ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్ -3(చివరి భాగం )
నాలుగేళ్ళు అజ్ఞాత వాసం లో గడిపి ఆగస్ట్ ఉద్యమవీరుడు, కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకుడు అచ్యుత్ పట్వర్ధన్ బొంబాయి రాగా అఖండ ప్రజావాహిని వీరోచిత స్వాగతం పలికింది .కాంగ్రెస్ నాయకులుమాత్రం రాలేదు మొహం చెల్లక .తర్వాత పూనాలో కూడా అఖండ స్వాగతమిచ్చారు ప్రజలు .అక్కడ ప్రసంగిస్తూ ‘’అ౦తిమస్వాతంత్ర్యంకోసం పోరాడాలి .కాంగ్రెస్ విధానాల్లో పెద్ద మార్పురావాలి సంపూర్ణ స్వాతంత్ర్యమే మన ధ్యేయం .బ్రిటిష్ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేయాలి .ఆత్మ బలిదానానికి సంసిద్ధులై మనం పనిచేయాలి .పెద్ద విప్లవ సైన్యం నిర్మించాలి.కార్మిక సంఘాలలో కమ్యూనిస్ట్ ల ప్రాధాన్యత తొలగించటానికి కాంగ్రెస్ సోషలిస్ట్ లు నడుం కట్టాలి ’అని గర్జించాడు .వల్లభాయి ,విఠ లుభాయి సోదరుల్లా రావు భాయ్, అచ్యుత్ సోదరులు భారత స్వాతంత్రోద్యమం లో కలిసిపని చేశారు .పటేల్ బార్డోలీ వీరుడైతే ,పట్వర్ధన్ సతారా వీరుడు .
పట్వర్ధన్ విజ్ఞాన సముద్రుడు .ఆయన ఇంటి లైబ్రరీలో దేశం లో ప్రచురితమైన ప్రతిరాజకీయ పుస్తకం దొరుకుతుంది .ఆయన చదవని రాజకీయ పుస్తకం లేదు .అన్ని విషయాలపై ఉత్తమ గ్రంధాలన్నీ ఆ ఇంట్లో ఉంటాయి .అజ్ఞాతవాసం లో ఉంటూ రైళ్ళరాకపోకల్ని తెలుసుకొంటూ వాటికి ఆటంకం కలిగించేవాడు .రైల్వే అధికారులకు సింహ స్వప్నంగా ఉండేవాడు .ఎంత విప్లవవాది అయినా గాంధీ పేరు చెబితే వినమ్రుడయ్యెవాడు .లోహియాలాగా’’ గాంధియన్ సోషలిస్ట్’’ . తుది నిర్ణయ౦ లో కాంగ్రెస్‌నే అనుసరిస్తారిద్దరూ .కాంగ్రెస్ ను విప్లవాత్మకం చేసే ప్రయత్నం చేశారు .పోరాటం పెరిగినకొద్దీ అతి వాదం పెరిగి దాన్నే అనుసరించాల్సి వచ్చింది .అతివాద చైతన్యం పెరిగింది .రాజకీయ చైతన్యానికి మహాత్ముడే కారణమని పట్వర్ధన్ ప్రగాఢ విశ్వాసం .అప్పటికి పాతికేళ్ళ క్రితం ‘’స్వరాజ్యం నా జన్మ హక్కు ‘’అన్నందుకు తిలక్ మహాశయుడిని తెల్లప్రభుత్వం ఆరేళ్ళు ఖైదులో ఉంచింది .గాంధీ వల్లనే వాక్ స్వాతంత్రం వచ్చి,’’మా దేశం విడిచిపొండి’’అని ఆజ్ఞాపించగలుగుతున్నాం .స్వతంత్ర వృక్షాన్ని పెంచి పెద్దదాన్ని చేసింది కాంగ్రెస్ .కాంగ్రేసే మహాత్ముడు మహాత్ముడే కాంగ్రెస్ .ఆయన సాధించేది సత్య సామ్రాజ్యం అని అభిప్రాయ పడ్డాడు పట్వర్ధన్ .గాంధీని చూస్తే పూనకమే వస్తుంది ఆరాధనాభావం తో పులకి౦చి పోయేవాడు .పెద్దల మితవాదం మాత్రం నచ్చలేదు కుండబద్దలుకొట్టినట్లుగా నిష్కర్షగా దాన్ని ఖండించాడు .స్వతంత్ర పోరాటం లో గాంధీ మితవాదం అతివాదులకు ఏమీ అడ్డు రాదు అని కాంగ్రెస్ సోషలిస్ట్ ల మనోభావం .అతివాద కార్యక్రమాలు చేబట్టినప్పుడే అతి వాదం వస్తుంది మాటలతో రాదు .దీనికి విరుద్ధంగా ‘’ప్రజా విప్లవమే మార్కిస్ట్ ల పంధా ‘’గా ఉండేది .స్వతంత్ర ఉద్యమలో ఎన్నో తప్పటడుగులు వేశారు కమ్మీలు .ఒక నిర్దుష్ట కార్యక్రమం ఇచ్చి నడపగలిగినవారిలో పట్వర్ధన్ ఒకడు .
