండవచ్చు .మొదటగా ఈ శిల్పాన్ని మరికొన్నిటిని శ్రీ రాళ్ళబండి సుబ్బారావుఒక ప్రత్యేక సంచికలో తెలియజేశారు .ఈ శిల్పాన్ని శిల్పించిన తీరు యావత్ భారత మూర్తి కళా చరిత్రలో లేనే లేదు .రుద్రుని ‘’అరుణాయ ,తామ్రాయ ‘’అంటారు .కానీ సదా శివ లక్షణాలు ఈ శిల్పం లో లేవని అసలు శివ శిల్పం కాదని కార్తికేయ శర్మ అభి ప్రాయ పడ్డారు .మధ్యరూపం నిల్చుని ఉన్న పూర్తి మానవ రూపం .కుడివైపుకు వంగినట్లు ఎత్తుగా ఉన్న పిరుదును బట్టి చెప్పవచ్చు .జట తురాయిలాగా నిలువుగా ఉన్నా ,ముఖాగ్రం లో మకుటం ఉంది .మకుటం మీదరత్న ఖచిత వైదిక పతకాలు లేక మాడలు న్నాయి .ఫాలమున నిటారుగా త్రినేత్రం ఉన్నది .నాసిక ,పెదిమలు కొంతవరకు చిద్ర౦ (రంధ్రం )మైంది .కంఠం పై మూడు రేఖలున్నాయి .మెడలో హారాలు మూడు దళసరిగా ముత్యాలు రత్నాలు పొదిగి ఉంటాయి .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -24-10-20-ఉయ్యూరు