స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం ) 

స్వాతంత్రోద్యమ ఖైదీల అండ మహాన్యాయవాది -భూలా భాయిదేశాయ్ -4(చివరి భాగం )

ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ

భూలాభాయ్ జీవితం లో మహత్తర ఘట్టం ఆజాద్ హింద్ ఫౌజ్ విచారణ .భారత్ నుండి రహస్యంగా జపాను వెళ్ళిన నేతాజీ సుభాశ్ చంద్ర  బోస్ నాయకత్వం లో శత్రువులకు భారత ప్రభుత్వ సైన్యం స్వతంత్ర జాతీయ సైన్యం అంటే ఆజాద్ హింద్ ఫౌజ్ గా ఏర్పాడి భారత స్వాతంత్ర్యం కోసం బ్రిటిష్ వారితో పోరాటం మొదలుపెట్టింది .భారత్ నుంచి బ్రిటిష్ వారిని వెడల గోట్టటమే వీరి ధ్యేయం .రెండవ ప్రపంచయుద్ధం పూర్తయి జర్మనీ ఇటలి పరాజయం పొందటం ,జపాన్ మిత్రమండలికి లొంగిపోవటం జరిగాయి .ఆజాద్ హింద్ ఫౌజ్ కూడా లొంగిపోవాల్సి వచ్చింది .ఈ సైనికులలో చాలామందిని  బ్రిటిష్ ప్రభుత్వం బంధించింది .కొందరిని ఢిల్లీ లోని ఎర్రకోటలో బంధించి  హింసించింది .భారత ప్రభుత్వం ప్రత్యేక కోర్టు ఏర్పాటు చేసి ఈ విషయం విచారించింది .ముందుగా విచారి౦ప బడిన నాయకులు కెప్టెన్ షా నవాజ్ ,లెఫ్టినెంట్ సైగల్ ,లెఫ్టినెంట్ ధిల్లాన్ . ఈ విచారణపై ప్రపంచం అంతా దృష్టి కేంద్రీకరించింది . ఫౌజుతరఫున వాదించటానికి భూలా భాయ్ దేశాయ్ ,నెహ్రు, ఆసఫాలీ లను కాంగ్రెస్ ఏర్పాటు చేసింది .ఎక్కువ శ్రమ తీసుకొని నేతాజీ విడుదలకు కారణమైనవాడు  భూలాభాయ్ .బోసు సర్వ సైన్యాధిపతిగా స్వతంత్ర ప్రభుత్వం ఏర్పాటు చేసి ,మాతృదేశం కోసం ప్రాణాలు అర్పించిన బోసువీరులను భారత ప్రభుత్వం రాజద్రోహులుగా పరిగణించటం ప్రపంచ స్వతంత్ర దేశాలన్నీ విని ముక్కు మీద వేలేసుకొన్నాయి .స్వరాజ్యం నా జన్మ హక్కు అని చాటేరోజుల్లో ,బ్రిటన్ పై యుద్ధం చేయటం నేరంగా భావించి విచారిస్తున్నదుకు సభ్య ప్రపంచం నివ్వెర పోయింది .లాల్ ఖిల్లా తీర్పుకోసం ఉత్కం తో ఎదురు చూసింది .

