యలమంద కోటీశ్వర శతకం
నరసరావుపేట తాలూకా శ్రీ కోటీశ్వర క్షేత్ర నివాసి ,అచల గురుసంప్రదాయకుడు శ్రీ బెల్లం కొండ కోటి నాగయ్యకవి ‘’శ్రీ యలమంద కోటీశ్వర శతకం ‘’రాశాడు .వృషభ గోత్రజుడు .తల్లి సొమా౦బ,తండ్రి పిచ్చయ్య .కవి పాశుపతం మొదలైన అనేక ఉపాసనా సిద్ధుడు ,పరమహంస స్వరూప నిత్యానంద రాజయోగి.కోటి నాగార్యుడుగా సుప్రసిద్ధుడు . రేపల్లె తాలూకా మాచవరం వాస్తవ్యులు శ్రీ అలపర్తి వెంకయ్య చౌదరి ధర్మపత్ని శ్రీమతి వేంకాయమ్మ ద్రవ్య సహాయం తో ,నిడుబ్రోలు తాతాముద్రాక్షర శాలలో 1934లో ప్రచురింపబడి౦ది .వెలలేదు .
సీస పద్యం లో యలమంద గొప్పతనం వర్ణించాడు కవి .యలమంద అంటే కోటప్పకొండ .అక్కడి స్వామి త్రికోటీశ్వరుడు .కైలాసానికి మించిందీ , సమస్త ఓషధులకు నిలయమైనదీ ,తిరుమలకు సాటియైనదీ ,అణిమాది అష్ట సిద్ధులను అందించేది ,’’వసుధ యాదవ మణి యొప్పుగా నందున్న మహిలో ఉన్నదీ ,రుష్యాదుల బిలాలున్నదీ,అందానికి సాటి ,మంచుకొండలున్నదీ , శ్రీకోటీశ్వరునికి నెలవై ఉన్నదీ ,కోటి లింగాని జ్ఞాన కొండ యలమంద కొండ .ఆ కొండపై వెలసిన వాడే శ్రీ యలమంద కోటీశ్వర స్వామి .
జన్మ సార్ధకం చేసే చతుర్విధ ఉపాయాలు ,జనన రాహిత్యానికి వివిధ సూచనలు ,గర్భం లోని పిండ వృద్ధిక్రమం ,పంచీకరణం ,హంస గమనాగమనం ,జ్ఞానే౦ద్రియాది నిర్మాణం ,సాంఖ్య తారక అమనస్క యోగ విషయాలు ముముక్షు తత్వ మార్గానికి సోపానాలుగా,పండిత పామర రంజకం గా ఈ శతకం కోటి లింగకవి రాశాడని బాపట్ల తాలూకా మాట్లూరు వాసి శ్రీ ఆకుల కోటి లింగయ్య మెచ్చుకున్నాడు .కవిగారు తన శతకాన్ని నారాయణ శతకం లాగా చదు వుకోవాలని సూచించాడు .
‘’శ్రీ భక్త హృదయవాసా –మౌనిజన- సేవ్యత్రికూట వాసా –శోభితామల వికాసా –మమ్మేలు –శుభ దృష్టి కొటీశ్వరా ‘’అని శతకం ప్రారంభించాడు కవి .’’గొప్పదనమునకు గాదు భక్తిగా జెప్పితి –ప్రాపు నీవని వేడితి –నన్ను తమ దాపునకు జేర్పమంటి –క్రూరుండు వీడ౦చు నను-నీవు వేరు శాయకు -కర్మ చే నిలబుట్టియు జీవులు –కర్మములు చేయు చుండి –కర్మ చేతను గిట్టుచు మరు జన్మ గా౦చు దురు -ఋతు వేళ కమలమందు –సతి శుక్ల శోణితములు నండమగు కోటీశ్వరా !
‘’తల్లి పొత్తిలి యందున బెరుగుచును –తగమూత్ర మలము లందు –తల్లడిలి పొర్లాడుచుజరపితిని –సోయంచు పూరకంబు –లోపలి పోయి కు౦భ కమగుచును –హం యంచు రేచకంబు వెలికొచ్చు-హర నామ కోటీశ్వరా-ముందు పరమాత్మ యందు నవ్యక్త-మందున మహత్తత్వము –అ౦దునను హంకారము –నను గల్గె-నతిమాయ కోటీశ్వరా-వాయువులో సగ భాగము వ్యానమై –వరుస మిగిలిన భాగము –తోయమాకాశాగ్ని భూమిలో –తోడ్పడియె కోటీశ్వరా-తోయమున నర్దాంశము రస మయ్యె-రూప శబ్ద స్పర్శ ము –గంధరస –రూపింప జలపంచకం బని యొప్పె-రూఢిగా కోటీశ్వరా-తన్ను డా జూచుకొనుటె యమనస్కము కోటీశ్వరా’’
చాలా గహన వేదాంత విషయాలు అరటి పండు వొలిచి చేతిలో పెట్టినట్లు శతకం లో రాసి నిజంగానే ముముక్షులకు మోక్ష మార్గ దర్శనం చేసిన శ్రీకోటి నాగార్య కవి ధన్యుడు .
కోటప్పకొండ, గుంటూరు జిల్లా, నరసరావుపేట మండలం, యల్లమంద గ్రామ పరిధిలో ఉన్న త్రికోటేశ్వరుని సన్నిధి. ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే ప్రసిద్ధి[1] చెందిన మహిమాన్విత క్షేత్రం. ఇక్కడ కైలాశాధినేత అయిన ఆ మహా శివుడు త్రికోటేశ్వరుని రూపంలో కొలువైన దివ్య సన్నిధి ఈ కొండ. యల్లమంద కోటయ్యగా భక్తులకు ప్రీతి పాత్రుడైన శివుడు కోటప్పకొండలో కొలువై భక్తుల కొంగు బంగారంగా విలసిల్లుతున్నాడు. ప్రతి ఏటా కార్తీకమాసంలో కోటప్పకొండ తిరుణాళ్ళు, కార్తీక వన సమారాధనలు కూడా జరుగుతాయి. ఈ తిరణాళ్లలో చుట్టుప్రక్కల ఊర్లనుండి ప్రభలతో భక్తులు దేవాలయాన్ని దర్శిస్తారు.ఇక్కడ కాకులు వాలవు .అదొక విచిత్రం . మీ- గబ్బిట దుర్గాప్రసాద్ -26-10-20-ఉయ్యూరు .