స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -2
కేంద్ర అసెంబ్లీ లో భూలాభాయ్ మాట్లాడిన విషయాలు ఒక తీవ్రవాది మాట్లాడినంత పరుషంగా ఉండేవి .ఇండో బ్రిటిష్ వ్యాపార వొడంబడిక ,జాయంట్ పార్లమెంటరి కమిటీ నివేదిక క్రిమినల్ లా సవరణ బిల్లు ,ఆర్మీ రిక్రూట్ మెంట్ బిల్లు ,ఆర్దికబిల్లు మొదలైన విషయాలలో భాయ్ చేసిన ఉపన్యాసాలు చాలా విలువైనవి .బ్రిటిష్ పాలకులుయుద్ధ సమయం లో భారత దేశం లో ప్రజా ప్రభుత్వమే నిర్వహిస్తోందని ఆర్భాటంగా ప్రచారం చేసుకొంటుంటే ,ఇండియాకు స్వాతంత్రం ఇవ్వటానికి హిందూ ముస్లిం సఖ్యత లేదన్న అసత్య ప్రచార సమయం లో ,భారత శాసన సభలో భూలాభాయ్ నాయకత్వం లో అసెంబ్లీ సభ్యులైన కాంగ్రెస్ వారు ,ముస్లిం లీగు సభ్యులు కూడా ఏకమై ,ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఫైనాన్స్ బిల్లు ను అనేక సార్లు ఓడించారు .శాసన సభ్యుల ఐక్యత చూసి తెల్ల ప్రభుత్వం తెల్ల బోయింది .హిదూ ముస్లిం ఐక్యత ఏర్పడు తుందేమోనని కంగారు పడింది కూడా .ఫైనాన్స్ బిల్లును ఓడించి భారత్ లో ప్రజా స్వామిక ప్రభుత్వం లేదని ప్రపంచానికి నిర్దంద్వంగా తెలియ జేశారు భూలాభాయి నాయకత్వంలోని సభ్యులు .ప్రభుత్వం చెప్పేదాంట్లో సత్యం లేదని నిరూపించారు .సభలో ఓడిన బిల్లును వైస్రాయి వీటో అధికారం ప్రయోగించి బలవంతంగా రుద్దే దురుద్దేశాన్ని లోకానికి చాటగలిగారు .1935నుంచి 45వరకు ఉన్న దశకం లో దేశం రాజకీయంగా అట్టుడికి పోతున్న తరుణం లో ,సెంట్రల్ అసెంబ్లీ లో ప్రతిపక్ష నాయకుడుగా భూలాభాయి ఉంటూ, యెనలేని కీర్తి నార్జించాడు దేశ విదేశాలలో .
1939సెప్టెంబర్ లో ప్రారంభమైన రెండవప్రపంచ యుద్ధం లో భాగస్వామిగా ఇండియాను చేయాలని ప్రభుత్వం కోరగా భారతీయులు అంగీకరించక అసమ్మతి తెలిపారు .బ్రిటిష్ వారి స్వంతయుద్ధాలలో ఇండియా 1927నుంచీ పాల్గోన్నదనీ ,కాంగ్రెస్ గుర్తు చేస్తూనే ఉంది .యుద్ధం ప్రారంభం కాగానే గాంధీ ,కాంగ్రెస్ ప్రభుత్వాన్ని యుద్ధం ఉద్దేశ్యం ఏమిటి అని నిలదీశారు .దానికి ఫాసిస్ట్ ప్రభుత్వాన్ని రూపుమాపి ,ప్రజాస్వామ్య సూత్రాలను కాపాడటమే అని ప్రభుత్వం సమాధానం చెప్పింది .’’మీతో కలిసి సమానంగా యుద్ధం చేసి శత్రు సంహారం చేయటానికి మాకుకూడా మీతో పాటు సమాన ప్రతిపత్తి ఇవ్వండి ‘’అని ప్రభుత్వాన్ని కాంగ్రెస్ కోరింది .కానీ కుటిల తెల్ల ప్రభుత్వం ప్రజలకు చెప్పకుండా ,ఇండియాను యుద్ధంలోకి దించి ,ఇండియా అంగీకరించే యుద్ధం చేస్తోందని ప్రభుత్వం ప్రచారం చేసింది .ఈ అసత్య ప్రచారాన్ని త్రిప్పికొట్ట టానికే కాంగ్రెస్ వ్యష్టి శాసనోల్లంఘన ఉద్యమం ప్రారంభించింది .