  భూలాభాయ్ వాదిస్తూ ‘’పరప్రభుత్వం పై యుద్ధ ప్రకటన ప్రతి పరతంత్ర జాతి జన్మ హక్కు ‘’అని గట్టిగా గంభీరంగా ప్రకటించాడు .తన యావత్ శక్తియుక్తులన్నీ ధారపోసి వాదించాడు భాయ్ .ఆయనవాదనను విని మెచ్చి సంతోషించని వాడే లేడు ఆనాడు .112మంది సాక్షులతో వాజ్మూలాలు చెప్పించాలనుకొని ,కాని ప్రాసిక్యూషన్ వారి 28సాక్షుల మాటలూ విన్నతర్వాత ,అందులో పసలేదని గ్రహించి ,,కేవలం 11మంది సాక్షులతోనే సరిపుచ్చి రెండు రోజులు ఫౌజుచర్యను సమర్ధిస్తూ దీర్ఘ ఉపన్యాసాలు చేశాడు .ఆయన సంది౦చిననమౌలిక ప్రశ్నలు –1-పరాధీన జాతికి స్వాతంత్రం కోసం యుద్ధం చేసే హక్కు ఉందా లేదా ?ఉన్నదనటానికి అనేక ప్రమాణాలున్నాయి 2-సువ్యవస్థమైన స్వతంత్ర భారత తాత్కాలిక సైన్యానికి మలయాలో 2లక్షల 50వేలమంది ,తూర్పు ఆసియాలో 2లక్షలమంది ప్రజలు భక్తీ విశ్వాసాలు చాటారు .అక్షరాజ్యాల ఆమోదం కూడా పొందింది ఈసైన్యం .ఇవన్నీ యదార్ధ విషయాలే కల్పనలుకావు .3-ఆజాద్ హింద్ ఫౌజ్ సువ్యవస్థిత సైన్యం ,దానికి చట్టముందనీ నేనేమీ శ్రమపడి వాది౦చ క్కరలేదు .దస్తావేజులపై దస్తావేజులు ప్రాసిక్యూషన్ వారే సమర్పింఛి రుజువు చేసినందుకు ధన్యవాదాలు .అయితే ఆ చట్టం లో కొరడాలతో కొట్టే నిబంధనను మాత్రమే అడ్వకేట్ జనరల్ అధిక్షేపించారు 4-1911 ఇండియన్ ఆర్మీ చట్టం లో 45వ అధికరణాన్ని ఆయన మర్చి పోయినట్లున్నాడు .అందులో బ్రిటిష్ ఇండియన్ చట్టం కింద దండనార్హం అయిన ఏ సివిల్ నేరానికైనా వారంట్ ఆఫీసర్ హోదా కంటే తక్కువ హోదా ఉన్నవారి ని 30కొరడా దెబ్బలు కొట్టాలని ఉంది .యుద్ధకాలానికి మాత్రం దాన్ని తొలగించారు ,కనుక స్టాట్యూ ట్ లో లేదని చెప్పటానికి వీల్లేదుకదా .కొరడా దెబ్బలను ఆమోదించిన సందర్భాలు డిఫెన్స్ ఆఫ్ ఇండియా రూల్స్ లో చాలా ఉన్నాయి .5-ఫౌజ్ యుద్ధం ప్రకటించటానికి రెండు కారణాలున్నాయి .ఒకటి ఇండియాకు స్వాతంత్రం. రెండు తూర్పు ఆసియా ప్రజల ధనమాన ప్రాణ రక్షణ 6-నూతన ప్రభుత్వానికి జపాన్ ప్రభుత్వం అండమాన్ నికోబార్ దీవులను ధారా దత్తం చేసింది .ఈ ప్రభుత్వం స్వయంగా 50చదరపు మైళ్ళ విస్తీర్ణం ఉన్న ‘’జయవాడే ‘’అనే భూభాగాన్ని సంపాదించింది .సుమారు 1500చదరపు మైళ్ళ విస్తీర్ణమున్న మణిపూరు ,విష్ణు పూరు ప్రాంతాలను అయిదారు నెలలు పాలించింది కూడా .అండమాన్ దీవులను కర్నల్ లోకనాధం రెండు శాఖలు మాత్రమే నిర్వహించాడు .అందులో ఒకటి చిన్నదైన విద్యాశాఖ. స్కూళ్ళు ఎక్కువ లేవు ఖర్చు తక్కువ అని అధిక్షేపించక్కరలేదు .15శాతం అక్షరాస్యతున్న మనదేశం లో కంటే అక్కడే ఎక్కువ స్కూళ్ళు న్నాయి .ఈ దీవులకు ‘’షాహిద్ ‘’,’’స్వరాజ్’’ అనే పేర్లు కూడా పెట్టారు .జయవాడిలో 15వేలమంది ప్రజలున్నారు . వారంతా భారతీయులే ,ఆజాద్ హింద్ ప్రతినిధే వీటిని  పాలించాడు 7-ఫౌజు ఇండియా-బర్మా సరిహద్దు దాటినప్పుడు రెండు ఫర్మానాలు జారీ అయ్యాయి .ఒకటి స్వతంత్ర భారత ప్రభుత్వ అధ్యక్షుని  చేత ,రెండవది జనరల్ కావేబే చేత .జపాన్ జయించే భారత్ భూ భాగమంతా ఫౌజు కే అప్పగించబడుతుందనీ ,వారే దాన్ని పాలిస్తారని ఫర్మానాల సారాంశం .8’’స్టాంప్ కలె క్టింగ్’’ అనే వారపత్రికలో టి.