1942స్వతంత్ర భారత రేడియో కేంద్రం గురించి ఉషా మెహతా చెప్పిన విషయాలు –1942‘’ఆగస్ట్ ఉద్యమ కాంగ్రెస్ ఉద్దేశ్యాన్ని ప్రజలకు తెలియజేయాలని దీన్నినేనూ నా సహచరులు కలిసి ఏర్పాటు చేశాం ఆగస్ట్ 20న మొదటి ప్రసారం చేశాం .అప్పుడులోహియా బాంబేలో అజ్ఞాతంలో ఉన్నారు .డిసెంబర్ లో ప్రసారాలు నిలిపేశాం .ప్రచారప్రసారాలు లోహియా రాసేవారు .కొన్ని నేనూ పట్వర్ధన్ రాశాం .వేటిని రేడియోలో చదవటానికి మాజీ ప్రొఫెసర్ కుందస్తూర్ ఉన్నారుకాని ఆమె అరెస్ట్ కాలేదు .అందుకని గ్రామఫోన్ రికార్డులుగా ప్రసంగాలు తయారు చేసి వాటితో ప్రసారం చేసేవాళ్ళం .కాంగ్రెస్ కమిటీ చేసిన ఉపన్యాసాలు రికార్డ్ చేసి రేడియోలో ప్రసారం చేశాం .మొదట్లో రోజుకొక్కసారి తర్వాత రెండుసార్లు ప్రసారం చేశాం .రేడియో యంత్రాగం బొంబాయిలో ఒక ప్రసిద్ధ న్యాయవాది అల్లుడి ఇంట్లో ఉండేది.పోలీసులు ఆచూకీ చేసి నన్ను అరెస్ట్ చేస్తారని తెలిసి ,ఆరోజు నేనే రేడియో ప్రసారం చేసి చివర్లో వందేమాతరం రికార్డ్ వేస్తుంటే ,పోలీసులువచ్చి నన్ను అరెస్ట్ చేశారు .వాళ్ళు నాలుగుగదులు దాటిరావాలి. తాళాలు పగలకొట్టి వచ్చి నన్ను అరెస్ట్ చేశారు .’’అని వివరించారు .
ఉషా, ఆసఫాలీ ,పట్వర్ధన్ ,ఆజాద్ ,జయప్రకాష్ వంటి నిస్వార్ధ త్యాగధనులు ‘’స్వాతంత్ర్యం మా జన్మ హక్కు ‘’అని చాటి చెప్పటానికి ఎన్నో కష్టనష్టాలు అనుభవించారు .1946జూన్ 8న కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ నాయకులు పట్వర్ధన్ లోహియా జయప్రకాష్ అరుణా ఆసఫాలీ లు ఒక ప్రకటన చేస్తూ ‘’భారత్ లో బ్రిటిష్ పెట్టుబడిదార్లు దొడ్డిదారిన ప్రవేశించారు. వారినుండి మనదేశాన్ని మనం కాపాడుకోవాలి .ఇదే సోషలిస్ట్ పార్టీ ఆదర్శం ‘’.అని చెప్పారు .
కాంగ్రెస్ లో ఉంటూ సోషలిజాన్ని సాధించలేమని గ్రహించి ఈ సోషలిస్ట్ లు 1947లో పట్వర్ధన్ నాయకత్వం లో ‘’సోషలిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా ‘’స్థాపించారు .1950లో అచ్యుత్ పట్వర్ధన్ రాజకీయాలనుంచి విరమించాడు .మళ్ళీ సెంట్రల్ హిందూకాలేజిలో ప్రొఫెసర్ గా పనిచేసి 1966లో రిటైరయ్యాడు .తర్వాత పూనా లో ఎవరికీ అందుబాటులో ఉండకుండా ,ఉత్తర ప్రత్యుత్తరాలుకూడా జరపకుండా ఒంటరిజీవితం గడిపాడు పట్వర్ధన్ రెండు గ్రంధాలు రాశాడు -1. Ideologies and the perspective of social change in India 2- The communal triangle in India.
ఆగస్ట్ ఉద్యమమమహానాయకుడు సోషలిస్ట్ పార్టీ స్థాపకుడు అచ్యుత్ పట్వర్ధన్ 1992 ఆగస్ట్ 5న 87వ ఏట వారణాసి లో మరణించాడు .త్యాగమూర్తి అచ్యుత్ పట్వర్ధన్ .
ఆధారం –శ్రీ గోపరాజు వెంకటానందం 1946లో రచించిన ‘’ఆగస్ట్ ఉద్యమవీరుడు అచ్యుత పట్వర్ధన్ ‘’
మీ –గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు