ఆగస్ట్ ఉద్యమ వీరుడు ,సోషలిస్ట్ పార్టీ నిర్మాత –అచ్యుత పట్వర్ధన్
5-2-1905 న మహారాష్ట్రలోని అహ్మద్ నగర్ లో అచ్యుత పట్వర్ధన్ జన్మించాడు .తల్లి తండ్రీ వైపు వారంతా సాంప్రదాయ కుటుంబీకులే.తండ్రి గొప్ప ప్లీడర్ మహాదాత .తల్లి వీరమాత .వీరి సంతానమంతా స్వాతంత్రోద్యంలో పాల్గొన్న వాళ్ళే ,తల్లి కూడా తన 60వ ఏట ఉద్యమం లో పాల్గొని జైలు కెళ్ళింది .అచ్యత్ అన్న రావు చాలాసార్లు జైలు కు వెళ్ళాడు. సోదరి విజయ 1942ఉద్యమం లో కాలేజీ మానేసి ఉద్యమం లో చేరి అన్నకు ,జయప్రకాష్ నారాయణ కు కార్యదర్శిగా పని చేసింది .ఈ రహస్యోద్యమం లో ఆమెకు తెలిసిన రహస్యాలు ఇంకెవ్వరికీ తెలియవు .గాంధీ గారి ‘’డు ఆర్ డై’’అనుసరిచి సోదరుడు ,సోదరి పని చేశారు .
అచ్యుత్ మంచి సంగీత గాయకుడు .అన్ని వాయిద్యాలు వాయించేవాడు .చిన్నప్పటినుంచి దేశభక్తి గీతాలు పాడేవాడు .లెక్కలు వచ్చేవికావు . సంపన్న కుటుంబం కనుక ఇల్లు నిత్యాన్నదానాలు అతిధులతో కళకళ లాడేది .బాగా ధనవంతుడైన పినతండ్రికి పిల్లల్లేక అచ్యుత్ ను దత్తత తీసుకొన్నాడు .అచ్యూత్ , రావు అహ్మద్ నగర్ లో మెట్రిక్ పూర్తి చేసి ,బెనారస్ కాశీ విశ్వవిద్యాలయం లో చేరారు .1893నవంబర్ 16 అనీబిసెంట్ ఇండియారాగా జనం బ్రహ్మ రధం పట్టారు .ఆమె భారత్ నే మాతృభూమిగా భావించి దాస్య విముక్తికి సంకల్పించింది .ఇక్కడే దివ్యజ్ఞాన సమాజం స్థాపించి ప్రపంచమంతా వ్యాపింప జేసింది .మానవ సేవ పరమావధిగా ఉన్న ఆ సమాజం వైపు అచ్యుత్ తండ్రి ఆకర్షితు డయ్యాడు .
1898జూన్ 6న లో బీసెంట్, కొందరుకలిసి ‘’సెంట్రల్ హిందూ కాలేజి ‘’స్థాపించారు.దీనికి ప్రిన్సిపాల్ గొప్ప విద్యావేత్త డా జి ఎస్ అరండేల్ .ఇందులో పని చేసేవారంతా సేవాభావం తో చేసేవారే .ఒకరినిమించి మరొక ప్రజ్ఞా దురీణులు .భగవాన్ దాస్, గోవిందదాస్ ,గుర్తు, లాంగ్ వంటి మేదావులున్నారు .కొంతకాలం గడిచాక పండిత మదన మోహన మాలవ్యా దీన్ని తీసుకొని హిందూ విశ్వ విద్యాలయం గా మార్చాడు .ఇక్కడ చదివిన అచ్యుత్ సోదరులు పీకే తెలంగ్ ,జ్ఞాన్ చంద్ ల శిష్యులై వారి అడుగుజాడల్లో నడిచారు .రావు వక్తృత్వం లో దిట్ట ఎన్నో బహుమతులు పొందాడు .ఒకసారి విశ్వ విద్యాలయ పార్లమెంట్ కు అచ్యుత్ ప్రధానిగా ఉన్నాడు .ఎం.ఎ.పాసై అచ్యుత్ యూరప్ వెళ్లి వచ్చి ఇక్కడే ఆర్ధిక శాస్త్ర లెక్చరర్ గా చేరి పని చేశాడు .
దేశం లో శాసనోల్లంఘన ఉద్యమం మహాఊపుగా సాగుతోంది .రావు అప్పటికే ఉద్యమంలో చేరి జైలు కెళ్ళాడు .బొంబాయ్ ఉద్యమానికి గొప్ప కేంద్రమైంది .ప్రచారం కోసం ఉమాశ౦కర దీక్షిత్ ఒక రహస్య పత్రిక స్థాపించి నడిపాడు .పట్వర్ధన్ వెంటనే తానూ రహస్య ఉద్యమం లో చేరి జైలుకెళ్లాడు .ప్రభుత్వ జైళ్ళు అన్నీ సత్యాగ్రహులతో నిండిపోయాయి .ఉద్యమం చల్లబడింది .యువకుల్లో ఉద్రేకం ఉప్పొంగింది .గాంధీ రాజకీయాన్ని సా౦ఘి కోద్యమం గా మార్చాడు .రష్యాలో లెనిన్ నాయకత్వం లో సామ్యవాద రాజ్యం స్థాపించటం ఇక్కడి యువకులకు అర్ధమై ,ఇక్కడ ఉద్యమానికి ‘’స్వరాజ్యం ‘’అన్నదానికి నిర్దిస్టరూపం ఇవ్వలేక పోవటం గమనించి తామే నడు౦కట్టాలని యువత భావించింది .సామ్యవాదమే పరిష్కారం అని నిర్ణయించారు .
ఈ సామ్య వాద సిద్ధాంతానికి నాసిక్ జైలు ప్రధాన కేంద్రమైంది .జయప్రకాష్ ,అచ్యుత పట్వ ర్ధన్, అశోక్ మెహతా, మీనూ మసానీ మొదలైనవారు కలిసి సిద్ధాంత రూప కల్పన చేశారు .1934 మేనెలలో పాట్నా అఖిలభారత కాంగ్రెస్ సమావేశం లో శాసనోల్లంఘన విరమిస్తూ ,శాసన సభా ప్రవేశానికి వీలుకలిగిస్తూ తీర్మానం చేశారు .అప్పుడే జయప్రకాష్ పట్వర్ధన్లు ,ఆచార్య నరేంద్ర దేవ్ అధ్యక్షత న సమావేశమే కాంగ్రెస్ మితవాద మార్గాన్నితీవ్రంగా విమర్శించి ,కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ స్థాపించి ,యువకులకు భాగస్వామ్య౦ కల్పించారు .
యువకిశోరం అచ్యుత్ పట్వర్ధన్ పాట్నాలో కాంగ్రెస్ పై నిప్పులు కక్కుతూ రాట్నం –ఖద్దరు తో స్వరాజ్యం రాదనీ ఉపన్యసించాడు .కాంగ్రెస్ నాయకులీ ప్రసంగానికి ఆశ్చర్యపోయారు .1936లక్నో కాంగ్రెస్ కమిటీ సభలో కూడా పట్వర్ధన్ కాంగ్రెస్ ను తీవ్రగా విమర్శించాడు .యువకుల మనోభావం అర్ధం చేసుకొన్న నెహ్రు నిర్మించిన అఖిలభారత కాంగ్రెస్ కార్యవర్గం లో సామ్యవాద యువకులైన ముగ్గురు-జయప్రకాష్ ,నరేంద్ర దేవ్ ,పట్వర్ధన్ లకు అవకాశం కల్పించాడు.మర్యాదగా తిరస్కరించాడు పట్వర్ధన్ .అప్పటికి అతని వయసు 30మాత్రమే .పదవీ వ్యామోహం ఆయనకు లేదన్నదానికి ఇదే నిదర్శనం .
1939లో రెండవ ప్రపంచ యుద్ధం మొదలయ్యాక .ఇండియాను యుద్ధంలోకి ది౦చ వద్దని వాక్ స్వాతంత్ర హక్కు ఇవ్వమని గాంధీ వైస్రాయి లిన్ లిత్ గో తో మాట్లాడి విఫలుడయ్యాడు.రాష్ట్రాల కాంగ్రెస్ మంత్రివర్గాల చేత రాజీ నామా చేయించాడు గాంధీ .వేరే మార్గం లేక గాంధీ వైస్రాయియికి లేఖరాసి ,వినోబా భావేతో వ్యష్టి సత్యాగ్రహం ప్రారంభింప జేశాడు .యుద్ధ వ్యతిరేక నినాదాలు చేస్తూ సత్యాగ్రహం లో జనం పాల్గొని జనం స్వచ్చందంగా జైలుకు వెళ్ళారు .వ్యష్టి సత్యాగ్రహం ప్రజాపోరాటం కాజాలదు అని కమ్యూనిస్ట్ లు భావించినా ప్రపంచామంతావ్యష్టి సత్యాగ్రహం తో మారు మోగింది .ప్రతిపోరాటం లోనూ ఏదో ఒక సాకుతో కమ్మీలు తప్పించుకోనేవారు .ఉప్పు సత్యాగ్రహాన్నికూడా ‘’ప్రజల పోరాట శక్తి తగ్గించే మత్తు మందు ‘’అని పెదవి విరిచారు .వ్యష్టి సత్యాగ్రహాన్ని ‘’పూలదండల సత్యాగ్రహం ‘’అని హేళన చేశారు ,1942ఆగస్ట్ ఉద్యమాన్ని ‘’ఆగస్టు అల్లర్లు ‘’అనీ జపాన్ ఏజెంట్లు ,పంచమాంగ దళం వాళ్ళు చేస్తున్న దౌర్జన్యా చర్యలనీ ప్రచారం చేసిన ప్రబుద్ధులు కమ్యూనిస్ట్ లు .ఊరందరిదీ ఒకదారి ఉలిపి కట్టేది మరో దారి అనే సామెత వీరిది .
సశేషం
మీ-గబ్బిట దుర్గాప్రసాద్ -29-10-20-ఉయ్యూరు