యే .బ్రో హెడ్ అనే విలేకరి ఇ౦ఫాలులో  ఉపయోగానికి ముక్కాణీ,అణా స్టాంపుల ప్రూఫ్ కాపీలు తానూ చూశానని’’ ఢిల్లీ కోట’’ బొమ్మ ,’’ఢిల్లీ చలో’’ అనే నినాదం వాటిపై ముద్రించబడి ఉందనీ  రెండు భాషలలోనూ  ‘’తాత్కాలిక భారత ప్రభుత్వం ‘’అని ఉందనీ ,తర్వాత వీటి అవసరంలేక ఆ అచ్చులు భగ్నం చేయబడి స్టాంపులు తగలబెట్ట బడినాయని.కనుక తాత్కాలికప్రభుత్వం ఏర్పడి పరిపాలించటం జరిగింది కనుక దానికి యుద్ధం చేసే హక్కుకూడా ఉన్నదని  ఒప్పుకోక తప్పదు.యుద్ధకాలంలో జరిగే పనులు సాధారణ ‘’లా ‘’క్రిందకు రావు .యుద్ధకాలం లో ఒక జర్మన్ పౌరుడు బ్రిటిష్ వాడి నెవరినైనా కాల్చిచంపితే హత్యాద్రోహం కింద శిక్షిస్తారా ?9-అంతర్జాతీయ న్యాయ శాస్త్రం ప్రకారం పరదాస్యం నుంచి విముక్తికావటానికి ఏ దేశమైనా చేసే యుద్ధం ధర్మ సమ్మతమే అవుతుంది .యుద్ధం చేసే ఆ రెండు పక్షాలు స్వతంత్ర రాజ్యాలుగా ఉండనక్కర లేదు .బోయర్ యుద్ధం దీనికి ఉదాహరణ  మొదటి చార్లెస్ ను ఉరితీయటాన్ని మీరు ఏమంటారు ?రెండవ జేమ్స్ కధఏమిటి ?’’10-ఫౌజు సైనికులు తిరుగుబాటు దార్లే కావచ్చు ,కాని 1870లో అమెరికన్ సభాపతి గ్రాంట్ ‘’తిరుగుబాటు దార్ల పోరాటం అంతర్జాతీయ ధర్మం ప్రకారం యుద్ధం కిందకే వస్తుంది ‘’అని బల్ల గుద్ది చెప్పలేదా  ? రెండవ పక్షం ఓడిపోయిన వ్యక్తులపై దోషా రోపణ చేయరాదని అమెరికన్ ఫెడరల్ కోర్ట్ ప్రధాన న్యాయమూర్తి పుల్లర్  తీర్పు ఇవ్వలేదా ?11-స్పానిష్ –అమెరికన్ కాలనీలు స్వతంత్రంకోసం స్పెయిన్ దేశం పై తిరుగుబాటు చేస్తే  ఆ పోరాటాన్ని సక్రమ యుద్ధం అనే బ్రిటన్ చెప్పలేదా .ప్రభుభక్తి శాశ్వత ధర్మం కాదు .అలా అయితే ఏ పరాధీన జాతీ స్వతంత్రాన్ని పొందనే లేదు 12-ప్రభుభక్తికీ దేశభక్తికీ సంఘర్షణ వస్తే దేశ భక్తినే ఎంచుకోవాలని 1776 అమెరికా స్వాతంత్ర ప్రకటనే గొప్ప నిదర్శనం .ఇదే న్యాయం కాకపొతే ప్రపంచం లో న్యాయాని చోటే ఉండదు 13-‘’లా ఆఫ్ నేషన్స్ ‘’అనే  వాటిల్ ప్రామాణిక ప్రాచీన ఆంగ్ల ధర్మ శాస్త్రం లో ‘’ప్రజల రాజ్య సంరక్షణ కింద ఉన్న ఒక దుర్బల రాజ్యాన్ని ,ఆ ప్రజల రాజ్యం రక్షించలేక పొతే ,ఆ దుర్బల రాజ్యం వెంటనే స్వతంత్రాన్ని మళ్ళీ పొందుతుంది ‘’అని ఉన్నదాన్ని బట్టి ఆజాద్ హింద్ ఫౌజు నిర్మాణ సందర్భం లో కూడా ఇలాంటిపరిస్థితు లే ఏర్పడ్డాయి 14.చివరగా క్రూరకృత్యాలు హత్యలుజరిపారు అన్న విషయాన్ని ప్రాసిక్యూషన్ సాక్షులే క్రాస్ పరీక్షలో చెప్పలేక పోయారు .ఇక్కడ హింసలు అంటే నియమ ఉల్లంఘన  చేసినందుకు శిక్షే కానీ వేరేదీ కాదు అని గ్రహించాలి 15-హత్యల విషయం రుజువే కాలేదు .మహమ్మద్ హుస్సేన్ ను తుపాకీ తో కాల్చినట్లు చేసిన అభియోగం లో ని ముగ్గురు సిపాయిలలో జాగీరాం కు అంతకు ముందు ఎప్పుడూ తుపాకి పట్టనే లేదని చెప్పాడు ,ముగ్గురి గుళ్ళూ అతని గుండెలో దిగాయన్న ప్రాసిక్యూషన్ ఆరోపణలో పస లేదనిరుజువైంది కదా .ఇలాంటి మేధో విలసిత అత్యంత అనుభవ పూర్వక భూలా భాయ్ డిఫెన్స్ వాదన కు ప్రభుత్వ మైండ్ బ్లాకై పోయింది .ముద్దాయిలను బేషరతుగా విడిచిపెట్టింది .

  బోసు వీరుల విడుదలవగానే భూలా భాయ్ ని అభినందిస్తూ దేశం నలు మూలాలనుంచి అభినందన టెలిగ్రాములు కుప్పలు తెప్పలుగా వచ్చాయి .బోసువీరులూ భాయ్ ని అభినదించారు .  బొంబాయి ప్రోగ్రెసివ్ గ్రూప్ సమావేశం లో భాయ్ ప్రసంగిస్తూ ‘’షా నవాజ్ ,సైగాల్ ,ధిల్లాన్ లను విచారిస్తున్నప్పుడు భారతజాతీయ సేనకు చెందిన 40వేల మంది ఆఫీసర్లు సామాన్య సైనికులు లాల్ ఖిలాలో విచారి౦పబడ్డారు .ఈ ముగ్గురు ఆఫీసర్లు భారతీయ యువకులకు ప్రతినిధులు .స్వాతంత్ర్యం తదితర సమస్యల కంటే ఎక్కువ గుణ పాఠం ఫౌజు విచారణలో భారతీయులకు నేర్పింది ‘’అన్నాడు .ఈ విచారణ తర్వాత భాయి రాజకీయాలనుండి విర మించాడు .

  భూలాభాయ్ ఆరోగ్యం క్రమంగా క్షీణించింది .దీనికి కారణం ఫౌజు కేసు విచారణలో ఆయన నిద్రాహారాలు మానేసి కృషి చేయటమే అని పెద్దలంతా భావించారు .తీవ్రమైన జబ్బులోకూడా మౌలానా అబ్దుల్ కలాం కోసం’’ ఆజాద్ ,ఆజాద్’’ అని కలవరించాడు .అంతటి మమైక్యం పార్టీతో వ్యక్తులతో ఆయనకు ఉండేది .నాలుగు నెలలు బాధపడి చివరకు 5-5-1946 న స్వాతంత్రం రాకుండానే భూలాభాయ్ దేశాయ్ 68వ ఏట బొంబాయి స్వగృహం లో మరణించాడు . పెద్ద ఊరేగింపుగా ఆయనను స్మశానానికి వేలాది అభిమానులు పౌరులు పెద్దలతో తీసుకు వెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు .ఆజాద్ హింద్ ఫౌజ్ సైనిక లాంచనాలతో తమ నివాళి అర్పించింది .