అప్పటికే అధికారం లో ఉన్న ఆరు రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రి వర్గాలు ,ఇండియా యుద్ధం లో పాల్గొనటానికి అసమ్మతిగా మంత్రిపదవులను త్యజించి వ్యష్టి సత్యాగ్రహం లో పాల్గొన్నారు .1940 డిసెంబర్ 1 న భూలాభాయ్ ని అరెస్ట్ చేసి ,ఎరవాడ సెంట్రల్ జైలులో డిటిన్యుగా తీసుకు వెళ్ళింది .జైలులో ఆయన జబ్బు పడ్డాడు .1941సెప్టెంబర్ 17న విడుదల చేసింది .
భూలాభాయ్ కాంగ్రెస్ కార్యవర్గ సభ్యుడుగా ,బొంబాయి రాష్ట కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడుగా ఉండేవాడు .1942లో కార్యవర్గ సభ్యత్వానికి రాజీనామా చేశాడు .1942ఏప్రిల్ లో క్రిప్స్ రాయబారం విఫలమయ్యాక,ఆగస్ట్ 7న బొంబాయి కాంగ్రెస్ సమావేశం లో ‘’బ్రిటిష్ ప్రభుత్వం భారత దేశం నుంచి పూర్తిగా వైదొలగాలి ‘’అనే తీర్మానం చేయటానికి సమావేశమైంది .ఆగస్ట్ 8న జాతీయ నాయకులను అరెస్ట్ చేసి అహ్మద్ నగర్ కోటలో బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది .దేశంలో ఉవ్వెత్తున విప్లవం చెలరేగింది .అణచటానికి ప్రభుత్వం అనేక ప్రయత్నాలు చేసి ,విఫలమై మారణ యంత్రాలను కూడా ప్రయోగించింది .మహాత్ముని అర్ధాంగి కస్తూరిబాయ్ మాత ,ఆయన కుడిభుజం మహ దేవ దేశాయ్ మరణించారు .ఈ మరణాలు ప్రజల్ని మరింత ఉద్రేక పరచాయి .గాంధీ ఆగాఖాన్ భవనం లో ఉపవాసం చేసి ,ఆగస్ట్ ఉద్యమానికి కాంగ్రెస్ కారణం కాదనీ ప్రభుత్వానినిదే బాధ్యత అని నిరూపించాడు .అనారోగ్య రీత్యా ఆతర్వాత గాంధీని విడుదల చేశారు .
దేశంలో జరుగుతన్న ఈ పరిణామాలన్నీ నిశితంగా పరిశీలిస్తున్నాడు ఎంతోవ్యధ చెందుతున్నాడు భూలాభాయ్ .గాంధీ నెహ్రు అజాట్ వంటి అగ్రనాయకులు జైల్లో ఉండటం ఆయన్ను కలచి వేసింది .వారి విడుదలకు ,ప్రతిష్టంభన తొలగటానికి మార్గాలు అన్వేషించాడు.శాసన సభా ప్రతిపక్ష నాయకూడుగా ,ముస్లిం పక్ష ఉపనాయకుడునవాబ్ జాదా లియాఖత్ ఆలీఖాన్ తో సంప్రదించి ఇద్దరూకలిసి అన్యోన్యంగా కేంద్రం లో జాతీయ ప్రభుత్వాన్ని తాత్కాలికంగా నైనా ఏర్పాటు చేస్తే సంక్షోభాన్ని కొంత వరకు తగ్గించవచ్చు అని అలోచించి లియాఖత్ నుఒప్పించి ఒక ప్రణాళిక తయారు చేశాడు భూలాభాయ్ . రెండవ ప్రపంచం మొదలైన నాటి నుంచీ జనాబ్ జిన్నా నాయకత్వం లోని ముస్లిం లీగు ఈశాన్య వాయవ్య రాష్ట్రాలతో ముస్లిం మేజారిటీరాష్ట్రాలను పాకిస్తాన్ పేరుతొ నిర్మించాలని కోరింది .జిన్నా వాదం ప్రమాదమైనదని జాతీయ ముస్లిం లు వాదించారు .దేశాన్ని రెండుముక్కలు చేయాల్సిందే అని పట్టుబట్టాడు జిన్నా .భారత దేశం అవిభాజ్యం అన్నది కాంగ్రెస్ .పాకిస్తాన్ వాదాన్ని ఖండిస్తూ జాతీయ ముస్లిం లు భావి భారత ప్రజలంతా సంపూర్ణ స్వాతంత్ర్యం తో తులతూగాలని ప్రచారం చేశారు .రాజ్యపద్దతి ముఖ్యంగా మూడు అంశాలపై ఆధార పడి ఉండాలని వా౦ఛి౦చారు . అ వివరాలు తర్వాత తెలుసుకొందాం .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -27-10-20-ఉయ్యూరు