మహా త్యాగి మద్దూరి అన్నపూర్ణయ్య-9
ఆంద్ర జయప్రకాష్ –జయప్రకాష్ నారాయణ జీవితానికి అన్నపూర్ణయ్య గారి జీవితానికీ చాలా సామ్యం ఉన్నది .ఇద్దరూ యువజనాకర్షణలో సిద్ధ హస్తులు .జాతీయ ఉద్యమం లో వామపంధా అనుసరించిన త్యాగమూర్తులు .మొదట్లో కాంగ్రెస్ తర్వాత మార్క్సిజం అధ్యయన శీలురు .’’వెలుగు ‘’పత్రికలో మద్దూరి ‘’ 1953 వేసవి శిక్షణలో జెపి పూనాలో 21రోజులు ఉపవాసం చేసి ,నాస్తికత్వం నుంచి ఆస్తికత్వానికి మారాడు .1953సెప్టెంబర్ లో ‘’బొంబాయి సోషలిస్ట్ జనరల్ కౌన్సిల్ ఆధిభౌతిక వాదం నా సమస్యలను పరిష్కరించలేకపోయింది .నేను ఇవాళ మార్క్సిస్ట్ ను కాను ‘’అని చెప్పాడు అంటూ రాశారు .మానవులమధ్య ప్రేమ బంధం గాఢ౦ గా ఉండాలి .జయప్రకాష్ నిర్ణయం దివ్యమైనది .కేవల నాస్తికుడు పరమ ఆస్తికుడై ప్రేమ తత్వాన్ని శరణు జొచ్చాడు .మహా పురుషుల గమ్యం ఇదే..ఆ గమ్యాన్ని చేరిన జెపి కి ఇవే జోహార్లు అని రాసినమాటలు అక్షరాలా అన్నపూర్ణయ్యగారికీ వర్తిస్తాయి .ప్రజా సేవలో 33ఏండ్లు పండిపోయి 1953డిసెంబర్ 2న అన్నపూర్ణయ్య గారు తాను ఏ పార్టీకీ చెందను అని ప్రకటించారు .ఆత్మ విచారణ మార్గం లో గురువును వెతుక్కొంటూ మెహర్బాబా శిష్యుడయ్యారు మద్దూరి .
యువజన శిక్షణా శిబిరాలు –గాంధీ ఆశీస్సులతో 1934లో జయప్రకాశ్ మొదలైన వారు కాంగ్రెస్ లో అంతర్భాగం గా ‘’కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ‘’స్థాపించారు .1937లో కమ్యూనిస్ట్ పార్టీపై నిషేధం ఉంది .బలం పు౦జు కోవచ్చునని వాళ్ళు ఈ పార్టీలో చొచ్చుకుపోయారు .ఆంద్ర యువకులకు మూతన రాజకీయ దృక్పధం అలవాటు చేయటానికి కొత్తపట్నం లో వాలంటీర్ల శిక్షణా శిబిరం నిర్వహించారు .ఇది ఒంగోలుకు తూర్పున పది మైళ్ళ దూరం లో సముద్రం ఒడ్డున శిబిరం . 170మంది వాలంటీర్లు చేరారు .వీరిలో పుచ్చలపల్లి సుందరయ్య ,కొల్లా వెంకయ్య ,మాకినేని బసవపున్నయ్య ,జొన్నలగడ్డ రామలింగయ్య ,పిడతల రంగా రెడ్డి మొదలైన వారున్నారు .ఇందూలాల్ యాజ్ఞిక్ ,జహీర్ ,జోరాబేగం ,స్వామి సహజానంద సరస్వతి ,ఆచార్య రంగా ,జయప్రకాష్ నారాయణ ,అచ్యుత పట్వర్ధన్ ,బాట్లివాలా ,సిపి అల్లం గో ఉపన్యాసాలిచ్చి అవగాహన కల్పించారు .
ఆంధ్రరత్న దుగ్గిరాలవారి ముఖ్య శిష్యుడు జనాబ్ గౌసు బేగం వాలంటీర్ దళాధిపతి .చండ్ర రాజేశ్వరరావు డ్రిల్లు ,అన్నాప్రగడ కామేశ్వరావు గెరిల్లా పద్ధతులు నేర్పేవారు .అల్లూరి సత్యనారాయణ రాజు ,ఆయన భార్య ,అన్నా ప్రగాడ, ఆయన సతీమణి కూడా పాల్గొన్నారు .శిబిర నిర్వహణ బాధ్యతా అన్నాప్రగడ ,మద్దూరి,అల్లూరి నేతి చలపతిసాగి విజయ రామరాజు వహించారు .స్థానికుల తోడ్పాటుతో జయప్రదంగా జరుగున్న ఈ శిబిరాన్ని ప్రభుత్వం నిషేధించింది.1937మే 21న గుంటూరు జిల్లా కలెక్టర్ వెల్లోడి రెండు వాన్ల రిజర్వ్ తో వచ్చి ,వాలంటీర్లపై లాఠీ చార్జి చేశాడు .అన్నా ప్రగడ,అన్న పూర్ణయ్య గార్లకు బాగా దెబ్బలు తగిలాయి .భారత జాతీయ కాంగ్రెస్ ఆవిర్భావం గురించి అన్నపూర్ణయ్య గంభీర ఉపన్యాసం చేశారు .1942లో దువ్వూరికి ఇచ్చిన చార్జి షీటు లో శిబిరం లోనిషేధిత కమ్యూనిజం గూర్చిబోధించారని ఆరోపణ ఉన్నది .తాను ఆపని చేయనే లేదు అని దువ్వూరివారు తీవ్రంగా ఖండించారు .
1938 మే 4న ఆంద్రా కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ ఆధ్వర్యం లో గుంటూరుజిల్లా మంతెన వారిపాలెం లో అన్నాప్రగడ యువజన శిక్షణా శిబిరం నిర్వహించాడు .దీన్ని ప్రభుత్వం నిషేధించలేదు .అన్న పూర్ణయ్య ఇక్కడా జాతీయోద్యమం సోషలిజం గూర్చి మాట్లాడారు .మాడభూషి వెంకటా చారి, చండ్ర , సివికే రావు ,కంభం పాటి సత్యనారాయణ పివి శివయ్య ,జొన్నలగడ్డ ,అధ్యాపకులుగా ఉన్నారు ఎస్ ఏ డాంగే,పిసి జోషి, అధికారి మొదలైన పెద్దలు ప్రేరణ కలిగించారు .మాదల వీరభద్రయ్య రాసిన గేయాని అన్న పూర్ణయ్య గారు పాడి స్పూర్తి క లిగించారు .
1936,37లో మద్దూరి విస్తృతంగా గోదావరి జిల్లాలో పర్యటన చేసి యువకులను సోషలిం వైపు ఆకర్షించారు.బట్ట గుండులో జరిగిన తమిళనాడు సోషలిస్ట్ సభకు అధ్యక్షత వహించారు ఏలూరు లో జరిగిన పగోజి సభకు అధ్యక్షత వహించగా శ్రీమతి కమలకుమారి ప్రారంభించారు .అదేకాలం లో రాజమండ్రి అల్యూమినం ,ప్రెస్ వర్కర్లను సంఘటితం చేసి వారి యూనియన్ లకు అధ్యక్షుడై కార్మిక సంక్షేమానికి యెనలేని కృషి చేశారు అన్నపూర్ణయ్య .
సశేషం
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-20-ఉయ్యూరు