.గాంధీ ‘’మహా నాయకుడు దేశాయ్ .ఆయన బాధ కు పరి సమాప్తి లభించింది .అందరికి ఆయన ఆదర్శనీయుడు ‘అన్నాడు .ప్రకాశం పంతులు ‘’క్రాస్ పరీక్షలో మేటి .న్యాయ శాస్త్ర మేధావి ‘’అన్నారు .ఆజాద్ ‘’అసెంబ్లీలో నాయకుడుగా గొప్ప దేశ సేవ చేశాడు ఈ కేసు ద్వారా అంతర్జాతీయ న్యాయ శాస్త్రం లో ఒక నూతన అధ్యాయం ఆవిర్భవించింది ‘’.నెహ్రూ ‘’బోసు వీరుల విచారణలో ఆయన ప్రసంగం చిరస్మరణీయం ‘’.జిన్నా ‘’నాతో ఏకీభవించలేదు కాని మాస్నేహం భంగం కాలేదు ‘’.ఆలీఖాన్ ‘’ఆయన ప్రసంగాలు శ్రోత్ర పేయాలు ‘’.కెప్టెన్ షా నవాజ్ ‘’మా దేశ ప్రజలే మమ్మల్ని జపాను చేతిలో కీలు బొమ్మలు అంటారని భయపడ్డాం .దేశాయ్ ధైర్యంగా ముందుకొచ్చి నేతాజీ గౌరవాన్ని ,దేశ గౌరవాన్ని కాపాడాడు ‘’.సరోజినీ నాయుడు ‘’దయ ఉదారహృదయం ఉన్నవాడు ఆయన చేసిన దానాలకు  లెక్కే లేదు .స్వాతంత్రం కోసం త్యాగం చేశాడు ‘’. కెప్టెన్ సెఘాల్ ‘’జీవించి ఉంటె స్వతంత్ర భారతానికి ఇంకా ఎక్కువ తోడ్పడి ఉండేవాడు ‘’.రాజాజీ ‘’కుశాగ్ర బుద్ధి కుసుమకోమల హృదయుడు .ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి వ్యక్తిని నేను చూడలేదు ‘’.అల్లాడి కృష్ణస్వామి అయ్యర్ ‘’దేశానికి స్వతంత్రం రాకముందే మరణించటం విచారకరం ‘’.కేఎం మున్షి ‘’నేను దేశాయ్ శిష్యుడిని .ఆయన లేని లోటు తీర్చలేనిది ‘’.జెవి మౌలంకర్ ‘’భారత దేశ యోగ క్షేమాలకోసం న్యాయశాస్త్రాన్ని ఉపయోగించిన ఉత్తమ వ్యక్తీ ‘’.సర్దార్ పటేల్ ‘’ఆయన సేవలకు దేశం ఎంతో రుణపడి ఉంది ‘’.డా.రాజేంద్ర ప్రసాద్ ‘’ఆయనమరణం నన్ను కలచి వేసింది ‘’.డా.లతీఫ్ ‘’రాజీ పద్ధతిలో సిద్ధహస్తుడు దేశాయ్ ‘’.కే భాష్యం’’నాయకులకు ఆయన సలహాలు అత్యంత అవసరమైన తరుణ౦ లో మరణించాడు ‘’.వివి గిరి ‘’రాజనీతిజ్ఞుడైన న్యాయవాది ‘’.రామస్వామి అయ్యర్ ‘’అనేక సంస్థానాలు ఆయన సలహా కోరేవి. ఆరోగ్యం బాగాలేకపోయినా ఫౌజు కేసు చేబట్టిన ధీమూర్తి ‘’. హరేకృష్ణ మెహతాబ్ ‘’దేశాయ్ విశదీకరణ విప్లవకారులకు శిలాశాసనం ‘’.గోపీనాధ బార్డో లాయ్’’దేశ స్వాతంత్రంకోసం వాదించిన అత్యుత్తమన్యాయవాది దేశాయ్ ‘ఒక ఉజ్వల తార అస్తమించింది ‘’అంటూ ప్రముఖులు నివాళి అర్పించారు . మద్రాస్ లో సానుభూతి తీర్మానం చేశారు .పెక్కు చోట్ల హర్తాల్ జరిగింది .పత్రికలూ ప్రత్యేక వ్యాసాలు రాశాయి .ధన్యజీవిగా అభి వర్ణించాయి .

  బ్రిటన్ లో చర్చిల్ ప్రభుత్వం పోయి, లేబరు ప్రభుత్వం రాగానే పార్లమెంటరీ రాయబారులు ఇండియా వచ్చి ఇక్కడి దుస్థితిని  ప్రభుత్వానికి తెలియజేశారు .ప్రతిస్టంభన పరిష్కారం కోసం ముగ్గురు మంత్రులను పంపింది .వారొచ్చి,గాంధీ జిన్నా మొదలైనవారితో సిమ్లాలో  సంప్రదింపులు జరుపుతుండగా భూలాభాయ్ మరణ వార్త తెలిసింది  .భూలాభాయి ఆత్మకు శాంతికలగాలని అందరూ కోరారు .

 మీ –గబ్బిట దుర్గాప్రసాద్-28-10-20-ఉయ్యూరు ’

About gdurgaprasad

Rtd Head Master 2-405 Sivalayam Street Vuyyuru Krishna District Andhra Pradesh 521165 INDIA Wiki : https://te.wikipedia.org/wiki/%E0%B0%97%E0%B0%AC%E0%B1%8D%E0%B0%AC%E0%B0%BF%E0%B0%9F_%E0%B0%A6%E0%B1%81%E0%B0%B0%E0%B1%8D%E0%B0%97%E0%B0%BE%E0%B0%AA%E0%B1%8D%E0%B0%B0%E0%B0%B8%E0%B0%BE%E0%B0%A6%E0%B1%8D
This entry was posted in పుస్తకాలు, సమీక్ష and tagged . Bookmark the permalink.

Leave a Reply

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.